కూరగాయలతో కమ్మగా కావల్సినవి: బర్గర్ బన్నులు - నాలుగు (మిశ్రమం పెట్టేందుకు వీలుగా మధ్యకు కోయాలి), లెట్యూస్ ఆకులు - నాలుగు, ఫ్రెంచ్‌ఫ్రైస్ - 240 గ్రా, క్యారెట్ - 150 గ్రా, బీన్స్ - వంద గ్రా, క్యాలీఫ్లవర్ - 200 గ్రా, పచ్చిబఠాణీ - ఎనభై గ్రా, బంగాళాదుంపలు - మూడు వందల గ్రా, ఉల్లిపాయలు - వంద గ్రా, మిరియాలపొడి - ఐదు గ్రా, నూనె - 240 గ్రా, బ్రెడ్డు పొడి, ఉప్పు - తగినంత, చీజ్ స్త్లెసులు - నాలుగు, టమాటాలు, ఉల్లిపాయలు - యాభై గ్రాల చొప్పున, కొత్తిమీర తురుము - కొద్దిగా, ఉల్లికాడలు - అరవై గ్రా, వెన్న - అరవై గ్రా, తులసి ఆకుల మిశ్రమం - చెంచా. తయారీ: క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, ఉల్లికాడలు, బంగాళాదుంపల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిబఠాణీని ఉడికించి బరకగా మిశ్రమంలా చేయాలి. టమాటాల్ని స్త్లెసుల్లా, ఉల్లిపాయల్ని చక్రాల్లా తరగాలి. ఇప్పుడు కూరగాయల్ని ఉడికించి.. తులసి ఆకుల మిశ్రమం, మిరియాలపొడి, తగినంత ఉప్పు వేసి మెత్తగా చిదిమి, బాగా కలిపి బర్గర్ బన్ను మధ్యభాగంలో పెట్టేందుకు వీలుగా వెడల్పాటి టిక్కీల్లా చేసుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేయించి తీయాలి. నూనెలో వేయించుకోవడం ఇష్టంలేనివారు.. పెనంపై రెండువైపులా కాల్చుకోవచ్చు. మధ్యకు కోసిన బర్గర్ బన్నుల్ని తీసుకుని వెన్న రాసి పెనంపై వేడిచేయాలి. ఒక బన్నుపై లెట్యూస్ ఆకుని పరిచి పైన సిద్ధం చేసుకున్న కూరగాయల టిక్కీని ఉంచి.. ఆ తరవాత చీజ్ స్త్లెస్ ఒకటి, దానిపై టమాటా స్త్లెస్, చక్రాల్లా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర తురుము వేసి రెండో బన్నుతో మూసేయాలి. పైన ఉల్లికాడలు, కొత్తిమీర తురుము అలంకరించి.. ఫ్రెంచ్‌ఫ్రైస్‌తో కలిపి వడ్డించాలి. నోరూరించే కూరగాయల బర్గర్ పిల్లలకు ఎంతో నచ్చుతుంది. |
పనీర్‌తో పసందైన రుచి.. కావల్సినవి: పనీర్ ముక్కలు - 850 గ్రా, పచ్చిమిర్చి - యాభై గ్రా, ఉల్లిపాయలు - 120 గ్రా, క్యాప్సికం - 120 గ్రా, ఎరుపు, పసుపు రంగు క్యాప్సికం - వంద గ్రా చొప్పున, వెల్లుల్లి - ముప్ఫై రెండు గ్రా, ఉప్పు - తగినంత, సోయా సాస్ - ఇరవై నాలుగు గ్రా, నూనె - మూడు వందల గ్రా, మొక్కజొన్నపిండి - 160 గ్రా, మైదా - ఎనభై గ్రా, పంచదార - ఐదు గ్రా, బర్గర్ బన్నులు - రెండు, ఉల్లికాడలు - 100 గ్రా (కాడల్ని మాత్రమే తీసుకోవాలి), మిరియాలపొడి - చెంచా. తయారీ: పనీర్‌ను ముక్కల్లా కోయాలి. మిగిలిన కూరగాయల్ని సన్నగా తరగాలి. ఓ గిన్నెలో ఉప్పు, మిరియాలపొడి, మైదా, మొక్కజొన్నపిండి, సోయా సాస్ తీసుకుని ఆ తరవాత పనీర్ వేయాలి. పనీర్ ముక్కలకు మిశ్రమం బాగా పట్టేలా కలిపి కాగుతున్న నూనెలో వేయించుకోవాలి. మరో బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి ఉల్లి కాడలు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, సోయాసాస్ వేసి వేయించాలి. అందులో సిద్ధంచేసుకున్న పనీర్‌ముక్కల్నీ కలిపి దింపేయాలి. ఇప్పుడు బన్నుల్ని తీసుకుని మధ్యకు కోసి కొద్దిగా వెన్నరాసి పెనంపై కాల్చాలి. ఆ తరవాత పైన లెట్యూస్ ఆకు, దానిపై టమాటాస్త్లెసు ఉంచి.. పనీర్ మిశ్రమాన్ని వేసి.. పైన మరో బన్నును పెట్టి ఫ్రెంచ్‌ఫ్రైస్‌తో కలిపి వడ్డించండి. |
చేపతో చవులూరించేలా కావల్సినవి: ముల్లు తీసేసిన చేప - 800 గ్రా, నిమ్మకాయలు - నాలుగు (రసం తీసుకోవాలి), మైదా - వంద గ్రా, గరంమసాలా, చాట్ మసాలా - ఐదు గ్రా చొప్పున, కొత్తిమీర తురుము - పావుకప్పు, పచ్చిమిర్చి - పది గ్రా, కరివేపాకు రెమ్మలు - నాలుగు, పెరుగు - 200 గ్రా, ధనియాలపొడి, అల్లంవెల్లుల్లి మిశ్రమం - పది గ్రా చొప్పున, మొక్కజొన్నపిండి - వంద గ్రా, కారం, ఉప్పు - పది గ్రాల చొప్పున, కోడిగుడ్లు - నాలుగు, నూనె - వేయించడానికి సరిపడా, బర్గర్ బన్నులు -నాలుగు. వెన్న - పావుకప్పు, లెట్యూస్ ఆకులు- నాలుగు, స్త్లెసుల్లా తరిగిన టమాటా - నాలుగు, చక్రాల్లా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కొన్ని, నూనె - వేయించడానికి సరిపడా. తయారీ: చేపను శుభ్రం చేసి వజ్రాకృతిలో ముక్కలుగా కోయాలి. ఓ గిన్నెలో మొక్కజొన్నపిండి, మైదా, ఉప్పు, కారం తీసుకుని కాసిని నీళ్లతో మిశ్రమంలా చేసి చేపముక్కలకు పట్టించాలి. ఇప్పుడు కాగుతున్న నూనెలో ఈ ముక్కల్ని బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి. మరో పాన్ తీసుకుని కొద్దిగా నూనె వేడి చేసి మిగిలిన పదార్థాలు, పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తరవాత చేపముక్కల్ని చేర్చి మిశ్రమం పూర్తిగా దగ్గరగా అయ్యేదాకా వేయించాలి. ఇప్పుడు బర్గర్ బన్ను ఒకటి తీసుకుని మధ్యకు కోయాలి. రెండింటికీ కొద్దిగా వెన్న రాసి.. ఒకదానిపై లెట్యూస్ ఆకు ఉంచాలి. దానిపై టమాటా స్త్లెసు ఒకటి, ఆ తరవాత సిద్ధం చేసుకున్న చేప మిశ్రమాన్ని కొద్దిగా పరిచి... దానిపై మళ్లీ చక్రాల్లా తరిగిన ఉల్లిపాయను ఉంచి.. రెండో బన్నుతో మూసేయాలి. ఫ్రెంచ్‌ఫ్రైస్‌తో కలిపి వడ్డిస్తే నోరూరించే ఫిష్ బర్గర్ సిద్ధం. |
గో గ్రీన్ ఘుమఘుమ కావల్సినవి: పనీర్ - 400 గ్రా, పచ్చి బఠాణీ - 120 గ్రా, క్యాప్సికం - 60 గ్రా, ఉప్పు- పదిహేను గ్రా, మిరియాల పొడి - ఒకటిన్నర చెంచా, కారంగా ఉండే టమాటాసాస్ - ఎనిమిది గ్రా, కొత్తిమీర తరుగు - పావు కప్పు, తీపి టమాటాసాస్ - 280 ఎంఎల్, క్రీం - నూటయాభై గ్రా, ఆలివ్‌లు - పదహారు, వెల్లుల్లి - ఎనిమిది, క్యారెట్ - అరవై గ్రా, బేబీకార్న్ - ఎనభై గ్రా, క్యాలీఫ్లవర్ - అరవై గ్రా, బీన్స్ - అరవై గ్రా, జుకిని - నలభై గ్రా, బంగాళాదుంపలు - 160 గ్రా, వెన్న, చీజ్ - వంద గ్రా చొప్పున, బ్రెడ్ బాస్కెట్, బర్గర్ బన్నులు - నాలుగు, ఎండుమిర్చి గింజలు - చెంచా. తయారీ: పనీర్ తురుము, వెన్న, చీజ్, పచ్చిబఠాణీ, ఆలివ్‌లు, వెల్లుల్లి, ఎర్ర క్యాప్సికం ముక్కలు తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీనికి ఉప్పు, మిరియాలపొడి, బ్రెడ్, క్రీం, ఎండుమిర్చి గింజలు కలపాలి. ఇప్పుడు కారంగా ఉండే టమాటాసాస్ వేసి మరోసారి కలపాలి. ఇది గట్టిగా పట్టీలా తయారవుతుంది. దీన్ని పెనంపై కాల్చాలి. లేదంటే గ్రిల్ కూడా చేయవచ్చు. ఇప్పుడు క్యారెట్, బేబీకార్న్, క్యాలీఫ్లవర్, బీన్స్, జుకినీ, బంగాళాదుంపల్ని పొట్టుతో సహా పొడుగ్గా తరగాలి. వెడల్పాటి పాన్ తీసుకుని ఈ కూరముక్కల్ని వేసి.. టమాటాసాస్‌తో వేయించాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పనీర్ పట్టీని, కూరగాయముక్కల, బన్నులతో కలిపి వడ్డిస్తే.. గోగ్రీన్ సిద్ధం.
గమనిక
* జుకినీ బదులుగా సొరకాయ వాడవచ్చు.
* ఉల్లిపాయల్ని చక్రాల్లా వాడాలంటే.. ఒకే రింగ్‌ను తీసుకోవాలి.
* లెట్యూస్ ఆకులు బజార్లో దొరుకుతాయి.
* ఫ్రెంచ్‌ఫ్రైస్, కారంగా ఉండే టమాటాసాస్ బజార్లో లభిస్తాయి. |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి