Eetaram (09_06_2011)
నల్సార్... ప్రతిష్ఠాత్మక న్యాయ విశ్వవిద్యాలయం... ఇక్కడ చదివితే కోరుకున్న కొలువులు... చేతినిండా కాసులు... వీటిని కాదని ఓ యువకుడు భిన్నమైన దారి పట్టాడు... తన న్యాయ పరిజ్ఞానాన్ని పేదల కోసం ధారపోస్తున్నాడు... ఆశయం కోసం 500మంది సుశిక్షితులను తయారు చేశాడు... వాళ్ల ఆసరాతో మూడులక్షల మందికి సాయమందించాడు! ఆ సేవకు గుర్తింపుగా రెండు అవార్డులందాయి!! అతడిని 'ఈతరం' పలకరించింది...రాష్ట్ర జనాభాలో 53 శాతం మందికి పంట భూమి లేదు. 14 శాతం మందికి ఇంటి స్థలం, వ్యవసాయ భూమీ లేవు. ఇరవై శాతం పంట భూములు వివాదాల్లో ఉన్నాయి. దీంతో ఏటా పదమూడువందల కోట్ల రూపాయల పంట నష్టపోతున్నాం. మొత్తం హత్యల్లో 12 శాతం భూవివాదాల కారణంగానే జరుగుతున్నవే. గాబరా పెట్టే లెక్కలివి. వీటిని సవరించడానికి వరంగల్ యువకుడు సునీల్‌కుమార్ రెడ్డి నడుం బిగించాడు. మొదటి ప్రయత్నం
సునీల్‌ది వరంగల్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి. పేద రైతు కుటుంబం. ఐ.ఎ.ఎస్. అధికారి కావడం చిన్ననాటి కల. హైదరాబాద్‌లోని నల్సార్‌లో న్యాయశాస్త్రం చదువుతున్నపుడు ఆ లక్ష్యం మారింది. తాను నేర్చుకున్న విద్యతోనే పేదలు, రైతులకు సాయం చేస్తే సంకల్పం నెరవేరినట్టేనని భావించాడు. విద్యార్థిగా ఉన్నపుడే 'శ్రేయ' అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టాడు. సొంత జిల్లాలో మూడు గ్రామాల్ని దత్తత తీసుకొని నమూనా గ్రామ న్యాయ స్థానాలు ఏర్పాటు చేశాడు. కొంతమంది మిత్రులను కూడగట్టి భూవివాదాల్లో పేదలు, రైతులకు అండగా నిలిచాడు. న్యాయపరమైన సలహాలిచ్చాడు.
రెండో అడుగు
2004లో లా పూర్త్తెంది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ (ఇందిర క్రాంతి పథం, వెలుగు)లో స్టేట్ లీగల్ కోర్డినేటర్‌గా చేరాడు. అక్కడా పేద రైతులకు సాయపడాలనే తపనే. అధికారులను ఒప్పించి లీగల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఫర్ లాండ్ అనే కొత్త పథకాన్ని రూపొందించాడు. నిరక్ష్యరాస్యులు, పేదలకు సాయపడటానికి 'పారాలీగల్స్' అనే యువ బృందాన్ని తయారు చేశాడు. పేదల తరపున కేసులు ఫైలు చేయడం, కోర్టులో పిటిషన్ వేయడం, న్యాయ సలహాలందించడం వీళ్ల పని. సేవలన్నీ ఉచితంగానే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పారా లీగల్స్ పట్టాలేని లాయర్లు. నాలుగేళ్లలో ఐదువందల మంది పారా లీగల్స్‌ని తయారు చేశాడు సునీల్. వీళ్ల ద్వారా ఇప్పటికి మూడు లక్షల మంది సాయం పొందారు.
స్టేట్ డైరెక్టర్‌గా...
సునీల్ ప్రస్తుతం రూరల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌డీఐ) స్వచ్ఛంద సంస్థకు స్టేట్ డైరెక్టర్. రాష్ట్రంలో అమల్లో ఉన్న భూ చట్టాలను పేదలు, రైతులు సమర్థంగా ఉపయోగించుకోవడానికి కృషి చేస్తుందీ సంస్థ. ఇది ప్రభుత్వ సంస్థలైన అపార్డ్ (ఆంధ్రప్రదేశ్ అకాడెమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్), మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలతో కలిసి పనిచేస్తోంది. సునీల్ ఈ సంస్థ తరపున జిల్లా కలెక్టర్లు, గ్రూప్ వన్, రెవెన్యూ అధికారులకు భూసంబంధ చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాడు. పలు చర్చా వేదికల ద్వారా 500 మంది న్యాయాధిపతులకు భూసమస్యలు, వాటి పరిణామాల గురించి వివరించాడు. కీలకమైన అసైన్డ్, ఆర్వోఆర్ లాంటి చట్టాల వివరణ, జడ్జిమెంట్ ఎట్లా రాయాలి, పేదవాళ్లకు అనుకూలంగా ఎందుకు పనిచేయాలి? అనే విషయాలు ఈ సదస్సులు, చర్చల్లో ముఖ్యమైనవి. రెండేళ్లు కష్టపడి గ్రామ స్థాయి అధికారులు సైతం చట్టాలు తేలికగా అర్థం చేసుకునేలా సులువైన పద్ధతిలో మెటీరియల్ తయారు చేశాడు. ఇందిర క్రాంతి పథంలో పనిచేస్తున్నపుడు విజయవంతమైన పారా లీగల్స్‌కి శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని ఇక్కడా కొనసాగిస్తున్నాడు.
గుర్తింపు
అవగాహన సదస్సులు నిర్వహించడం, పారాలీగల్స్‌ని తయారు చేయడమే కాదు సునీల్ పేదల తరపున స్వయంగా చాలా కేసులు వాదించాడు. ఆదిలాబాద్ జిల్లాలో మంకూబాయ్ అనే గిరిజనురాలి తరపున వాదించిన కేసు ఓ సంచలనం. ముప్ఫై ఏడేళ్లుగా కోర్టుల్లో నానుతున్న కేసుకు నాలుగు నెలల్లో పరిష్కారం చూపించాడు. 18 ఎకరాల భూమిని ఆమెకు ఇప్పించగలిగాడు. సునీల్ పేదల తరపున చేస్తున్న సాయానికి గుర్తింపు లభించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా నిర్వహించిన 'లీడ్ ఇండియా' పోటీల్లో హైదరాబాద్ రీజియన్‌లో 'విజనరీ లీడర్'గా ఎంపికయ్యాడు. సామాజిక సేవకు గుర్తింపుగా గౌరీశంకర్ స్మారక సంస్థ 'యంగ్ లీడర్' అవార్డు అందుకున్నాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి