Etaram Sunday (03_07_2011)
ప్రార్థన...కోరికల చిట్టా కాదు. డిమాండ్ నోటీసు కాదు. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయమూ కాదు. అది దేవుడితో సంభాషణ. అంతరంగ ఆవిష్కరణ. ఆత్మకు అభ్యంగన స్నానం.
మరొకవైపు, అనంతానంతుడైన భగవానుడు.
మధ్యలో నేను.
మెత్తటి ఇసుకలో నిశ్శబ్దంగా నడుస్తున్నాం.
అంతలో మబ్బులు మాయమయ్యాయి. ఆకాశం తెల్లటి తెరలా మారిపోయింది. నా జీవితంలోని ప్రధాన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా ఆ నింగితెర మీద కనిపిస్తున్నాయి.
ప్రతి ఘట్టంలో రెండు జతల పాదముద్రలు... ఒక జత నావి, రెండో జత నన్ను వెన్నంటి కాపాడే పరమాత్ముడివి.
ఆశ్చర్యం! నేను కష్టాల్లో కూరుకుపోయినప్పుడు, నష్టాల్లో సతమతమైపోతున్నప్పుడు, ఆత్మీయుల మరణాలతో కుంగిపోతున్నప్పుడు... ఒక జత అడుగులు మాత్రమే కనిపిస్తున్నాయి.
'ఇదేమిటి ప్రభూ! కరుణామయుడవని అంటారే. ఆశ్రిత రక్షకుడని పిలుస్తారే.
నా విషయంలో మాత్రం ఎందుకింత అన్యాయం? మామూలప్పుడు పక్కనే ఉండి, కష్టకాలంలో నన్ను విడిచి వెళ్లావెందుకు?' బాధగా ప్రశ్నించాను.
దేవుడు చిరునవ్వుతో సమాధానం చెప్పాడు.
'పిచ్చివాడా! నువ్వు సుఖంగా ఉన్నప్పుడంతా నీ పక్కనే నడిచాను. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకుని నడిచాను. అందుకే కష్టకాలంలో నీకు ఒక జత పాదముద్రలే... నా అడుగులే కన్పిస్తున్నాయి.'
* * *
ప్రార్థనకు పరిమితుల్లేవు. ఒక్కసారి చేయాలనో ఐదుసార్లకు మించకూడదనో నిబంధన లేదు. కష్టాల్లో ఉన్నప్పుడో, పాపాల్లో చిక్కుకున్నప్పుడో మాత్రమే ప్రార్థించాలన్న పరిమితి లేదు. అవసరమైనప్పుడు మాత్రమే బయటికి తీయడానికి ప్రార్థనేం డిక్కీలోని అదనపు టైరు కాదు, అది కారు స్టీరింగ్‌తో సమానం. పనిలో, విశ్రాంతిలో, నిద్రలో, శ్వాసలో...జీవితాన్నే ఓ పెద్ద ప్రార్థనగా మలుచుకున్న మహాసాధకులూ ఉన్నారు. బుద్ధుడు, క్రీస్తు, ప్రవక్త, గాంధీజీ, రమణమహర్షి, మదర్ థెరెసా అలాంటివారే.
అతిసులభం...ఫలమదికం!
ప్రార్థన...శ్వాస పీల్చినంత సులభం, కష్టసుఖాలంత సహజం. ఎవరో వచ్చి బీజాక్షరాలు రాయాల్సిన పన్లేదు. మతపెద్దల సిఫార్సులు అసలే అక్కర్లేదు. నోరుతిరగని మంత్రాలుండవు. పురాణేతిహాసాలు చదవకపోయినా నష్టంలేదు. పద్మాసనంలోనో శీర్షాసనంలోనో కూర్చోవాల్సిన కష్టమే లేదు. ప్రార్థన మానవ స్వభావంలో ఓ భాగం. పసితనంలో అమ్మ కోసం ఏడుపు ప్రార్థనే. కౌమారంలో ప్రియురాలి సాక్షాత్కారానికి తహతహ ప్రార్థనే. యవ్వనంలో ఉద్యోగం కోసం ఎదురుచూపు ప్రార్థనే. నడివయసులో బిడ్డ తీవ్రఅనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పుడు, వాడికంతా మంచే జరగాలన్న బలమైన ఆకాంక్ష ప్రార్థనే. ఆ భావోద్వేగాల్ని దేవుడి వైపు మళ్లించడమే మనం చేయాల్సింది. కష్టాల్లో ఉన్నప్పుడో వోయలేనన్ని బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడో ప్రార్థించడం కాదు. ప్రార్థనను జీవితంలో భాగం చేసుకోవాలి. కొంతకాలానికి జీవితమే ఓ ప్రార్థన అవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దేవుడికి నైవేద్యాలు అవుతాయి. అజ్ఞానికి జ్ఞానం, పిరికివాడికి ధైర్యం, బాధల్లో ఉన్నవారికి వూరడింపు...ఎవరికి ఏది అవసరవో అవన్నీ ప్రార్థనలో దొరుకుతాయి. నిజానికి ఏ ప్రార్థనా పరిస్థితుల్ని మార్చలేదు. విధిరాతను తలకిందులు చేయలేదు. కానీ వాటిని తట్టుకునేలా మనల్ని మారుస్తుంది. అవసరమైతే, విధిని ఎదిరించే శక్తినిస్తుంది.
ప్రార్థనలో నమ్మకం ముఖ్యం. సర్వాంతర్యామి మన ముందే నిలబడి ఉన్నట్టు నమ్మాలి. మన బాధల్ని శ్రద్ధగా ఆలకిస్తున్నట్టు నమ్మాలి. అతను సూచించే పరిష్కారం కోసం అంతే నమ్మకంగా ఎదురుచూడాలి. కొన్నిసార్లు ఆ సమాధానం ప్రతీకాత్మకం కావచ్చు. ఎవరిని ప్రార్థించాలి? ఏమని ప్రార్థించాలి? అన్న సందేహం ఉండనే ఉంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించవచ్చు. సర్వేశ్వరుడిని నిరాకారుడిగా నిర్గుణుడిగా ప్రార్థించవచ్చు. సద్గురువును ప్రార్థించవచ్చు. 'సకల చరాచరసృష్టిలో వ్యాపించివున్నవాడూ పరమానంద స్వరూపుడూ అయిన పరమాత్మను ప్రార్థిద్దాం. మనకు నచ్చిన రూపాన్ని లేదా గుణాన్ని ఎన్నుకుని, మనకు నచ్చిన విధంగా ప్రార్థిద్దాం. పద్ధతి ఏదైనా, ఆ పరమాత్మతో సంబంధాన్ని కొనసాగిద్దాం' అంటారు స్వామి యతీశ్వరానంద.
అనగనగా ఓ కొండ. దానిమీద మూడు చెట్లు. వెుదటి చెట్టు 'స్వామీ! బంగారం, డబ్బు, వజ్రవైఢూర్యాలు నాక్కావాలి' అని ప్రార్థించేది. రెండో చెట్టు 'ప్రభువా! నేను ప్రపంచాన్నంతా చుట్టేసిరావాలి' అని ప్రార్థించేది. మూడోది 'సదా నీ సన్నిధిలో కాలం గడపాలనుంది. అంతకంటే నాకెలాంటి కోరికా లేదు' అని విన్నవించుకునేది. కొంతకాలానికి ఆ చెట్లను ఎవరో నరికేశారు. వెుదటిదాన్ని ఓ వడ్రంగి తీసుకెళ్లాడు. దాంతో నగలపెట్టె తయారు చేశాడు. రెండోదాన్ని ఓడల తయారీదారుడు తీసుకెళ్లాడు. మూడోదాన్ని కళాకారుడు తీసుకెళ్లి పూజా మంటపంగా తీర్చిదిద్దాడు. ఏడాది తిరిగేసరికి, నగల పెట్టెను పగులగొట్టి అందినంతా దోచుకెళ్లాడో దొంగ. ప్రమాదవశాత్తు ఓడ సముద్రం పాలైపోయింది. మంటపం మాత్రం దేవుడితోపాటు పూజలందుకుంటూ జీవితాన్ని చరితార్థం చేసుకుంది. ఏది కోరితే ఇంకేదీ కోరాల్సిన అవసరం ఉండదో, అంత అత్యుత్తమమైన దానికోసమే మనం ప్రార్థించాలి. మన మాటల్ని ఆలకిస్తున్నది మామూలు మనిషి కాదు, సాక్షాత్తు పరమాత్ముడు! ఏ ప్రధాన మంత్రినో కలిసే అవకాశం వచ్చిందనుకోండి...మా కాలనీలో డ్రైనేజీ సమస్య ఉందనో, మా వీధిలో కుక్కల బెడద ఉందనో చిన్నాచితకా సమస్యల్ని ఏకరవుపెట్టి కాలాన్ని వృథాచేయం కదా! వరాలిచ్చే వ్యక్తి స్థాయికి తగిన కోరికలే కోరతాం! కార్లు, బంగళాలు, బంగారం లాంటి అతి సామాన్యమైన కోరికలతో అంతర్యామి ఉన్నతిని దిగజార్చడం తగదు.
వివేకానందుడికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. తండ్రి మరణంతో బాధ్యతలు పెరిగాయి. ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. దిక్కుతోచలేదు. రామకృష్ణ పరమహంసతో తన కష్టాలు చెప్పుకున్నాడు. జగన్మాతకు సిఫార్సు చేసి, వాటిని పరిష్కరించేలా చూడమని వేడుకున్నాడు. 'అమ్మ కరుణామయి. నువ్వే ప్రార్థించు. తప్పకుండా వెుర ఆలకిస్తుంది' అని సలహా ఇచ్చారు పరమహంస. నరేంద్రుడు జగన్మాత ఆలయానికి వెళ్లాడు. కళ్లుమూసుకుని ప్రార్థిస్తుంటే, ఆ శక్తి స్వరూపిణి కట్టెదుటే ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది. ఆ క్షణానికి తన ఆర్థిక సమస్యలు గుర్తుకురాలేదు. కష్టాలూ కన్నీళ్లూ తలపునకు రాలేదు. 'భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ప్రసాదించు తల్లీ' అని తన్మయంగా ప్రార్థించాడు. అమ్మ వారు మాయమైన మరునిమిషమే, ప్రాపంచిక విషయాలు గుర్తుకొచ్చాయి. 'అయ్యో, అడగాలనుకున్నవి అడగలేకపోయానే' అనుకున్నాడు. అలా మూడుసార్లు జరిగింది.
సమస్యలూ సవాళ్లూ సంక్షోభాలూ ఎవరి జీవితంలో అయినా ఉంటాయి. అవి మన సమస్యలు. మనమే పరిష్కరించుకోగలం. అందుకు అవసరమైన శక్తినివ్వమని భగవంతుడిని ప్రార్థిస్తే చాలు. అర్జునుడి సంగతే తీసుకోండి. కృష్ణభగవానుడిని ఎప్పుడూ తన తరపున యుద్ధం చేయమని అడగలేదు. 'నువ్వు సారధిగా ఉంటే చాలు, అదే పదివేలు' అని కోరాడు. ప్రార్థన కూడా మన ఆలోచనా రథానికి సారథిలా పనిచేస్తుంది.
జీవితమే ప్రార్థన...
అలవాట్లు మన ఆలోచనల మీద ప్రభావం చూపుతాయి. ఆలోచనలు మన చర్యల మీద ప్రభావం చూపుతాయి. ఆ చర్యలు మన జీవితగమ్యాన్ని నిర్దేశిస్తాయి. నిత్యం మద్యం మత్తులో తూగుతున్న వ్యక్తికి ప్రార్థన చేయాలన్న ఆలోచనే రాకపోవచ్చు. కక్షలూ కార్పణ్యాలతో రగిలిపోతున్న మనిషికి మంచి ఆలోచనలు అసాధ్యం కావచ్చు. అటుఇటు కాని హృదయంతో ప్రార్థించేవారి వెురలు ఆలకించడానికి సృష్టికర్త సిద్ధంగా ఉండడు. నీ చుట్టూ ఉన్నవారు ఎవరో చెప్పు, నేను నీ గురించి చెబుతాను...అన్న నానుడి ఇక్కడా వర్తిస్తుంది. సృష్టికర్త పరమ పవిత్రుడు, రాగద్వేషాలకు అతీతుడు, నిరాడంబరుడు. ప్రార్థనల ద్వారా తనతో సంభాషించేవారు కూడా తనలాంటివారే అయి ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఏ అమెరికాకో వెళ్లాలంటే ఎన్ని నిబంధనలు..వీసాలు, పాస్‌పోర్టులు, విమానాశ్రయాల్లో తనిఖీలు! అలాంటిది, సర్వేశ్వరుడి సమక్షం అంత సులభంగా దక్కుతుందా? ప్రార్థనాశక్తితో ఆ ద్వారాల్ని తెరవాలి.
బుర్రనిండా ఆలోచనలతో హృదయపూర్వకంగా ప్రార్థించలేం. ప్రశాంతమైన జీవనశైలి మన ఆలోచనల్నీ ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రార్థనకు కేటాయించిన సమయాన్ని పూర్తిగా ప్రార్థనకే వినియోగించాలంటే, అంతలోపు మిగిలిన పనులన్నీ పూర్తిచేసుకోవాలి. చక్కని క్రమశిక్షణతోనే అది సాధ్యమవుతుంది. తొలి దశలో బద్ధకం, నిరాసక్తత మనల్ని దారిమళ్లించే ప్రయత్నం చేస్తాయి. అయినా లొంగిపోకూడదు. మాటవినని విద్యార్థిని ఉపాధ్యాయుడు బెత్తంతో బెదిరించినట్టు, కప్పదాట్ల మనసు మీద కళ్లెర్రజేయాలి. ప్రార్థన వెుదలుపెట్టిన తొలిరోజుల్లో...ఓ పట్టాన ఏకాగ్రత కుదరదు. పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. వాటన్నిటినీ అస్సలు పట్టించుకోకూడదు. అతి భోజనం, అతి నిద్ర పనికిరావు. ప్రాణాయామం, యోగా జీవితంలో ఓ భాగం కావాలి. వారానికి ఒక్కసారి ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రార్థన చేయవచ్చు. పుణ్యతీర్థాల్లో ఆధ్యాత్మిక తరంగాలు శక్తిమంతంగా ఉంటాయంటారు. 'ఇంట్లో చేసే ప్రార్థన దీపం లాంటిది. ఆలయాల్లో నలుగురితో కలిసి చేసే ప్రార్థన సూర్యుడి వెలుతురు లాంటిది' అంటారు చినజీయరు స్వామి. సామూహిక ప్రార్థనల శక్తి అపారం.
వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించి కావచ్చు... తరచూ మన బుర్రలో జొరబడటానికి ప్రయత్నించే నెగెటివ్ ఆలోచనల్ని అంతదూరం నుంచే తరిమికొట్టాలి. మంచి ఆలోచనలకు సదా స్వాగతం పలకాలి. ఇదో కళ. సాధన పెరిగేకొద్దీ ఒంటబడుతుంది. ప్రార్థన అంటే మరేమిటో కాదు...పాజిటివ్ ఆలోచనల సమాహారం. సత్సాంగత్యం, చక్కని సాహిత్యం, వినసొంపైన సంగీతం...మన ఆలోచనల్ని మంచివైపు నడిపిస్తాయి. హృదయపూర్వక ప్రార్థనకు ఇవన్నీ మూలస్తంభాలు.
నిజంగా ప్రార్థనకు అంత శక్తి ఉందా? కోరికల్ని తీరుస్తుందా? అనారోగ్యాల్ని దూరం చేస్తుందా? మనుషుల్లో మార్పు తీసుకొస్తుందా? వీటిలో చాలా ప్రశ్నలకు శాస్త్రీయమైన నిరూపణ లేకపోవచ్చు. ఒకటి మాత్రం నిజం, ఒక మనిషి మన తరపున ప్రార్థన చేస్తున్నాడంటే, మన మంచి కోరుతున్నాడని అర్థం. ఆ మద్దతే రోగికి కొండంత ధైర్యాన్నిస్తుంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కోలుకోడానికి వైద్యపరీక్షలూ శస్త్రచికిత్సలూ మాత్రమే కాదు, కొండంత ధైర్యమూ అవసరమే. ఓరకంగా ఇది 'ప్లాసిబో ఎఫెక్ట్'లానూ పనిచేస్తుంది. ఖాళీ గొట్టపు మాత్రే ఎంతోకొంత రోగతీవ్రతను తగ్గించినప్పుడు, సర్వశక్తిమంతుడైన భగవంతుడు మన మాటలు ఆలకించాడన్న భావన ఇంకెంత శక్తినివ్వాలి? ఆ ధైర్యం ప్రార్థన ద్వారా వస్తుంది. ఇండియానా యూనివర్సిటీ పరిశోధనలో ఈ విషయమే తేటతెల్లమైంది. ఆలోచనలకు అపారమైన శక్తి ఉందన్న అభిప్రాయాన్ని పూర్తిగా కొట్టివేయలేం. మనం దేన్నయినా బలంగా కోరుకుంటే, సర్వసృష్టీ ఏకమై దాన్ని నిజం చేస్తుందంటారు 'థియరీ ఆఫ్ ఎట్రాక్షన్' సిద్ధాంతకర్త రిండా బర్నే. ఆ 'సర్వసృష్టికి' చాలామంది 'దేవుడు' అని పేరుపెట్టుకున్నారంతే. 'యద్భావం... తద్భవతి' అన్న పెద్దల మాట ఉండనే ఉంది. ఒక బలమైన ఆలోచన కలిగినప్పుడు, స్పష్టంగానో అస్పష్టంగానో దానికి సంబంధించి మెదడులో ఓ రూపం ప్రాణంపోసుకుంటుంది. ఫలితంగా మనలో ఓరకమైన ఉద్వేగం చోటుచేసుకుంటుంది. అది నెగెటివ్ ఆలోచన అయితే ఆందోళన, భయం, ఆవేశం ఉప్పొంగుతాయి. అల్సర్లకూ హైపర్‌టెన్షన్‌కూ కొన్నిసార్లు క్యాన్సర్‌కూ దారితీస్తాయి. కానీ ప్రార్థనలో ప్రాణం పోసుకునేదంతా పాజిటివ్ ఆలోచనలే. అవి జీవితం మీద కొత్త ఆశలు రేకెత్తిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తాయి.
ప్రార్థన మన జీవన విధానంలోనూ మార్పు తీసుకొస్తుంది. ఇక్కడ శరణాగతి ముఖ్యం. నేను అల్పుడిని, నా జీవితం క్షణభంగురం అన్న భావన అహాన్ని శుభ్రంగా కడిగేస్తుంది. చుట్టూఉన్నవాటిలో ఏదీ మనది కాదని తెలిశాక, ఇక దేనికోసం ఆరాటపడతాం? కోరికలూ వెంపర్లాటలూ మనల్ని వదిలి వెళ్లిపోతాయి. ప్రార్థనలో మన సమస్యల్నీ ఆవేదనల్నీ భగవంతుడికి బదిలీ చేస్తాం. కుక్కర్ ప్రెషర్ వాల్వ్‌లోంచి ఆవిరి బయటికొచ్చినట్టు, బోలెడంత ఒత్తిడి దేవుడి ఖాతాలోకి బదిలీ అయిపోతుంది. ఫలితానికి దేవుణ్ని బాధ్యుడిని చేసినప్పుడు, వైఫల్యాలూ ఎదురుదెబ్బలూ మనల్నేమీ చేయలేవు. ఎదుటివారి తప్పుల్లో వాళ్ల అమాయకత్వమూ అజ్ఞానమే కనిపిస్తాయి. తేలిగ్గా క్షమిస్తాం. 'మనం నమ్మిన విలువలకు కట్టుబడి ఉండటానికి అవసరమైన ఆత్మవిశ్వాసం ప్రార్థన ద్వారానే వస్తుంది' అంటారు ముంబయిలోని ఏంజిల్ ఆశ్రమం ప్రతినిధి ఫాదర్ ఫ్రాన్సిస్కో. కఠినమైన బ్రహ్మచర్యాన్ని ఆచరించడానికి అవసరమైన ఆత్మశక్తి తనకు అలానే సమకూరిందంటారు ఆయన. 'విధినిర్వహణలో నిజాయతీ, సమాజానికి మనవంతు సేవ కూడా ప్రార్థనలో భాగమే' అని భక్తులతో చెబుతుంటారు ఉడిపి విశ్వేశ్వరతీర్థ స్వామీజీ.
ప్రార్థించే వ్యక్తి ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. మనకేం కావాలన్నది దేవుడినే నిర్ణయించనివ్వండి. ఆయన అత్యుత్తమమైనదే ఇస్తాడు. వంటగదిలో ఉన్నా, స్నానాలగదిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, సినిమాహాలులో ఉన్నా...అమ్మ మనసెప్పుడూ బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ప్రార్థన కూడా అలా మన జీవితంలో, ఆలోచనల్లో ఓ భాగం కావాలి. ప్రార్థన 'యాస్ప్రిన్' మాత్ర కాదు. కాస్త అసౌకర్యంగా అనిపించినప్పుడు మాత్రమే గుర్తుకురావడానికి. చాలామంది ప్రార్థించరు. యాచిస్తారు. దేవుడికీ మనిషికీ మధ్య దూరం...ప్రార్థన. ప్రార్థన...ఉదయం తలుపు తెరిచే తాళంచెవి. రాత్రి తలుపు మూసే గొళ్లెం. విద్యుత్‌శక్తి గ్రామాల్నీ నగరాల్నీ దేశాన్నీ దేదీప్యమానం చేసినట్టే, ప్రార్థనాశక్తి మన అంతరంగాల్ని తేజోమయం చేస్తుంది. రోజుకు ఎన్నిసార్లు ప్రార్థన చేయాలంటే...వడ్లగింజను ఎన్నిసార్లు దంచితే బియ్యపు గింజ అవుతుందో అన్నిసార్లు, కఠిన శిలకు ఎన్ని ఉలిదెబ్బలు తగిలితే శిల్పం అవుతుందో అన్నిసార్లు, ఎన్నిసార్లు చిలికితే మజ్జిగలోంచి వెన్నపుడుతుందో అన్నిసార్లు...చేయాల్సిందే. ప్రార్థనలో దేవుడితో మాట్లాడతాం. ధ్యానంలో దేవుడి సందేశాన్ని వింటాం. కాలంగడిచేకొద్దీ మాటలు తగ్గాలి. శ్రోతగా మిగిలిపోవాలి. అప్పుడే, సాధన ముందుకు సాగుతున్నట్టు అర్థం. ప్రార్థన ద్వారా దేవుడికి బోలెడన్ని విషయాలు చెప్పాలన్న ఆత్రుత వద్దు. అన్నీ తెలిసినవాడికి ఎన్నని చెప్పగలం. సృష్టికర్తతో మౌనంగానే సంభాషించాలి. మనలోని అహంభావాలవైపూ అజ్ఞానాలవైపూ చూడనంతకాలం, దేవుడివైపుచూసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ ప్రార్థన ప్రార్థనే కాదు, ఒట్టి ఏకపాత్రాభినయం! హిందూ ప్రార్థన, ముస్లిం ప్రార్థన, క్రైస్తవ ప్రార్థన వేరువేరు కాదు. ప్రార్థన ఒక్కటే. పేర్లే వేరు. |
|
ఆ తామరలకు 'పుష్పవిలాపం' అంటే తెలియదేవో! ఓ మారుమూల కుగ్రామంలో పూసిన ఆ పూలు ప్రముఖ దేవాలయాల్లో అర్చనకు ఉపయోగపడుతుంటే ఎందుకు విలపిస్తాయి? మతసామరస్యానికి ప్రతీకలుగా నిలిచే ఆ కమలా పూలు తమను తెంచుతుంటే... 'మా ప్రాణములు తీతువా'యని ఎందుకు బాధపడతాయి? సమైక్యతకు వారధిగా నిలిచే ఆ కమలాల కథ తెలుసుకోవాలంటే కేరళ వెళ్లాల్సిందే. |
లేచిన దగ్గర్నుంచి ఆరుగంటలయ్యేదాకా ఇదే ఆయన దినచర్య. ఆయనొక్కడిదే కాదు, సుమారు మరో 100మందిదీ ఇదే దినచర్య. అలా వాళ్ల వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయలుగా సాగిపోతోంది.
'పూలమ్మేవాళ్లు ఎంతోమంది ఉంటారు.
మరి, వీళ్లకు వేరే ప్రత్యేకత ఏమైనా ఉందా' - అని సందేహం రావొచ్చు. అవును, వీళ్లకు చాలా ప్రత్యేకతలున్నాయి.
పేద్ద తామరవనం
కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలోని ఓ కుగ్రామం ఎడక్కుళం. జనాభా ఓ నాలుగయిదువేలు ఉంటుంది. గ్రామంలో ఎటుచూసినా చెరువులూ తోటలే కనిపిస్తాయి. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక పల్లెటూరు ఎలా ఉంటే బాగుంటుందో ఆ లక్షణాలన్నీ ఎడక్కుళంలో కనిపిస్తాయి.
గ్రామంలో సుమారు 60 ముస్లిం కుటుంబాలున్నాయి. దాదాపుగా వాళ్లందరి జీవనాధారం ఒక్కటే... తామరపూలు. వూరిమధ్యనున్న పేద్ద తామరవనంలో వాటిని పెంచుతారు. అక్కడ పూసిన తామరలనే కేరళ, కర్ణాటకల్లోని ప్రముఖ దేవాలయాలకూ దుకాణాలకూ అమ్ముతారు. కేవలం ఆలయాలకే రోజూ పదివేల పూలు తీసుకెళ్తుంటారు.
'మేం నాణ్యమైన తామరలను పెంచుతాం. పూజారులు కూడా వాటిని చూసి చాలా మెచ్చుకుంటారు. అంతేకాదు, తక్కువ ధరకే వాటిని అమ్ముతాం. ఒకవేళ మా దగ్గర పూలు లేకపోతే ఇతర ప్రాంతాలనుంచి తెప్పించయినా దేవాలయాలకు తప్పనిసరిగా ఇస్తాం' అంటారు 56 ఏళ్ల అబ్దుర్ రెహమాన్. ఆయన సహా మరో ఆరు కుటుంబాలవే ఇక్కడున్న తామరవనాలు. అందులోనే మిగతావాళ్లంతా పనిచేస్తుంటారు. ఆయన గత పాతికేళ్లుగా ఈ పూల వ్యాపారం చేస్తున్నారు.
'కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని దేవాలయ అధికారులుగానీ పూజారులుగానీ ఎవ్వరూ మమ్మల్ని ఇప్పటివరకూ పల్లెత్తు మాటనలేదు. మా మతపెద్దలెవరూ మాకు అడ్డు చెప్పలేదు. మేం చేసేది తప్పయితే కదా... ఎవరయినా మమ్మల్ని వేలెత్తి చూపడానికి' అంటారు మహమ్మద్ ముస్తఫా అనే మరో రైతు.
ఎడక్కుళం నుంచి కేరళలోని సుప్రసిద్ధ దేవాలయాలైన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం, త్రిస్సూర్ పరమేక్కువ భగవతి గుడి, కోజికోడ్ తాలి శివాలయం, కడంపుజ వనదుర్గ అమ్మవారి ఆలయం... ఇలా అనేక సుప్రసిద్ధ దేవాలయాలకు తామరలు రోజూ ఇక్కడి నుంచే వెళ్తుంటాయి. అంతేకాదు... ఈ ఆలయాల్లో ఏటా జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం కూడా వీళ్లే పూలు పంపుతుంటారు.
ఎప్పటి నుంచో...
హిందూ దేవాలయాలకు ముస్లింలు తామరలు పంపించడం ఎలా సాధ్యమైంది అని చాలామంది ఈ వూరివాళ్లని అడుగుతుంటారు. నిజానికి అదెలా ప్రారంభమైందో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ వూరివాళ్లు ఓ కథ చెబుతారు. గ్రామంలో పురాతన ఆలయం ఒకటి ఉండేది. దానికి సమీపంలో చెరువులు ఉండేవి. అప్పట్లో ఇక్కడున్న ముస్లిం కుటుంబాలకు జీవనాధారం ఉండేది కాదు. అది గమనించిన ఆలయ పూజారులు... ఆ చెరువుల్లో తామరలు పెంచమని సలహా ఇచ్చారట. అప్పట్నుంచి ముస్లిములు తామరలు పెంచడం వెుదలుపెట్టారని చెబుతారు. ఇటీవలి కాలంలో ఎడక్కుళం తామరలకు గిరాకీ పెరిగింది. దాంతో చుట్టుపక్కల వూళ్లలోని రైతులు కూడా తామరల పెంపకం చేపట్టారు.
'మిగతా వ్యవసాయోత్పత్తుల్లా మాకు మార్కెట్‌తో సంబంధం లేదు. మా పూలకు సంవత్సరంలో 365 రోజులూ డిమాండ్ ఉంటుంది. కాకపోతే, తక్కువ ధరకే అమ్ముతాం కాబట్టి, లాభమూ తక్కువ వస్తుంది. అయినా మేమెప్పుడూ బాధపడలేదు. వ్యాపారమే లేనివాళ్లకంటే మేం చాలా నయం. ముఖ్యంగా... ఆ భగవంతుణ్ణి పరోక్షంగా సేవిస్తూ, అన్ని మతాలవారినీ కలుపుకొనిపోయే అవకాశం ఎంతమందికి వస్తుంది?. దేవుణ్ణి నమ్ముకుని ధర్మంగా పోయేవాళ్లకు ఆ దేవుడే బతుకుదారి చూపిస్తాడు. మేమే అందుకు నిదర్శనం' అంటారు అబ్దుర్ రెహమాన్.
ఓట్లకోసవో పదవుల కోసవో మత విభేదాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే స్వార్థ రాజకీయ నాయకులకూ పార్టీలకూ ఈ మాటలు వినిపిస్తాయా!
క్లాసైనా... క్లాసికలైనా... జానపదమైనా... జాజ్‌బీటైనా... ఆమె పాడిన పాట ఏదైనా దానికంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆమె గాత్రానికి ఒక ప్రత్యేక గుర్తింపూ ఉంటుంది. ఆ గాయని వాణీజయరాం. 40 యేళ్లుగా మనకు సుపరిచితం ఆమె గానం. 'ఇప్పటికీ ఎప్పటికీ సంగీతమే సర్వస్వం' అంటున్నారామె. ఇంకా మరెన్నో విషయాలు ఇలా మనకోసం చెబుతున్నారు.
- కాశీలో గంగామహోత్సవ్ జరిగింది. అప్పుడు దశాశ్వమేథ్ ఘాట్ దగ్గర కూర్చుని నేను కచేరీ చేశాను. అదో మధురమైన అనుభూతి. ఆ మరునాడు ఓ పత్రికలో నా గానం గురించి అలా రాశారు. 'మీరా భువికి మరోసారి దిగొచ్చింది.
వాణి గొంతులోంచి మరోసారి పాడింది.'
- ఓసారి చిత్తోడ్‌గఢ్‌లో మీరామహోత్సవ్ జరిగింది. అక్కడ పాడాను. ఆ మరునాడు స్థానిక పత్రికల్లో అలా రాశారు. ఇదంతా ఏదో గొప్ప కోసం చెప్పడం లేదు. దేవుడు నాకిచ్చిన వరం గురించి చెబుతున్నాను. ఈ స్వరం పూర్వ జన్మల పుణ్యఫలం! నిజమే... గత జన్మలో నేను దేవుణ్ని తేనెతో అభిషేకించానట! ఆ పుణ్యం వల్లే ఈ జన్మలో గాయనిగా పుట్టానట. ఈ మాట వేలూరులోని ఓ సిద్ధాంతిగారు మా నాన్నతో చెప్పారు!
సంగీత కుటుంబం
తమిళనాడులోని వేలూరులో నేను పుట్టాను. అమ్మ పద్మావతి. నాన్న దొరైస్వామి. నేను పుట్టగానే జాతకం చూపిద్దామని నాన్న ఓ సిద్ధాంతి దగ్గరికి వెళ్లారు. 'మీ పాప భవిష్యత్తులో సుమధుర గాయని అవుతుంది. అందుకే కలైవాణి అని పేరుపెట్టండి' అని ఆయన సూచించారు. ఆ మాట వినగానే నాన్నకి నవ్వొచ్చిందట. ఇప్పట్నుంచే పాప భవిష్యత్తు గురించి అంత పెద్ద కలలు ఎందుకని అమ్మానాన్న అనుకున్నారట. నిజానికి మాది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. అమ్మ చక్కగా పాడుతుంది. వీణ కూడా వాయించేది. నేను పదకొండు మంది పిల్లల్లో ఎనిమిదో సంతానం. మా అక్కయ్యలూ సంగీత ప్రియులే. అందుకే కడలూరు శ్రీనివాస అయ్యంగార్ అనే విద్వాంసుని దగ్గర వాళ్లకి సంగీతం నేర్పించేవారు. అప్పటికి నా వయసు ఐదేళ్లు. నేను కూడా వాళ్లతోపాటు వెళ్లేదాన్ని. పక్కన కూర్చుని కృతులు పాడేదాన్ని. దాంతో గురువుగారు నా ఆసక్తిని గమనించి సంగీత పాఠాలు చెప్పడం వెుదలుపెట్టారు. అలా శాస్త్రీయ సంగీతం పరిచయమైంది. చెన్నై వెళిపోతే పిల్లలకి సంగీతం మరింత బాగా నేర్పించొచ్చు అన్న ఆలోచనతో మా కుటుంబాన్ని అక్కడికి మార్చేశారు అమ్మానాన్న. చెన్నై వచ్చాక ఐదో తరగతిలో చేరాను. టి.ఆర్. బాలసుబ్రమణియన్, త్రివేండ్రం ఆర్.ఎస్.మణి వంటి సంగీతజ్ఞుల దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. మరోపక్క స్కూల్లో నేనే టాపర్. పాటల పోటీలూ వ్యాసరచనా డ్రాయింగ్ దస్తూరీ వక్తృత్వం అన్నింట్లో బహుమతులన్నీ నావే. పదేళ్ల వయసులో స్కూల్ తరఫున ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశం వచ్చింది. అలా నా గొంతు వెుదటిసారి బాహ్య ప్రపంచానికి వినిపించింది. అక్కణ్నుంచి రేడియోలో వరుసగా నాటకాలు వేస్తుండటం... కవితలు చదవడం... పాడటం... దాదాపు పదేళ్లపాటు వివిధ రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. దాంతో స్కూల్లో నేనో సెలెబ్రిటీగా వెలిగిపోయాను. చాలామంది పిల్లలకి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అంతా బానే ఉంది, కానీ... నా ఆసక్తి నెమ్మదిగా సినిమా పాటలవైపు మళ్లింది. అదే ఇబ్బంది..!
దొంగచాటుగా...
మా ఇంట్లో సంగీతం అంటే శాస్త్రీయ సంగీతమే! అదితప్ప వేరే ఏదీ వినిపించడానికి వీల్లేదు. కనీసం లలితగీతాలు కూడా పాడనిచ్చేవారు కాదు. సినిమాలన్నా సినిమా పాటలన్నా సంపూర్ణ నిషేధం. సినీగీతాలు విన్నా పాడినా శాస్త్రీయ సంగీతానికి అవమానం జరిగినట్టు భావించేవారు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు సినీగీతాలపై ఆసక్తి పెరిగింది. ఇంట్లో ఒక రేడియో ఉండేది. వివిధభారతిలో పాటలు వస్తుంటే చాలా తక్కువ సౌండ్ పెట్టుకుని ఎవరికీ వినిపించకుండా కనిపించకుండా ఓ మూల కూర్చుని వినేదాన్ని. విన్నపాటల్ని నేపథ్య సంగీతంతో సహా కంఠతా పెట్టేసేదాన్ని. ఎప్పటికైనా సినిమాల్లో పాడాలి అని అప్పుడే నిర్ణయించేసుకున్నాను. అలాగే కలలు కంటూ ఉండేదాన్ని. అలా సినీగీతాలు వినే హాబీ కొనసాగుతూ ఉండేది. స్కూల్ చదువు అయ్యాక చెన్నైలోని క్వీన్స్ మేరీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశాను. తరువాత ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అనిపించింది. ప్రయత్నిస్తే చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లకి హైదరాబాద్ బదిలీ అయింది. దాంతో ఇక్కడికి వచ్చేశాం. ఇక్కడికి వచ్చాకే నాకు జయరాంతో పెళ్త్లెంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లి తరువాత నా పేరు వాణీజయరాంగా మారింది. ఆయన ముంబైలోని ఇండో-బెల్జియం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పని చేసేవారు. కాబట్టి నేను కూడా ముంబై వెళ్లిపోవాల్సివచ్చింది. అయినా నేను ఉద్యోగం మాత్రం మానలేదు. ఇక, సంగీతం సంగతీ అంటారా... నిజానికి గొప్ప మలుపు తిరిగింది పెళ్లి తరువాతే!
ఎందరో మహానుభావులు
మా వారికి పాటన్నా సంగీతమన్నా ఎంతో అభిమానం. ఆయన సితార్ వాయిస్తారు. పండిట్ రవిశంకర్‌గారి దగ్గర దాదాపు ఆరేళ్లపాటు నేర్చుకున్నారు. 'కర్ణాటిక్, శాస్త్రీయం నేర్చుకున్నావు కదా. ఇప్పుడు హిందుస్థానీ కూడా నేర్చుకో' అని నన్ను ప్రోత్సహించారు. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ సాబ్ దగ్గర సంగీత పాఠాలకు చేర్పించారు. రహమాన్‌గారు చాలా కఠిన శిక్షణ ఇచ్చేవారు. ఒక్కోరోజు ఉదయం పది గంటలకి సాధన చెయ్యడం వెుదలుపెడితే సాయంత్రం ఆరు వరకూ సాగుతూ ఉండేది. రోజుకి 18 గంటలపాటు నాతో సాధన చేయించిన సందర్భాలూ ఉన్నాయి. దాదాపు ఆరు నెలలపాటు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నాను. తరువాత ఆయనే చెప్పారు... 'ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ సింగర్‌వి. నిశ్చింతగా కచేరీలు చేసుకోవచ్చు' అని. ఆయన సలహామేరకే ఉద్యోగం మానేసి పూర్తి సమయాన్ని సంగీతానికి కేటాయించాను. 1969లో బాంబేలో తొలి కచేరీ ఇచ్చాను. తరువాత చాలా సంస్థల నుంచి కచేరీలకి ఆహ్వానాలు వచ్చాయి. వరుస ప్రోగ్రామ్‌లు చేస్తూండేదాన్ని. అలాగే ఓ కచేరీకి సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్ హాజరయ్యారు. ఆయనకి నా గొంతు బాగా నచ్చింది. ఆయన గుల్జార్‌గారికి చెప్పారు. గుల్జార్‌గారు అప్పుడు నాతో మీరాభజన్స్ పాడించారు. నా తొలి రికార్డింగ్ అది. తరువాత 1970లో వసంత్‌దేశాయ్ 'గుడ్డీ' చిత్రంలో పాడే అవకాశం ఇచ్చారు. దానికి ఆయనే సంగీత దర్శకులు. అందులో మూడు పాటలు పాడాను. ఆ చిత్రంలో ధర్మేంద్ర, జయబాధురీ హీరోహీరోయిన్లు. 'బోలే రే పపి' పాట అప్పట్లో సూపర్‌హిట్ అయింది. దానికి తాన్‌సేన్ అవార్డుతోపాటు మరో నాలుగు అవార్డులు వచ్చాయి. వెుదటిపాటకే ఇంత గుర్తింపు వస్తుందని వూహించలేదు. అది మరచిపోలేని సందర్భం. సినిమాల్లో పాడాలీ అనే నా చిన్ననాటి కల అలా నిజమైంది. తరువాత నౌషాద్‌గారి 'పాకీజా'లో పాడాను. అప్పట్లో ఆ పాటలు సూపర్‌హిట్. దాంతో అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఆర్.డి.బర్మన్, నౌషాద్, మదన్‌వోహన్, ఓపీ నయ్యర్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, పండిట్ రవిశంకర్ వంటి గొప్ప సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం దక్కింది. అలాగే మహమ్మద్ రఫీ, కిషోర్‌కుమార్ వంటి ప్రముఖ గాయకులతోనూ కలిసి పాడే అదృష్టం దక్కింది. నిజానికి వెుదట్లో ఎక్కువగా హిందీ పాటలే పాడాను. దక్షిణాది నుంచి అవకాశాలు కూడా రాలేదు. వాటి గురించి ఆలోచించలేదు కూడా. ఆ సమయంలో ఎస్.పి.కోదండపాణిగారు 'అభిమానవంతుడు' అనే చిత్రంలో 'ఎప్పటివలె కాదురా స్వామి' అనే పాటను నన్ను పిలిచి పాడించారు. అదే నా వెుదటి తెలుగు సినిమాపాట. తరువాత తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అవకాశాలు వచ్చాయి. అప్పట్లో బాంబే నుంచి మద్రాసు వస్తుండటం... పాట రికార్డింగ్ అవగానే వెళ్లిపోవడం చేస్తుండేదాన్ని. రానురానూ బిజీగా మారడంతో మద్రాసులోనే స్థిరపడిపోదామని నిర్ణయించుకున్నాం.
తొలిచిత్రాలకు నేనే...
తమిళంలో దర్శకులు కె.బాలచందర్‌గారు తీసిన 'అపూర్వ రాగంగళ్' నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇందులో పాడిన పాటలకి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు లభించింది. తెలుగులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రం 'శంకరాభరణం'. ఈ సినిమాలో పాడటం వల్ల రెండోసారి జాతీయ ఉత్తమ గాయని అవార్డు అందుకున్నాను. అదే ఏడాది హిందీలో 'మీరా' చిత్రం విడుదలైంది. అందులో 14 పాటలూ నేనే పాడాను. పండిట్ రవిశంకర్‌గారు సంగీతం. దానికీ ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. 'స్వాతికిరణం'లోని... 'తెలిమంచు కరిగింది'... 'ఆనతినియ్యరా హరా'... ఆ తరువాత 'ఎన్నెన్నో జన్మల బంధం', 'ఒక బృందావనం'... ఇలా చెప్పుకొంటూ పోతే అన్నీ మధుర జ్ఞాపకాలే. ఇవన్నీ నాకు ఎంతో సంతృప్తిని మిగిల్చిన గీతాలు. అదృష్టం ఏంటంటే తెలుగులో సంగీత దర్శకులు నాకిచ్చిన గీతాలన్నీ సూపర్‌హిట్. అప్పట్లో ఇండస్ట్రీలో అనుకునేవారట... ఏదైనా కొత్తగా పాడించాలన్నా కష్టమైన స్వరకల్పన ఉన్నా వాణీజయరాంతో పాడించాలీ అని. నిజానికి నా జీవితంలో ఏ రోజూ ఎవరినీ ఒక పాట పాడే అవకాశం ఇవ్వండని అడిగిన సందర్భాలే లేవు. అందరూ ఎంతో అభిమానంగా పిలిచేవారు. పాడించుకునేవారు. యాదృచ్ఛికంగా చాలామంది హీరోయిన్ల తొలిచిత్రాలకు నేనే పాటలు పాడాను. శ్రీదేవి తొలి హిందీ, తమిళ చిత్రాలకి నేనే పాడాను. అలాగే షబానా ఆజ్మీ, జూహీచావ్లా, పర్వీన్‌బాబీ, జయబాధురీల తొలిచిత్రాలకు నేనే పాడాను. అప్పట్లో ఎవరైనా కొత్త నటీనటులతో సినిమా తీస్తుంటే అందులో పాటల్ని కూడా ఫ్రెష్ వాయిస్‌తో పాడించాలని అనుకునేవారు. దాంతో నాకు అవకాశం ఇచ్చేవారు. ఇప్పటివరకూ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ ఇలా 14 భాషల్లో దాదాపు 8 వేలకు పైగా పాటలు పాడాను. వివిధ దేశాల్లో ఎన్నో కచేరీలు ఇచ్చాను.
నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటే కారణం మావారు. సంగీతం నేర్చుకోమని నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఎన్నో సలహాలిస్తూ అన్ని సందర్భాల్లో వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. మాకు పిల్లలు లేరు. అయితే, ఆ లోటు సంగీతం తీర్చేసింది. ప్రస్తుతం నేను కచేరీలతో బిజీగా ఉన్నాను. రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దేవుణ్ని ఓ కోరిక కోరుతుంటా... రోజుకి 24 గంటలకి బదులు 72 గంటలిమ్మని! ఎందుకంటే సంగీతం కోసం రోజూ చేస్తున్నదానికంటే ఎక్కువ చెయ్యాలి. ఎక్కువగా పాడాలి.
ఈతరం గాయనీగాయకులకు ఒక్కమాట. డబ్బుకోసవో కీర్తికోసవో తాత్కాలిక సుఖాలకోసవో పరుగులు పెట్టొద్దు. ముఖ్యంగా పెద్దల పట్ల గౌరవంతో మెలగాలి. నిరంతర సాధన ఉండాలి. అప్పుడు విజయం వెంటే ఉంటుంది. గాయకులనే కాదు, ఏ రంగంలోవారైనా రాణించాలంటే ఇదే సూత్రం.
పుస్తకాలు: నేనో పుస్తకాల పురుగుని. మహానుభావుల ఆత్మకథలు చదవడమంటే ఇష్టం. ఆధ్యాత్మిక పుస్తకాలూ చదువుతాను. పుస్తకం పట్టుకుంటే ఒక్కోసారి రాత్రి ఒంటిగంటా రెండూ అయిపోతూ ఉంటుంది.
వంటావార్పు: ఇంటి పని వెుత్తం నేనే చేసుకుంటాను. నా వంట గురించి మా ఆయనే చెప్పాలి. బాగానే చేస్తానంటారు.
ఆరోగ్యం: మా ఇంట్లో ఇడ్లీపూరీ దోశ లాంటివేవీ ఉండవు. ఉదయాన్నే పండ్లు తింటాను. మధ్యాహ్నం ఒక కూరతో భోజనం. సాయంత్రంపూట ఏమీ తినను. ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే ఒక పండు. రాత్రిపూట కూడా మితాహారమే.
పరమశివుడు నివసించే కైలాసగిరినే దేవాలయంగానూ బ్రహ్మ సృష్టించిన మానససరోవరాన్ని దేవతల సరస్సుగానూ భావించి చేసేదే మానససరోవర యాత్ర. జీవితకాలంలో ఒక్కసారైనా ఆ మహిమాన్విత శిఖరాన్ని కళ్లారా చూసి తరించాలనుకునేవాళ్లెందరో. అయితే ఈ యాత్ర కష్టసాధ్యమే కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే అసాధ్యం కాదు అంటున్నారు కడపవాసి డాక్టర్ కె.ఎల్.సంపత్‌కుమార్.
కైలాసగిరి పరిక్రమణ
ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని బియ్యం, పెసరపప్పుతో చేసిన కిచిడీ తిని మధ్యాహ్నానికి వెజిటబుల్ శాండ్‌విచ్, అరటిపండు, చాకొలెట్లు, బిస్కెట్లు, నీళ్లసీసా తీసుకుని వ్యానులో బయలుదేరాం. నాలుగుకిలోమీటర్ల ప్రయాణం చేయగానే చోర్డెన్ కాంగ్లీ అనే కట్టడం వచ్చింది. దీన్నే యమద్వారం అంటారు. కైలాస పరిక్రమణ దిగ్విజయంగా జరగాలని దాని చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేశాం. ఇది చేస్తే శారీరక, మానసిక సమస్యలు ఏమున్నా సమసిపోయి చనిపోయాక నేరుగా స్వర్గానికి వెళతామన్నది భక్తుల నమ్మకం. ఇక్కడినుంచే కైలాస పరిక్రమణ వెుదలవుతుందని నమ్ముతారు. గుర్రాలపైన వెళ్లేవారు, నడిచివెళ్లేవారు అంతా ఒకేదారిలో వెళతారు.
యమద్వారం దాటాక లాఛూ అనే లోయ వస్తుంది. దీన్నే దేవతల లోయ అంటారు. ఇక్కడికి దేవతలు వ్యాహ్యాళికి వస్తుంటారని అంటారు. ఈ లోయలో ఓ నది పారుతుంటుంది. అదే లాఛూ నది. ఇది దాటగానే కైలాసపర్వతం పరిపూర్ణంగా కనిపిస్తుంది. ఇక్కడ లాఛూనది ఒడ్డున ఓ బౌద్ధవిహారం ఛాకూగోంఫా ఉంది. ఇందులో టిబెట్ లామాల ఆరాధ్యదైవం రింపొచే విగ్రహం ఉంది. దారిలో కైలాస పర్వతానికి పశ్చిమదిశలో ఓ వింతైన పర్వతశిఖరం కనిపించింది. ఇది నల్లగా పాము పడగలా ఉంది. దీన్ని గోంచోపాంగ్ లేదా రావణశిఖరం అంటారు. వెుదటిరోజు పరిక్రమణ ముగిసేటప్పటికి సాయంత్రం ఆరుగంటలయింది. ఆ రాత్రి బస డేరాపుర్ అనే గ్రామంలో. ఇక్కడనుంచి కైలాసపర్వతం ఈశాన్యభాగం బోర్లించిన వెండిగిన్నెలా తళతళా మెరుస్తూ కనిపిస్తుంది. ఆ అద్భుతదృశ్యం చూశాక ప్రయాణ బడలిక మటుమాయం అయింది. ఇక్కడ ఉన్న బౌద్ధ విహారాన్ని డేరాపూర్ గోంఫా అని పిలుస్తారు. ఇక్కడ విగ్రహరూపంలో ఉన్న వ్యక్తే ప్రస్తుత పరిక్రమణ మార్గాన్ని కనిపెట్టాడని అంటారు. అక్కడ నుంచి చూస్తే మూడు ఎత్త్తెన పర్వతాలు కనిపిస్తాయి. వాటిపేర్లు మంజుశ్రీ, అవలోకతేశ్వరి, వజ్రపాణి. జ్ఞానం, దయ, అధికారం అనే మూడింటినీ ఈ పర్వతాలు ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం. శివస్థల్
రెండోరోజు పరిక్రమణలో అత్యంత క్లిష్టమైన డోల్మాలా పర్వతం దాటాలి. దీనికి 'తారాదేవి' కనుమ అని కూడా పేరు. ఇది సముద్ర మట్టానికి 19,500 అడుగుల ఎత్తులో ఉంది. ఈ దారిలో కూడా లాఛూనది వస్తుంది. నది దాటగానే 'శివస్థల్' అనే పర్వతం ఎన్నో వింత కాంతులతో మెరుస్తూ కనిపించింది. ప్రతి ఉదయం సూర్యుడి తొలికిరణాలు పర్వతంమీద పడి అది అద్భుతంగా కనిపిస్తుంది. డోల్మాలా పర్వతాన్ని పార్వతీదేవి స్థలంగా చెబుతారు. ఈ కనుమ దారి మధ్యలో ఓ పెద్ద బండరాయి ఉంది. దీన్ని తారాదేవి శిల అంటారు. వాతావరణం నిర్మలంగా ఉంటే ఇక్కడ నుంచే ఎవరెస్ట్ శిఖరం కనిపిస్తుంది. ఈ దారి సరిగా ఉండదు. జాగ్రత్తగా చేతికర్ర సాయంతో దిగాలి. డోల్మాలా శిఖరం నుంచి కిందకి దిగే దారిలో కుడివైపున సుమారు 500 అడుగుల కింద కోడిగుడ్డు ఆకారంలో మంచుతో గడ్డకట్టిన ఓ కొలను కనిపిస్తుంది. దీన్ని గౌరీకుండం అంటారు. ఇది ఎప్పుడూ ఘనీభవించి ఉంటుంది. పూర్తిగా నీళ్లున్న సందర్భాలు చాలా అరుదు. 1946, 47, 52, 94లలో ఈ సరస్సు పూర్తిగా నీటితో ఉందని అంటారు. పార్వతీదేవి శివుణ్ణి వివాహమాడేందుకు రోజూ ఉదయాన్నే ఇందులో స్నానం చేసి తపస్సు చేసేదని భక్తుల నమ్మకం. దారిలో కొందరు లామాలు సాష్టాంగ నమస్కారాలతో పరిక్రమణ చేయడం కనిపించింది. ఇలా చేయడానికి సుమారు 15 రోజులు పడుతుంది. ఈ పరిక్రమణ కాలమంతా సత్తు అనే పిండిని నీళ్లలో వేసుకుని తాగుతారు. ఇదే వారి ఆహారం. అలా మా రెండో రోజు పరిక్రమణ ముగిసింది. రాత్రికి జతుల్‌పుర్ అనే వూరిలో బస చేశాం. అక్కడ ఉన్న బౌద్ధవిహారంలో కుడిచేతిని కుడిచెవికి వెనక ఉంచి ఏవో మాటలు వింటున్నట్లుగా ఓ వింత విగ్రహం ఉంది. ఇది మిలారేపో అనే లామాది. కైలాసగిరి ఎక్కాలని చాలామంది ప్రయత్నించారట. కానీ ఎవరికీ సాధ్యం కాలేదు. ఒక్క మిలారేపోనే కైలాసపర్వతారోహణ చేశాడని అంటారు.
చివరిరోజు పరిక్రమణం చాలా సులభం. సుమారు 8 కిలోమీటర్లు గుర్రాలమీద వెళ్లవచ్చు. తరవాత 4 కిలోమీటర్లు నడవాలి. ఆ తరవాత 4 కిలోమీటర్లు అందరం వ్యానుల్లో ఎక్కి కైలాసగిరి ప్రదక్షిణ ముగించాం. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి వ్యానుల్లో బయలుదేరి ఖాట్మండుకి చేరుకున్నాం.
* చల్లగాలికి ముక్కుల్లోంచి రక్తం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముక్కు రంధ్రాలకు వేజలైన్ రాస్తే మంచిది. పాదాలను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. శక్తిని ఇచ్చే చాకొలెట్లు, బిస్కెట్లు తెచ్చుకోవడం మంచిది. * దారిలో మనుషులు కనిపించరు కాబట్టి గుర్రపు లద్దెలను చూసుకుంటూ వెళ్లవచ్చు. వీలయినంతవరకూ తక్కువగా మూడు నాలుగు గంటల వ్యవధిలో తింటుండాలి. నీళ్లు మాత్రం 5 లీటర్ల పైనే తాగాలి. * మానససరోవరం, కైలాసశిఖరం రెండూ టిబెట్‌లోనే ఉన్నాయి. ఇది ఎత్త్తెన పీఠభూమి. అక్కడ పగలు ఎండ, రాత్రి చలి విపరీతంగా ఉంటాయి. కాబట్టి పగలు తేలికైన నూలుదుస్తులు, రాత్రికి ఉన్ని దుస్తులు కావాలి. సన్‌స్క్రీన్ తప్పనిసరి. చాలా ఎత్తుకి వెళ్లాలి కాబట్టి రెండు మూడు నెలల ముందు నుంచి వ్యాయామం, నిత్యం ప్రాణాయామం చెయ్యడం మంచిది. * ప్రథమచికిత్సకు అవసరమైన మందులూ బ్యాండేజీలూ దగ్గర ఉంచుకోవాలి. వూపిరితిత్తుల నెమ్ముకి రాత్రి నిద్రపోయేముందు 10 మిల్లీగ్రాముల డైమాక్స్ ట్యాబ్లెట్ వాడాలి. ఇది సాధారణంగా యాత్రా నిర్వాహకులే ఇస్తారు. |
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి