Etaram Saturday (02_07_2011)
ఐదుగురు కుర్రాళ్లు... ఆలోచనల్లో చురుకు... పట్టుపట్టి ప్రయోగాలు చేశారు... బూడిదతో రోడ్లు వేసే పద్ధతి కనుగొన్నారు... ఇది కార్యరూపం దాల్చితే... తక్కువ ఖర్చుతో రోడ్లు వేయొచ్చు... పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది... కోట్లాది రూపాయలు ఆదా అవుతాయి... ఆ యువతరంగాలతో 'ఈతరం' ముచ్చటించింది.ఫ్త్లెయాష్. ఒక రకమైన బూడిద. థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టుల నుంచి వెలువడే వ్యర్థ పదార్థం. దాని బెడద ఇంతా అంతా కాదు. అది కుప్పలు తెప్పలుగా పేరుకుపోతూ గాలుల ద్వారా రేగిపోతూ కాలుష్యం సృష్టిస్తుంది. గ్రామాలకు గ్రామాలే ఈ దుమ్ముతో విలవిల్లాడిపోతున్నాయి. ప్రజల గగ్గొలు, పరిహారం కోసం డిమాండ్లు, ధర్నాలు... ఇదీ ప్రస్తుత నేపథ్యం! ఈ బూడిదను అద్భుతంగా ఉపయోగించుకునే ఆలోచనను తళుక్కుమనిపించారు వరంగల్‌కి చెందిన యువ ఇంజినీర్లు. దీన్నే ముడి సరుకుగా చేసుకుని పటిష్ఠమైన రహదార్లను నిర్మిచవచ్చని నిరూపించారు. ఒక్క రహదార్లేనా? ఇంటి గోడలు, టైల్స్, ఫ్లోరింగ్ పనులకు సంబంధించిన పనుల్లో కూడా ఉపయోగించుకునే వీలు ఉందంటున్నారు. ఆ యువకులే అబూ అభిలాష్, రవికాంత్, రాజీవ్, రమేష్, శ్రీకాంత్.
చేతులు కలిశాయి
వరంగల్‌లోని సుజల భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌బీఐటీ) విద్యార్థులైన ఈ అయిదుగురూ సివిల్ ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్నారు. 'ఫ్త్లెయాష్‌ని తరలించడం కష్టంగా ఉంది. ఎవరైనా వచ్చి ఉచితంగా తీసుకెళ్లొచ్చు' అని ఓ థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్ అధికారుల చేసిన ప్రకటన వీళ్లనాకర్షించింది. దాంతోనే ఏదైనా సాధించాలనుకుని ఆలోచించారు. ల్యాప్‌టాప్‌లకి పని చెప్పారు. ఫ్త్లెయాష్ రసాయనిక ధర్మాలన్నీ తెలుసుకున్నారు. చల్లగా ఉండడం, తొందరగా గట్టిపడే గుణం ప్రత్యేక లక్షణాలని గ్రహించారు. ఇప్పటికే దీంతో తయారు చేస్తున్న ఇటుకల్ని పరిశీలించారు. దీన్ని రోడ్ల నిర్మాణానికి వాడలేమా అని ప్రశ్నించుకున్నారు. పరిశోధన మొదలైంది. ఫ్త్లెయాష్‌కి రకరకాల పదార్థాలు కలుపుతూ గట్టిదనాన్ని పరీక్షించారు. ఓ ఫార్ములా తయారైంది.
తమ పరిశోధనను కాలేజీ యాజమాన్యానికి చెప్పి సాయం చేయమన్నారు మిత్రులు. 'చూద్దాం' అన్నారేగానీ భరోసా ఇవ్వలేదు యాజమాన్యం. సరిగ్గా అప్పుడే రాష్ట్ర స్థాయిలో ఇంజినీరింగ్ విద్యార్థులకు జరిపే పోటీలకు రమ్మంటూ ఆహ్వానమందింది. వెంటనే తమ ప్రాజెక్ట్ వివరాలను పంపారు. తారు, సీసీరోడ్లు, ఇంట్లో ఫ్లోరింగ్, భవనాల నిర్మాణ పనుల్లో ఫ్త్లెయాష్‌ను ఎలా ఉపయోగించవచ్చో వివరించారు. నిపుణుల దృష్టిలో పడ్డారు. ఫలితం... ఈ బృందానికే మొదటి బహుమతి. కాలేజీ యాజమాన్యానికి తమ కుర్రాళ్ల ప్రతిభపై నమ్మకం కుదిరింది. ఆర్థికసాయం చేయడానికి ముందుకొచ్చింది. రెండేనెలల్లో.. అదరహో
ప్రయోగాత్మకమైన పని మొదలైంది. ఫ్త్లెయాష్‌కు కొద్ది మొత్తంలో అప్‌గ్రేడెడ్ సిమెంట్, ఇసుకకు బదులు స్టోన్ పౌడర్, కంకర రాళ్లు, నీళ్లతో ఓ మిశ్రమాన్ని తయారు చేశారు. 27X13 అడుగుల స్థలాన్ని నాలుగు భాగాలుగా విభజించి తారు రోడ్డు, సీసీరోడ్డు, ఇంటి ఫ్లోరింగ్, టైల్స్ మధ్యలో వాడే మిశ్రమం... అన్నింటికీ ఎలా వాడవచ్చో ప్రత్యక్షంగా చూపిస్తూ ప్రయోగాలు చేశారు. మూడు గంటల్లోనే రోడ్డు ఆరిపోయి గట్టిపడటం మొదలైంది. తర్వాత రోజు నగర పాలక సంస్థలోని సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల్ని పిలిపించారు. నమూనాలు తీసుకున్న అధికారులు వాటిని పరిశీలించి 'నాణ్యత భేష్' అంటూ ప్రశంసించారు. ఎగిరి గంతేశారు విద్యార్థులు. యాజమాన్యం ప్రోత్సాహంతో ఇప్పుడు కళాశాలలో అంతర్గత రహదారులను వేయడానికి సిద్ధమయ్యారు.
-
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి