Hai Bujji (13-07-2011)

సూర్యుడిని చుట్టొచ్చిన ఇంద్రుడు!
సౌర కుటుంబంలో... అతి పెద్ద గ్రహాల్లో నాలుగోది... సూర్యుడి నుంచి చూస్తే... ఎనిమిదవది... అదే నీలివర్ణాల నెప్ట్యూన్‌... ఏదో చెబుతుందట... విందామా!
న్ను పోల్చుకున్నారా? రోమన్‌ పురాణాల్లో సముద్ర దేవుణ్ణి. హిందూ పురాణాల్లో ఇంద్ర దేవుణ్ణి. కానీ మీ పాఠ్య పుస్తకాల్లో మాత్రం 'నెప్ట్యూన్‌' గ్రహాన్ని. ఇంతకీ మీ పేజీలోకి ఎందుకు వచ్చానో తెలుసా? మీకొక విచిత్రమైన సంగతి చెబుదామని. మీరు మీ శాస్త్రవేత్తల దగ్గరకి వెళ్లి 'అంకుల్‌! నెప్ట్యూన్‌ గ్రహాన్ని కనిపెట్టి ఎంత కాలమైంది?' అని అడిగి చూడండి. '165 సంవత్సరాలు' అని చెబుతారు. కానీ నేనేమంటానో తెలుసా? కేవలం ఒక ఏడాదే అయిందని! ఇద్దరి జవాబులూ నిజమే. ఎలాగో చెప్పనా? మీ భూమ్మీద 165 సంవత్సరాలైతే, నాకు మాత్రం కేవలం ఒక్క ఏడాదే అయినట్టు! అంటే నేను సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడానికి మీ భూమి లెక్కల ప్రకారం 165 సంవత్సరాలు పడుతుంది. అలా మీరు నన్ను ఎక్కడుండగా కనిపెట్టారో సరిగ్గా అక్కడకి ఇవాళే వచ్చాను. నేనంటూ ఓ గ్రహాన్ని ఉన్నానని మీ వాళ్లు 1846 సెప్టెంబరు 23న కనిపెట్టారు. సూర్యుని నుంచి చూస్తే నేను ఎనిమిదో గ్రహాన్ని. సూర్యుని నుంచి నా దూరం సగటున 4,50,40,00,000 కిలోమీటర్లు. మీ భూమికి చంద్రుడు ఒక్కడే కానీ, నాకు మాత్రం 8 చందమామలు ఉన్నాయి. నా చుట్టూ నేను తిరగడానికి నాకు మీ లెక్కలో 16 రోజులు పడుతుంది. సూర్యకుటుంబంలోని పెద్ద గ్రహాల్లో నేను నాలుగో స్థానంలో ఉంటాను. ఇటలీకి చెందిన గెలీలియో 1612లోనే నన్ను గుర్తించి సౌరకుటుంబం బొమ్మలో వేశాడు కానీ, నేనొక గ్రహాన్నని కనుగొనలేకపోయాడు. ఆ తర్వాత ఫ్రెంచ్‌ గణిత శాస్త్రవేత్త లే వెరియర్‌, బ్రిటన్‌ శాస్త్రవేత్త జాన్‌ కోజ్‌ ఆడమ్స్‌ నా ఉనికిని గణిత సూత్రాల ప్రకారం వెల్లడించారు. 1846లో జాన్‌ గాట్‌ఫ్రైడ్‌ గాలె అనే మరో పరిశోధకుడు నేను ఎక్కడున్నానో కనిపెట్టాడు.
నేను హైడ్రోజన్‌, హీలియం, మీథేన్‌ వాయువులతో, మంచుతో ఏర్పడ్డాను. మీథేన్‌ వల్లనే నేను నీలంగా కనిపిస్తాను. మీరొచ్చి నా మీద నిల్చున్నారనుకోండి. పాదాలు ఆన్చడానికి భూమ్మీదలాగా గట్టి నేల ఏదీ ఉండదు. మీ భూమి మీద కన్నా నా మీద గురుత్వాకర్షణ శక్తి 17 శాతం ఎక్కువ. మీ భూములు నాలుగు కలిస్తే ఎంతో అంతుంటాను నేను. ఇక నా మీద గంటకి 2,100 కిలోమీటర్ల వేగంతో భయంకర తుపాను గాలులు వీస్తుంటాయి. నాకు దగ్గరగా వచ్చిన ఒకే ఒక అంతరిక్ష నౌక ఏదో తెలుసా? వోయేజర్‌-2. 1989లో అది నాకు 3000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లింది. నా ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువ. మైనస్‌ 218 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో అతి శీతలంగా ఉంటాను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు