Eenadu Etaram (16_06_2011)



ప్రపంచ విద్యా సదస్సు. దేశ వ్యాప్తంగా పదకొండు మందికి ఆహ్వానం. అందులో ఒకే ఒక తెలుగు తేజం ఎన్నంశెట్టి అఖిల్‌. వేగాన్ని విద్యుత్తుగా మలిచిన ప్రయోగం. వాహనాల కాలుష్యాన్ని తగ్గించే సిద్ధాంతం. ఆ యువకుడి ఆలోచనలకు దక్కిన గౌరవం అది.
గ్రామం, పట్టణం తేడాల్లేకుండా విద్యుత్తు కొరత దేశంలో సాధారణం. ఇదే సమస్య అఖిల్‌ని ఎన్నోసార్లు ఆలోచనల్లో పడేసింది. ఓసారి హైదరాబాద్‌ నుంచి సొంతూరు హన్మకొండకు వెళుతున్నాడు. రైలులో కూర్చున్న అతడి ఆలోచనలు అంతకంటే వేగంగా పరిగెత్తాయి. 'వాహనాల వేగాన్ని విద్యుత్‌గా మార్చలేమా?' అనుకున్నాడు. ఏవేవో పరికరాలు మదిలో మెదిలాయి. ఆపై ఇంట్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా అదే తలపు. తన ఊహల్ని తల్లిదండ్రులు, టీచర్లతో పంచుకున్నాడు. ప్రోత్సహించారు. ప్రయోగానికి కావాల్సిన చిన్న గాలిమర, డైనమో, బ్యాటరీ, బల్బు సిద్ధం చేసుకున్నాడు. తొలుత కారుతో పరీక్షిద్దామనుకున్నాడు. కారు ముందు భాగంలో గాలిమర అమర్చాడు. సైకిల్‌ డైనమోని దానికి అనుసంధానించాడు. కారు వేగానికి గాలిమర తిరుగుతుంది. ఆ పవన శక్తిని డైనమో విద్యుత్‌గా మార్చుతుంది. ఆ కరెంటు నిల్వ చేయడానికి ఓ బ్యాటరీ ఉంటుంది. నాలుగైదుసార్లు ప్రయత్నించినా ప్రయోగం విఫలమైంది. మార్పులు చేసి మరోసారి ప్రయత్నించాడు. ఈసారి కారును రెండు కిలోమీటర్లు నడిపించగానే బల్బు వెలిగింది. దీనికి 'మొబైల్‌ విండ్‌ పవర్‌ జనరేషన్‌ సిస్టం' అని పేరుపెట్టాడు అఖిల్‌. ఇలాంటి పరికరాలు వాహనాలకు అనుసంధానిస్తే విద్యుత్‌ అవసరాలు కొంతవరకైనా తీరుతాయనేది అతడి ఆలోచన.
ర్వాత అతడి ఆలోచనలు కాలుష్యంపైకి మళ్లాయి. వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని నివారించే పరికరాలను చేయలేమా అనుకున్నాడు. రెండు నెలలు కష్టపడి 'పొల్యూషన్‌ రిడక్షన్‌ డివైస్‌' తయారు చేశాడు. దీన్ని మోటార్‌ సైకిళ్లు, కార్ల సైలెన్సర్లకి బిగించవచ్చు. దీంట్లోని ఫిల్టర్లు పొగకు వడబోతగా పనిచేస్తాయి. దాంట్లోంచి వచ్చే పొగ వల్ల కాలుష్యం పాలు సగానికి సగం తగ్గినట్టే. ఈ ఆలోచన, ప్రయోగ ఫలితాలను అఖిల్‌ అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌కి పంపించాడు. సంస్థ నిపుణులు మెచ్చుకొని జాతీయస్థాయిలో నిర్వహించిన 'ఇన్‌స్ఫైర్‌-2010' కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇదే ప్రయోగాన్ని చెన్నై నేషనల్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ వేడుకల్లోనూ ప్రదర్శించాడు. ఈ ప్రయోగాలే న్యూఢిల్లీలో జరిగిన 98వ ప్రపంచ విద్యా సదస్సులో పాల్గొనడానికి కారణమయ్యాయి. సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు. మన రాష్ట్రం నుంచి ఈ అవకాశం కేవలం అఖిల్‌కు మాత్రమే దక్కింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు