Eenadu Sunday (10-07-2011)
నిరుద్యోగం, వైకల్యం, గ్రామీణ ఉపాధి, వ్యవసాయ సంక్షోభం... దేశంలో చాలా సమస్యలున్నాయి. పాలకులకు తీరికలేదు. అధికారగణానికి ఆసక్తిలేదు. వాటినెవరు పరిష్కరిస్తారు? 'మేం ఉన్నాం...' అంటూ ముందుకొస్తున్నారు సామాజిక వ్యాపారవేత్తలు.కల-1
ఐఐటీ నుంచో ఐఐఎమ్ నుంచో పట్టా అందుకోవాలి. కల-2
క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం సంపాదించాలి. ప్రారంభజీతం ఏటా పాతిక లక్షలకు తగ్గకూడదు.
కల-3
చక్కని జీవిత భాగస్వామి. గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు. స్థాయికి తగిన కారు.
కల-4
సొంతంగా ఓ కంపెనీ ప్రారంభించడం. దాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం.
కల-5
వారసులకు బాధ్యతలు అప్పగించి, అరవై ఐదేళ్లకు పదవీవిరమణ చేయడం. ఇష్టమైన పుస్తకాలు చదువుతూ ఇష్టమైన సంగీతం వింటూ శేషజీవితం గడపడం.
ఐదు కలలు. యాభై ఏళ్ల జీవితం. ఎక్కడా సమాజం ప్రస్తావన లేదు. ప్రజలకు స్థానంలేదు. దేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యల్లో ఒక్కటంటే ఒక్కదానికీ పరిష్కారం లేదు. చుట్టూ దారిద్య్రం తాండవిస్తుంటే, మనం సిరిసంపదలతో తులతూగి ఏం ప్రయోజనం! సగానికి సగంమంది అర్ధాకలితో అలమటిస్తుంటే మనం పంచభక్ష్య పరమాన్నాలు తిన్నా, ఒంటికి అంటుతుందా? ఎదుగుదలంటే ఇది కాదు. విజయానికి కొలమానం సిరిసంపదలు కానేకాదు. జీవితానికి అర్థం, పరమార్థం ఇంకేదో ఉంది...అన్న అంతర్మథనంలోంచి 'సామాజిక వ్యాపారం' పుట్టుకొచ్చింది. ఇక్కడా పెట్టుబడులు ఉంటాయి. వ్యాపారం జరుగుతుంది. లక్ష్యాలు వెంటాడతాయి. లాభాలు కూడా వస్తాయి. కాకపోతే, ఒంటిస్తంభం మేడలాగా మనం ఒక్కరమే అంతెత్తున నిలబడం. ఎదుగు-ఎదగనివ్వు...సామాజిక వ్యాపార నినాదం. సంపద సృష్టించడమే కాదు, పంచుకోవడమూ ప్రధానమే. ఎంత లాభం సంపాదించాం అన్నదానికంటే...ఎంతమందికి ప్రయోజనం చేకూర్చాం, ఎన్నిజీవితాలు మార్చగలిగాం అన్నదే కీలకం. ఈ నలుగురి జీవితాలే అందుకు నిదర్శనం...
'నిశ్శబ్ద' విప్లవం
ఆ ఆఫీసు వాతావరణం చాలా వైవిధ్యంగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఎవరిపని వారు చేసుకుపోతూ ఉంటారు. సందేహాలొచ్చినా, సమాధానాలు చెప్పాలన్నా సైగల్లోనే. వాళ్లంతా బధిరులు. ఆ సంస్థ పేరు మిరాకిల్ కొరియర్స్. ముంబయి కేంద్రంగా పనిచేస్తోంది. ధ్రువ్‌లక్రా అనే యువకుడి ఆలోచన అది. చదువైపోయాక అతను బైకులు అమ్మాడు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేశాడు. జీతం బాగానే వచ్చేది. కానీ ఎందుకో అసంతృప్తి. డబ్బు కోసమే పనిచేయడం అస్సలు నచ్చలేదు. ఏం చేసినా, అందులో ఎంతోకొంత సామాజిక ప్రయోజనం ఉండాలన్నది అతని ఆలోచన. వెంటనే రాజీనామా ఇచ్చేసి, దస్రా అనే స్వచ్ఛంద సంస్థలో చేరాడు. సునామీ బాధితుల కోసం పనిచేశాడు. అక్కడ ఉన్నప్పుడే హెచ్‌ఐవీ రోగులు, బాలల హక్కులు, వికలాంగుల సమస్యలు...ఇలా వివిధ అంశాల మీద అవగాహన ఏర్పడింది. అనుకోకుండా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ స్కూల్లో చదువుకునే అవకాశం వచ్చింది. స్కాలర్‌షిప్ కూడా ఇచ్చారు. 'సోషల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్' ఐచ్ఛిక అంశంగా ఎంబీయే పూర్తిచేశాడు. ఆక్స్‌ఫర్డ్ అనుభవం కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. సొంతంగా ఏదైనా చేయాలన్న కోరిక కలిగింది. ప్రజలు, వికలాంగులు, ఉపాధి అవకాశాలు...సామాజిక వ్యాపారాన్ని అధ్యయనం చేసినవాడు కాబట్టి, చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచించసాగాడు.
మీ దారే... రహదారి పేరు : ధ్రువ్‌లక్రా వయసు : 30 సంస్థ : మిరాకిల్ కొరియర్స్ (2009) వ్యాపార కేంద్రం : ముంబయి కుటుంబం : పుట్టింది జమ్మూలో. చదువుకుంది ముంబయిలో. నాన్న వ్యాపారి. అమ్మ బ్యుటీషియన్. చదువు : ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీయే తొలి ఉద్యోగం : ఓ వినోద కేంద్రంలో క్యాషియర్ వ్యాపార లక్ష్యం : రోజుకు రెండు లక్షల డెలివరీలు యువతకు సలహా : మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి. సవాళ్లూ సమస్యలూ ఎక్కడైనా ఉంటాయి. ప్రోత్సహించేవారూ నిరుత్సాహపరిచేవారూ ఉండనే ఉంటారు. ఎవరేం చెప్పినా, మీ పని మీదే. |
'పల్లెటూళ్లు...టెక్నాలజీ...వ్యాపారం' అప్పుడే ఇంజినీరింగ్ పూర్తిచేసుకుని క్యాంపస్‌లోంచి బయటికొచ్చిన సలోనీ మల్హోత్రా బుర్రనిండా ఆ మూడు పదాలే. ఆ మూడింటికీ ముడిపెట్టి మారుమూల ప్రాంతాల్లో బీపీవో (బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్) ప్రారంభించారామె. నిజానికి సలోనీ ఎప్పుడూ పల్లెలకు వెళ్లలేదు. పుట్టిపెరిగిందంతా ఢిల్లీ, పుణె వంటి నగరాల్లోనే. అయినా ఎందుకో గ్రామీణ ప్రాంతాలంటే చాలా ప్రేమ. పంటల్లేక, ఉపాధి అవకాశాల్లేక పట్టణాలకు తరలుతున్న గ్రామీణుల్ని తలుచుకున్నప్పుడు గుండె కలుక్కుమనేది. ఉన్నచోటే ఉపాధి దొరికితే, ఎవరు మాత్రం వలసలు వెళ్తారు. ఆ అవకాశం తానే ఎందుకు కల్పించకూడదు? అలా అని అదేదో స్వచ్ఛంద సేవ లాంటిదీ కాకూడదు. తనకూ కొంత లాభం ఆర్జించిపెట్టాలి. ఆ ఆలోచనల్లో తలమునకలైనప్పుడే, ఎవరో మద్రాసు ఐఐటీలో పనిచేస్తున్న ఝున్‌ఝున్‌వాలా గురించి చెప్పారు. వెళ్లి కలిసింది. ఆ అమ్మాయి తపన చూసి ఆయనా ముచ్చటపడ్డారు. గ్రామీణ బీపీవో ప్రారంభించమని సలహా ఇచ్చింది ఆయనే. 'ఏడాది తర్వాతో, రెండేళ్ల తర్వాతో చేతులెత్తేయకూడదు. లాభసాటి కాదని పెదవి విరిచేయకూడదు. అలా అయితేనే సాయం చేస్తాను. సరేనా?' అని నిబంధన పెట్టారు. ఆమెకు ఎలాంటి అభ్యంతరం కనిపించలేదు. కొద్దినెలల్లోనే తమిళనాడులోని ఓ గ్రామీణ ప్రాంతంలో 'దేశీ క్రూ' వెుదలైంది. ఇందుకు మద్రాసు ఐఐటీ ఐదు లక్షల రూపాయల నిధులు సమకూర్చింది. సలోనీ అమ్మానాన్నలూ కొంత సాయం చేశారు.
కృషి ఉంటే... పేరు : హరీష్ హండే వయసు : 43 సంస్థ : సెల్కో (1995) వ్యాపారకేంద్రం : కర్ణాటక కుటుంబం : నాన్న రూర్కెలా స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి. అమ్మ గృహిణి. చదువు : ఎనర్జీ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ వ్యాపార లక్ష్యం : వచ్చే ఏడాదికంతా కస్టమర్లలో 40 శాతం నిరుపేదలే ఉండాలి. అంటే, నెలకు రెండువేలలోపు ఆదాయం ఉన్నవారు. యువతకు సలహా : విజయం అంత తొందరగా వరించదు. కనీసం రెండుమూడేళ్లు పడుతుంది. అంతకన్నా ఎక్కువా కావచ్చు. అంత సమయాన్ని కేటాయించే ధైర్యం ఉందా? అలా అయితేనే ప్రయోగాలకు సిద్ధంకండి. మీ లక్ష్యాన్ని మీరొక్కరే సాధించలేరు. మీ చుట్టూ ఎవరున్నారన్నదీ ముఖ్యమే. |
మీలో ఆ సత్తా ఉందా? పేరు : సలోనీ మల్హోత్రా వయసు : 29 సంస్థ : దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై.లిమిటెడ్ (2007) వ్యాపారకేంద్రం : తమిళనాడు కుటుంబం : పుట్టింది ఢిల్లీలో. పెరిగిందీ చదివిందీ... పుణెలో, ఢిల్లీలో. అమ్మానాన్నలు డాక్టర్లు. చదువు : ఇంజినీరింగ్ వ్యాపార లక్ష్యం : మరిన్ని పెట్టుబడులను గ్రామాలకు తరలించడం. మరింతమందికి ఉపాధి కల్పించడం. యువతకు సలహా : ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దాన్ని నిజం చేసుకోడానికి కృషిచేయండి. రాజీలొద్దు. అపనమ్మకాలొద్దు. వెుక్కుబడి ప్రయత్నాలు వద్దు. కొంతకాలం ఏదైనా మంచి ఎన్జీవోలో పనిచేయండి. ప్రజల్లోకి వెళ్లండి. జీవితమంటే ఏమిటో తెలుస్తుంది. ఈ సలహా... కష్టపడటానికి సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే. |
చీకటిని గెలవడం అంటే భయాన్ని గెలవడం. అభద్రతను గెలవడం. ఆకలిని గెలవడం. సమస్యల్ని గెలవడం. మారుమూల పల్లెల్లో చీకటి రాత్రుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న సామాన్య జనానికి, ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా వెలుతురు మాత్రం ఇచ్చితీరాలి అన్నదే హరీష్ హండే కాంతి సిద్ధాంతం. అందుకే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో చక్కని ర్యాంకు వచ్చినా, ఐఐటీలో అడుగుబొడుగు అభ్యర్థులు కూడా ఇష్టపడని ఎనర్జీ ఇంజినీరింగ్‌లో చేరాడు. రెండో సంవత్సరంలో 'సౌరవిద్యుత్' పాఠం వింటున్నప్పుడు అతని బుర్రలో ఓ ఆలోచన తళుక్కుమంది. దేశం ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యకు అందులోనే పరిష్కారం ఉందని నిర్ధారణకు వచ్చాడు. ఆ విభాగంలో పైచదువులకు అమెరికా వెళ్లాడు. పరిశోధనలో భాగంగా డొమినికల్ రిపబ్లిక్‌కు వెళ్లినప్పుడు, సామాన్యులు కూడా సౌరదీపాలు వాడటం చూశాడు. భారతదేశానికి వచ్చి చూస్తే, పరిస్థితి భిన్నం. కర్ణాటకలోని చాలా పల్లెల్ని సందర్శించాడు. ఇంటికంతా కలిపి ఒకటే బల్బు. అదీ మసక మసకే. సౌరవిద్యుత్ గురించి ఎవరికీ తెలియదు. ఒకటిరెండు చోట్ల ఏవో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి వెళ్లినా... మరమ్మతులు కరవై మూలనపడిపోయాయి. ఇదంతా చూశాక...సౌరవిద్యుత్ దీపాలను ఇక్కడే తయారు చేసి, అతితక్కువ ధరకు విక్రయించి, అవసరమైతే ఇంటికెళ్లి సేవలు అందించడానికి ఓ పూర్తిస్థాయి సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. అలా ప్రాణంపోసుకుంది...'సెల్కో'. ఓ సామాజిక పెట్టుబడిదారుడు నాలుగు లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చాడు. సౌర విద్యుత్‌దీపాలు తయారు చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. విడిపరికరాలు తెచ్చి ఓ దగ్గర బిగించడమే. సమస్యంతా వాటి అమ్మకాలే. ధర అటూఇటుగా పదిహేను వేలు. సంపన్నరైతులు మాత్రమే భరించగలరు. డాక్టర్లు, టీచర్లు వెుదలైన స్థిర ఆదాయవర్గాలు కూడా కొంతవరకు వెుగ్గుచూపాయి. హరీష్ లక్ష్యం నిరుపేదలు. వాళ్లతో కొనిపించాలంటే, అప్పు ఇవ్వాలి లేదా ఇప్పించాలి. తనకేవో అంత స్థోమత లేదు. పానీపూరీ దుకాణంవాళ్లు, బజ్జీల కొట్టువాళ్లు, పూల దుకాణంవాళ్లు, రైతు కూలీలు...ఎవరికైనా వెలుతురు అవసరమే. నిజానికి కిరోసిన్ దీపం కోసం, కొవ్వొత్తుల కోసం అల్పాదాయ వర్గాలు చేస్తున్న ఖర్చూ తక్కువేం కాదు.
ఈమధ్యే హరీష్‌కు ఓ ఫోన్‌కాల్ వచ్చింది...'సార్ మా అమ్మాయి పదోతరగతి పరీక్షల్లో స్టేట్‌ర్యాంకు సాధించింది. మీ దీపం వెలుగుల్లో చదువుకునే!'.
అతని కళ్లలో వేయి సౌరవిద్యుత్ దీపాల కాంతి.
మూలాలకు సలాం! పేరు : కిళ్లి రమణబాబు వయసు : 26 సంస్థ : గ్రీన్ బేసిక్స్ (2008) వ్యాపారకేంద్రం : ఆంధ్రప్రదేశ్ చదువు : టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్. కుటుంబం : నాన్న టెలికాం లైన్‌మాన్. అమ్మ గృహిణి. వ్యాపార లక్ష్యం : వ్యవసాయాన్ని వ్యవస్థీకృత పరిశ్రమగా తీర్చిదిద్దడం. యువతకు సలహా : నలుగురూ నడిచేదార్లో వెళ్లకుండా... మనకంటూ ఓ ప్రత్యేకమైన మార్గాన్నినిర్మించుకోవాలని అనుకుంటే చాలా కష్టపడాలి. అందులోనూ సామాజిక వ్యాపారవేత్తలకు పెట్టుబడులకంటే... ఆలోచనల్లో స్పష్టత, చిత్తశుద్ధి చాలా అవసరం. కుటుంబ మద్దతు ఉండాలి. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ని. మంచి మంచి కార్పొరేట్ ఉద్యోగ అవకాశాల్ని వదులుకున్నా, అమ్మానాన్నలు నాకెప్పుడూ అడ్డు చెప్పలేదు. |
కిళ్లి రమణబాబు దృష్టిలో...మంచి ఐడియా అంటే సమాజానికి ఉపయోగపడేది. గొప్ప వ్యాపారమంటే, ఎక్కువమందికి ఉపాధి కల్పించేది. అతనికి వ్యాపారాలు కొత్తేం కాదు. చిన్నప్పుడే సైకిలుషాపు నడిపాడు. టెంట్‌హౌస్ నిర్వహించాడు. ఆడియో సిస్టమ్స్ అద్దెకు ఇచ్చాడు. ఇక, ఐడియాల విషయంలో రమణ తర్వాతే ఎవరైనా. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో చదువుతున్నప్పుడే బిజినెస్ ప్లాన్ పోటీల్లో బోలెడన్ని బహుమతులు గెలుచుకున్నాడు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన పోటీలో...రైతులకు అవసరమైన వివిధ సేవల్ని అందించడానికి ఓ వ్యాపార సంస్థను స్థాపించవచ్చంటూ అతను చేసిన ప్రతిపాదనకు ప్రథమ బహుమతి వచ్చింది. ఆ ఆలోచనకు తనే రూపం ఇచ్చి, 'గ్రీన్ బేసిక్స్' ప్రారంభించాడు.
రెండుమూడు ఎకరాల సన్నకారు రైతు, ఏ ఆధునిక యంత్రాల్నీ కొనలేడు. ఏ వ్యవసాయ నిపుణుడూ అతని గడపదాకా వచ్చి ఫలానా పంట వేయమని చెప్పడు. ఫలానా విత్తనాలు వాడమని సలహా ఇవ్వడు. ఇప్పటికీ తాతముత్తాతల వ్యవసాయ పద్ధతులే దిక్కు. ఫలితంగా, పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. రాబడులేవో తగ్గిపోతున్నాయి. ఆ పరిమితుల్ని అధిగమించాలంటే, రైతన్నకు ఎవరో ఒకరి బాసట కావాలి. ఆ బాధ్యత తాను తీసుకున్నాడు రమణబాబు. 'గ్రీన్ బేసిక్స్' ... సంప్రదాయ మూలాలకు భంగం కలగకుండానే ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల్ని పరిచయం చేస్తుంది. ఆధునిక పరికరాల్ని అందిస్తుంది. నాణ్యమైన విత్తనాల్ని సరఫరా చేస్తుంది. మార్కెటింగ్ దాకా ప్రతి దశలో అండగా ఉంటుంది. దీనివల్ల రైతులకు పంటవ్యయం తగ్గుతుంది. నష్టభయం పరిమితం అవుతుంది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. నాబార్డ్‌లాంటి సంస్థల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తున్నాడు రమణ. భావసారూప్యం ఉన్న స్వచ్ఛంద సంస్థలతోనూ కలిసి పనిచేస్తున్నాడు. ఈ రెండేళ్లలో దాదాపు 500 మంది రైతులు 'గ్రీన్ బేసిక్స్' సహకారాన్ని అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి, పర్లాకిమిడి(ఒడిషా), తదితర ప్రాంతాలకు సంస్థ సేవలు విస్తరించాయి. ఈమధ్యే తూర్పు గోదావరి జిల్లాలోని తుని దగ్గర్లో మూడువందల ఎకరాల్లో వ్యవసాయ సేవలు అందించే అవకాశం దక్కింది. దేశంలో వరి పండించే ప్రాంతాలన్నిటికీ విస్తరించాలన్నది అతని ఆలోచన. త్వరలోనే గోవాలో 'గ్రీన్‌బేసిక్స్' శాఖ ప్రారంభం అవుతోంది. మిత్రులు ప్రేమ్‌సాగర్‌రాజు, మదన్‌వోహన్ ఈ సేవా వ్యాపారంలో భాగస్వాములు. తమ కలను నిజం చేసుకోడానికి ముగ్గురూ ఇప్పటిదాకా ముప్పై లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. స్థోమతకు మించిన వ్యవహారమే కావచ్చు. కానీ 'శక్తి'కి మించిన పనేం కాదు.
* * *
'ఎంత సంపాదించారేమిటి?'
నలుగురి దగ్గరా నాలుగు సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి.
'మిరాకిల్ కొరియర్స్' ధ్రువ్‌లక్రా:
వంద జీవితాల్లో ఆత్మవిశ్వాసం.
'దేశీ క్రూ' సలోనీ మల్హోత్రా :
పది గ్రామాలకు ఉపాధి.
'సెల్కో' హరీష్ హండే:
లక్షా ఇరవైవేల ఇళ్లలో వెలుగులు.
'గ్రీన్ బేసిక్స్' రమణబాబు:
వందల ఎకరాల్లో బంగారం.
డబ్బు, కార్లు, బంగళాలు, బ్యాంక్
బ్యాలెన్సులు... అన్ని విజయాలకూ
కొలమానాలు కావు. నిజానికి అవి
కొలమానాలే కాదు!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి