Eenadu (19-06-11)



పుస్తకాల సంచి భుజానికేసుకుని బడికెళ్లాల్సిన వయసులో చంకలో ఓ పసిబిడ్డ. మనసు వికసించాల్సిన దశలో...ఒత్తిళ్లూ ఆత్మహత్య ఆలోచనలు. పచ్చగా కాపురం చేసుకోవాల్సిన సమయానికి...విడాకులూ వైధవ్యాలు. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని పలు గ్రామాల్లో బాల్యవివాహాలు ఆడపిల్లల జీవితాల్ని బుగ్గిపాలు చేస్తున్నాయి.
ప్రతిభాపాటిల్‌.
భారత రాష్ట్రపతి. సోనియాగాంధీ.
కాంగ్రెస్‌ అధ్యక్షురాలు.
సుష్మాస్వరాజ్‌.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత.
మాయావతి.
అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి.
...తాజా ఎన్నికల్లో మమత, జయలలితల విజయం వార్తావిశ్లేషకులకు చేతినిండా పని కల్పించింది. స్త్రీజాతికి ఇదో స్వర్ణయుగమన్నట్టు ఊదరగొట్టారు. భారతీయ మహిళ వెలిగిపోతోందని కథనాలు అల్లారు.
అంతా భ్రమ. అక్షరాల కనికట్టు.

వెలుగులు చూసి మురిసిపోవడం కాదు. చికట్లవైపు కూడా తొంగిచూడాలి. రాజధానులు కొలమానాలు కాదు. మారుమూల పల్లెలే తూకంరాళ్లు. ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమే. పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు - మూడుపడగల నాగుపామై బుసలుకొడుతున్న మారుమూల గ్రామాల్లో...ఆడపిల్లగా పుట్టి, బాల్యాన్ని గెలవడం అంతకంటే వేయిరెట్లు కష్టం.
ఒక సుజాతమ్మ పద్దెనిమిదేళ్లు కూడా నిండకముందే, విడాకుల కేసులో ముద్దాయి అవుతుంది. ఒక సౌభాగ్యమ్మ పదమూడేళ్లకే ఇద్దరు పిల్లల తల్లి అనిపించుకుంటుంది. ఒక వెంకటలక్ష్మి పదహారేళ్ల ప్రాయంలో భర్తను కోల్పోయి ఒంటరిజీవితం గడుపుతుంది. ఒక సరస్వతి చదువు ఐదోతరగతితో ఆగిపోతుంది. ఒక ఎలిజబెతమ్మ జీవితం ఆత్మహత్యతో ముగుస్తుంది.
ఇన్ని సంక్షోభాలకు కారణం...
బాల్య వివాహాలు!
కర్నూలు జిల్లాలోని ఒక్క ఆదోని డివిజన్‌లోనే...అలాంటి బాలికా వధువులు, చిన్నారి అమ్మలు, ఒంటరి తల్లులు, కౌమారంలోనే వృద్ధాప్యఛాయలు కనిపిస్తున్న వివాహితలు వందలమంది కనిపిస్తారు. యునిసెఫ్‌ సంస్థ నిర్వహించిన తాజా సర్వేల నిండా...గుండెలుపిండే నిజాలే. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన గణాంకాలే. ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లో గత ఏడాది 1400 బాల్య వివాహాలు జరిగినట్టు నిర్ధరించారు. వధూవరులంతా 9 నుంచి 14 ఏళ్ల పసిపిల్లలే. ఇక పద్దెనిమిదేళ్లలోపు వివాహాలైతే దానికి రెట్టింపు ఉంటాయని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోనే ఇది అత్యధికం. జాతీయ సగటుతో పోల్చినా చాలా ఎక్కువ. అంకెలకు అందనివి, సర్వేలకు చిక్కనివి, అధికారులకు పట్టనివి, పాలకులు పట్టించుకోనివి...ఇంతకు పదిరెట్లు!
ఎదిరించే వయసులేదు. తిరగబడే ధైర్యంలేదు. కాదనే శక్తి లేదు. ఏం చేయగలదా అమాయక బాలిక? మహా అయితే, ఎగదన్నుకొస్తున్న కన్నీళ్లను తలంబ్రాల చిరతో తుడుచుకుంటుంది. గుండెల్లోని మంటల్ని హోమాగ్నిలో చూసుకుంటుంది.
ఏడడుగులు...కష్టాలు, కన్నీళ్లు, అనారోగ్యం, లింగవివక్ష, దుర్భరదారిద్య్రం, విడాకులు, ఆత్మహత్యలే!
ముడులు మూడే...వాటిచుట్టూ పదునైన ముళ్లు మాత్రం లెక్కలేనన్ని. అప్పగింతలంటే...మేకపిల్లలా కసాయి వెనకే తలవంచుకుని నడవడం. చాలామందికి, అదసలు పెళ్లని తెలియదు. వాడో వెుగుడని తెలియదు. మెడలో వేలాడుతున్నది మంగళసూత్రమనీ తెలియదు. అంత అమాయకత్వం. కొందరైతే ఏ మూడోతరగతో, నాలుగోతరగతో చదువుతుంటారు. బాల్యం బుగ్గిపాలైపోతుంది. పుస్తకాల సంచి అటకెక్కుతుంది. వయసుకు మించిన బాధ్యతలు తలకెక్కుతాయి. వోయలేని బరువులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఏడాది తిరిగేసరికి ఆ చిట్టితల్లి, పూచికపుల్లలాంటి ఓ బిడ్డకు కన్నతల్లి! ఆ పుత్తడిబొమ్మ, అనారోగ్యంతో బక్కచిక్కిన గాజుబొమ్మ.
ఎన్ని జీవితాలో అన్ని కష్టాలు.
ఎన్ని కష్టాలో అన్ని కన్నీళ్లు.
ప్రతి కన్నీటి చుక్కా ఓ కథ.
ప్రతి కథా నాగరిక సమాజం జవాబు చెప్పితీరాల్సిన ఒక ప్రశ్న.

అనగనగా అగాథం ఉంది...
భారతి బంగారు తల్లి. ఎక్కాలు చదువుతుంటే చక్కగా పాటపాడినట్టు ఉండేది. నోటుపుస్తకంలో రాస్తుంటే, ముగ్గులేసినంత ముచ్చటగా అనిపించేది. బడికెళ్తుంటే, ఏ గుడికో వెళ్తున్నంత భక్తి. 'బాగా చదువుకుంటాను...' అమ్మానాన్నలకు ఎన్నిసార్లు చెప్పిందో. కలలనిండా పుస్తకాలే. ఆడపిల్ల అంత పెద్దపెద్ద కలలు కనకూడదని ఆ చిన్నారికేం తెలుసు? ఏడోతరగతి చదువుతున్నప్పుడు అర్థమైందా సంగతి. అప్పటికే కుటుంబ పరిస్థితి చితికిపోయింది. చదువు ఆగిపోయింది. తండ్రి లాలెన్న మంచంపట్టాడు. చనిపోతానేవో అని అతనికి భయంపట్టుకుంది. కూతురి పెళ్లి చూడాలని ఆశపడ్డాడు. భారతి అభిప్రాయం ఎవరూ అడగలేదు. తెగించి చెప్పినా, వింటారన్న నమ్మకం లేదు. తలవంచుకుని తాళికట్టించుకుందా అమ్మాయి. బిడ్డ మనువు తర్వాత లాలెన్న కోలుకున్నాడు. అంతలోనే భారతి పెళ్లిపెటాకులైంది. వంటరాదని అత్త ఆరళ్ళు పెట్టింది. కట్నం తక్కువైందని వెుగుడు వీరంగం చేశాడు. ఆ నరకం నుంచి తప్పించుకుని పుట్టింటికొచ్చింది. ఇక్కడ మాత్రం ఎంతకాలం ఉంటుంది? వంట నేర్చుకుని మరీ వెళ్లింది. రెండ్రోజులకే కిరోసిన్‌ మంటల్లో తగులబెట్టారు. స్టౌపేలిందని అబద్ధం అల్లారు. కూతురి వైద్యానికి లాలెన్న మరో యాభైవేలు అప్పుచేయాల్సి వచ్చింది. ఒంటినిండా గాయాలతో, గుండెనిండా విషాదంతో ఆ పద్నాలుగేళ్ల పసిపిల్ల న్యాయం కోసం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతోందిప్పుడు. కాలం మారుతోంది. సమాజం మారుతోంది. ఆలోచనలు మాత్రం మారడం లేదు. ఆడపిల్ల అంటే, గుండెల మీద కుంపటి! ఎప్పుడు వదిలించుకుందామా అన్న తొందర. అందుకేనేవో, పదమూడేళ్ల వయసులోనే సుమంగళికి పెళ్లిచేశారు. ఎదిగీఎదగని శరీరం. వికసించి వికసించని ఆలోచనలు. పెళ్లంటే, మనువాడిన మనిషితో కలసిమెలసి ఉండటమే, కష్టసుఖాలు పంచుకోవడమే అన్న సంగతి కూడా తెలియకముందే...కాపురం బీటలువారింది. సుమంగళికి విడాకులు వచ్చేశాయి. పల్లవి జీవితమూ అలానే ముగిసింది. ఏంవీ ఫౌండేషన్‌ చొరవతో బ్రిడ్జికోర్సులో చేరి...బుద్ధిగా చదువుకుంటున్న అమ్మాయికి బలవంతంగా పెళ్లిచేశారు. అటు చదువు పూర్తికాలేదు. ఇటు కాపురమూ సజావుగా సాగలేదు. కన్నవారికి భారమౌతున్నా
నని ఆ అమ్మాయి కుంగిపోతోంది. హర్దగేరికి చెందిన ఓ బాలికకు చిన్నప్పుడే పెళ్లిచేశారు. కొన్నాళ్లకే భర్త మరణించాడు. పసితనంలోనే వైధవ్యాన్ని అనుభవిస్తోంది. ఇంకో పెళ్లిచేయాలంటే సంప్రదాయం, కుటుంబగౌరవం అడ్డొస్తున్నాయి. ప్రాథమిక స్థాయిని దాటని చదువులతో అంతంతమాత్రం ఆర్థిక పరిస్థితులతో...వాళ్లంతా ఎలా బతుకుతారో?
వూహించుకోడానికీ ధైర్యం చాలదు.

ఒళ్లంతా గాయాలే
అప్పుడప్పుడే పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంటున్న శరీరానికి శక్తికి మించిన భారం వేస్తే ఏమవుతుందో ముద్దనగేరి మల్లమ్మ వితమే ఉదాహరణ. పదిహేనేళ్లకు పెళ్లయింది. వరుసగా మూడుసార్లు అబార్షన్లు, తీవ్ర అనారోగ్యం కారణంగా గర్భసంచి తొలగించారు. దీంతో అమ్మతనానికి శాశ్వతంగా దూరమైపోయిందా యువతి. జె. హోసళ్లి గ్రామానికి చెందిన ఓంకారమ్మకు పదమూడేళ్లకే పెళ్లిచేశారు. వెంటనే గర్భం. పోషకవిలువల లోపమో, వైద్యసౌకర్యాల కొరతో ... మరో ప్రాణిని ఈ ప్రపంచానికి అందించే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయింది. ఆ బక్కచిక్కిన బాలికలంటే రోగాలకూ లోకువే. గర్భసంబంధ వ్యాధులు ఎంతోమంది పసితల్లుల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి. గర్భస్రావాలూ ఎక్కువే. రక్తహీనత దాదాపుగా అందర్లోనూ కనిపిస్తుంది. ఆ గండాలన్నీ తప్పించుకుని ఎనిమిదోనెలో, తొమ్మిదోనెలో బిడ్డకు జన్మనిచ్చినా...నవజాతశిశువుల ఆరోగ్యం అంతంతమాత్రమే. మరీ పూచికపుల్లల్లా పుడుతున్నారు. ఏదో ఓ అనారోగ్యవో, వైకల్యలక్షణవో కనిపిస్తుంది. ఆరోగ్యవంతులైన శిశువులు ఉండాల్సిన బరువులో సగం కూడా ఉండటంలేదని వైద్యనిపుణులు డాక్టర్‌ మల్లికార్జున చెబుతున్నారు. అనారోగ్యం, అంటువ్యాధులు, అంతంతమాత్రంగా చనుబాలు...ఆ తల్లుల కడుపున పుట్టిన బిడ్డలకు దినదినగండమే!

ఒంటరి బతుకు...
రాజకీయాలు, ఫ్యాక్షన్లు, ప్రజలు...కర్నూలు జిల్లాకు సంబంధించినంతవరకూ ఈ మూడూ ఒకదానితో ఒకటి ముడిపడిన విషయాలు. రాజకీయ నాయకులు జనం మీద పెత్తనం కోసం ఫ్యాక్షన్లను ప్రోత్సహిస్తారు. ఆ పులిజూదంలో పావులు సామాన్యులే. కౌమారం వచ్చేలోపే చాలామంది యువకులు ఫ్యాక్షన్ల వలయంలో చిక్కుకుంటారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడికేసుల్లో ముద్దాయిలు అవుతారు. అతను కోర్టులూ కేసులంటూ తిరుగుతుంటే, ఆమె గంపెడు కుటుంబాన్ని పోషించాలి. దురదృష్టవశాత్తు, అతను మరణిస్తే... ఆమె జీవితం ఇంకా నరకం! రాజమ్మకు పద్నాలుగేళ్ల వయసులోనే పెళ్లయింది. పారాణి ఆరకముందే తాళికట్టిన భర్త ఏదో హత్యకేసులో ఇరుక్కున్నాడు. అత్తమామలు పట్టించుకోలేదు. కన్నవారి మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. పల్లవి కష్టం పల్లవిది. ముక్కుపచ్చలారని వయసులో పెళ్లి చేశారు. ఇష్టంలేదన్నా పెద్దలు వినలేదు. మెడలు వంచి తాళికట్టించారు. మనసుకు తగిలిన గాయం అంత తొందరగా ఎలా మానిపోతుంది? ఆ చేదు అనుభవంతో వైవాహిక జీవితం అంటేనే విరక్తి వచ్చేసింది. భర్తకు దూరంగా ఉంటోంది. మూడోతరగతి చదువుతున్నప్పుడు జరిగిన వివాహం నీలమ్మ దృష్టిలో పెళ్లే కాదు. ఇప్పటికీ అత్తారింటికి వెళ్లలేదు. వీళ్లంతా చేసుకున్న పాపమేమిటి? ఆ మారుమూల గ్రామాల్లో పుట్టడమేనా? ఈ దురాచారం ఇంకా కొనసాగడం వెనుక సమాజం పాత్ర ఎంతో, కన్నవారి బాధ్యతా అంతే. హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో బాల్య వివాహాలపై విచారణకు వెళ్లిన యునిసెఫ్‌ సిబ్బందికి ఓ అనుభవం ఎదురైంది. ఐదోతరగతి చదువుతున్న ఓ చిన్నారికి పెళ్లి జరుగుతోందక్కడ. ఇదేమిటని నిలదీస్తే...కుటుంబంలోని వయోధికులు మనవరాలి వివాహం చూడాలని కోరుకుంటున్నారనీ...పెద్దలు కళ్లుమూసేలోపు నాలుగు అక్షింతలు వేస్తే ఓ పనైపోతుందని ముహూర్తాలు పెట్టించామనీ కన్నవారు ఒప్పుకున్నారు. అందులో పశ్చాత్తాపం లేదు. తప్పుచేస్తున్నామన్న బాధ కూడా లేదు. చిప్పగిరి మండలంలోని రామదుర్గం గ్రామంలో ఐసీడీఎస్‌ అధికారులు ఓ బాల్య వివాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అమ్మాయి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. చేసేదిలేక అధికారులు వెనుదిరిగారు. లగ్నపత్రికలు అచ్చువేయించుకోవాలంటే, ప్రింటింగ్‌ ప్రెస్సువారికి వధూవరుల వయసుకు సంబంధించి ధ్రువపత్రాలు ఇవ్వాలని అధికారులు నిబంధన పెట్టడంతో...రాష్ట్రంలో ముద్రించుకోవడమే మానేశారు. కర్ణాటకలో అచ్చువేయించుకుని వస్తున్నారు. మతపెద్దల నుంచి కూడా ప్రభుత్వానికి సహకారం అందటం లేదు. నేతలవేవో ఓట్ల రాజకీయాలు. ఇటీవల జరిగిన ఓ బాల్య వివాహం విషయంలో.. పోలీసులు జోక్యం చేసుకోకుండా ఓ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ రాష్ట్రనేత ఫోన్లమీద ఫోన్లు చేశారు. ఎవరి స్వార్థం వారిది. బలయ్యేది మాత్రం బాలికలే!
పేదరికం...నిరక్షరాస్యత
యునిసెఫ్‌ ఆధ్వర్యంలో...ఆదోని డివిజన్‌లోని పదిహేడు మండలాల్లో ఐసీడీఎస్‌, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి సర్వేచేశాయి. ఏడాదికాలంలో 1400 బాల్య వివాహాలు జరిగినట్టు వెల్లడైంది. నాలుగు నెలల్లోనే ఆరువందల పెళ్లిళ్లు జరిగాయి. అత్యధికంగా ఎమ్మిగనూరు మండల పరిధిలో 160 దాకా జరిగాయి. 85 మనువులతో హోలగుంద రెండోస్థానంలో ఉంది. అంతా ముక్కుపచ్చలారని పసిపిల్లలే. బాలికల సగటు వయసు పదకొండు, బాలుర సగటు వయసు పదహారు. చదువులూ అంతంతమాత్రమే. అమ్మాయిలు ఐదోతరగతి లోపే. అబ్బాయిలు మహా అయితే ఒక తరగతి ఎక్కువ! యాభై నుంచి ఎనభైశాతం బాలికలు మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. కాదుకాదు, పెద్దలే మాన్పించేస్తున్నారు. ఈ అజ్ఞానానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతే. 2011 జనాభా లెక్కల ప్రకారం... జిల్లాలో 61.13 శాతం అక్షరాస్యత ఉండగా, మహిళల్లో అది 50.81 శాతం. ఆదోని డివిజన్‌లో అంతకంటే చాలాచాలా తక్కువ. కౌతాళం, కోసిగి, హోలగుంద లాంటి మండలాల్లో అయితే మహిళల్లో అక్షరాస్యత 34శాతమే! ఈ డివిజన్‌లో ప్రభుత్వంతో పాటు, అనేక స్వచ్ఛంద సంస్థలు బాల్యవివాహాల విషయంలో ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. అందుకు ప్రధాన కారణం చదువుల్లేకపోవడమే. నిజానికి, ఈ ప్రాంతంలో పిల్లలు పుట్టడంతోనే పెద్దవారి పెళ్లి ఆలోచనలు వెుదలవుతాయి. అంతకుమించిన ఆశలూ కోరికలూ లేని అమాయక జీవులు వీళ్లు. నిన్నవెున్నటిదాకా బసివి (దేవదాసీ) వ్యవస్థ రాజ్యమేలిన ప్రాంతమిది.
బాల్య వివాహాలు ఓరకంగా మానవహక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయి. ప్రతి బాలికకూ తన బాల్యాన్ని ఆస్వాదించే హక్కుంది. ఇష్టమైన చదువులు చదువుకునే హక్కుంది. కనీస వివాహ వయసు వచ్చాక నచ్చిన భాగస్వామిని ఎంచుకునే హక్కుంది. కన్నంతమాత్రాన, వాటిని కాలదన్నే నిరంకుశాధికారం అమ్మానాన్నలకూ లేదు. జీవితమంటే తెలియదు. వివాహబంధానికి అర్థంతెలియదు. లైంగికవిజ్ఞానం అసలే లేదు. తమ కాళ్లమీద తాము నిలబడే శక్తి లేదు. అసలు వివాహం గురించి ఆలోచించేంత మానసిక వికాసం కూడా లేని బాలికను తీసుకెళ్లి... కష్టాలకొలిమిలో తోసేయడం ఏం ధర్మం, ఏం న్యాయం? పేగు తెంచుకుపుట్టిన పాపానికి ఇంత శిక్ష విధిస్తారా? ఆడపిల్ల అన్న అలుసు, ఎప్పుడెప్పుడు పెళ్లిచేసి వదిలించుకుందామా అన్న తొందర, వయసు పెరిగితే కట్నాలు ఇవ్వాల్సి వస్తుందేవో అన్న ఆలోచన...ఈ వ్యవస్థకు పునాది. ఆ ఆలోచన రావడానికి కారణం..పేదరికం! ఆ మండలాల్లో సాగునీటి వసతి లేదు. అన్నీ బీడుభూములే. ఎనభైశాతం కుటుంబాలు బెంగళూరు, గుంటూరు లాంటి ప్రాంతాలకు వలస వెళ్తాయి. ఉగాది నాటికి అంతా సొంత గ్రామాలకు చేరుకుంటారు. ఈ సమయంలోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. వలసకు (సుగ్గికి) వెళ్లి తెచ్చుకున్న ఆదాయంతో పెళ్లిచేసి చేతులు దులుపుకుంటున్నారు. బాల్య వివాహాల మీద ప్రజల్లో అవగాహన పెంచేందుకు అన్ని శాఖలనూ సమన్వయం చేసుకుని సదస్సులు పెడుతున్నట్లు ఆదోని డివిజనల్‌ రెవెన్యూ అధికారి ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. వివాహాలు నిర్వహించే పూజారులనూ మతపెద్దలనూ పిలిపించి, అవసరమైతే వారిమీద కూడా కేసులుపెడతామని హెచ్చరిస్తున్నట్టు చెప్పారు.
 


చట్టం ఏం చెబుతోంది?
(బాల్యవివాహ నిషేధ చట్టం-2006)
ఎవరికి వర్తిస్తుంది?
18 ఏళ్లలోపు బాలికలు.
21 ఏళ్లలోపు బాలురు.
...భారతీయ పౌరులందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. కీలక అంశాలు...
బాల్యవివాహాలు జరిపించడం బెయిల్‌ లభించని నేరం. బాల్యవివాహాలు జరగకుండా ఉత్తర్వులు జారీచేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది. అవసరమైతే, అలా జరిగిన వివాహం చల్లదని కూడా నిర్ధారిస్తాయి. ప్రతి రాష్ట్రానికీ బాల్య వివాహ నిరోధక వ్యవస్థ ఉండాలి. ఈ చట్టం మీద ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కలెక్టరుకు ఉంది. ఎక్కడైనా బాల్య వివాహం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన కర్తవ్యం ప్రతిపౌరుడిదీ. మైనారిటీ తీరిన తర్వాత, తమకు జరిగిన బాల్యవివాహాన్ని రద్దుచేయమని కోరవచ్చు.
అందరూ దోషులే
* ఇరుపక్షాల తల్లిదండ్రులు/సంరక్షకులు
* పురోహితుడు
* ఇరుగుపొరుగువారు
* 18 ఏళ్లకు పైబడిన పెళ్లికొడుకు
* ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన ఎవరైనా.
శిక్ష
బాల్యవివాహాన్ని ప్రోత్సహించేవారు కఠిన కారాగార శిక్షకు అర్హులు. ఈ నేరానికి రెండేళ్లవరకూ జైలు శిక్ష లేదా లక్షరూపాయల వరకూ జరిమానా ఉంటుంది. రెండూ విధించే అవకాశాలూ ఉన్నాయి.
చట్టాలున్నాయి కానీ...
చెప్పుకోడానికేం, చాలా చట్టాలున్నాయి. వాటిని అమలుచేయడానికి కూడా కలెక్టరు నుంచి గ్రామకార్యదర్శి దాకా చాలామంది ఉద్యోగులే ఉన్నారు. అయినా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వైఫల్యానికి ఏ ఒక్కరినో కారణంగా చూపలేం. ఏసీ గదులకే పరిమితమైన ఉన్నతాధికారుల నిర్లిప్తత ఎంతో, ప్రజాప్రతినిధుల స్వార్థమూ అంతే. ఆదోని డివిజన్‌లోని చాలా గ్రామాలు సరిహద్దులో ఉండటంతో...అటు కర్ణాటక అధికారులు, ఇటు ఆంధ్రా అధికారులు - రెండువైపుల నుంచి నిర్లక్ష్యమే! బాల్య వివాహాల నిషేధానికి 2007 నుంచి ఓ ప్రత్యేక చట్టం అమలులో ఉన్నా, ఆచరణ మాత్రం లేదు. ఇందుకోసం రెవెన్యూ, పోలీసు, స్త్రీశిశుసంక్షేమశాఖ లాంటి తొమ్మిది విభాగాలు కలసి పని చేయాలి. ఆ ప్రయత్నమూ జరగడం లేదు. చట్టం ప్రకారం బాల్యవివాహాలను నిరోధించడానికి రాష్ట్ర స్థాయిలో ఓ అధికారిని నియమించాలి. ఇంతవరకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. నిజానికి, బాల్యవివాహాలు అన్నది... జాతీయ సమస్య, రాష్ట్రస్థాయి సమస్య. మిగతా జిల్లాల్లోనూ ఆ దురాచారం బలంగా ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, బాధ్యతాయుత పౌరులు - వెుత్తంగా వ్యవస్థ వైఫల్యానికి ఆదోని డివిజన్‌ గణాంకాలు ఒక పెద్ద ఉదాహరణ. నేర్చుకునే మనసుంటే, తమను తాము మార్చుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే...ఆ ప్రయత్నమేదో ఇక్కడి నుంచే వెుదలుపెట్టాలి.


మేం చేసిన తప్పేమిటి?
బుద్ధిగా బడికెళ్లి చదువుకోవాల్సిన వయసులో... మూడుముళ్లతో బంధిస్తారా? నాలుగుగోడలకే పరిమితం చేస్తారా? ఎవరిచ్చారు మీకీ అధికారం? ...అంటూ దీనంగా అడుగుతున్నారీ చిన్నారులు.
ఆశాకిరణం...
హాలహర్వి మండలంలోని ఓ గ్రామం. పుస్తకాల సంచి భుజానికేసుకుని ఓ బాలిక పాఠశాలకు వెళ్తోంది.
పేరు దేవి.
వయసు పదమూడేళ్లు ఉండొచ్చు.
ఎనిమిదో తరగతి చదువుతోంది.
బక్కపల్చగా ఉంది. పొట్టమాత్రం కాస్త ముందుకొచ్చింది.
తను గర్భవతి. ఆ బాలికకు ఇష్టంలేకపోయినా పెళ్లిచేశారు. తప్పనిసరై తలవంచింది.
బడి మానేయమన్నారు.
చదువు విషయంలో మాత్రం తలవంచేది లేదంది. తొమ్మిది నెలలు నిండేదాకా బడికెళ్తానని స్పష్టంగా చెప్పేసింది. ఎంత కష్టమైనా సరే, ఆ తర్వాత కూడా చదువు కొనసాగిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
అక్షరంతో ఆలోచన పెరుగుతుంది. దురాచారాల్ని ఎదిరించే ధైర్యం వస్తుంది. బాల్యవివాహాల్లాంటి సామాజిక సమస్యలకు అక్షరాన్ని మించిన శస్త్రచికిత్స లేదు.
దేవి ఒక మార్పునకు సంకేతం.
'జాగ్రత్త! ఆడపిల్ల తిరగబడుతుంది' అన్న పదునైన హెచ్చరిక!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)