India Tourism_Mahabaleshwar (Telugu)

'మండువేసవిలో మంచువానల్ని చూడాలన్నా, పంచగంగలో మునకలు వేయాలన్నా, ఎర్రెర్రని స్ట్రాబెర్రీ షేకుల్ని ఆస్వాదించాలన్నా పచ్చని ప్రకృతితో అలరారే మహాబలేశ్వర్‌కి ప్రయాణమవ్వాల్సిందే' అంటున్నారు హైదరాబాద్‌కి చెందిన ఎ.ఎన్‌.ఎస్‌.శంకర్రావు.
రాత్రి 12 గంటలకు హైదరాబాద్‌లోని దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి ఉదయం ఏడు గంటలకు షోలాపూర్‌ చేరుకున్నాం. నేరుగా శ్రీ సిద్ధేశ్వర దేవస్థానం చేరుకుని స్వామిని దర్శించుకున్నాం. అది చూడ్డానికి అచ్చం కోటలానే ఉంది. 12వ శతాబ్దంలో జన్మించిన సిద్ధేశ్వరుడు గొప్ప యోగి, శ్రీశైల మల్లన్న భక్తుడు. దైవసాక్షాత్కారం పొందడమే కాకుండా స్వామి ఆజ్ఞానుసారం 68 క్షేత్రాల్లో ఉండే అన్ని రకాల లింగాలను గుడి ఆవరణలోనూ ఊరి నలుమూలలా ప్రతిష్ఠించాడట. మల్లన్న ఆజ్ఞానుసారమే శ్రీశైలం నుంచి వచ్చిన పాతాళగంగ ఈ గుడిచుట్టూ చేరిందన్నది పురాణగాథ. శక్తిపీఠం!
అక్కడ నుంచి మళ్లీ 9 గంటలకు బయలుదేరి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుల్జాపూర్‌కి వెళ్లి అక్కడి భవానీ మాతను దర్శించుకున్నాం. ఈ దేవాలయం శక్తిపీఠాల్లో రెండోది. స్కాంధపురాణంలో ఈ గుడి ప్రస్తావన ఉంది. ఇక్కడ అమ్మవారిది స్వయంభూ విగ్రహం. ఇక్కడున్న బాలాఘాట్‌ కొండమీదే అమ్మవారు శ్రీరాముణ్ణి దీవించిందట. శివాజీ కుటుంబమంతా అమ్మవారి భక్తులే. అందుకే ప్రతాప్‌గడ్‌ కోటలో అమ్మవారి గుడిని కట్టించాడు శివాజీ. మధ్యాహ్నం లంచ్‌ చేసి బయలుదేరి సాయంత్రానికి పండరీపురం చేరుకున్నాం. కాసేపు విశ్రాంతి తీసుకుని శ్రీపాండురంగ విఠల మందిరానికి వెళ్లాం. పుండరీకుడనే భక్తుడు విసిరిన ఇటుకమీద నిలబడి నడుమ్మీద చేతులుంచిన పాండురంగడు దర్పంగా దర్శనమిస్తాడు. రాధాకృష్ణులు ఒకే పల్లకీమీద కూర్చోవడం చూసి అలిగిన రుక్మిణి మాత్రం విఠలుడికి వాయవ్య దిశలోని మరో గుడిలో నవ్వుతూ దర్శనమిస్తుంది. అక్కడ గుడి పూజారులు హరిజనులు. ఈ గుడిలో తెల్లవారుజామున స్వామి అభ్యంగనం, కాకడా ఆరతి, 12 గంటలకు పాదపూజ, 7 గంటలకు ధూపహారతి, 10 గంటలకు శేజ ఆరతి చూసి తీరాల్సిందే. జగద్గురు శంకరాచార్యులు, మధ్వాచార్యులు, పురందరదాసు, రామానుజాచార్యులు ఈ స్వామిని సేవించినవారిలో ప్రముఖులు. కొద్దిదూరంలో ఉన్న విష్ణుపాదం, కృష్ణుడి పాదముద్రలు, ఆవుల పాదముద్రల్ని చూసి మహాబలేశ్వరం బయలుదేరాం.
పచ్చని ప్రకృతిలో...
ఉదయం 9 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం 12 గంటలకు సతారా చేరుకున్నాం. దారిలో దొరికిన నేరేడుపండ్లు, జామపండ్లు, మామిడిపండ్లు తింటూ సాయంత్రానికి మహాబలేశ్వర్‌ చేరుకున్నాం. ఘాట్‌రోడ్డు ప్రయాణం ఆహ్లాదకరంగా సాగింది. చుట్టూ ఎత్త్తెన కొండలూ పచ్చని చెట్లూ కిందకి చూస్తే ఆవులిస్తున్నట్లున్న లోయలూ పైకి చూస్తే ఎప్పుడెప్పుడు కురుద్దామా అన్నట్లున్న నల్లని మబ్బులూ ఎండావానల దోబూచులాటల మధ్య ఘాట్‌రోడ్డు ప్రయాణం ఆద్యంతం రమణీయంగా సాగింది. మండువేసవిలో సైతం సన్నగా కురిసే మంచుతుంపరలూ రంగుబల్బుల షాపులూ గుర్రపుస్వారీలూ బోటింగ్‌లూ స్ట్రాబెర్రీ, క్యారెట్‌ తోటలూ నిప్పులమీద కాల్చిన వెుక్కజొన్నపొత్తులతో అప్పుడే ఓణీ కట్టినట్లున్న పడుచుపిల్లలా అనిపించింది మహాబలేశ్వరం.
పల్లీలు, సెనగపప్పు, జీడిపప్పు, బాదంపప్పులతో చేసిన రకరకాల పప్పుచెక్కలు, హల్వాలు, స్పైసీ మంచూరియాలు, 20రకాల సెనగల మసాలాలతో నిండిన బండ్లూ; కివీ, దానిమ్మ, లిచి, బ్లూబెర్రీ, పుచ్చ, మామిడి, అరటి, మిక్స్‌డ్‌ ఫ్రూట్‌సలాడ్‌, ఐస్‌క్రీమ్‌ల పార్లర్లూ నోరూరిస్తుంటాయి. అవన్నీ తినడానికి అరవై చేతులూ ఇరవై నోళ్లూ ఉంటే బాగుండుననిపించింది. ఇంకా రకరకాల పండ్లతో తయారైన జామ్‌లు, చాక్లెట్లు, ఫ్రూట్‌టాపింగ్స్‌, జ్యూస్‌లు, జెల్లీలు... సహజప్రక్రియల్లో తయారైన ఈ తినుబండారాలన్నీ జిహ్వచాపల్యాన్ని రెచ్చగొడుతుంటాయి. అక్కడ షాపులన్నీ కిలోమీటరు దూరంలోనే ఉంటాయి. కానీ అన్నీ తిరిగి చూడ్డానికి ఎన్ని గంటలయినా చాలవు. తరవాత అక్కడకు 18 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పాంచ్‌గనికి బయలుదేరాం. అక్కడ అన్నీ గ్రీన్‌హౌస్‌, ఫామ్‌హౌస్‌లే. కంపెనీ యాజమాన్యాలు తోటల్లోనే ఫ్యాక్టరీలు ఏర్పాటుచేసి ఆయా పండ్ల ఉత్పత్తుల్ని తయారుచేస్తుంటారు. అక్కడే ఉచితంగా రుచి చూసే కౌంటర్లూ విక్రయశాలలూ ఉంటాయి. 20 శాతం డిస్కౌంటు ఇస్తారు. అక్కడ చల్లదనానికి ఎంత తిరిగినా అలసటన్నదే తెలియలేదు. మహాబలేశ్వరంలో సూర్యోదయం ఎంతో బాగుంటుంది. ఎన్నింటికి సూర్యోదయమవుతుందని ఆరా తీశాను. నాలుగు రోజుల నుంచి మబ్బులే. సూర్యుడే కనిపించడంలేదు. ఈరోజు కూడా నక్షత్రాలు కన్పించడం లేదు. కాబట్టి రేపు కూడా నో ఛాన్స్‌ అని చెప్పేశారు అక్కడివాళ్లు. కానీ మర్నాడు అడిగితే 5.50 గంటలకు సూర్యోదయం స్పష్టంగా కన్పించిందట. అప్పుడు చెప్పినవాళ్లమీద చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాం!
ఇక్కడున్న విల్సన్‌ పాయింట్‌ దగ్గరే అంతా సూర్యోదయాన్ని చూస్తారు. ఉదయాన్నే టైగర్‌పాత్‌లో వాకింగ్‌ చేస్తూనో లేదా గుర్రాలమీదో చాలామంది ఈ పాయింట్‌కి చేరుకుంటారు. అలాగే సూర్యాస్తమయం చూడ్డానికి సాయంత్రం అంతా బాంబే పాయింట్‌కి చేరుకుంటారు. ఇక సూర్యోదయం చూసే భాగ్యం లేదు కాబట్టి మేం ట్యాక్సీ మాట్లాడుకుని కేట్స్‌ పాయింట్‌కి వెళ్లాం. ఇది చాలా ఎత్త్తెన ప్రదేశం. ఎత్త్తెన కొండలూ లోతైన లోయలూ పక్కనే కృష్ణానది దానిమీద ఓ చిన్న డ్యామ్‌ ఎటుచూసినా పరవశింపజేసే ప్రకృతిదృశ్యాలే. నదిపక్కనే పచ్చదనం పరచుకున్న పల్లెటూళ్లు. ఇక్కడ తరచూ షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఇక్కడే ఏనుగు తలను పోలిన కొండ, సూది బెజ్జాన్ని పోలిన కొండ, ఎకోపాయింట్‌లు చూశాం. దార్లోనే లింగమల వాటర్‌ఫాల్స్‌, లొడ్విక్‌ పాయింట్‌, పార్క్‌ల్యాండ్‌ చూశాం. ప్రతిచోటా వేడివేడిగా కాల్చిన స్వీట్‌కార్న్‌లూ తాజా క్యారెట్‌లూ స్ట్రాబెర్రీలూ పలకరిస్తూనే ఉన్నాయి. మా ట్యాక్సీని ఓ స్ట్రాబెర్రీ తోటముందు ఆపి లోపలకు వెళ్లాం. తోటలోనే చిన్న షాపు. అక్కడ మిల్క్‌షేక్‌లూ జ్యూస్‌లూ క్రీమ్‌లూ ఉన్నాయి. స్ట్రాబెర్రీతో చేసిన ఓ క్రీమ్‌ని తిన్నాం. ఆ రుచి ఇప్పటికీ నాలుకమీదే ఉంది. అంత బాగుంది మరి.
ఐదునదుల సంగమం
మహాబలేశ్వర్‌లోని గుడికి వెళ్లి శివుణ్ణి దర్శించుకున్నాం. గుడి పక్కనే నిరంతరం పారే పంచగంగ దగ్గరకు వెళ్లాం. గాయత్రి, సావిత్రి, కొయనా, వెన్నా, కృష్ణా నదులు కలిసి ఒక్కటిగా ప్రవహించే ధారనే 'పంచగంగ' అని పిలుస్తారు. గురువు కన్యారాశిలోకి వచ్చినప్పుడు పన్నెండు సంవత్సరాలకోసారి భాగీరథి ఓ సంవత్సరం పాటు పంచగంగతో కలసి ప్రవహిస్తుంది. సరస్వతీనది మాత్రం కపిల షష్టిలో 60 సంవత్సరాలకోసారి వచ్చి కేవలం ఒక్కరోజే ప్రవహిస్తుందట. పంచగంగ పడే ప్రాంతంలో కన్పించే బ్రహ్మకుండంలో స్నానానికి మాత్రమే అనుమతిస్తారు. పక్కనే ఉన్న విష్ణుకుండంలో బట్టలు ఉతుక్కోవచ్చు. తరవాత ఎల్పిస్టన్‌, మార్జొరి, మంకీ, సావిత్రి, ఎకో, విండో పాయింట్లనూ టైగర్‌ పాయింట్‌నూ చూశాం. టైగర్‌ పాయింట్‌లో ఏడాదిపొడవునా నీరు వస్తుందట.
అద్భుతం... ఆ కోట నిర్మాణం
మధ్యాహ్నం లంచ్‌ చేసి ప్రతాప్‌గఢ్‌కి వెళ్లాం. బీజాపూర్‌ రాజ్యంలోని శక్తిమంతుడైన కమాండర్‌ అఫ్జల్‌ఖాన్‌నీ అతడి సైన్యాన్నీ మట్టి కరిపించేందుకు దట్టమైన అడవిలో 52 ఎకరాల్లో కేవలం రెండేళ్లలోనే అద్భుతమైన కోటను కట్టించాడు శివాజీ. ఆ విషయాలన్నింటినీ గైడ్‌ కుర్రాడు చక్కగా వివరించాడు. కోట చుట్టూ లోతైన లోయలే. కోట ప్రారంభంలో సైనికులు దాక్కొనే గుహ ఉంది. కోటకు నలువైపులా నాలుగు వాచ్‌టవర్లు ఉన్నాయి. చిమ చిటుక్కుమన్నా వెంటనే కనుక్కునే విధంగా వీటిని నిర్మించారు. రాజమార్గం చాలా విచిత్రంగా ఉంది. చివరి ద్వారం గుండా వెళ్దామనుకుంటే అక్కడ లోయ ఉంటుంది. సీక్రెట్‌ దర్వాజాలు, ప్రతాప్‌గార్డెన్‌, రాయల్‌కోర్టు, ప్రజల సమస్యల్ని స్వయంగా వినే దివానీ ఆమ్‌, కోటలోనే ఉన్న చిన్న సిటాడెల్‌, డ్రమ్‌హౌస్‌(శత్రువులు రాకను గుర్తించి శబ్దాలు చేసే ప్రదేశం), సొరంగాలు, శిక్షలు అమలుచేసే పాయింట్‌... అన్నీ చూశాం. శిక్షపడినవారిని ఈ పాయింట్‌ నుంచే లోయలోకి తోసేసేవారట.
వర్షపునీటిని పొదుపుచేసి కోట అవసరాలను తీర్చేందుకు 40 అడుగుల లోతుండే నాలుగు చెరువుల్ని తవ్వించాడు శివాజీ. కోట నిర్మాణానికి- అక్కడే తొలచిన కొండరాళ్లు, సిమెంటుకి బదులు బెల్లం, ఇసుక, సున్నపురాయి వాడారు. కోటపైనుంచి పరిసరాలను గమనిస్తే ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. కోటలోనే హనుమాన్‌, భవానీ మందిరాలు కూడా ఉన్నాయి. శివాజీ కుమారుడు శంబాజీకి రామదాస్‌ స్వామి కానుకగా ఇచ్చిన స్ఫటిక శివలింగం కూడా ఈ గుడిలో ఉంది.
తరవాత భవానీమాతను కూడా దర్శించుకుని చివరగా ప్రధాని జవహర్‌లాల్‌ చేతులమీదుగా కోటలో ఆవిష్కరించబడిన శివాజీ విగ్రహాన్ని చూసి బయలుదేరాం. అప్పటికే సాయంత్రమైంది. ఎలాగైనా సూర్యాస్తమయాన్ని చూడాలని 5.45కల్లా మార్జొరీ పాయింట్‌కి చేరుకున్నాం. మబ్బులన్నీ సూర్యుణ్ణి దాచేశాయి. ఇది కూడా చూడలేమేవోనన్న నిరాశ... ఎక్కడో ఆశ. ఉత్కంఠతో అలా నిరీక్షిస్తుండగానే సరిగ్గా 6.25కి మబ్బుల్ని తోసేసి సూర్యుడు పడమటకి వాలిపోతూ దర్శనమిచ్చాడు. అది చూసి అందరం ఎంతో సంతోషించాం. ఇక్కడ గుర్రాల్ని ముందుకాళ్లపై ఆడిస్తారు. అక్కడ నుంచి వెనక్కి హోటల్‌కి వచ్చి డిన్నర్‌ చేసి ట్యాక్సీలో పుణెకి చేరుకున్నాం. మర్నాడు ఉదయమే అక్కడ బస్సు ఎక్కి షిరిడీకి బయలుదేరాం. ఉదయాన్నే షిరిడీలో దిగి స్నానాలు, భోజనాలు ముగించి సాయిదర్శనానికి బయలుదేరాం. మరుసటిరోజు అభిషేకం, సత్యనారాయణస్వామి వ్రతాలకు టికెట్స్‌ తీసుకుని రూమ్‌కి వచ్చాం. మళ్లీ సాయంత్రం గుడికి వెళ్లి సంధ్యా ఆరతి చూశాం.
మర్నాడు ఉదయం 8 గంటలకే గుడికి వెళ్లాం. రష్‌ చూసి భయమేసింది. 9 గంటలకు ఎలానూ అభిషేకానికి వెళ్లాలి కదాని పర్మిషన్‌ ఇస్తే సాయిని దగ్గరగా చూసి వస్తామని కోరగా అరగంటపాటు హుండీలోని డబ్బుల్ని వేరుచేసి క్రమంలో పేర్చి బండిల్స్‌గా చేస్తే అనుమతి ఇస్తామన్నారు. అలాగే చేసి సాయిని దగ్గరగా దర్శించుకున్నాం. సాయంత్రం విశాఖపట్నం రైలు ఎక్కి ఉదయానికల్లా సికింద్రాబాద్‌ చేరుకున్నాం. ఐదురోజుల యాత్ర ఐదునిమిషాల్లో అయిపోయిందనిపించింది. ఏమయినా మరపురాని మహాబలేశ్వర్‌ని మాత్రం మళ్లీమళ్లీ చూడాల్సిందే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)