Helping Hands

ఎన్నో పక్షులు ఆహారం కోసం విదేశాల నుంచి మనదేశానికి వలస వస్తాయి. కొన్నాళ్లు ఉండి తిరిగి వెళ్లిపోతాయి. అదే మనదేశంలో వలస జీవులు... ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఎన్నాళ్లు ఉంటారో లెక్కలేదు. అలాంటి వారి బాగోగుల కోసం కృషిచేస్తోంది 'ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌.'
ప్యారిస్‌ కేంద్రంగా పనిచేసే 'ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌' సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. దక్షిణాసియాలో మనదేశంతో పాటు శ్రీలంక, నేపాల్‌లలో సేవలందిస్తోంది. మనదేశంలో ప్రధానంగా వలస కార్మికుల పిల్లల చదువులు, యువతకు స్థానికంగా ఉపాధి... అనే అంశాలపై ఈ సంస్థ దృష్టిపెట్టింది. ఉపాధి కల్పనలో భాగంగా ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌ 'ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లైవ్లీహుడ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(ఐలీడ్‌)' కార్యక్రమం చేపడుతోంది. దీన్లో 18-25 ఏళ్ల మధ్య వయసు యువత వివిధ పరిశ్రమల్లో పనిచేసేందుకు కావాల్సిన నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. అలా గత పదేళ్లలో దేశవ్యాప్తంగా యాభైవేల మందికి వీరు శిక్షణ ఇచ్చారు. విప్రో, టాటా బీపీవో విభాగాలు, పిజ్జాకార్నర్‌, యమహా, నోకియా... వంటి కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని వారి అవసరాలకు తగినట్టు యువతకు శిక్షణ ఇచ్చి ఆయా సంస్థల్లో ఉపాధి పొందేలా కృషిచేస్తారు. టైలరింగ్‌, సెల్‌ రిపేరింగ్‌, బ్యుటీషియన్‌ కోర్సు, ఆటోవెుబైల్‌ టెక్నాలజీలో వీరు శిక్షణ ఇస్తారు. మనరాష్ట్రంలో...
హైదరాబాద్‌ (040-23316128), విజయవాడ, కొత్తగూడెంలలో ఐలీడ్‌ శిక్షణ కేంద్రాలున్నాయి. ఏడో తరగతి వరకూ చదువుకున్న హైదరాబాద్‌కు చెందిన 17 ఏళ్ల అఫ్రీన్‌ బేగమ్‌ ఐలీడ్‌ కేంద్రంలో టైలరింగ్‌ శిక్షణ తీసుకుంది. ఇప్పుడో రెడీమేడ్‌ వస్త్ర దుకాణంలో చేరి నెలకు నాలుగువేల రూపాయలకుపైనే సంపాదిస్తోంది. సరిహద్దు జిల్లాల్లో ఉండే ఇతర రాష్ట్రాలవారి పిల్లలు చదువుల్లో వెనుకబడటంపై ఈ సంస్థ ప్రత్యేకశ్రద్ధ పెట్టింది. రాజీవ్‌ విద్యా మిషన్‌ సహకారంతో సరిహద్దుల్లో కన్నడ, మరాఠీ వలంటీర్లను నియమించి మాతృభాషలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. తండాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటుచేసి పిల్లలు బడిబాటపట్టేలా చూసి తర్వాత ఆ కేంద్రాలను ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. నల్గొండ జిల్లాలో బొమ్మల రామారం గ్రామంలో సుమారు యాభై కుటుంబాలు ఒరిస్సా నుంచి వలస వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నాయి. బడికి దూరమైన వారి పిల్లల కోసం ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌ ఒరిస్సా నుంచి ఒక వలంటీరుని తెప్పించి స్థానికంగా పాఠాలు చెప్పిస్తోంది.
ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌ వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో రాష్ట్రంలోని వలస జీవుల సంఖ్యను లెక్కించింది. ఆ గణాంకాలను ప్రభుత్వానికి అందించారు. రాష్ట్రంలో ఏటా సుమారు ఎనిమిది లక్షల మంది వలస పోతుంటారనేది వీరి సర్వే. వారిలో లక్షా డెబ్భైవేల మంది బడి ఈడు పిల్లలే. వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో జరిగే లబ్ధి అంతంత మాత్రమే. ఇలాంటివారు ఎక్కడున్నా ప్రభుత్వ ఫలాలు అందాలనేది వీరి ప్రతిపాదన. క్వారీలు, మైనింగ్‌, ఇటుక బట్టీలు, భవన నిర్మాణాలు జరిగేచోట తాత్కాలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు వలస పోవడంతో ఒంటరి వారైన పిల్లలకు ఆశ్రయం కల్పించడం కోసం వీరు శ్రీకాకుళం జిల్లాలో ఓ సీజనల్‌ హాస్టల్‌ను ప్రారంభించారు. అక్కడ సుమారు 200 మంది పిల్లలు వసతి పొందుతున్నారు.
తెలుగువారికోసం
మనరాష్ట్రం నుంచి చెన్నై వెళ్లిన వలస కార్మికుల కోసం 'ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌' 12 బ్రిడ్జి స్కూళ్లను నిర్వహిస్తోంది. తల్లిదండ్రులు పనులకు వెళ్తే ఇంటి దగ్గరుండే పిల్లలు ఈ బ్రిడ్జి స్కూళ్లలో చదువుకుంటారు. వీరికి తెలుగులో పాఠాలు చెప్పిస్తున్నారు. విజయనగరం నుంచి భవన కార్మికులుగా పనిచేసేందుకు చెన్నై వెళ్లిన అప్పలస్వామి, కళావతిల 11 ఏళ్ల కుమార్తె భాగ్యలక్ష్మి బ్రిడ్జి స్కూల్‌కు వెళ్లి చదువుకుంటోంది. 'అమ్మానాన్న పనికెళ్లాక ఇంట్లో పని పూర్తిచేసి బడికివెళ్లి పాఠాలు నేర్చుకుంటాను' అని చెబుతుంది భాగ్యలక్ష్మి. 'పిల్లలకు చదువు నేర్పడంలో విజయం సాధించగలుగుతున్నాం కానీ వారిని ఇక్కడ బడుల్లో రెగ్యులర్‌ విద్యార్థులుగా మార్చాలంటే కష్టం. పదో తరగతి పరీక్షలు రాయాలంటే మైగ్రేషన్‌ సర్టిఫికేషన్‌ అవసరం' అని చెబుతారు ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌ సంస్థ తమిళనాడు ప్రతినిధి రాజా ఫెర్నాండో.
'విద్యతోనే మార్పు'... అనేది ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌ నినాదం. అందుకే చదువు ఎంత ముఖ్యవో తెలిపే డాక్యుమెంటరీలను పిల్లలకు చూపిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాల ప్రభుత్వ పాఠశాలల్లో 'పున్నీకీ కహానియా' పేరుతో ఈ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. విద్య బాలల హక్కు... వలసజీవుల పిల్లల చదువు కోసం వీరు చేస్తున్న కృషి ఎంతైనా ప్రశంసనీయం కదూ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)