Eetaram (25_06_2011)

ఐడియాల వీరులు!
మేటి ఆవిష్కర్తలు!!
* పరిశోధనే పెట్టుబడిగా అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతున్నది ఒకరు...
* తెలుగు భాష మీదున్న మమకారానికి సాంకేతికతను అద్దింది మరొకరు...
* ఆక్వా రైతుల కోసం ఆలోచించి అంతర్జాతీయ అవార్డును అందుకున్నది ఇంకొకరు...
ముగ్గురూ యువ పరిశోధకులే! సమాజాన్ని మేలి మలుపు తిప్పడానికి కృషి చేస్తున్న నవ శాస్త్రవేత్తలే! ఈ మేటి ఆవిష్కర్తలతో 'ఈతరం' ముచ్చటించింది...
పరిశోధనల 'ప్రవీణు'డు!
పేద వికలాంగులకు చౌకైన కృత్రిమ కాలు... పత్తి నుంచి ప్రత్యామ్నాయ ఇంధనం... మైనంతో మిసైల్స్‌ను నడిపించే సాధనం... ఇవన్నీ ఓ యువకుడి ఆలోచనల ఫలితాలే. అతడే అబ్దుల్‌ కలాం మెప్పు పొంది, మేటి శాస్త్ర సాంకేతిక సంస్థల గుర్తింపు సాధించిన గోరకవి ప్రవీణ్‌కుమార్‌. హైదరాబాదీ. 'మా యూనిర్సిటీలో పీహెచ్‌డీ చేయండి' అంటూ ఆహ్వానం పలికింది ప్రతిష్ఠాత్మక బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం. తిరస్కరించాడు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఐ.ఐ.ఎం., ఐ.ఐ.ఎస్‌.సి. విద్యాసంస్థల్లో సీటొచ్చింది. వదులుకున్నాడు. ఏడాదికి నాలుగున్నర లక్షల జీతమిస్తామన్నాయి విప్రో, కాగ్నిజెంట్‌ కంపెనీలు. చేరలేదు. ఇన్ని అవకాశాల్ని కాదని సమాజం కోసమే పరిశోధనల్లో నిమగ్నమైన ప్రవీణ్‌ బాల మేధావి. రాష్ట్రపతి చేతుల మీదుగా 'బాలశ్రీ' అవార్డు అందుకున్న ఇతడు ఇరవై ఏళ్లకే దాదాపు అరవై ఆవిష్కరణలు చేశాడు. ఇరవై రెండేళ్లకే ఫ్యాప్సీ (ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య) ఎక్సలెన్స్‌ అవార్డు సొంతమైంది. రాష్ట్రస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి వరకు దాదాపు నలభై అవార్డులు సాధించాడు. అతడి ఆవిష్కరణల్లో కొన్ని...
* పేద వికలాంగుల కోసం అయిదు వందల రూపాయలు మాత్రమే ఖర్చయ్యే కృత్రిమ కాలు రూపొందించాడు. డ్యురాలమిన్‌, మెలానిన్‌ మిశ్రమంతో తయారు చేసిన దీన్ని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం సైతం మెచ్చుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులిస్తామని ఓ కంపెనీ ముందుకు వచ్చినా కాదనుకుని పేదలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల కోపరేటివ్‌ కార్పొరేషన్‌కి ఉచితంగా ఇచ్చాడు. అక్కడ్నుంచి అది 'నిమ్స్‌'కు చేరింది. ఉత్పత్తి ప్రారంభమయ్యే దశలో ఉంది.
* పత్తి నుంచి ఇంధనం తీసే కొత్త టెక్నాలజీ కనుగొన్నాడు. పత్తిలో ఉండే 'సెల్యులోజ్‌'ను కుళ్లబెట్టి పెట్రోల్‌గా మార్చే ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే లీటర్‌ ఇంధనాన్ని కేవలం రూ. 13లకే ఇవ్వొచ్చు. దీనిపై ప్రవీణ్‌ రాసిన పరిశోధక వ్యాసం ప్రఖ్యాత 'నేచర్‌' పత్రికలో ప్రచురితమైంది. 'అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌' దీన్ని ఆచరణాత్మకమైనదిగా గుర్తించింది. ఇదే ఎన్‌.ఐ.టి. (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) తిరుచ్చిలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో రెండో ఉత్తమ పరిశోధనగా ఎంపికైంది. దీంట్లో ప్రపంచంలోని ఐదువేలమంది శాస్త్రవేత్తలు పోటీ పడ్డారు. ఈ టెక్నాలజీ మెచ్చి ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించమంటూ భారత శాస్త్ర సాంకేతిక మండలి (డీఎస్‌టీ) మూడు కోట్ల రూపాయల గ్రాంట్‌ విడుదల చేసింది. ఈ ఫండ్‌తో రోజుకు ఐదువేల లీటర్ల ఇంధనం ఉత్పత్తి చేసే కంపెనీ ప్రారంభిస్తున్నాడు ప్రవీణ్‌.
* మైనంలోని మాలిక్యూల్స్‌ను మండించి ఉత్పత్తి అయ్యే శక్తిని రాకెట్‌, మిస్సైల్‌ ఇంధనంగా వాడుకునేలా మరో టెక్నాలజీ రూపొందించాడు. పరీక్షించి చూడటానికి సొంతంగా రెండడుగుల మిస్సైల్‌ తయారు చేశాడు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ధృవీకరించింది. దీని కారణంగానే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా'తో కలిసి ఓ ప్రాజెక్టుకు పనిచేశాడు.
* సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకొని 'వాస్కామూడ్‌' అనే 'ఆహార నిల్వ యంత్రం' రూపొందించాడు. ఇది ఎలాంటి ఆహారాన్నైనా మూడేళ్లవరకు కుళ్లిపోకుండా చేస్తుంది. ద్రాక్షగింజల నుంచి ఉత్పత్తి చేసిన 'ఆక్టివిన్‌' సాయంతో ఈ విధానం రూపొందించాడు. ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్‌.జి. ఈ టెక్నాలజీ బదలాయింపుపై చర్చిస్తోంది.
* కేవలం రెండువేల రూపాయలతో వేల లీటర్ల నీటిని శుద్ధి చేసేలా 'వాటర్‌ ప్యూరిఫికేషన్‌ సిస్టమ్‌' తయారు చేశాడు. మురుగు నీటిని సైతం శుద్ధి చేసే ఈ టెక్నాలజీతో సొంతంగా ఉత్పత్తి ప్రారంభించాలనే యోచనలో ఉన్నాడు.
* అంధుల కోసం గంటకు నలభై పదాలు టైపు చేయగలిగే 'బ్రెయిలీ ఎంజాసర్‌' రూపొందించాడు. వికలాంగుల కోసం సౌరశక్తితో పనిచేసే 'సోలార్‌ ట్రైసైకిల్‌' తయారు చేశాడు.
తెలుగు అభిమాని!
తెలుగు మీద అభిమానంతో ఓ సరికొత్త 'ఈ-బుక్‌' (ఈ-పబ్లికేషన్‌) తయారు చేశాడు నవీన్‌ బొగ్గారపు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇతగాడు కొత్త ఆవిష్కరణలు చేయాలనే ఉద్దేశంతో 'సీర్‌ అకాడెమీ'లో బీటెక్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ కోర్సు చేశాడు. 'ఈబుక్‌ రీడర్‌కి మంచి భవిష్యత్తు ఉంది. దానికి తెలుగులో సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తావా?' అని సంస్థ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ జడ్చర్ల అడగ్గానే రంగంలోకి దిగాడు. ప్పుడున్న ఈబుక్‌ రీడర్‌లతో కేవలం ఇంగ్లిష్‌ పుస్తకాలను మాత్రమే చదవగలం. తెలుగు భాష పుస్తకాల్ని సైతం అందులోకి అప్‌లోడ్‌ చేయడానికి కొత్త సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలి. ఆ ప్రాజెక్టు పనిలో నిపుణుల సలహాలు తీసుకున్నాడు. అంతర్జాలాన్ని గాలించాడు. నాలుగు నెలలు కష్టపడ్డాక అనుకున్నది సాధించాడు. మొదటిసారి 'ఆర్థిక భారత్‌' అనే తెలుగు పుస్తకాన్ని ఈబుక్‌రీడర్‌లోకి ఎక్కించాడు. అప్పుడు మొదలయ్యాయి సమస్యలు. ఒత్తులు, కొమ్ములు స్పష్టంగా లేవు. కొన్నాళ్లు కష్టపడితే ఆ సమస్య పరిష్కారమైంది. తర్వాత పేజీని చదివి వినిపించగలిగితే మరింత బాగుంటుందనుకున్నాడు. దాంట్లోనూ సవాలక్ష సమస్యలు. పేజీ తిరగేసిన చాలా సేపటికి వాయిస్‌ వచ్చేది. పేజీలో విషయానికి భిన్నంగా వాయిస్‌ మాడ్యులేషన్లు, పిచ్‌లు మారిపోతుండేవి. సవరించడానికి మళ్లీ తంటాలు పడ్డాడు. విషయానికి అనుగుణంగా భావాలు పలికించేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ జత చేశాడు. ఎట్టకేలకు ఏడాది కాలంలో అనుకున్న విధంగా తెలుగులో ఈ బుక్‌ రూపొందించగలిగాడు. దీని సాయంతో ఈబుక్‌ రీడర్‌లలో మాత్రమే కాదు సెల్‌ఫోన్‌, నుక్‌లలో కూడా తెలుగు పుస్తకాల్ని చక్కగా చదువుకోవచ్చు. చిన్నచిన్న లోపాల్ని సవరించి మరో మూడునెలల్లో మిగతా భారతీయ భాషలన్నింటిలోనూ ఈబుక్‌ రూపొందిస్తానంటున్నాడు నవీన్‌.
* భారతీయ భాషల్లో ఇదే మొదటి ఈ బుక్‌.
* ఒక ఈబుక్‌ రీడర్‌లో 300 పుస్తకాల సమాచారం నిక్షిప్తం చేయొచ్చు.
* తెరపై అక్షరాల్ని చదువుకోవడమే కాదు 'ప్లే' బటన్‌ నొక్కితే చదివి వినిపించే సదుపాయం కూడా ఉంటుంది.
* ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే పుస్తకాలు మొత్తం చదివే వరకూ కరెంటు అవసరం లేదు.
ఆక్వా ఆదాయానికి వూతం!
ల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూశాడు... వారి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు... చదువుపై శ్రద్ధ పెట్టి ఎదిగి యువ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నాడు... అతడే విజయ్‌కుమార్‌ రెడ్డి. నిండా పాతికేళ్లు లేని ఈ యువకుడి పరిశోధన అందుబాటులోకి వస్తే ఆక్వా రైతుల ఆదాయం ఇనుమడిస్తుంది. పాలమూరు జిల్లా మిడ్జిల్‌ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన విజయ్‌కుమార్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. కుమారుడు ఉన్నత చదువులు చదివితే చూసి మురిసిపోవాలనుకున్నారు తల్లిదండ్రులు. వాళ్ల ఆశల్ని నిలబెడుతూ నెల్లూరు కళాశాలలో బీఎఫ్‌ఎస్‌సీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌), మహారాష్ట్రలోని రత్నగిరిలో పీజీ పూర్తిచేశాడు విజయ్‌.
విజయ్‌ ఆల్‌టెక్‌ అనే అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన 'యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు'ల పోటీలో రెండోస్థానం దక్కించుకున్నాడు. ఈ పోటీకి ప్రపంచవ్యాప్తంగా ఏడువేలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోటీదారులంతా ఏదైనా ఒక అంశంపై పరిశోధన చేసి, ఆ వివరాలన్నింటినీ నివేదిక రూపంలో పంపాల్సి ఉంటుంది. ఇలా అందిన పరిశోధన పత్రాల పరిశీలనలో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి అండర్‌ గ్రాడ్యుయేట్‌, మరోటి గ్యాడ్యుయేట్‌. గ్రాడ్యుయేట్‌ విభాగంలో ప్రాంతీయ స్థాయిలో విజయ్‌ రెండో స్థానం సాధించాడు.
విజయ్‌ ఇంతకు ముందే మత్స్యపరిశ్రమపై పరిశోధనలు చేశాడు. ఈసారి రొయ్యల్లో నల్లమచ్చ నివారణపై దృష్టి సారించాడు. రొయ్యల ఉత్పత్తిలో నల్లమచ్చ సోకి చాలా నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ఈ సమస్య తీరితే ఆక్వా రైతుల కష్టం ఫలించినట్టే. అలాగే రొయ్యలను ఎక్కువ కాలం నిల్వ ఉంచగలగడం కూడా చాలా అవసరం. విజయ్‌ ఈ విషయంపై కూడా పరిశోధన చేసి సరికొత్త నిల్వ పద్ధతులను ఆవిష్కరించాడు. ఈ విషయాలు ఎలా సాధ్యమవుతాయో విశ్లేషిస్తూ పరిశోధన పత్రం పంపాడు.
'ఫిషరీ సైన్స్‌కు విదేశాల్లో డిమాండు ఎక్కువ. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నా. కావాల్సినంత నీరు ఉంటే చాలు ఈ రంగంలో అభివృద్ధి సాధించొచ్చు' అంటున్నాడు విజయ్‌. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం పరిశోధన కేంద్రంలో రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆన్‌ ఫిషరీస్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)