అగ్ని కణిక.. ఆంగ్‌సాన్‌



అగ్ని కణిక.. ఆంగ్‌సాన్‌
ఆంగ్‌సాన్‌ సూకీ సిగలోని తెల్లపువ్వులు శాంతి కపోతాన్ని తలపిస్తాయి, కళ్లలోని ఎర్రజీరలు ఉద్యమ అగ్నికణికల్లా అనిపిస్తాయి. ఆ అరవై అయిదేళ్ల బక్కపల్చ మహిళను తిరుగులేని మెజారిటీతో గెలిపించడం ద్వారా మయన్మార్‌ పౌరులు - తుపాకుల పాలనపై నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు జేజేలు పలికారు.
యన్మార్‌ ప్రజలు గెలుపులోని ఆనందాన్ని తొలిసారిగా అనుభవించారు. వీధుల్లోకి వచ్చి నాట్యం చేశారు. పిడికిళ్లు బిగించి నినాదాలిచ్చారు. నిన్నటిదాకా నిర్లిప్తత ఆవహించిన ఆ మొహాల్లో సరికొత్త వెలుగులు. ఆ ఆశావాదానికి బలమైన కారణమే ఉంది - ఆంగ్‌సాన్‌సూకీ నాయకత్వం వహిస్తున్న నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించింది.ఆరు దశాబ్దాల క్రితం, స్వాతంత్య్ర యోధుడు ఆంగ్‌సాన్‌ మీద కూడా ప్రజలు ఇలాంటి ఆశలే పెట్టుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఆ మహానేతను పొట్టనపెట్టుకున్నారు. ఆ దుర్ఘటన మయన్మార్‌ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఆ తండ్రి వారసురాలిగా 'నవ మయన్మార్‌' నిర్మాణ బాధ్యతల్ని సూకీ స్వీకరించింది. ఆంగ్‌సాన్‌ హత్యకు గురయ్యేనాటికి సూకీ వయసు రెండేళ్లు. లీలగా ఒకటిరెండు సంఘటనలు తప్పించి...తలుచుకుని మురిసిపోడానికి తండ్రి తాలూకు ఒక్క జ్ఞాపకమూ దక్కలేదామెకు. ఆయన వ్యక్తిత్వం గురించీ ఆలోచనల గురించీ తల్లి డాఖిన్‌ మాటల ద్వారా తెలుసుకున్నదే ఎక్కువ. వాటన్నిటినీ గుదిగుచ్చి తన మనసులో తండ్రికి ఒక రూపాన్ని ఇచ్చుకుంది. 'నాకు తెలిసిన మా నాన్న నిలువెత్తు మానవతావాది. మార్క్సిజం, సోషలిజం, బుద్ధిజం - కలగలిసిన వ్యక్తిత్వం ఆయనది...' తండ్రి గురించి మాట్లాడటం మొదలుపెడితే అదో ప్రవాహం!
బంధాలపై బందూకులు
రాజకీయ విశ్లేషకులు ఆంగ్‌సాన్‌ సూకీని 'నల్లసూరీడు' నెల్సన్‌ మండేలాతో పోలుస్తారు. ఎందుకంటే, ఆమె జీవితం కూడా చాలాభాగం నిర్బంధాలతోనే గడిచిపోయింది. తండ్రి మరణం తర్వాత, సూకీ కొంతకాలం బర్మాలోనే చదువుకుంది. డాఖిన్‌ను భారత్‌లో బర్మా రాయబారిగా నియమించడంతో తల్లితోపాటు ఢిల్లీకి వచ్చేసింది. గ్రాడ్యుయేషన్‌ దాకా చదువులన్నీ ఇక్కడే. సూకీ మీద అమితంగా ప్రభావం చూపిన అంశాలు రెండు...నాన్న దేశభక్తి, అమ్మ అంకితభావం. నిబద్ధతలో డాఖిన్‌ తర్వాతే ఎవరైనా. సూకీకి ఓ తమ్ముడు ఉండేవాడు. ఓసారి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆవరణలోని కొలనులో పడిపోయాడు. శవం తేలేదాకా ఎవరికీ విషయం తెలియలేదు. ఆ సమయానికి డాఖిన్‌ ఆఫీసులో ఏదో ముఖ్యమైన సమావేశంలో ఉన్నారు. ఇంటి నుంచి ఫోన్‌ వచ్చింది. 'పోయిన బిడ్డ ప్రాణాన్ని ఎటూ వెనక్కి తీసుకురాలేను. కనీసం నా బాధ్యతల్ని అయినా సమర్థంగా నిర్వహిస్తాను' అని బదులిచ్చారామె. పుట్టెడు దుఃఖంలోనూ విధి నిర్వహణకు అంత ప్రాధాన్యం! ఆ అంకితభావం సూకీలోనూ కనిపిస్తుంది. బ్రిటన్‌లో క్యాన్సర్‌తో పోరాడుతున్న భర్తను కలుసుకోడానికి శాశ్వతంగా దేశం వదలి వెళ్లడమా, చివరి చూపులకూ నోచుకోకుండా మయన్మార్‌లోనే ఉండిపోవడమా...అన్న సంశయం వచ్చినప్పుడు సూకీ మాతృభూమి వైపే మొగ్గు చూపింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సహాధ్యాయి మైఖేల్‌ను ఆమె ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఇద్దరు పిల్లలు - అలెగ్జాండర్‌, కిమ్‌. పదమూడేళ్లు కుటుంబమే ప్రపంచంగా బతికింది సూకీ. అలా అని, తండ్రి ఆశయాల్ని మరచిపోయిందని కాదు. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఒక విద్యార్థిలా ఉద్యమాల చరిత్రను అధ్యయనం చేసింది. తండ్రి జీవితం మీద పరిశోధనలు జరిపింది. 'భవిష్యత్‌లో నేను ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాల్సి రావచ్చు. మీ సహకారం కావాలి' అని పెళ్లికిముందే భర్తకు చెప్పింది. సకుటుంబంగా బ్రిటన్‌లో ఉన్నప్పుడు, తల్లి ఆరోగ్యం విషమించిందన్న సమాచారం అందింది. హుటాహుటిన బయల్దేరి మయన్మార్‌ వెళ్లింది. రంగూన్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అచేతనంగా మంచం మీద పడున్న మాతృమూర్తిని చూడగానే గుండె చెరువైంది. పక్కనే...వందలాది క్షతగాత్రులు, సైనికుల తూటాలకు గాయపడిన విద్యార్థులు. అందర్నీ పలకరించింది. పరామర్శించింది. ఎంత అన్యాయం! ఎంత నిరంకుశత్వం! సూకీ రక్తం సలసలా మరిగిపోయింది. నియంత నెవిన్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న రోజులవి. అప్పటికే ఎందరో విద్యార్థులు బలైపోయారు. ఆతర్వాత, అతనికంటే ఘనుడు సామాంగ్‌ గద్దెనెక్కాడు. ఆ కర్కోటకుడి పాలనలోనే..విద్యార్థి ఉద్యమం ప్రజా ఉద్యమంగా మలుపు తిరిగింది. మూడువేలమంది నేలకొరిగారు. సూకీ కార్యక్షేత్రంలోకి దూకింది. రంగూన్‌లో బహిరంగ వేదిక మీద నిలబడి లక్షలమందికి లక్ష్యోపదేశం చేసింది. ఆమె రాకతో, దశాదిశాలేని నిరసన కార్యక్రమాలకు ఓ స్పష్టత వచ్చింది. మానవ హక్కులు, స్వేచ్ఛాయుత ఎన్నికలు..తదితర ప్రజాస్వామిక భావజాలాలతో సూకీ సారథ్యంలో మలిదశ పోరాటం మొదలైంది. నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి దేశమంతా పర్యటించింది. జనం ఆమెలో దివంగత నేత ఆంగ్‌సాన్‌ను చూసుకున్నారు. ఎక్కడికెళ్లినా ప్రజాప్రవాహమే. సైనిక నియంతల ప్రభుత్వం(జుంటా) కన్నుకుట్టింది. కడుపు మండింది. తొలిసారిగా 1989లో ఆంగ్‌సాన్‌ సూకీని నిర్బంధించారు. అప్పటి నుంచీ ప్రజల్లో ఆమెకు మద్దతు పెరుగుతున్నట్టు సందేహం కలిగిన ప్రతిసారీ నాలుగు గోడలకే పరిమితం చేస్తున్నారు. గత ఇరవైమూడేళ్లలో దాదాపు పదిహేనేళ్లు ఆమె నిర్బంధంలోనే గడిపింది. నిర్బంధం నుంచి స్వేచ్ఛ, స్వేచ్ఛ తర్వాత నిర్బంధం..ప్రతిసారీ సూకీ బలపడుతూనే ఉంది. ప్రజాభీష్టానికి తలవంచి 1990లో ఎన్నికలు నిర్వహించింది జుంటా. ప్రజలు సూకీకే పట్టం కట్టారు. నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ అత్యధిక స్థానాలు సాధించింది. న్యాయంగా అయితే, సూకీ అధికార పీఠం మీద కూర్చోవాలి. ఆ తీర్పును సైన్యం గౌరవించలేదు. ఏకపక్షంగా ఎన్నికల్ని రద్దు చేసింది. మళ్లీ నిర్బంధం! కాలు కదిపితే చాలు, గూఢచారుల అనుమానపు చూపులు. ఇంట్లోని టెలిఫోన్‌ తీగల్ని కూడా కోసేశారు. ఆమెకూ ప్రపంచానికీ మధ్య వారధిగా ఓ చిన్న రేడియో. అరలో పుస్తకాలు. చాలావరకూ బౌద్ధ సాహిత్యమే. అందులో రెండు ఆత్మకథలూ ఉన్నాయి - ఒకటి మహాత్ముడిది, మరొకటి నెల్సన్‌ మండేలాది.
1999లో మరో నిర్బంధం. ఆ సమయంలోనే, మైఖేల్‌కు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముదిరినట్టు సమాచారం అందింది. ఏం చేయాలో తోచని పరిస్థితి. సూకీ తన భర్తనూ పిల్లల్నీ చూసి అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన్నే మయన్మార్‌కు పిలిపిద్దామంటే, పాలకులు అడ్డుచెప్పారు. అనుమతి కోరుతూ ఒకదానివెనుక ఒకటి... దాదాపు 30 విన్నపాలు పంపాడు మైఖేల్‌. పోప్‌ జాన్‌పాల్‌, దలైలామా వంటి పెద్దలు జోక్యం చేసుకున్నారు. అయినా ఫలితం కనిపించలేదు. తనే భర్త దగ్గరికి వెళ్లాలనుకుంది. అదే జరిగితే, తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయి. దాని వల్ల ఉద్యమానికి నష్టం. ఎట్టిపరిస్థితుల్లోనూ దేశం వదలకూడదని నిర్ణయించుకుంది.మైఖేల్‌కు ఇష్టమైన డ్రస్సులో, మరింత ఇష్టమైన గులాబీ పువ్వు తల్లో పెట్టుకుని ... వీడియో రికార్డు ద్వారా తన సందేశాన్ని పంపింది. 'జన్మజన్మలకూ సరిపడా ప్రేమనిచ్చావు నేస్తం! ఆ ప్రేమనే నేనిప్పుడు, తోటి ప్రజలకు పంచుతున్నాను. రావాలని ఉన్నా...రాలేకపోతున్నా. వీడ్కోలు మైఖేల్‌...తుది వీడ్కోలు!' మరణానికి రెండురోజుల మందు అది మైఖేల్‌కు చేరింది.
సంకెళ్లతో సహవాసం
ప్రపంచానికీ మయన్మార్‌కూ మధ్య ఇనుపతెర. డేగకళ్ల పహరా. జుంటా తుపాకుల గురి. బయట ఏం జరుగుతోందో, ప్రజాస్వామ్య పోరాటాలు ఎంత ఉద్ధృతంగా సాగుతున్నాయో బర్మా ప్రజలకు తెలియకూడదు. సైనికుల తుపాకుల చప్పుళ్లు సరిహద్దులకు ఆవల అస్సలు వినిపించకూడదు. ప్రసార మాధ్యమాలమీదా ఆంక్షలే. ఎంత నిర్బంధమంటే...పత్రికల్లో సూకీ పేరు కనబడటానికి కూడా వీల్లేదు. 'ఆ మహిళ' అనో, 'మైఖేల్‌ భార్య' అనో 'విదేశీయుడిని పెళ్లాడిన బర్మా వనిత' అనో పరోక్షంగా రాయాల్సిన దుస్థితి. అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా ఒకట్రెండు ఆంక్షల్ని సడలించినా, సమాచార విభాగం అధికారులు సరేనన్నాకే సూకీకి సంబంధించిన ఏవార్తా కథనం అయినా ప్రచురితం కావాలి. ఉద్యమ తీవ్రతను తగ్గించి చూపడానికి జుంటా చేయని ప్రయత్నాల్లేవు. నిర్బంధంలో ఉంచినంత కాలం...జనాదరణ పెరుగుతూనే ఉంటుందని వాళ్లకు అర్థమైపోయింది. అందుకే 2003, 2004 మధ్యకాలంలో ప్రజల్లోకి వెళ్లడానికి అనుమతించారు. 'సూకీ పనైపోయింది. ఆమె మీద నమ్మకం తగ్గింది. సమావేశాలకు పెద్దగా జనం రావడం లేదు' అంటూ విషప్రచారం చేశారు. పాశ్చాత్య భావజాలాల ప్రతినిధి అని చాటింపు వేయించారు. హత్యాయత్నాలకైతే లెక్కేలేదు. ఓసారి రెండువందలమంది కిరాయి హంతకులు మారణాయుధాలతో దాడి చేశారు. అయినా సూకీ భయపడలేదు. బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకోడానికి కూడా ఆసక్తి చూపలేదు. 'ఆ దుస్థితి రాకూడదనే కోరుకుంటాను. నాకు ప్రాణాల మీద అంత తీపిలేదు' అని సున్నితంగా తిరస్కరించింది.
రెండు దశాబ్దాల క్రితం ఆంగ్‌సాన్‌ సూకీకి నోబెల్‌ పురస్కారం రావడంతో..మయన్మార్‌ సమస్య అంతర్జాతీయమైంది. సైనిక పాలకులపై ఒత్తిడి పెరిగింది. అమెరికా, జపాన్‌ వంటి దేశాలు ఆంక్షలు విధించాయి. ఐరాస రంగంలో దిగింది. యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధులు తమవంతు ప్రయత్నం చేశారు. అయినా జుంటా వంకర బుద్ధిపోలేదు. సమస్యలు సృష్టించడం మానలేదు. అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకోడానికి, సూకీపార్టీని అనర్హతకు గురిచేసి తూతూమంత్రం ఎన్నికలు జరిపారు. రబ్బరు స్టాంపులాంటి యూనియన్‌ సాలిడారిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆతర్వాతే సూకీని విడుదల చేశారు. ఆ స్వేచ్ఛను ఆమె సద్వినియోగం చేసుకుంది, దేశమంతా తిరిగింది. పార్టీని పటిష్టం చేసింది. వివిధ వర్గాల నేతలతో చర్చలు జరిపింది. బహిరంగ సభలకైతే లెక్కేలేదు. ఎక్కడ ఏ నలుగురు గుమిగూడినా 'నేను మీ మనసులు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీ హృదయాల్లో స్థానాన్ని కోరుతున్నాను' అంటూ సూకీ స్వరం. ప్రజలు ఆమె నాయకత్వాన్ని బలపరిచారు. మయన్మార్‌ను ముందుకు తీసుకుపోగల శక్తి ఆమెకుందని బలంగా విశ్వసించారు. తాజా ఎన్నికలే అందుకు నిదర్శనం.
నిజమే, ఈ ఉపఎన్నికల వల్ల వచ్చే పెనుమార్పులేం ఉండవు. మహా అయితే చట్టసభలో సూకీకి స్థానం లభిస్తుంది. మానవ హక్కుల గురించీ ప్రజాస్వామ్యం గురించీ ఆమె నిర్భయంగా నిలదీస్తుంది. కానీ, జుంటా రూపొందించుకున్న రాజ్యాంగం ప్రకారం...పార్లమెంటులోని 25 శాతం సీట్లు మిలిటరీకే కేటాయించారు. అధ్యక్షుడి నియామకంలోనూ సైన్యం పెత్తనమే. వ్యవస్థలో సమూలమైన ప్రక్షాళనతోనే మయన్మార్‌ ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. తాజా విజయం ఆ మార్పునకు సంకేతం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇదే స్థాయిలో మద్దతు ప్రకటిస్తే, సూకీ సంపూర్ణ విజయాన్ని సాధిస్తుంది. మయన్మార్‌ పరిపూర్ణ ప్రజాస్వామ్య దేశం అవుతుంది.
రేపటి సవాళ్లు...
మయన్మార్‌ (అలనాటి బర్మా) జనాభా ఆరుకోట్లు. మూడొంతుల మంది...దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. పారిశ్రామిక అభివృద్ధి లేనేలేదు. ఈ పేదరికం, నిరుద్యోగం... సైనిక నియంతల స్వార్థానికి ఫలితాలే. ఒకప్పటి బర్మా బంగారం లాంటి దేశం. పంటలతో కళకళలాడేది. బియ్యం ఎగుమతిలో అగ్రస్థానంలో ఉండేది. ఆంగ్‌సాన్‌ వంటి నేతల పోరాట ఫలితంగా 1948లో బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రాన్ని సాధించుకుంది. సైనిక నియంతృత్వంలో ఆ వైభవం మసకబారిపోయింది. దేశం గురించీ ప్రజాసంక్షేమం గురించీ పట్టించుకునే నాథుడే లేడు. బడ్జెట్‌లో నలభైశాతం సైన్యానికే సరిపోతుంది. చదువులకూ సంక్షేమానికీ ఒకటీ ఒకటిన్నరశాతాన్ని మించి కేటాయించలేని దుస్థితి. శాంతి భద్రతల పరిస్థితీ అంతంత మాత్రమే. చైనా లాంటి దేశాలు అక్కడున్న సహజవనరుల మీద కన్నేసి ఉంచాయి. ఈ పరిస్థితుల్లో ఆ దేశానికి బలమైన నాయకత్వం కావాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)