Eenadu Eetaram (14/04/2012)


వినండి వినండి ఉల్లాసంగా.. ఉత్సాహంగా... విను.. వినిపించు.. లైఫ్‌ అందించు... ఇది చాలా హాట్‌ గురూ... ఈ ట్యాగ్‌లైన్లు చూడగానే ఠక్కున గుర్తొచ్చేవి ఎఫ్‌.ఎం. రేడియోలే...! ఇప్పుడు అదే వరుసలో మస్త్‌ మజా.. మస్త్‌ మ్యూజిక్‌ అనే సరికొత్త నినాదం చేరింది... తెలుగు యూత్‌ని ఆకట్టుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తోంది. ఇదేం ఎఫ్‌.ఎం. రేడియో కాదు.. తొలి తెలుగు గ్లోబల్‌ ఆన్‌లైన్‌ రేడియో... పేరు రేడియో జోష్‌... ఈ నయా ట్రెండ్‌కు తెర తీసిందెవరో కాదు...పాలకొల్లు కుర్రాడు అగ్నిపుత్రవర్మ.బిగ్‌ ఎఫ్‌.ఎం., రేడియో మిర్చీ.. పేర్లేవైనా వాటి పరిధి కొంతవరకే.నగరాలు, పట్టణాల్లోనే వాటి ప్రసారాలు. రేడియో జోష్‌ వీటికి భిన్నం. ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంటే చాలు. ప్రపంచంలో తెలుగువాడు ఏ మూలనున్నా వాళ్ల హృదయాల్ని తట్టిలేపుతుంది. కోరిన పాటల్ని క్షణాల్లో వినిపిస్తుంది. ఆర్జేల సరదా సరదా ముచ్చట్లు.. ఆడియో.. వీడియో కాలింగ్‌లు.. చాట్‌ బాక్స్‌ అదనపు హంగులు.
ఏమిటీ ప్రత్యేకతలు?
ఆన్‌లైన్‌ రేడియో ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటున్న ట్రెండ్‌. తెలుగులో మాత్రం రేడియో జోష్‌తోనే ఈ ధోరణి మొదలైంది. రేడియో జోష్‌కి హైదరాబాద్‌తో పాటు ఇంగ్లండ్‌, అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ కార్యాలయాలున్నాయి. ఈ వెబ్‌సైట్‌ని ఇప్పటికి దాదాపు నూట యాభై దేశాల్లోని జనం వీక్షించారు.www.radiojosh.com వెబ్‌సైట్‌లో ఒక్కసారి లాగిన్‌ అయితే చాలు ఏ దేశంలో ఉన్నా ఉచితంగా ఆడియో, వీడియో కాల్‌తో ఆర్జేలతో మాట్లాడొచ్చు. దీంతోపాటు నేరుగా ల్యాండ్‌లైన్‌కే ఫోన్‌ చేసి నచ్చిన పాట అడగొచ్చు. ఐఫోన్‌, అండ్రాయిడ్‌ ఆప్స్‌తో రేడియో వింటూ చాటింగ్‌ చేసుకునే అవకాశముంది. దీనికోసం ప్రత్యేకంగా 'షౌట్‌ బాక్స్‌' అనే ఆప్షన్‌ ఉంటుంది. ఇరవై నాలుగు గంటల రేడియో జోష్‌ కార్యక్రమాలు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లోనూ కొనసాగుతున్నాయి. ఈ ఆన్‌లైన్‌ రేడియో మొదలైన ఆరు నెలల్లోనే వెబ్‌సైట్‌ని నాలుగు లక్షలమంది క్లిక్‌మనిపించారు. ఇందులో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, గృహిణలే.
భవిష్యత్తు ఆన్‌లైన్‌దే
ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి గనకే భవిష్యత్తంతా 'ఆన్‌లైన్‌ రేడియోలదే' అంటున్నాడు రేడియో జోష్‌ వ్యవస్థాపకుడు అగ్నిపుత్రవర్మ ఉరఫ్‌ ఉద్ధవోలు సాయికుమార్‌. వర్మ ఈ అంతర్జాల రేడియో కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. రెండునెలలు కష్టపడి తనే సొంతంగా కొత్తవాళ్లకి శిక్షణనిచ్చి ఆర్జేలుగా తయారు చేశాడు. పాటల సేకరణ.. సెలెబ్రెటీల అపాయింట్‌మెంట్‌.. మార్కెటింగ్‌.. అన్నింటికీ వన్‌మ్యాన్‌ ఆర్మీలా కష్టపడ్డాడు. 'ఇప్పుడు రేడియో జోష్‌కి వస్తున్న స్పందనతో పడ్డ కష్టమంతా తేలిగ్గా మర్చిపోతున్నా' అంటున్నాడు. వర్మ జోష్‌ కేవలం రేడియో జోష్‌తోనే ఆగిపోలేదు. సినిమాలకి వెబ్‌సైట్లు తయారు చేసి ఇస్తున్నాడు. బిజినెస్‌మేన్‌ సినిమాతో మొదలుపెట్టి రాజన్న, పంజా, దమ్ము, ఈగ, దరువు సినిమాల అఫీషియల్‌ వెబ్‌సైట్లు రూపొందించాడు. మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తూ తన ఆన్‌లైన్‌ రేడియో ద్వారా సినిమాలకి విదేశాల్లో ప్రచారం కల్పిస్తున్నాడు. ఇంతేనా? రేడియో జోష్‌ ప్రవాసాంధ్రులను కలిపే సరికొత్త వేదిక. అమెరికా, ఇంగ్లండ్‌, దుబాయ్‌, ఆస్ట్రేలియాల్లోని తెలుగు సంఘాలు ఏ కార్యక్రమం తలపెట్టినా వర్మ రేడియో జోష్‌ ప్రచార వేదికగా ఉపయోగపడుతోంది.
ఆన్‌లైన్‌ రేడియో ప్రారంభించాలంటే..
పెద్దగా పెట్టుబడి, ప్రభుత్వ అనుమతులేం అఖ్కర్లేదు
వెబ్‌సైట్‌ కోసం డొమైన్‌ కొనుగోలు
ఎక్కువ పాటల డేటాబేస్‌ సేకరించాలి
వాక్చాతుర్యం, వర్తమాన విషయాలపై పట్టున్న ఆర్జేల ఎంపిక
మార్కెటింగ్‌ వ్యూహాలు తెలిసుండాలి
శ్రోతల నాడీ పట్టుకునే ప్రోగ్రామ్స్‌ రూపకల్పన
పబ్లిక్‌ రిలేషన్స్‌ మెయింటెయిన్‌ చేయగలిగే నేర్పు
ఇంటర్నెట్‌ సదుపాయమున్న కంప్యూటర్‌, ఓ టేబుల్‌తో ఆఫీసు సిద్ధం.
- విన్నకోట వెంకటరమణ, న్యూస్‌టుడే: పాలకొల్లు
లక్షన్నర జీతం వదులుకున్నా!
చిన్నప్పట్నుంచి సంగీతమన్నా, పాటలు వినడమన్నా చాలా ఇష్టం. ఆకాశవాణి, వివిధ భారతి కార్యక్రమాల్ని క్రమం తప్పకుండా వినేవాణ్ని. మహానటి సావిత్రి రికార్డింగ్‌ ఇంటర్వ్యూ విన్నపుడు నేనూ ఇలాంటి గొప్పవాళ్ల ఇంటర్వ్యూలు చేసే స్థితికి రావాలనుకున్నా. ఎంబీఏ పూర్తవగానే కొన్నాళ్లు విశాఖపట్నంలో పని చేశాను. ఆపై దుబాయ్‌లో మంచి ఉద్యోగం దొరికింది. జీతం నెలకి లక్షన్నర పైనే. ఉద్యోగం చేస్తూనే ఓ తెలుగు ఎఫ్‌.ఎం. రేడియోలో పార్ట్‌టైమ్‌ ఆర్జేగా పని చేసేవాణ్ని. అప్పుడే నా మెదడులో ఓ ఆలోచన మెరిసింది. నేనే సొంతంగా ఓ ఆన్‌లైన్‌ రేడియో ఎందుకు ప్రారంభించకూడదని? వెంటనే ఎనిమిది వేల రూపాయలతో 'రేడియో జోష్‌' పేరుతో డొమైన్‌ కొనేశాను. నా ఆలోచనని ఫేస్‌బుక్‌ మిత్రులతో పంచుకున్నా. నా రెగ్యులర్‌ కాలర్‌ సరిత వెంటనే స్పందించారు. ఏ డాక్యుమెంట్‌ లేకుండానే పది లక్షలు నా చేతిలో పెట్టారు. లక్ష్యం చేరుకోవడానికి అంతా సిద్ధం. కానీ మంచి ఉద్యోగం వదులుకుంటానంటే అమ్మానాన్నలు ససేమిరా కుదరదన్నారు. ఎలాగోలా వాళ్లని ఒప్పించి గతేడాది అక్టోబర్‌ 26న రేడియో జోష్‌ ప్రారంభించా.
- అగ్నిపుత్రవర్మ, రేడియో జోష్‌ వ్యవస్థాపకుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)