Eenadu Eetaram (31/03/2012)


నచ్చిన డ్రెస్‌ వేసుకోకుండానే... అది ఒంటిపైకి చేరితే ఎలా ఉంటుంది?
- అలా చూపించే వినూత్న పరికరాన్ని సృష్టించిందొకరు!కంటి రోగుల మొత్తం చరిత్ర ఒకే క్లిక్‌తో ప్రత్యక్షమైతే?
- అలాంటి డిజిటల్‌ రికార్డింగ్‌ వ్యవస్థను రూపొందించింది మరొకరు!
ఇద్దరూ యువకులే! వారి నైపుణ్యాల్ని దేశం మెచ్చింది... వాళ్లు 250 మంది యువప్రతినిధులతో పోటీపడి... మేటి ఆవిష్కర్తలుగా మెరిశారు! ఏంటా ఆవిష్కరణలు? ఉపయోగాలేంటి? మాట కలిపింది 'ఈతరం'.
సాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అంటే తెలియని వారుండరు. ప్రపంచంలోనే నెంబర్‌వన్‌ యూనివర్సిటీ. 'టెక్నాలజీ రివ్యూ' పేరుతో దానికో అనుబంధ మ్యాగజైన్‌ ఉంది. ప్రతి ఏడాది సరికొత్త ఆవిష్కరణలు చేసిన యువతను గుర్తించి అవార్డులిస్తుంది ఈ పత్రిక. ఆవిష్కర్తలు ముప్ఫై అయిదేళ్లలోపు ఉండాలనేది నియమం. ఈసారి ఇరవై మందిని ఎంపిక చేశారు. అందులో ఇద్దరు తెలుగు తేజాలకు చోటు దక్కింది. ఒకరు... 'ట్రయలార్‌' సృష్టికర్తహేమంత్‌కుమార్‌ సత్యనారాయణ. మరొకరు... 'ఐ స్మార్ట్‌' విధానానికి తెర తీసిన కంటి వైద్యుడుఆంథోనీ విపిన్‌దాస్‌. వివిధ రంగాలకు చెందిన ఇరవై అయిదు మంది నిపుణులు వచ్చిన నామినేషన్లు, చేసిన ఆవిష్కరణలను క్షుణ్ణంగా పరిశీలించాకే విజేతల్ని ఎంపిక చేశారు. ఈసారి రెండువందల యాభై దరఖాస్తులొచ్చాయి.
మెరుగైన ముందు'చూపు'
విపిన్‌దాస్‌ పుట్టి పెరిగింది, డాక్టరు పట్టా అందుకుందీ హైదరాబాద్‌లోనే. ఏడోతరగతిలో ఉన్నప్పుడు, అతడి బావకి మెడికల్‌ కాలేజీలో సీటొచ్చింది. అప్పటి సంబరాలు చూశాక, ఎప్పటికైనా డాక్టరవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే మెడిసిన్‌ పూర్తి చేశాడు. ఆపై పీజీ కోసం వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీకెళ్లాడు. అక్కడ పడింది 'ఐ స్మార్ట్‌' ఆలోచనలకు బీజం.విపిన్‌ వరంగల్‌ 'రీజినల్‌ ఐ హాస్పిటల్‌'లో పనిచేస్తున్నపుడు అనేక సమస్యలతో గ్రామీణులు వచ్చేవాళ్లు. వాళ్లలో నిరక్షరాస్యులు, నిరుపేదలు, పిల్లలు, వృద్ధులే ఎక్కువ. తమ సమస్యని ఎవరూ సరిగా చెప్పలేకపోయేవాళ్లు. సమస్య ఎప్పుడు మొదలైంది? ఏ వైద్యుని దగ్గరికెళ్లారు? ఏమేం పరీక్షలు చేయించుకున్నారు? ఏ మందులు వాడారు? అనడిగితే మౌనమే సమాధానం. కారణం పాత సమాచారం వాళ్ల దగ్గర లేకపోవడమే. ఆ నేపథ్యంలో వైద్యం ఎక్కడినుంచి మొదలు పెట్టాలో విపిన్‌కి అర్థం కాకపోయేది. అప్పుడే దీనికో శాశ్వత పరిష్కారం కనుగొనాలనుకున్నాడు.
పై ఎల్వీ ప్రసాద్‌ నేత్ర చికిత్సాలయంలో చేరాక తన ఆలోచనని ఛైర్మన్‌తో పంచుకున్నాడు. ఇనిస్టిట్యూట్‌కు అనుబంధంగా ఉన్న 106 కేంద్రాలకు వచ్చే రోగుల సమాచారం మొత్తాన్ని అన్ని కేంద్రాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తానన్నాడు. క్లినికల్‌, సర్జరీ, అడ్మినిస్ట్రేషన్‌... సమాచారమంతా ఒకేచోట ఉంటే కలిగే లాభాలు వివరించాడు. ఛైర్మన్‌ నుంచి సానుకూల స్పందన వచ్చింది. అందరి సహకారంతో 2010లో తన ఆలోచనకు శ్రీకారం చుట్టాడు విపిన్‌. 'ఐ స్మార్ట్‌' పేరుతో ఎలక్ట్రాక్‌ మెడికల్‌ రికార్డు (ఇ.ఎం.ఆర్‌.)లు ప్రారంభించాడు. ఇంట్రానెట్‌, డేటామైనింగ్‌ పరిజ్ఞానం ఉపయోగిస్తూ కంప్యూటర్‌ ఇంజినీర్‌గా రూపాంతరం చెందాడు. ప్రతి పేషెంట్‌ వివరాల్ని కంప్యూటరీకరించాడు. మాదాపూర్‌ సెంటర్‌లో మొదలై తాడిగడప, పాల్వంచ, చెరుకుపల్లి, మణుగూరు, దమ్మపేట, తల్లాడ, చర్ల, ఇల్లెందులకు విస్తరించాడు. ఇరవై నెలల్లో డెబ్భై ఏడువేల మంది రోగుల సమస్త వివరాలు నమోదు చేశాడు. దీంతో మెరుగైన సేవలందడమే కాదు వివరాల ఆధారంగా కొత్త పరిశోధనలు చేయడానికి ఆస్కారముంటుంది. ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికే పరిమితమైన ఈ విధానాన్ని తర్వాత అన్ని నగరాలు, గ్రామాలకు విస్తరించడం తన లక్ష్యమంటున్నాడు విపిన్‌.
-నాగా వెంకటరెడ్డి, న్యూస్‌టుడే, విజయవాడ
వూహల ప్రతిబింబం!
తిరుపతి యువకుడు హేమంత్‌కుమార్‌ సత్యనారాయణ, అందరిలాంటి యువకుడే. ఐఐటీ మద్రాస్‌లో ఇంజినీరింగ్‌ పూర్తికాగానే అమెరికా ఫ్త్లెటెక్కాడు. అక్కడే పీజీ చదివాడు. 'ఆగ్మెంటెడ్‌ రియాలిటీ'పై పరిశోధనలు చేశాడు. అప్పుడే అతడికో ఆలోచన తట్టింది. 'ఇదే టెక్నాలజీ ఉపయోగించి సరికొత్త వ్యాపారాత్మక ఆవిష్కరణ ఎందుకు చేయకూడదు?' అని. మూడేళ్లు ఉద్యోగం చేశాక హైదరాబాద్‌ తిరిగొచ్చాడు. ఏడాదిన్నర కష్టపడి తన ఆలోచనల రూపమైన 'ట్రయలార్‌' రూపొందించాడు.ఏంటీ ట్రయలార్‌? ఇదొక ఆలోచనలకు నిజ రూపం ఇచ్చే ట్రయల్‌ రూం. దుస్తుల దుకాణాల్లో 'ట్రయల్‌ రూమ్స్‌' తెలుసుగా? నచ్చిన దుస్తులను ఒకొక్కటీ వేసుకుని చూసుకోవలసిందే. ఇక అమ్మాయిలకైతే చీరలు కట్టుకొని చూసే అవకాశం కూడా ఉండదు. ఈ సమస్యకు సమాధానమే హేమంత్‌ రూపొందించిన ట్రయలార్‌! ఇదొక యాభై అంగుళాల ఎల్‌సీడీ తెరతో కూడిన పరికరం. దానికెదురుగా ఎవరైనా నిలబడగానే వారికి సరిపోయే డ్రెస్‌లు తెరపై ప్రత్యక్షమవుతాయి. నచ్చినవాటిని ఎంపిక చేసుకుంటే, వాటిలో మనమెలా ఉంటామో ఎల్సీడీ తెర చూపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా డ్రెస్‌ను వేసుకోనక్కర్లేకుండానే నప్పిందో లేదో చూసుకోవచ్చు. కావాలంటే తెర నాలుగు భాగాలుగా విడిపోయి నాలుగు డ్రెస్‌లు వేసుకున్నట్టు చూపిస్తుంది. అమ్మాయిలైతే చీర కట్టుకుంటే ఎలా ఉంటారో అలాగే చూపిస్తుంది. ఎల్‌సీడీ తెరకు అమర్చిన కంప్యూటర్‌, కెమెరాతో ఇది సాధ్యం. 'ఈ ట్రయలార్‌తో వినియోగదారులకు సమయం కలిసొస్తుంది. దుకాణాదారులకు అనవసర ప్రయాస తప్పుతుంది' అంటాడు హేమంత్‌.
ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు హేమంత్‌. ముందు ఏ వ్యాపారికి చెప్పినా నమ్మలేదు. చివరికి ఓ షాపు యజమాని ప్రోత్సహించడంతో ముందుకు సాగాడు. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ రాసేటపుడు ఎన్నో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. పరిష్కరించాడు. మధ్య మధ్యలో ఆర్థిక కష్టాలు. ఐదునెలల కిందట మిత్రుడు కొసరాజు పవన్‌కుమార్‌ హేమంత్‌తో జత కలిశాక కష్టాలకు చుక్క పడి ప్రాజెక్టు పరుగులు పెట్టింది. చివరికి అన్నింటినీ దాటుకొని అనుకున్నది సాధించాడు హేమంత్‌..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)