Eenadu Ruchulu


పసందుగా పాన్‌కేక్‌లు
పిల్లలు ఇంట్లో ఉండే సమయమిది. టీవీ చూస్తున్నప్పుడు, ఆటల మధ్యలోనే కాదు.. అల్పాహారంగా.. సాయంత్రం వేళ చిరుతిండిగా విభిన్న రుచి ఉండాల్సిందే. అవి సరికొత్త రుచుల్లా ఉండాలి. చూడగానే నోరూరించాలి. ఇంట్లోనే చేసుకునే ఆధునిక పదార్థాలై ఉండాలి. ఈ రకంగా చూస్తే, పాన్‌కేక్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పెనంపై చిట్టి దోశల్లా వేసుకొని... పలు రుచులను మేళవించి వీటిని విభిన్నంగా తయారుచేసుకోవచ్చు.
చికెన్‌తో కమ్మగా..
కావల్సినవి:పాన్‌కేక్‌ కోసం: మైదా - యాభై అయిదు గ్రా, ఉప్పు - చిటికెడు, కోడిగుడ్డు - ఒకటి, పాలు - 140 ఎంఎల్‌, నూనె - సరిపడా, ఉల్లి కాడలు - మూడు (ఉల్లిపాయల్ని చక్రాల్లా తరగాలి), ఎండలో ఎండబెట్టిన టమాటాలు - నాలుగు, ఆవిరి మీద ఉడికించిన చికెన్‌ - ఎనభై గ్రా. 
చీజ్‌ సాస్‌ కోసం: వెన్న, మైదా - 25 గ్రా చొప్పున, పాలు - 225 ఎంఎల్‌, చీజ్‌ - వంద గ్రా, తాజా మిరియాలపొడి - రుచికి సరిపడా.తయారీ: మైదా, ఉప్పును ఓ పాత్రలోకి తీసుకోవాలి. మరో పాత్రలో కోడి గుడ్డు, పాలను తీసుకుని బాగా గిలక్కొట్టి మైదాలో కలపాలి. చీజ్‌ సాస్‌ కోసం వెన్నను కరిగించి మైదా పిండిలో చేర్చి బాగా గిలక్కొట్టాలి. దీన్ని పొయ్యిమీద పెట్టి నిమిషమయ్యాక పాలు చేర్చాలి. ఈ మిశ్రమం దగ్గరగా అయ్యేదాకా ఉంచి ఆ తరవాత చీజ్‌, మిరియాల పొడి కలిపి దింపేయాలి. ఇప్పుడు పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని సగం గరిటెడు వేసి.. పెనాన్ని అటూఇటూ తిప్పాలి. అర నిమిషమయ్యాక పాన్‌కేక్‌ను తిరగేయాలి. పాన్‌కేక్‌ సిద్ధమయ్యాక కొద్దిగా చికెన్‌ చక్రాల్లా తరిగిన ఉల్లిపాయముక్కలు, టమాటాముక్కలు పరిచి దానిపై చీజ్‌ వేయాలి. దీన్ని పళ్లెంలోకి తీసుకుంటే సరిపోతుంది. వేడివేడి చికెన్‌ సేవరీ పాన్‌కేక్‌లు నోరూరిస్తాయి.
చీజ్‌తో చవులూరించే..
కావల్సినవి: మైదా - ఎనభై గ్రా, పార్మెసన్‌ చీజ్‌ తురుము - 60 గ్రా, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, కీరతురుము - 130 గ్రా, కోడిగుడ్డు - ఒకటి (సొనను బాగా గిలక్కొట్టాలి), ఉల్లిపాయ తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, మయొనైజ్‌, కరిగించిన వెన్న - రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, క్రీం - ఎనభై గ్రా.తయారీ: వెడల్పాటి పాత్రలో మైదా, చీజ్‌ తురుము, సరిపడా ఉప్పు, మిరియాల పొడి తీసుకోవాలి. మరో పాత్రలో కీర తురుము, గుడ్డుసొన, ఉల్లిపాయముక్కలు, మయొనైజ్‌ తీసుకుని బాగా కలిపి మొదట సిద్ధం చేసుకొన్న మిశ్రమంలో కలపాలి. వీటన్నింటినీ మరోసారి బాగా కలిపితే పిండి తయారవుతుంది. ఇప్పుడు వెడల్పాటి పెనాన్ని ఎక్కువ మంటపై వేడిచేసి కొద్దిగా వెన్న రాయాలి. మైదా మిశ్రమాన్ని తీసుకుని పెనంపై వేసి గరిటెతో నొక్కినట్లు చేయాలి. రెండు నిమిషాలుంచి తిరగేయాలి. కావాలనుకుంటే మరికాస్త వెన్న వేసుకోవచ్చు. కాలాక టిష్యూపై వేసి క్రీంతో కలిపి వడ్డిస్తే వేడివేడి చీజ్‌ పాన్‌కేక్‌ సిద్ధం. పార్మెసన్‌ చీజ్‌, మయొనైజ్‌ సూపర్‌ మార్కెట్లలో దొరుకుతాయి.
హనీ అండ్‌ ఫిగ్స్‌ మజా
కావల్సినవి: కాటేజ్‌ చీజ్‌ - 250 గ్రా, పాలు - వంద ఎంఎల్‌, మైదా - డైబ్భై అయిదు గ్రా, బేకింగ్‌పొడి - అరచెంచా, కోడిగుడ్లు - రెండు, కాస్టర్‌ షుగర్‌ - టేబుల్‌స్పూను, వెనిల్లా ఎసెన్సు - నాలుగైదు చుక్కలు, వెన్న - కొద్దిగా, ఫిగ్స్‌ - నాలుగు (ముక్కల్లా తరగాలి), తేనె - కొద్దిగా.తయారీ: ముందు చీజ్‌ను మిక్సీలో వేసి తిప్పాలి. ఆ తరవాత వెన్న, గుడ్డు సొన తప్ప మిగిలిన పదార్థాలన్నీ కూడా మిక్సీలో వేయాలి. పిండి తయారయ్యాక ఓ గిన్నెలోకి మార్చుకోవాలి. ఆ తరవాత గుడ్డులోని తెల్లసొనను తీసుకుని బాగా గిలక్కొట్టి పిండిలో కలపాలి. పెనం వేడి చేసి కొద్దిగా వెన్న రాసి పిండిని పరిచి కాల్చాలి. రెండువైపులా తిప్పి కాల్చితే నోరూరించే హనీ పాన్‌కేక్‌లు సిద్ధం.
బియ్యప్పిండితో భలేగా!
కావల్సినవి:బియ్యప్పిండి - 180 గ్రా, గ్లూటెన్‌ ఫ్రీ గోధుమపిండి - మూడు టేబుల్‌స్పూన్లు, బంగాళాదుంప గంజి - 70 గ్రా, మజ్జిగ - ఒకటిన్నర కప్పు, పంచదార - చెంచా, బేకింగ్‌సోడా - ఒకటిన్నర చెంచా, ఉప్పు - అరచెంచా, కోడిగుడ్లు - రెండు, సన్‌ఫ్లవర్‌ నూనె - మూడుటేబుల్‌స్పూన్లు, నీళ్లు - రెండు కప్పులు.తయారీ: ఓ పాత్రలో బియ్యప్పిండి, గోధమపిండి, బంగాళాదుంప పొట్టు తీసి ఉడికించగా వచ్చే గంజి, మజ్జిగ, బేకింగ్‌సోడా, పంచదార, ఉప్పు కలపాలి. మరో పాత్రలో కోడిగుడ్ల సొన, నీళ్లు నూనె తీసుకుని గిలక్కొట్టాలి. ఆ తరవాత దీన్ని బియ్యప్పిండి విశ్రమంలో చేర్చాలి., పెనాన్ని వేడిచేసి పావుకప్పు మిశ్రమాన్ని వేసి కొద్దిగా పరిచినట్లు చేయాలి. రెండోవైపు కూడా తిప్పి ఎర్రగా వేగాక తీసేయాలి. ఇలా మిగతా పిండిని కూడా చేసుకోవాలి. ఇది మరింత రుచికరంగా ఉండాలంటే.. పైన పంచదార పాకం లేదా తేనె వేస్తే సరిపోతుంది.
చాక్‌ చిప్‌ పీనట్‌ బటర్‌తో..
కావల్సినవి: మైదా - 140 గ్రా, వెన్న తీయని పాలు - 200 ఎంఎల్‌, కోడిగుడ్లు - రెండు, ఉప్పులేని వెన్న - 25 గ్రా (కరిగించాలి), ఉప్పు - చిటికెడు. ఫిల్లింగ్‌ కోసం: పీనట్‌ బటర్‌ - 6 టేబుల్‌ స్పూన్లు, ఐసింగ్‌ షుగర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, పాలు - రెండు టేబుల్‌స్పూన్లు, చాక్లెట్‌ చిప్స్‌ - యాభై గ్రా, చక్రాల్లా తరిగిన అరటిపండు ముక్కలు - నాలుగైదు.తయారీ: మైదాలో ఉప్పు వేసి బాగా కలపాలి. మరో పాత్రలో పాలు, పావుకప్పు నీళ్లు కలిపి పెట్టుకోవాలి. కోడిగుడ్ల సొన తీసుకుని నెమ్మదిగా గిలక్కొట్టాలి. అందులో పాలు చేర్చి.. కలిశాక మైదా వేయాలి. పిండి తయారయ్యాక అరగంట నాననివ్వాలి. ఆ తరవాత కరిగించిన వెన్న కలపాలి. ఇప్పుడు పెనం వేడిచేసి కరిగించిన వెన్నను కొద్దిగా రాసి రెండు టేబుల్‌స్పూన్ల పిండి వేసి దోశలా రాయాలి. ఎర్రగా వేగాక తీయాలి. మిగతా పిండినీ పాన్‌కేక్‌లు వేసుకోవాలి. చిరవగా ఫిల్లింగ్‌ కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నింటినీ కలిపి పాన్‌కేక్‌లపై పరిచి అరటిపండు ముక్కను ఉంచి వడ్డించాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)