ఒడుదొడుకులు దాటి.. ఒలింపిక్స్‌కి..


ఒలింపిక్స్‌ అంటే ఆటలు, పతకాలు మాత్రమే కాదు.ఆటుపోట్లను గెలుపుమెట్లుగా మార్చుకొన్న విజేతల స్ఫూర్తిపథం.మనదేశం తరఫున ఒలింపిక్స్‌ బరిలో నిలిచిన వారినే గమనిస్తే..ఆకలితో పోరాడి.. ఆంక్షలను ఎదిరించి.. అవరోధాలను అధిగమించి.. వివాహమయ్యాక విజేతగా నిలిచి..అమ్మయ్యాకా ప్రపంచ ఛాంపియన్‌గా ఎగసిన ఆణిముత్యాలున్నారు.ఒక్కొక్కరి క్రీడా గమనం.. ఓ కెరీర్‌ పాఠం.
కుస్తీ బరిలో నంబర్‌వన్‌
ది పన్నెండేళ్ల క్రితం మాట. సిడ్నీ ఒలింపిక్స్‌ జరుగుతున్నాయి. మన కరణం మల్లీశ్వరి పతకం గెలిచిన సందర్భం. అప్పుడు మనలాగే, హర్యానాలోని గీతా పొగట్‌ కుటుంబం ఊర్లోని కమ్యూనిటీ టీవీ సెట్‌కి కళ్లప్పగించేశారు. చాలా ఉత్కంఠ మధ్య మల్లీశ్వరి విజేత కాగానే ఎగిరి గంతేసింది గీత. ఆమె తండ్రి కూడా స్ఫూర్తి పొందాడు. తన ఐదుగురు పిల్లలకు కుస్తీలో శిక్షణనివ్వడం ఆరంభించాడు. ఆయన స్వయంగా మల్లయోధుడు మరి. అలా తండ్రి శిక్షణలో రాటుదేలిన గీత మనదేశం తరఫున కుస్తీలో మొదటిసారి పాల్గొంటున్న క్రీడాకారిణి. లండన్‌లో ప్రత్యర్థులని మట్టి కరిపిస్తానంటూ ప్రతిజ్ఞ చేస్తోంది. అయితే ఈ స్థాయికి ఆమె అంత సులువుగా చేరుకోలేదు. నాన్నది కఠిన క్రమశిక్షణ. సాధన ఎంత కఠినంగా ఉంటే విజయం అంత సులువవుతుంది అనేవారు. నిత్యం పొలంలో మట్టి తవ్వించే వారు. దాన్ని వంటికి పట్టించుకొని మల్ల విద్యను అభ్యసించమనే వారు' అని తెలిపింది గీత. హర్యానాలో అమ్మాయిలపై అరాచకాలు ఎక్కువ. ప్రేమిస్తే తప్పు, అసలు ఆడపిల్లల మనుగడే తప్పు. పరువు హత్యలు ఎక్కువ. ఇటువంటి అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ఈ విద్య అవసరమేనన్నది తన నమ్మకం. 'ఏం చెప్పమంటారు.. బయటివారు సరే, తోటి మల్లయోధులే నీకు ఈ విద్య అవసరమా అని హేళన చేసేవారు. మొదట్లో ఆడపిల్లతో పోటీకి రాం అనేవారు. కానీ నేను పిడిగుద్దుల వర్షం కురిపిస్తుంటే తట్టుకోలేక మధ్యలో పారిపోయేవారు' అన్న గీత కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి పతకం సాధించి, ఒలింపిక్స్‌ వేదికకు బాటలు పరుచుకొంది. ఇప్పుడామె గ్రామంలో గీత అంటే చెప్పలేనంత పేరు. ఒలింపిక్స్‌ ఆశాకిరణం.
ఛాంపియన్‌గా బరిలోకి...
మ్మానాన్నలది పోడు వ్యవసాయం. ఆదాయం గోరంత. నలుగురి పిల్లల కడుపు నింపడం వల్లయ్యేది కాదు. ప్రతినిత్యం పస్తుల సావాసం. చదువుకునే వీలు లేదు. ఈ పరిస్థితుల్లో ఆకలికి తాళలేక విలవిల్లాడిన ఓ అమ్మాయి తన గురించి ఆలోచించలేదు. నేనింటికి పెద్దమ్మాయిని! ఇంట్లోంచి బయటపడి, స్పోర్ట్స్‌ హాస్టల్లో చేరితే మిగిలిన వాళ్లు పట్టుమని నాలుగు మెతుకులు తింటారు కదా అనుకొంది. బాధ్యతగా ఆలోచించి శాయ్‌ కోచ్‌ని కలిసి శిష్యురాలిగా చేర్చుకొని బాక్సింగ్‌ నేర్పమని బతిమిలాడింది. ఆయన వెటకారంగా నవ్వాడు. ఈమె వదల్లేదు. చివరకు ఒప్పుకొన్నాడు. ఆపై పేదరికం మీద కసితో ఆమె విసిరిన పంచ్‌లు ఎంత బలంగా పడ్డాయంటే.. ఏకంగా ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అమ్మయ్యాకా, ఎదురులేదనిపించింది. ఇదీ మణిపూర్‌ కోహినూర్‌ మేరీకోం అకుంఠిత దీక్షాశక్తి! 'బాక్సింగ్‌ బరిలో తగిలే పంచ్‌లు పేదరికం కంటే పెద్ద గాయాలు చేయవు' అనే ఆమెకు మూడు 'టి'లు అంటే ఇష్టం. అవి ట్రైనింగ్‌ (శిక్షణ పొందడం), టీచింగ్‌ (శిష్యురాళ్లను తీర్చిదిద్దడం), ట్విన్స్‌ (తన కవల పిల్లలు). బాక్సింగ్‌ కింగ్‌ మహ్మద్‌ అలీని అభిమానించే మేరీ.. ఓ పక్కన విజయ దుందుభి మోగిస్తూనే నిస్సహాయులైన ఆడపిల్లలని తనలాగా తీర్చిదిద్దే పనిలో పడింది. 'నేనుండే చోట కరెంట్‌ లేదు. శిక్షణ శిబిరానికి పై కప్పు లేదు. వర్షం కురిస్తే సాధన ఆపేయాల్సిందే. అయినాసరే, నేను వీటిని లెక్క చేయను. ఒలింపిక్స్‌లో పతకం సాధించి తెస్తా' అంటోన్న ఈ రాజీవ్‌ ఖేల్‌రత్న 'కమాన్‌.. ఎవరొస్తారో రండి' అంటూ ప్రత్యర్థుల్ని బాక్సింగ్‌ బరిలోకి ఆహ్వానిస్తోంది. ఎన్నిసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా గెలిచినా దేశానికి ఒలింపిక్స్‌ సాధించడంలో ఉన్న ఆనందం వేరంటుందామె.
చదువు.. పరుగు.. చెట్టపట్టాల్‌.
టింటూలూకా.. ఇప్పుడు పరుగుల ప్రపంచంలో మరో సరికొత్త తరంగం. ఒకప్పటి పరుగుల రాణి.. పయోలి ఎక్స్‌ప్రెస్‌ పీటీ ఉష చేతుల్లో తురుపుముక్కలా తయారవుతున్నదీ ఆణిముత్యం. బీకాం రెండో సంవత్సరం చదువుతున్న టింటూ కూడా కేరళ అమ్మాయే. తండ్రి క్రీడల్లో మేటి. హైజంప్‌, లాంగ్‌ జంప్‌ అంటే అతనికి ప్రాణం. ఆటల్లో రాణించినా రోజుగడవడం కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం అతను మేస్త్రీ వృత్తిని చేపట్టాడు. తల్లి కూడా క్రీడాకారిణే. రాష్ట్రస్థాయి అథ్లెట్‌. ఇటువంటి నేపథ్యం నుంచి వచ్చిన టింటూలోనూ ఆ క్రీడా స్ఫూర్తే ఉండేది. కానీ పన్నెండేళ్ల వయసులో బక్కపల్చగా, బలహీనంగా.. అసలీమ్మాయి క్రీడలకు పనికొస్తుందా అన్నట్టు ఉండేది. దానికి కారణం దిగజారిన కుటుంబ ఆర్థిక పరిస్థితులు. ఆ సమయంలో టింటూ మేనమామ ఆమెలోని ఆసక్తిని గమనించి తన ఉత్సాహానికి ఊపిరిలూదాడు. అదే సమయంలో పీటీ ఉష మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే పనిలో పడింది. 'నా అకాడమీలో ఉన్న క్రీడాకారులంతా పేద పిల్లలే! ఎటువంటి ఆర్థిక సాయం అందనివాళ్లే.. పరుగులు తీయాలని ఉన్నా పేదరికం వెనక్కి లాగుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. రోజూ ఐదు కిలోమీటర్లు నడిచి స్కూలుకి వెళ్లొచ్చే టింటూ పట్టుదలను చూసి ముచ్చటపడ్డా. సన్నగా ఉన్నా.. తనలో గొప్ప సంకల్ప బలం ఉందని గ్రహించి చేరదీశాను. మా అకాడమీ తరపున ఇచ్చిన ఊతాన్ని అందిపుచ్చుకొని చకాచకా ఎదిగింది. 800 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచి నా ఆశలు నిలబెట్టింది. రేపటి తరానికి ఆమె కచ్చితంగా స్ఫూరిదాయకం' అంది ఉష. 'క్రీడల్లో రాణించాలంటే చక్కని శిక్షణ అందాలి. ప్రతిభా పాటవాలను వెలికితీసే గురువు చేతిలో పడాలి. టింటూ దేశం గర్వించే క్రీడాకారిణిగా ఎదుగుతుందా అనే భయం నాలో ఉండేది. ఎందుకంటే మాది అంతంతమాత్రపు ఆర్థిక నేపథ్యం. ఉష చేతిలో పడ్డాక నాకు భయం పోయింది' అంటోంది టింటూ తల్లి గర్వంగా.
ఆంక్షలను అధిగమించి...
ఇంగ్లిషు మీడియం స్కూల్లో చదువుకోవాలని కోరిక. మరి అది తీరాలంటే? స్పోర్ట్స్‌ హాస్టల్‌కి ఎంపికవ్వాలి. అదే జరిగితే భోజనం, చదువు ఉచితం కూడా. ఇలాగే ఆటల్లోకి ప్రవేశించిన ఆమే ఒలింపిక్స్‌కు వెళుతోన్న డిస్కస్‌ త్రోయర్‌ సీమా ఆంటిల్‌. మొదట అనుకొన్నట్టుగానే శాయ్‌లో వసతి, శిక్షణకు అవకాశం సంపాదించింది. యా.. హూ.. అని హుషారుగా ఇంటికెళ్లి చెప్పింది. 'ఆటలా ఇంకేమన్నానా? అదీ ఇల్లొదిలి దూరంగా వెళతావా? కుదరదు' అంటూ తండ్రి గద్దించాడు. అంతే అవకాశం చేజారిపోయింది. అయినా ధ్యాసంతా క్రీడల మీదే. పుట్టిపెరిగిన సోనేపట్‌లో స్థానికంగా ఉండే స్టేడియానికి రోజూ వెళ్లి సాధన చేసే వాళ్లని ఆరాధనగా చూసేది. ఆమె తపనను గమనించిన ఓ కోచ్‌ డిస్కస్‌ త్రోలో శిక్షణనిచ్చాడు. అలా సామర్థ్యాలు పెంచుకొన్న సీమా ఏడాది తిరిగేసరికల్లా జాతీయ స్థాయిలో రాణించింది. సీఆర్‌పీఎఫ్‌లో హవల్దార్‌ ఉద్యోగం పొందింది. హమ్మయ్య.. ఆర్థికంగా పుంజుకోవచ్చు అనుకొన్న తరుణంలో ఆడపిల్లవి ఉద్యోగం చేయడం ఏంటి? అని నాన్న అడ్డుచెప్పారు. కాలం మారింది, నన్ను సొంతంగా ఎదగనివ్వండి అంటూ సీమాటపాకాయ్‌లా బదులిచ్చింది. ఉద్యోగంలో చేరి, పోటీల్లోనూ పాల్గొంది. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం అందుకొన్న తొలి అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది.
వివాహమయ్యాక విజయదుందుభి... 
ెల్లారి లేస్తే పాడి పశువులు, వాటి పని. వాటికి వేయాల్సిన గ్రాసం సేకరించడంలో తలమునకలవడం. పైగా కృష్ణ పునియాకి తల్లి కూడా లేదు. ఇంటి పనంతా తనే చెయ్యాలి. తండ్రిది మహా క్రమశిక్షణ. తల్లిలేని పిల్లలని గారం చేస్తే ఎక్కడ చెడిపోతారోనని ఆయన భయం. ఆడపిల్లలు చదువు, ఆటలంటే చర్రున లేచేవాడు. దీంతో దేహధార్డ´్యం, ఎత్తు, చురుకు ఉన్నా పునియా క్రీడల పట్ల తనకున్న ఆసక్తిని బయటపెట్టలేదు. కానీ కళాశాలలో చేరాక నెమ్మదిగా ఆటల్లో చేరింది. డిస్కస్‌ త్రోలో ప్రతిభ చాటుకొంది. త్వరగానే నైపుణ్యాలని అందిపుచ్చుకొంది. వివాహమయ్యాక భర్త, కోచ్‌ వీరేంద్ర సహకారంతో పోటీల్లో పాల్గొని, విజయాలు సాధించింది. వద్దన్న తండ్రి నుంచే ప్రశంసలు అందుకొంది. కామన్వెల్త్‌ బంగారు పతకం సాధించినప్పుడు మా బాబు లక్ష్య కంట్లో మెరుపు నాకింకా గుర్తే. పదకొండేళ్ల మా అబ్బాయి గొప్పగా చెప్పుకొనేలా ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తా అంటోంది కృష్ణ పూనియా. వివాహమయ్యాక కూడా విజయాలు సాధ్యమేనంటూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)