ఈగ హోరు.. యువ హుషారు! (Eetaram_14/07/2012)




ఈగ జోరుకు కుర్రకారంతా ఖుషీ అవుతున్నారు... ఆ గ్రాఫిక్‌ మాయాజాలానికి మైమరిచిపోతున్నారు...ఇంతకీ ఈ ఈగ... హాలీవుడ్‌ అపర బ్రహ్మల చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మేం కాదు...కాకలు తీరిన గ్రాఫిక్‌ యోధులు తీర్చిదిద్దిన అవతార్‌ అసలే కాదు... సృష్టికర్తలు మన కుర్రాళ్లే! నిన్నగాక మొన్న కాలేజీ మెట్లు దిగి కొలువు చేపట్టిన వాళ్లే! గుండె నిండా ఆశల్ని, కళ్ల నిండా కలల్ని నింపుకొని... ఒక్క ఛాన్స్‌ కోసం ఎదురుచూసినోళ్లే!! వీళ్లకి ఈ అవకాశమెలా వచ్చింది? ఈగకి ప్రాణం పోసి మన మీదకెలా వదిలారు?? ఆ అనుభవాల్ని 'ఈతరం'తో పంచుకున్నారు.
గ రొద పెడుతుంది. చిరాకు తెప్పిస్తుంది. ఇప్పుడైతే కాసులు కురిపించే కామధేనువులా మారింది. తెలుగోడి దమ్ముని స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ రూపంలో ప్రపంచానికి పరిచయం చేసింది. దర్శకుడు రాజమౌళి దార్శనికత, గ్రాఫిక్స్‌ సంస్థ సీఈవో పీట్‌ డ్రాపర్‌ సూచనలు అందిపుచ్చుకుని కుర్ర యానిమేటర్ల బృందం చేసిన మాయాజాలం 'ఈగ' సినిమాలో కళ్లకు కడుతోంది.సత్తా తెలిసింది
ఈగకి ప్రాణం పోసింది ప్రధానంగా పదకొండు మంది కుర్రాళ్లు, ఒక అమ్మాయి మరికొందరితో కూడిన బృందం. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. సైన్యంలో చేరబోయి యానిమేషన్‌ వైపు మళ్లాడో కుర్రాడు. అప్పు చేసి మరీ చదువులు కొనసాగించింది మరొకరు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూనే తనకిష్టమైన రంగం ఎంచుకున్న నేపథ్యం మరొకరది. సరదాలతో సాఫీగా సాగిన జీవితాలు కొన్నైతే, కష్టాలతో నెట్టుకొచ్చింది ఇంకొంతమంది. నేపథ్యం ఏదైనా, ప్రాంతాలు వేరైనా అందరికీ యానిమేషన్‌పై పిచ్చి మోజు. అందుకే వీళ్లంతా హైదరాబాద్‌లోని ఓ యానిమేషన్‌ సంస్థలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మల్టీమీడియా కోర్సులో కలిశారు. చివరి సంవత్సరం ప్రాజెక్టులో భాగంగానే తమ సత్తా నిరూపించుకుంటూ 'మిస్టిక్‌ ఎవల్యూషన్‌' అనే లఘుచిత్రం రూపొందించారు. దానికి జాతీయస్థాయి అవార్డులందాయి. వారి పనితనం సినీ దర్శకుడు రాజమౌళి దృష్టిలో పడింది.
అవకాశం అందింది
కోర్సు పూర్తి కాగానే అందరూ మకుట అనే గ్రాఫిక్‌ సంస్థలో ఉద్యోగులుగా చేరారు. దాని సీఈవో పీట్‌ డ్రాపర్‌. హాలీవుడ్‌ సినిమాలకు పనిచేసిన అనుభవం అతడి సొంతం. అక్కడే రాజమౌళి. 'ఈగ'ను కుర్ర బృందం చేతిలో పెట్టారు. అప్పటిదాకా ఆ దర్శకుడి గురించి గొప్పగా వినడమే. కళ్లారా చూసింది లేదు. ఇప్పుడేమో తమలో ఒకడిగా మారి మన సినిమా బాగా రావాలని ప్రోత్సహిస్తుంటే వాళ్లకి నోట మాటలు రాలేదు. కష్టపడి పనిచేసి తమ సత్తా నిరూపించుకోవాలనుకున్నారు. 'ఈగ'నే తమ నైపుణ్యానికి గీటురాయిగా భావించారు. యానిమేషన్‌, స్కెచ్చింగ్‌, మోడలింగ్‌, రిగ్గింగ్‌, గ్రాఫిక్స్‌, కంపోస్టింగ్స్‌... ఇలా ఒక్కొక్కరు ఒక్కో విభాగం బాధ్యత స్వీకరించారు. పీట్‌ డ్రాపర్‌ సలహాలు, సూచనలు ఉండనే ఉన్నాయి. అలా 'ఈగ' వెండితెర అవతారానికి రెండేళ్ల కిందట తొలి అడుగులు పడ్డాయి.

మాకు మేమే పోటీ!
యానిమేషన్‌, గ్రాఫిక్స్‌ అంటేనే సృజనాత్మక పనితనం. ఒత్తిళ్లు, చికాకులుంటే ముందుకెళ్లలేం. పనిపై ఇష్టం ఉండాలి. అది యువ జట్టుకు పుష్కలంగా ఉంది. కావాల్సినంత స్వేచ్ఛ కూడా ఇచ్చారు. అందుకే ఈ ప్రాజెక్టును నైన్‌ టూ ఫైవ్‌ ఉద్యోగం అనుకోలేదు. ఉదయం ఆరింటికే కంప్యూటర్ల ముందు ప్రత్యక్షమయ్యేవారు. లాగాఫ్‌ అయ్యేది ఏ అర్థరాత్రికో. ప్రతి విషయాన్ని కలిసే చర్చించే వాళ్లు. జూనియర్‌, సీనియర్‌ తేడాల్లేవు. మంచి సలహా ఎవరిచ్చినా అమలు చేయాల్సిందే. ఒత్తిడి లేకుండా పనిని ఎంజాయ్‌ చేశారు. అయితే ఎంత స్వేచ్ఛ ఉన్నా, ఎంత కష్టపడ్డా గ్రాఫిక్‌ ఒక్కోసారి అనుకున్న విధంగా రాకపోయేది. దర్శకుడే కాదు కుర్రాళ్లు సైతం రాజీ పడే రకం కాదుగా! వందశాతం పరిపూర్ణత కోసం చేసిన పనినే మళ్లీమళ్లీ చేసేవారు. ముందు ఈగకి ఓ రూపం తీసుకురావడానికి ఎడెల్‌ అనే హాలీవుడ్‌ గ్రాఫిక్‌ డిజైనర్‌కే నెల్లాళ్లు పట్టింది. ఎన్నో నమూనాలు చేశాక చివరికిది ఓకే అయింది. అతడు అందించిన ఈగ నమూనాకు కదలికలు, హావభావాలు, విన్యాసాలు, హీరోయిజం తెరపైకి ఎక్కడానికి యువబృందం తీసుకున్న సమయం తొమ్మిది నెలలు. కేవలం ఈగ కళ్లు, రెక్కలు, రోమాలు, వాటి కదలికలకే బృందంలోని ఓ సభ్యురాలు పూర్తి సమయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ఇప్పుడు 'ఈగ సినిమా గ్రాఫిక్‌ పనితనం హైలెట్‌' అని అంతా మెచ్చుకుంటుంటే పండగ చేసుకుంటోంది కుర్రబృందం. అందుకే మరి అందరి పేర్ల ముందు ఇప్పుడు 'ఈగ' వచ్చి చేరింది.



మెరుపుల్లో మచ్చుకు కొన్ని
'ఈగ' ప్రతి కదలిక వెనుక యువ బృందం కృషి దాగున్నా ప్రత్యేకంగా ఆకట్టుకున్న కొన్ని సన్నివేశాలివి.
* నాని చనిపోయినందుకు సమంతను విలన్‌ సుదీప్‌ ఓదార్చుతుంటే అవన్నీ నాటకాలని చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఈగ హావభావాలు.
* 'నేనే నానిని' అంటూ ఈగ సమంతని నమ్మించే సన్నివేశం.
* సుదీప్‌ని ఏడిపించినప్పుడల్లా తోక ఊపుతూ ఈగ చేసే అల్లరి విన్యాసం.
* సుదీప్‌ కారు ట్రక్‌ను గుద్దే దృశ్యం.
* ఈగ పాటలో అది వేసే స్టెప్పులు.

గ్రాఫి'కింగ్‌'లు వీళ్లే!
'ఈగ' గుర్తింపుతో యువబృందం సంతోషానికి అవధుల్లేవ్‌. ఆ ఆనందం వాళ్ల మాటల్లో...
ఫణి విహారి, మిథున్‌: నాలుగేళ్లు యానిమేషన్‌ నేర్చుకొని ఉద్యోగులమైతే ఈగ సినిమాతో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాం.
విష్ణు: మంచి సలహాలిచ్చిన జూనియర్లకీ పెద్దపీట వేశారు. సమష్టి కృషితోనే ఈ విజయం.
భానుప్రకాశ్‌రెడ్డి: మా గ్రాఫిక్స్‌లో నచ్చని సీన్లంటూ ఏవీ లేవు. వందశాతం మనసుపెట్టి చేశాం. ఎక్కడా రాజీ పడలేదు.
లక్ష్మిసమీర: ఈగ జుట్టు, షేడింగ్‌, ఫర్‌ డిజైన్‌లన్నీ నావే. ఈ అనుభవం మర్చిపోలేనిది.సతీశ్‌: ఒక పనికి ఎంతలా మనసు పెట్టి చేయొచ్చో ఈ ప్రాజెక్టుతో మాకర్థమైంది. భవిష్యత్తులో ఈ ఫార్ములానే కొనసాగిస్తాం.
వీళ్లతోపాటు కృష్ణచైతన్య, షేక్‌ అఖిల్‌, హరికృష్ణ, బషీర్‌, రాజేశ్‌, రాజేంద్రప్రసాద్‌లదీ ఈగ ప్రాజెక్టులో కీలక పాత్రే

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు