అవినీతిలో ఇన్నో స్థానం, పేదరికంలో అన్నో స్థానం...అంటూ ఎప్పుడూ నిరాశావాదమేనా?మనం ధరించిన వీరతాళ్లనూ మనం అధిగమించిన మైలురాళ్లనూ పూర్తిగా విస్మరిస్తే ఎలా? చాలా విషయాల్లో భారత్ ఇప్పుడు, ప్రపంచ 'నంబర్ వన్', ఘనత వహించిన 'గ్లోబల్ లీడర్!'. ఆ విజయాల్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం...
భా...ర...త్! 'ఇంకా...అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థేనా?' అంటూ దీర్ఘాలు తీయకండి. మూడోప్రపంచ దేశమని... మూలకు నెట్టేయకండి. మురికివాడల్ని వికృతంగా చిత్రించి ఆస్కార్లు దండుకోవాలనుకునే దర్శకులకూ పేదరికాన్ని భూతద్దంలోంచి చూపించి నోబెల్ కొట్టేద్దామనుకునే అతితెలివి రచయితలకూ... కాలం చెల్లిపోయింది. పేదరికం, నిరక్షరాస్యత, అధిక జనాభా, అవినీతి, రాజకీయ నిర్లిప్తత... పరిమితులన్నీ అధిగమించి భారత్ ప్రపంచ స్థాయికి ఎదుగుతోంది.ఈ విజయం అయాచితంగా వచ్చిందేం కాదు. గాలివాటంగా సొంతమైంది కూడా కాదు. దానివెనుక, అపారమైన కృషి ఉంది. తడబడుతూ తప్పులు దిద్దుకుంటూ, నిలబడుతూ నిలదొక్కుకుంటూ, చెమటలు కక్కుతూ నిప్పులు చిమ్ముతూ... నింగికెగిసిన విజయగాథ ఇది.
భారతదేశం ఎదురులేని శక్తిగా, తిరుగులేని బ్రాండ్‌గా గెలుపుముద్ర వేయించుకుంది. అది నల్లబొగ్గు కావచ్చు. విస్కీపెగ్గు కావచ్చు. ఖరీదైన వజ్రాలు కావచ్చు. కారుచౌక కార్లయినా కావచ్చు. పాలపొంగు కావచ్చు. బంగారపు హంగూ కావచ్చు. అంతర్జాతీయ విపణిలో మన దేశాన్ని ముందువరుసలో నిలబెడుతున్న రంగాలెన్నో! |
కోల్ సలాం! నల్లనల్లని బొగ్గు... కొత్తకొత్త వెలుగులు తీసుకొచ్చింది. కోల్ ఇండియా - ప్రపంచంలోనే అత్యధిక పరిమాణంలో బొగ్గును తవ్వితీస్తున్న ప్రతిష్ఠాత్మక సంస్థగా అంతర్జాతీయ రికార్డులకెక్కింది. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న కోల్ ఇండియా... కేంద్రం మెచ్చిన 'మహారత్న' కంపెనీ! దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 81.1 శాతం కోల్ ఇండియా ద్వారానే జరుగుతోంది. ఏటా నాలుగువందల మిలియన్ టన్నులంటే మాటలు కాదు. ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఇంత భారీ పరిమాణంలో బొగ్గు వెలికితీయడమన్నది ఇంకెక్కడా లేదు. స్టాక్‌మార్కెట్‌లోనూ కోల్ ఇండియాకు తిరుగులేదు. ఆ కంపెనీ షేర్లు వాటాదారులకు లాభాలపంట పండించాయి. 2010లో ఐపీవోకు వచ్చినప్పుడు... కోల్ ఇండియా షేర్లు 15.28 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఇది కూడా ఓ రికార్డే. స్టాక్‌మార్కెట్‌లో నమోదైన తొలిరోజే... లిస్టింగ్ ధర కంటే 40 శాతం ఎక్కువ పలికింది. ఏ బంగారమో కొనకుండా ఆ బొగ్గుల కంపెనీ షేర్లు కొంటే బావుండేదేమో అని సంప్రదాయ మదుపర్లు పశ్చాత్తాప పడిన సందర్భాలూ ఉన్నాయి.ఇప్పటికీ భారత్‌లో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిదే అగ్రస్థానం. ఎనభై ఆరు థర్మల్ పవర్ స్టేషన్లలో ఎనభై రెండింటికి కోల్ ఇండియానే ఆధారం. మనింట్లో బల్బు వెలగాలంటే... బొగ్గు కావాలి. బొగ్గుకావాలంటే... కోల్ ఇండియా తవ్వితీయాలి. వెలుగులే కాదు, రికార్డులూ ఇచ్చిన... బొగ్గు మాలక్ష్మికీ కోటి దండాలు!
సంక్షిప్తంగా...పేరు: కోల్ ఇండియా స్థాపన: 1975 ప్రధాన కార్యాలయం: కోల్‌కతా సిబ్బంది సంఖ్య: 3,83,347 యాజమాన్యం: 90 శాతం ప్రభుత్వం, 10 శాతం ప్రజలు. లక్ష్యం: సిబ్బంది భద్రతకూ పర్యావరణ పరిరక్షణకూ ప్రాధాన్యం ఇస్తూ... నాణ్యమైన ఉత్పత్తిని అందించడం. వెబ్‌సైట్:www.coalindia.in |
'బంగారు' కొండ! భారతీయులకు సెంటిమెంట్లు ఎక్కువ. భారతీయులకు ముందుచూపు ఎక్కువ. భారతీయులు మహా పొదుపరులు. భారతీయులు సౌందర్య ప్రియులు. ...బంగారం మీద మోజుకు ఇవన్నీ కారణాలే. భారతీయుల ఇనప్పెట్టెల్లో 18,000 టన్నులకుపైగా నగానట్రా మూలుగుతోంది. ఆ నిల్వలతో వచ్చే వందేళ్లలో అమెరికన్ల స్వర్ణాభరణ అవసరాలన్నీ తీర్చచ్చు.ఈ నిక్షేపాల వెనుక ఇంకో కారణమూ ఉంది- మనవాళ్లకు బంగారం కొనడమంటే చాలా ఇష్టం. దాన్నో శుభసూచకంగా భావిస్తారు. ధరలు ఎంతగా పెరిగిపోయినా...అమ్ముకోడానికి అస్సలు ఇష్టపడరు. అక్షయ తృతీయ, ధంతేరాస్ వంటి ప్రత్యేక సందర్భాల్లో అయితే, నగల దుకాణాలు తిరుపతి ఆలయాన్ని తలపిస్తాయి... అంత రద్దీ! 'ఇ-గోల్డ్'కు కూడా ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక పరిమాణంలో బంగారాన్ని కొంటున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయంలో చైనా సమ ఉజ్జీగా నిలుస్తోంది. అంతర్జాతీయ స్వర్ణాభరణాల మార్కెట్‌లో మనవాటా 27 శాతం! నా దేశం... బంగారుకొండ! |
'బిజినెస్' భారత్! ఒకప్పుడు 'మేడ్ ఇన్ ఇండియా' ముద్రతో సరుకుల్ని ఎగుమతి చేయడానికి వ్యాపారులు భయపడేవారు. కారణం, భారత్ నుంచి వచ్చిందంటే, అది నాసిరకమై ఉంటుందన్న విదేశీయుల అపోహ. అంతా పట్టుబట్టి మరీ, ఆ ముద్రను తొలగించాలంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. ఇంతలోనే ఎంత మార్పు! ఇప్పుడు అనేకానేక భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌ను శాసిస్తున్నాయి.బిస్కెట్లు, కొబ్బరి నూనె వంటి చిల్లర వస్తువుల ఎగుమతిలోనూ మనదేశం అగ్రస్థానంలో ఉంది. ముద్దుగా బొద్దుగా ఉన్న పసివాళ్లను 'పార్లె-జి' బిస్కెట్ ప్యాకెట్ మీదున్న బొమ్మతో పోల్చుకుని మురిసిపోతుంటారు చాలామంది. ఆ బిస్కెట్లకున్న ఆదరణ అలాంటిది. సార్క్ దేశాలతో పాటు అమెరికా, యూరప్, ఆఫ్రికాలకు పార్లె-జి బిస్కెట్లు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న బిస్కెట్ బ్రాండ్ ఇదే. చైనీయులు స్వతహాగా బిస్కెట్ ప్రియులు. అత్యధికంగా బిస్కెట్లు తినే దేశం చైనా. అక్కడ ఉత్పత్తి అయ్యే బిస్కెట్లకంటే... పార్లేజీ ఉత్పత్తే అధికం. 'పారాచ్యూట్' బ్రాండ్ కూడా భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది. కొబ్బరినూనె ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. నంబర్ వన్ హోదా 'చిల్లర' వ్యాపారానికే పరిమితం కాలేదు. ఇంజినీరింగ్‌లోనూ అద్భుతాలు చేస్తోంది భారత్. టవర్ల తయారీలో కె.ఇ.సి. ఇంటర్నేషనల్ విశ్వవిపణిలో మొదటిస్థానంలో ఉంది. 'నానో'... ప్రపంచంలోనే అతిచవక కారుగా రికార్డుల కెక్కింది. 'ఆకాశ్' నోట్‌బుక్ కూడా ఆ పక్కనే చోటు సంపాదించుకుంది.
సంక్షిప్త పరిచయం...పార్లె-జి: ముంబయి శివార్లలోని విలే పార్లేలో పార్లే ఉత్పత్తులు ప్రారంభం అయ్యాయి (1929). బిస్కెట్ల తయారీ మాత్రం 1939లో మొదలైంది. ఈ బ్రాండ్ విలువ రెండువేల కోట్లు ఉంటుందని అంచనా.పారాచ్యూట్: మరీకో కంపెనీ ఉత్పాదన. గత ఏడాది ఈ సంస్థ రూ. 3,128 కోట్ల టర్నోవరు సాధించింది. మరీకో - ఇరవై రెండేళ్లలోనే వివిధ రంగాలకు విస్తరించింది. కె.ఇ.సి.ఇంటర్నేషనల్: విద్యుత్, టెలికాం, రైల్వే తదితర రంగాలలో ఇంజినీరింగ్ సేవలు అందిస్తోంది. పాతిక దేశాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
నానో: రతన్‌టాటా కలల పంట. నాలుగు చక్రాల బండి సామాన్యుడికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఈ బుల్లికారుకు ప్రాణం పోశారు. |
ప్రపంచ 'మధుపాత్ర'! ఎడ్వర్డ్ డయర్ అనే ఇంగ్లీషు పెద్దమనిషి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా భారతదేశానికి వచ్చాడు. వేడివేడి వాతావరణమే అయినా ఎలాగోలా సర్దుకుపోయాడు. భాష విషయంలోనూ పెద్దగా ఇబ్బందులు రాలేదు. సమస్యంతా... మద్యంతోనే! చుక్క పడకపోతే... దొరగారికి చుక్కలు కనబడతాయి. కానీ, స్కాచ్ విస్కీ ఎక్కడ దొరుకుతుంది? సొంత దేశం నుంచి ఎన్ని సీసాలని తెచ్చుకుంటాడు పాపం! కొలువుల కోసమనీ వ్యాపారం కోసమనీ అప్పటికే చాలామంది ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చేశారు. వాళ్లంతా ఎడ్వర్డ్‌లానే ఇబ్బందిపడుతున్నారు. చిక్కని మద్యం తయారుచేసి అమ్ముకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందాయనకు. స్కాట్‌లాండ్‌ను తలపించే ప్రాంతం కోసం దేశమంతా వెతికాడు. అప్పుడే, సిమ్లా ప్రత్యేకత తెలియవచ్చింది. మద్యం తయారీకి అవసరమైన సామగ్రిని ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకున్నాడు. 1820 ప్రాంతంలో విస్కీ ఉత్పత్తి మొదలైంది. అదే ప్రారంభం. తర్వాత కాలంలో విజయ్‌మాల్యా వంటి దిగ్గజాలు భారతీయ మద్యాన్ని దిగంతాలకు విస్తరించారు. ప్రస్తుతం భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ తయారీదారు! ఏటా సుమారు 55.96 మిలియన్ బాటిళ్ల మద్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తోంది. 'స్కాటిష్' ముద్ర నుంచి బయటపడి, ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది...భారతీయ విస్కీ. మత్తెక్కించే విజయమే! |
'గ్లోబల్' టాటాలు!మనల్ని పాలించిన తెల్లవారికి... మనమే ఉద్యోగాలిస్తున్నాం. ఉప్పు నుంచి ఉక్కు దాకా... అనేకానేక ఉత్పత్తులతో భారత పారిశ్రామిక రంగానికి నాయకత్వం వహిస్తున్న టాటా సంస్థలు బ్రిటన్‌లోనూ అగ్రస్థానంలో ఉన్నాయి. ఉత్పత్తి రంగంలో దాదాపు నలభైవేలమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఘనత వహించిన 'బ్రిటిష్ ఏరోస్పేస్' రెండో స్థానానికే పరిమితమైంది. అప్పట్లో... భారత్‌లో ఉత్పత్తి అయిన సరుకుల్ని విక్రయించడానికి అక్కడో అనుబంధ శాఖను ఏర్పాటు చేసుకున్నారు టాటాలు. ఇప్పుడది మహావృక్షం. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కూడా దాదాపు నాలుగువేలమంది బ్రిటన్ పౌరులకు ఉద్యోగాలిచ్చింది. అప్పటికే ఉన్న వ్యాపారాలకు తోడు జాగ్వర్ లాండ్ రోవర్, టెట్లే, కోరస్ వంటి సంస్థల టేకోవర్ ద్వారా... మరింత మంది తెల్లదొరలకు అన్నంపెడుతోంది టాటా పరివారం. రెండేళ్ల క్రితం, బ్రిటన్‌లోని అతిపెద్ద ఉప్పు తయారీ సంస్థనూ సొంతం చేసుకుంది టాటా గ్రూప్. బ్రిటన్‌లో నంబర్‌వన్ విదేశీ పెట్టుబడిదారులు టాటాలే! ఆసియాలోని అతిపెద్ద గొలుసుకట్టు హోటళ్ల సమూహం... తాజ్ గ్రూప్. ఇది కూడా టాటాలదే.ఆమధ్య ఏదో సమావేశానికి వెళ్లినప్పుడు... శాంతమూర్తి అయిన రతన్‌టాటాకు కూడా బ్రిటిష్ ఉద్యోగుల తీరు ఆగ్రహం కలిగించింది. 'మీరు కష్టపడటం నేర్చుకోండి. భారతీయ మేనేజర్లలా అంకితభావంతో పనిచేయండి' అని గట్టిగానే హెచ్చరించారు. కొంతమందిని ఉద్యోగాల్లోంచి తొలగించినట్టూ సమాచారం. ఆరున్నర దశాబ్దాల క్రితం దాకా... భారతీయుల మీద పెత్తనం చేసిన బ్రిటిషర్లు ఇప్పుడు, ఓ భారతీయ సంస్థలో సాధారణ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇది ప్రత్యక్షంగా టాటాల విజయం, పరోక్షంగా భారత్ విజయం! అంతటితో అయిపోలేదు, ఐర్లండ్‌లో అత్యంత సంపన్నుడు ఏ శ్వేతజాతీయుడో కాదు. అచ్చమైన భారతీయుడు - పల్లోంజీ మిస్త్రీ. టాటా సంస్థల భవిష్యత్ నాయకుడు... సైరస్ ఆయన చిన్న కొడుకే!
సంక్షిప్తంగా టాటాలు!వ్యవస్థాపకుడు: జంషెడ్‌జీ టాటా. సంవత్సరం: 1868 ఛైర్మన్: రతన్ టాటా వైస్ ఛైర్మన్: సైరస్ పల్లోంజీ మిస్త్రీ మొత్తం ఉద్యోగులు: 4.5 లక్షలు విస్తరించిన రంగాలు: ఇనుము, ఉప్పు, బంగారం, ఐటీ, టెలికాం, రసాయనాలు, విద్యుత్, వినియోగ వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తులు, ...ఒకటారెండా! |
ఇట్లు...మీ(పొరుగు)సేవలో!గత ఏడాది ప్రకటించిన 'గ్లోబల్ సర్వీస్ లొకేషన్ ఇండెక్స్'లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికీ అమెరికా లాంటి అగ్రదేశాలకు అవుట్‌సోర్సింగ్ అంటే భారతదేశమే గుర్తుకొస్తుంది. చైనా, మలేసియా, ఇండొనేషియా, ఈజిప్ట్ వంటి దేశాలు... తీవ్రంగా పోటీపడుతున్నా మన స్థానం మనదే! గడగడా ఇంగ్లిష్ మాట్లాడే యువతకు కొదవలేదు. తెలివితేటల్లో తిరుగులేదు. అత్యున్నత ప్రమాణాలున్న విద్యాసంస్థలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే జీతభత్యాలూ తక్కువే. అందుకే... కాల్‌సెంటర్లు మొదలుకొని సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టుల దాకా అనేకానేక పొరుగుసేవలకు భారత్ రాజధానిగా నిలుస్తోంది. అంతెందుకు, సింగపూర్‌లో కంటే బెంగళూరులోనే 'గ్రేడ్-ఎ' స్థాయి ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారట! ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం కొంత దెబ్బకొట్టినా... ఇప్పటికీ అవుట్‌సోర్సింగ్‌లో మనమే కింగ్! |
'వజ్ర' సంకల్పం! వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. అదంత సులభమైన పని కాదు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి నిజంగానే వజ్రసంకల్పం అవసరం. ముడి వజ్రాన్ని కోయడం చాలా కష్టం. సానబెట్టడం, మెరుగులు దిద్దడం...ఇంకా ఇంకా కష్టం. నిజానికి వజ్రంలోని అందమంతా ఆ పనితనంలోనే కనిపిస్తుంది. ముడిరాతికి తళుకూబెళుకూ తీసుకురావాలంటే..బోలెడంత నైపుణ్యం ఉండాలి. ఓపిక కావాలి. సృజనాత్మకత తప్పనిసరి. ఈ మూడు లక్షణాలూ భారతీయుల డీఎన్‌ఏలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో, ఎక్కడెక్కడి ముడివజ్రాలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. మెరుగులు దిద్దుకుని, మెరుపులు పూసుకుని అంతర్జాతీయ మార్కెట్‌కు తరలి వెళ్తాయి. ప్రపంచంలోని ఏ గనుల్లో దొరికినా... నూటికి డెబ్భైశాతం వజ్రాలు మెరుగులు దిద్దుకునేది మాత్రం భారతదేశంలోనే! ఈ వ్యాపారంలో ఇజ్రాయిల్, బెల్జియం మనతో పోటీపడుతున్నాయి. ఏది రాయో ఏది రత్నమో తెలియని అమాయక ప్రపంచానికి... వజ్రాన్ని పరిచయం చేసింది కూడా భారతీయులే. వజ్రానికి మెరుగులు దిద్దడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ముంబయి, సూరత్, భావ్‌నగర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో... కుటీర పరిశ్రమగా మొదలై, అత్యాధునిక సౌకర్యాలున్న వ్యాపార కేంద్రంగా అవతరించింది. తాజా అంచనాల ప్రకారం, మన దేశం నుంచి ఏటా 1.41 లక్షల కోట్ల విలువైన వజ్రాల ఎగుమతి జరుగుతుంది. గత ఏడాది భారత్ మొత్తం ఎగుమతుల్లో... మెరుగులు దిద్దిన వజ్రాల వాటా పదహారున్నర శాతానికి పైగానే ఉంది. దాదాపు పది లక్షల మంది కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులైన సిబ్బందిలో 95 శాతం మనదగ్గరే ఉన్నారు. అమెరికా, జపాన్, చైనా దేశాల్లో వజ్రాలకు మంచి గిరాకీ ఉంది. వజ్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దాంతోపాటే, భారత్ అగ్రస్థానం కూడా! |
పాలధార... తల్లి బిడ్డకు మాత్రమే పాలిస్తుంది. భారతదేశం ప్రపంచానికంతా పాలిస్తోంది. పాడిపరిశ్రమలో మనదే అగ్రస్థానం. అంతర్జాతీయ పాల ఉత్పత్తిలో పదిహేను శాతానికిపైగా భారత్‌లోనే జరుగుతోంది. అయినా, పాడిపశువులు మనకు కొత్తేం కాదు. వేదకాలం నుంచీ ఉన్నవే. ఒకప్పుడు, ఆస్తులంటే... పశుసంపదే. పశువుల కోసం యాగాలు చేశారు. యుద్ధాలు కూడా చేశారు. ఇప్పటికీ ఆవులూ గేదెల జనాభాలో మన దేశమే అగ్రస్థానంలో ఉంది. సహకారోద్యమ ప్రభావంతో... శ్వేతవిప్లవం పరవళ్లు తొక్కింది. పాలబుగ్గల 'అమూల్'... సహకారశక్తిని ప్రపంచానికి చాటింది. అంతర్జాతీయ పాల ఉత్పత్తుల బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది.దాదాపు 37 దేశాలకు రూ.150 కోట్ల విలువైన ఎగుమతులు చేస్తోంది. రానున్న పదేళ్ల కాలంలో, భారత్‌లో పాల ఉత్పత్తి మూడురెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో డెయిరీ నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. దీంతో పాల ఉత్పత్తుల ఎగుమతి మహా లాభసాటిగా ఉంటోంది.నిజమే, మన పరిమితులు మనకున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే... పాడిపశువుల తలసరి పాల ఉత్పత్తి తక్కువే. రైతులకు శాస్త్రీయ నిర్వహణ పద్ధతుల మీదా పెద్దగా అవగాహన లేదు. పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. అయినా, ఈ పరిమితుల్ని అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాం.భరతమాతకు క్షీరాభిషేకం! |
పంచదార...శుభవార్త చెబితే నోటినిండా చక్కెర పోస్తాం. నలుగురూ కలుసుకున్నప్పుడు 'తీయని వేడుక చేసుకోవడం' మన సంప్రదాయం. చాలాప్రాంతాల్లో... భోజనంలో చిన్న మిఠాయి ముక్కయినా ఉండాల్సిందే. కాఫీ, టీలలో చిటికెడు చక్కెర తగ్గితే... మొహం అదోలా పెట్టేస్తాం! ఎందుకంటే, తీపి మన జీవితాల్లో ఓ భాగం. చక్కెర వినియోగంలో మనదే సింహభాగం. చైనా కూడా మన తర్వాతే. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయిన మొత్తం చక్కెరలో పదిహేనుశాతం భారతీయులే తినేస్తున్నారు. ఇక పంచదార ఉత్పత్తిలో మనం అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉన్నాం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్... ఆరు రాష్ట్రాలూ కలిసి దాదాపు 95 శాతం చక్కెరను అందిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న రంగమూ ఇదే. ఎంత 'తీపి' కబురు! |
మేనేజ్‌మెంట్ గురు! సిటీగ్రూప్, పెప్సీ, మోటరోలా ... వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తులు భారతీయులే! సిటీగ్రూప్ సి.ఇ.ఒ. విక్రమ్ పండిట్, పెప్సీకో అధినేత్రి ఇంద్రానూయి, మోటరోలా పెద్దబాస్ సంజయ్ ఝా - సమర్థ నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మేనేజ్‌మెంట్ థింకర్స్ జాబితాలో - పదిమందిలో ఒకడిగా - భారతీయుడు సి.కె.ప్రహ్లాద్ స్థానం సంపాదించారు. 'కోర్ కాంపిటెన్సీ' అన్న భావనను పరిచయం చేసిన ఘనత ఆయనదే. మరో భారతీయుడు రామ్‌చరణ్ 'సి.ఇ.ఒ. కోచ్'గా పేరు తెచ్చుకున్నారు. విజయ్ గోవిందరాజన్ చీఫ్ ఇన్నొవేషన్ కన్సల్టెంట్ హోదాలో జి.ఇ. సంస్థ ప్రగతికి తనవంతు మేధోసహకారం అందించారు. 'రివర్స్ ఇన్నొవేషన్' అన్న మాటను మేనేజ్‌మెంట్ ప్రపంచానికి కానుకగా ఇచ్చిన మహానుభావుడీయన. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన రాకేష్ ఖురానా... నాయకత్వ నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. అర్థశాస్త్రం, భగవద్గీత, మహాభారతం... వంటి ప్రాచీన భారతీయ గ్రంథాలను విదేశీ మేనేజ్‌మెంట్ నిపుణులు పాఠ్యపుస్తకాలంత శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నారు. 'గురు', 'కర్మ', 'తపస్య' వంటి సంస్కృత పదాలు అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ నిపుణుల వూతపదాలయ్యాయి. |
మన ప్రత్యేకతలు మనకున్నట్టే, మన పరిమితులూ మనకున్నాయి.మైక్రోసాఫ్ట్‌కు భారత్‌లోని కార్యాలయం గుండెకాయ లాంటిదంటారు. 'గూగుల్ ఇండియా' గురించి చెప్పకపోతే... ఆ కంపెనీ విజయాల చరిత్ర పరిపూర్ణం కానేకాదంటారు. జి.ఇ.లాంటి దిగ్గజం కూడా తన పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని తొలిసారిగా అమెరికాకు అవతల... భారత్‌లో ఏర్పాటు చేసుకుంది. ఇదంతా విజయమే. కాదనలేం. ఇప్పటిదాకా మనం అనుచరుల పాత్రలోనే అద్భుతంగా రాణించాం. మరి, నాయకులుగా.?గూగుల్‌తో పోటీపడగలిగిన సంస్థను ఎందుకు స్థాపించలేకపోతున్నాం? 'ఐ-ఫోన్'ను తలదన్నే ఉత్పత్తిని ఎందుకు రూపొందించలేకపోయాం? ఎందుకంటే, ఆవిష్కరణల్లో మనదేశం బాగా వెనుకబడిపోయింది. 'అవుట్‌సోర్సింగ్' కేంద్రంగానే మిగిలిపోయింది. ఇది పూర్తిగా వైఫల్యం కాదు - దిశానిర్దేశం లేకపోవడం కొంత, ముందుచూపు మందగించడం మరికొంత. ఆ పరిమితిని కనుక అధిగమించగలిగితే... పది రంగాల్లోనో, పాతిక వ్యాపారాల్లోనో కాదు... అన్నింటా అగ్రగామిగా నిలుస్తాం. ఆరోజూ ఎంతోదూరం లేదు.
మేరా భారత్ మహాన్! హమారా ఇండియా...నంబర్ వన్!! |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి