రైతు సంఘం జిందాబాద్! ()(_Eenadu Mag_15/07/12
రైతు వ్యూహకర్త కావాలి. మార్కెటింగ్ మాంత్రికుడి అవతారం ఎత్తాలి. ఆర్థిక నిపుణుడిలో పరకాయప్రవేశం చేయాలి. డిమాండ్-సప్త్లె సూత్రాన్ని నరనరానా జీర్ణించుకోవాలి. అప్పుడే, లాభాలపంట పండించగలడు. 'అభినవ్ ఫార్మర్స్ క్లబ్' రైతన్నలకు నేర్పుతున్న పాఠం ఇదే!రైతు ఎడ్లబండే ఎందుకు తోలాలి? దర్జాగా ట్రాక్టరు నడపొచ్చుగా! సేద్యగాడు డొక్కు మోపెడ్ మీదే ఎందుకు తిరగాలి? కారు కొనుక్కోవచ్చుగా! రైతన్న నివాసం పెంకుటిల్లేనా? ముచ్చటైన మేడ కట్టుకోవచ్చుగా! కృషీవలుడికి ఎప్పుడూ నష్టాలేనా? ఉద్యోగిలా నెలకో యాభైవేలు సంపాదించుకోవచ్చుగా! ముత్తాత తాతకూ, తాత నాన్నకూ, నాన్న బిడ్డకూ నేర్పిన పద్ధతుల్నే ఇప్పటికీ పాటించాలా? అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవచ్చుగా!అవును, ఎందుకు సాధ్యం కాదు? అయితీరుతుందని నిరూపించడానికే 'అభినవ్ ఫార్మర్స్ క్లబ్' ప్రాణంపోసుకుంది. రైతు బతుకంటే పుట్టెడు కష్టాలు కానేకాదు... పుట్లకొద్దీ ధాన్యపురాశులని చాటిచెప్పింది. దాదాపు రెండువేల ఎకరాల్లో 'అభినవ్' సేద్యం నడుస్తోంది. ఒక్క పుణె క్లబ్‌లోనే 250 మంది సభ్యులున్నారు. మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలతోపాటు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. పరోక్షంగా వేలమంది రైతులు సలహాలూ సూచనలూ సాంకేతిక సహకారాలూ అందుకుంటున్నారు. 'అభినవ్ ఫార్మర్స్ క్లబ్' వ్యవస్థాపకుడు ధ్యానేశ్వర్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. పుణె దగ్గర్లోని హింజేవాడి సొంతూరు. తండ్రి పదహారణాల రైతు. సేద్యం తప్ప మరో సంపాదన మార్గం తెలియని మనిషి. గిట్టినా గిట్టకపోయినా, పంట వచ్చినా రాకపోయినా వ్యవసాయం చేస్తూనే వచ్చాడు. ఎప్పుడో అవసరం కొద్దీ తీసుకున్న ఇరవైవేల అప్పు... లక్షా నలభైవేలై కూర్చుంది. పంటలేమో... అంతంతమాత్రం! ఉన్న పదిహేను ఎకరాల్లో ఐదెకరాలు అమ్మక తప్పలేదు. అప్పులు తీర్చగా మిగిలిన డబ్బుతో ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. జేబు ఖాళీ అయిపోయింది. ఓ దశలో పూటగడవడం కూడా కష్టమైంది. అల్లుడు దారిచూపకపోతాడా అన్న ఆశతో ఒక్కగానొక్క కొడుకును పెద్దకూతురి ఇంటికి పంపాడు. అప్పటికి ఆ కుర్రాడు పదోతరగతి చదువుతున్నాడు. అక్కయ్య ఇంట్లో పశువుల కాపరి అవతారం ఎత్తాడు ధ్యానేశ్వర్. తీరిక సమయంలో టైపింగ్ నేర్చుకునేవాడు. చదువు ఆగిపోయినా, పస్తుల బాధ తప్పింది. అయినా, మనసంతా అమ్మానాన్నల మీదే. ఎలా బతుకుతున్నారో, ఏం తింటున్నారో అన్న బెంగ. టైపు పరీక్ష ఫలితాలు వెల్లడైనరోజే... 'నా మిత్రుడు పుణెలో పెద్ద ఆర్కిటెక్ట్. తన దగ్గర టైపిస్టు ఉద్యోగం ఖాళీగా ఉంది. ఓసారి వెళ్లిరా...' అని చెప్పారు బావగారు. వెంటనే బయల్దేరాడు ధ్యానేశ్వర్. రెండ్రోజుల్లో వచ్చి చేరమన్నాడు ఆ పెద్దమనిషి. జీతం... రెండువందలు! అమ్మానాన్నలు సంతోషించారు. సొంతూరు హింజేవాడికి పుణె మరీ దూరమేం కాదు. సైకిలు మీద గంటన్నర ప్రయాణం. పొద్దున్నే బయల్దేరి వెళ్లేవాడు. ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి దాటేది. ఆ శ్రమ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. కీబోర్డు మీద పట్టు రావడంతో... చకాచకా పనులు పూర్తిచేసుకునేవాడు. ఆ చురుకుదనం చూసి యజమాని ముచ్చటపడ్డాడు. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేర్పించాడు. కొత్త అర్హతతో జీతం పెరిగింది. రెండువందలతో బతికిన వాడికి నెలకు అయిదు వేలంటే..పెద్దమొత్తమే! ముంబయి, పుణె నగరాల్లోని డొమినోస్ పిజ్జా, వెంకీస్ ఫాస్ట్‌ఫుడ్ దుకాణాల ఇంటీరియర్ డిజైనింగ్ బాధ్యతలు తనే చూసేవాడు. పొదుపు చేసుకున్న డబ్బుకుతోడు మరికాస్త అప్పుచేసి మిగిలిన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లూ చేశాడు. మంచి సంబంధం రావడంతో తనూ ఓ ఇంటివాడు అయ్యాడు. బాధ్యతలు తీరిపోయాయి. బరువు తగ్గింది. జీతం పెరిగింది. అయినా ఏదో అసంతృప్తి. ధ్యానేశ్వర్‌కు సేద్యమంటే ప్రాణం. ఏ కాస్త తీరిక దొరికినా వ్యవసాయ రంగంలోని కొత్తకొత్త విషయాలు తెలుసుకునేవాడు. ఎన్నో ఆలోచనలు... 'ఏ రైతూ సంతోషంగా లేడు. అప్పులతో కుదేలైపోతున్నాడు. బాధ్యతలతో కుంగిపోతున్నాడు. అతనికున్న ఆస్తీ ఆధారం... పొలమే! మరోదారిలేక ..తెగనమ్ముతున్నాడు. పొలంలేని రైతంటే - ఆత్మలేని శరీరమే - జీవచ్ఛవమే! ఎవరికీ అలాంటి పరిస్థితి రాకూడదు. చిన్న కమతాలు, నిధుల కొరత, ఆధునిక పద్ధతుల మీద అవగాహన లేకపోవడం, మార్కెటింగ్ నైపుణ్యం కొరవడటం... భారతీయ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు' పండించిందేదో అమ్మడం కాదు. గిరాకీ ఉన్నదే పండించాలి. సమస్య..పంటలో లేదు. రైతులో ఉంది. పంటకు గిరాకీ లేకపోవడం కాదు, ఆ గిరాకీని వ్యాపారంగా మార్చుకునే వ్యూహం కరవైంది. కలిసి పండించడం ద్వారా, కలిసి విక్రయించడం ద్వారా లోపాన్ని సరిదిద్దుకోవచ్చని ధ్యానేశ్వర్ నిశ్చితాభిప్రాయం. తనే ఆ బాధ్యత తీసుకోవాలనుకున్నాడు. తోటిరైతులు తనను నమ్మాలంటే, ముందుగా తానేమిటో నిరూపించుకోవాలి. మరో ఆలోచనకు తావివ్వకుండా, ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పొదుపు డబ్బులోంచి, చెల్లెళ్ల పెళ్లికి చేసిన 70వేల అప్పు తీర్చేశాడు. చేతిలో ఇంకాస్త నగదు మిగిలింది. విదేశీ అలంకరణ పుష్పాలకు మంచి గిరాకీ ఉందని తెలిసింది. తన పొలంలో వాటిని పండించాలని నిర్ణయించాడు. సాగు విధానం తెలుసుకోడానికి శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యాడు. పెట్టుబడికి ఐదులక్షల దాకా అవసరం అవుతుందని తేలింది. తన దగ్గర అంత డబ్బులేదు. ఓ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసి బ్యాంకువారికి ఇచ్చాడు. మేనేజరుకు ఆ ప్రణాళిక చాలా నచ్చింది. కోరినంత రుణం మంజూరు చేశాడు. పద్నాలుగు నెలల్లో..పూల విక్రయం ద్వారా నాలుగు లక్షలా ఎనభై ఎనిమిదివేలు సంపాదించాడు ధ్యానేశ్వర్. నేషనల్ హార్టీకల్చర్ బోర్డు వారు లక్షా ఇరవై రెండువేల రూపాయలు సబ్సిడీగా ఇచ్చారు. మొత్తం అప్పు తీర్చేశాడు. బ్యాంకువాళ్లు తెగ సంతోషించారు. అన్నీపోగా ఎంతోకొంత లాభం వచ్చింది. అదంతా చూసి.. ఇరుగుపొరుగు రైతులకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఏడాది వూళ్లోని రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. తన ఆలోచన పంచుకోడానికి ఇదే సరైన సమయమని ధ్యానేశ్వర్ భావించాడు. మనసులోని మాట చెప్పాడు. 'ఫార్మర్స్ క్లబ్' ప్రతిపాదనకు మిశ్రమ స్పందన వచ్చింది. అతికష్టం మీద ఓ పదిహేడుమంది సిద్ధపడ్డారు. 2004, పంద్రాగస్టునాడు అభినవ్ ఫార్మర్స్ క్లబ్ ప్రారంభమైంది. బ్యాంకువారిచ్చిన పది లక్షల అప్పుతో... సరికొత్త సేద్యం మొదలైంది. నాటి నుంచి... ధ్యానేశ్వర్ అంటే... అభినవ్ ఫార్మర్స్ క్లబ్బే! 'ఏం పండించాలి?' అన్నది మన ఇష్టం కాదు. మార్కెట్‌ను బట్టి నిర్ణయించాలి. 'ఎప్పుడు పండించాలి?' అన్నది కూడా 'గిరాకీ-సరఫరా' సూత్రం ప్రకారమే జరగాలి. కూరగాయలకూ పండ్లకూ అలంకరణ పుష్పాలకూ పుణె, ముంబయి, ఢిల్లీ తదితర నగరాల్లో చాలా గిరాకీ ఉంది. అందుకే, క్లబ్ ఆ పంటల్నే ప్రోత్సహించింది. ఎవరి పొలంలో వారు సేద్యం చేసుకుంటారు. కానీ విత్తనాలూ ఎరువులూ క్రిమిసంహారకాలూ కలిసే కొంటారు. దీనివల్ల బేరమాడే శక్తి వస్తుంది. పంటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని క్లబ్బే అందిస్తుంది. పంట చేతికిరాగానే.. ఆ సరుకంతా నేరుగా పుణెలోని 'అభినవ్' కార్యాలయానికి తరలిస్తారు. అక్కడున్న స్వయంసహాయక బృందాల మహిళలు నాణ్యత ప్రకారం సరుకును విభజిస్తారు. శుభ్రంచేసి నిల్వచేస్తారు. గిరాకీని బట్టి మార్కెట్‌కు పంపుతారు. పుట్టీపుట్టగానే... అభినవ్ ఫార్మర్స్ క్లబ్ ఇంత వ్యవస్థీకృతం కాలేదు. అంచెలంచెలుగా ఎదిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంది. రైతుకు ధర మీద అవగాహన ఉండదు. దళారీ చెప్పిందే నిజమనుకుంటాడు. ఆకలితో అలమటిస్తున్న వారికి బేరమాడే శక్తి ఎలా వస్తుంది? ఏదో ఓ ధరకు పంట అమ్ముడుపోతే చాలనుకునే పరిస్థితి. రైతుల్ని మధ్యవర్తుల వలలోంచి బయటికి తీసుకురావాలన్నది 'అభినవ్' ప్రధాన లక్ష్యం. అప్పుడప్పుడే మాల్స్ హడావుడి మొదలైంది. కార్పొరేట్ దిగ్గజాలు రిటైలింగ్ రంగంలోకి వస్తున్నారు. ధ్యానేశ్వర్ నేరుగా వెళ్లి వారితో మాట్లాడాడు. దళారులు చెల్లిస్తున్న ధర కంటే..కనీసం 30 శాతం ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాకపోతే, రెండుమూడు నెలల సమయం అడిగారు. కొంతకాలం వేచి ఉండగలిగే రైతులకు ఇది మంచి బేరమే. కానీ మిగిలినవారి మాటేమిటి? హోటళ్ల మీదా హాస్టళ్ల మీదా దృష్టిపెట్టాడు. భారీమొత్తంలో ఆర్డర్లు రావడం మొదలుపెట్టాయి. కోరినన్ని కూరగాయలను కోరుకున్న సమయానికి సరఫరా చేయడం కత్తిమీద సామే. ముందు, గిరాకీకి సరిపడా సరఫరా పెంచాలి. అంటే, దిగుబడి పెరగాలి. సేద్యంలో అనిశ్చితి తొలగిపోవాలి. నేరుగా వినియోగదారుడికే కూరగాయలు వెళ్తే..ఎలా ఉంటుంది? రైతుల నుంచి కొనే చిన్న దళారీ ఉండడు. చిన్నదళారీ నుంచి కొనే పెద్ద దళారీ ఉండడు. సూపర్ మార్కెట్లవాళ్లూ కూరగాయల వ్యాపారులూ అసలు ఉండరు. మొత్తం రెండు అంచెలే! ఇద్దరూ గరిష్ఠ ప్రయోజనం పొందుతారు. రైతుకు గిట్టుబాటు ధర దొరుకుతుంది. వినియోగదారుడికి చవగ్గా కూరగాయలు అందుతాయి. 'అభినవ్' ప్రయోగం విజయవంతమైంది. పుణెలోని వందలాది అపార్ట్‌మెంట్లకు కూరగాయలు వెళ్తున్నాయి. నాలుగైదువేల కిలోల సరుకు దళారుల ప్రాబల్యమే లేకుండా చేరాల్సినవారికి చేరుతోంది. స్వయం సహాయక బృందాల మహిళలు శుభ్రంగా కడిగి ప్యాక్ చేస్తారు. వాహనాల్లో వాటిని తరలించి... జాబితా ప్రకారం సరఫరా చేస్తారు. మార్కెట్‌తో పోలిస్తే ధర చాలా తక్కువ. తాజాదనానికి తిరుగులేదు. దీంతో అభినవ్ ఫార్మర్స్ క్లబ్ కూరగాయలకు ఆదరణ పెరుగుతోంది. గుడ్లు, బియ్యం, పప్పుదినుసులు కూడా సరసమైన ధరకు అందిస్తున్నారు. డిమాండ్ ఎక్కువకావడంతో... సేంద్రియ పద్ధతుల్లో ప్రత్యేకంగా మేలురకం వరి పండిస్తున్నారు అభినవ్ రైతులు. పాడి, పంట - వేరువేరు కాదు! ఒకదానితో ఒకటి ముడిపడ్డాయి. ఫార్మర్స్ క్లబ్ పాడిని కూడా ప్రోత్సహిస్తోంది. నిజానికి, పట్టణాల్లో నాణ్యమైన పాలకూ పాల ఉత్పత్తులకూ చాలా గిరాకీ ఉంది. 'అభినవ్' బ్రాండ్ పేరుతో విక్రయాలు ప్రారంభించారు. మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ఈ పాలకు మంచి ఆదరణ ఉంది. రోజూ దాదాపు ఐదువేల లీటర్ల దాకా విక్రయిస్తున్నారు. ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. ఎన్ని పెద్దనోట్లు ఖర్చుపెట్టినా చిన్న కూరగాయల సంచీ కూడా నిండటంలేదు. మధ్యతరగతి జీవికి పళ్లెంముందు కూర్చుంటే కడుపునిండిపోదు, మండిపోతుంది - ఆ ధరల్ని తలుచుకుని. ఈ పరిస్థితుల్లో... మీ కూరగాయలు మీరే పండించుకోండి! అంటూ 'అభినవ్ ఫార్మర్స్ క్లబ్' సగటు మనిషికి చల్లని కబురు చెబుతోంది. అవును, ఎందుకు పండించుకోకూడదు? బాల్కనీ, టెర్రస్, పార్కింగ్ ఏరియా, పెరడు... ఎక్కడో ఓ చోట, ఎంతోకొంత జాగా ఉంటే చాలు. విత్తనాలు, మట్టి, కుండీలు, చిన్నాచితకా పనిముట్లు... అన్నీ క్లబ్బువాళ్లే ఇస్తారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బోధిస్తారు. వంటింటి వ్యర్థాలనే ఎరువుగా వాడుకోవచ్చు. వంకాయ, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, క్యాబేజీ... ఏమైనా పండించుకోవచ్చు. నిశ్చింతగా వండుకుతినొచ్చు. 'ఎంతైనా, మన పెరట్లో పండిన కూరగాయల రుచే వేరు. ఆహా! ఎంత తాజాగా ఉంటాయి! ఎంత కమ్మగా ఉంటాయి..' అంటూ పొంగిపోతారు రత్నా జయ్‌దేవ్ అనే గృహిణి. ఈ ప్రయోగం కూడా విజయవంతమైంది. దాదాపు మూడువందల ఫ్లాట్లలో పెరటి పంటలు పండుతున్నాయి. రోజుకు పదిహేను నిమిషాలు కేటాయించగలిగితే... వారానికి కనీసం రెండు కిలోల కూరగాయలు పండించుకోవచ్చని చెబుతారు ఫార్మర్స్ క్లబ్ సభ్యురాలు యోగిత. ఓ ఏడాదిదాకా నిర్వహణ బాధ్యత క్లబ్బువాళ్లదే. దీని ద్వారా వచ్చే నిర్వహణ రుసుము కూడా 'అభినవ్'కు ఓ ఆదాయ వనరే.'సేంద్రియ' మంత్రం రసాయన ఎరువులూ క్రిమిసంహారకాలూ లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. అందులోనూ పుణె పరిసర ప్రాంతాల్లో కొత్తకొత్త ఐటీ కంపెనీలు వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు..ఆర్గానిక్ రకాల కోసం కొంత ఎక్కువ చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటి కస్టమర్స్ కోసమే అభినవ్ ఫార్మర్స్ క్లబ్ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించింది. చూడముచ్చటైన అలంకరణతో చిన్నచిన్న దుకాణాల్ని తెరిచింది. మిగతా కూరగాయలతో పోలిస్తే ధర పదిహేను శాతం దాకా ఎక్కువగా ఉంటుంది. 'అభినవ్' ఆర్గానిక్ ఫలాల్నీ పండిస్తోంది. ఈ ఉత్పత్తులకు 'ఎకోసర్ట్' ధ్రువీకరణ కూడా వచ్చింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి పట్టణాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. నియంత్రిత వాతావరణంలో విదేశీకూరగాయల్ని పండించడం సాధ్యమే? ఏ అమెరికాలోనో సాగుచేయడానికి అయ్యేఖర్చులో పావుభాగం కూడా ఇక్కడ ఉండదు. ఎందుకంటే, మన దగ్గర శ్రమ చాలా చౌక. విదేశాలతో పోలిస్తే... సాంకేతిక పరిజ్ఞానం, ఎరువుల ధరలూ తక్కువే.దిగుమతి ఖర్చులు ఉండవు. విదేశీ పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే గోవాలోని కొన్ని రెస్టరెంట్లకు వాటిని విక్రయించడం ద్వారా... ఈ వ్యాపారంలోకి వచ్చింది అభినవ్. కాప్సికమ్, బేబీకార్న్, చైనీస్ క్యాబేజీ తదితర రకాల్ని పండిస్తున్నారు రైతులు. ఇంట్లోనే విదేశీ వంటలు వండుకోవాలనుకునేవారు కూడా ఈ ఖరీదైన కూరగాయల్ని ఇష్టంగా కొంటున్నారు. విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. కూరగాయల్ని నేరుగా అపార్ట్‌మెంట్లకే సరఫరా చేయడం, బియ్యం-పప్పు దినుసుల వ్యాపారం, పాల వ్యాపారం, పూల వ్యాపారం, పండ్ల వ్యాపారం, ఆర్గానిక్ సాగు, పూల అలంకరణలు, శిక్షణ కార్యక్రమాలు... రకరకాల మార్గాల్లో అభినవ్ ఫార్మర్స్ క్లబ్ సభ్యులు నెలనెలా నలభై నుంచి యాభైవేల దాకా సంపాదించుకుంటున్నారు. 'క్లాస్‌వన్ స్థాయి అధికారి జీతం కంటే, నా సంపాదనే ఎక్కువ' సగర్వంగా చెబుతాడు టమోటా రైతు బాలాజీరావ్. చక్కని ఇల్లు, వాహనం, బ్యాంక్ బ్యాలెన్స్... ఆ చూడముచ్చటైన జీవితాలు సేద్యానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాయి.
రైతు... రాజు కావచ్చు, కాకపోవచ్చు. కానీ, బిజినెస్‌మాన్... అయితీరాల్సిందే! వ్యవసాయ రంగానికి ధ్యానేశ్వర్ చెబుతున్న 'అభినవ్' వేదమిది! |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి