గ్రిడ్డు కాలం (Special news)


గ్రిడ్డు కాలం
కుప్పకూలిన ఉత్తర, తూర్పు, ఈశాన్య విద్యుత్‌ గ్రిడ్లు
స్తంభించిన జనజీవనం
21 రాష్ట్రాల్లో 60 కోట్లమందికి నరకయాతన
3 రాష్ట్రాల ఉల్లంఘనవల్లే..
తాగునీళ్లు లేవు
ఏటీఎంలు బంద్‌
మూగబోయిన సెల్‌ఫోన్లు
ఎక్కడి రైళ్లక్కడే
బొగ్గు గనుల్లో చిక్కుకుపోయిన 265 మంది కార్మికులు
న్యూఢిల్లీ - న్యూస్‌టుడే
దేశంలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఏర్పడింది. సగం జనాభా పలు గంటల పాటు విద్యుత్‌ లేక విలవిల్లాడింది. సోమవారం అర్ధరాత్రి ఉత్తరాది గ్రిడ్‌ వైఫల్యంతో మొదలైన నరకయాతన మంగళవారం చుక్కల్ని చూపించింది. వరుసగా రెండో రోజూ ఉత్తరాది గ్రిడ్‌ కుప్పకూలగా.. దీంతో పాటు తూర్పు, ఈశాన్యగ్రిడ్లు కూడా గుడ్లు తేలేశాయి. సుమారు 21 రాష్ట్రాల్లో 60 కోట్లమంది ప్రజలు నరకాన్ని చవిచూశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్ని రాష్ట్రాలు గ్రిడ్ల నుంచి అధిక విద్యుత్తు లాక్కోవడమే ఈ వైఫల్యానికి ప్రధాన కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇలాంటి రాష్ట్రాలపై చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యుత్తు శాఖామంత్రి సుశీల్‌కుమార్‌షిండే హెచ్చరించారు. మంగళవారం నాటి విద్యుత్‌ సంక్షోభాన్ని.. ప్రపంచం ఎదుర్కొన్న విద్యుత్తు విపత్తుల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మూడు గ్రిడ్‌లు విఫలమైనట్లు విద్యుత్తు మంత్రిత్వశాఖ పరిధిలోని నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ వెల్లడించింది. ఇలా ఒక్కసారే మూడు గ్రిడ్లు విఫలమవడం దేశంలో ఇదే తొలిసారి. ''తూర్పు గ్రిడ్‌ నుంచి మంగళవారం ఉదయం 3వేల మెగావాట్ల విద్యుత్‌ను అదనంగా లాక్కున్నట్లు నాకు అధికారులు చెప్పారు. దాన్ని ఆపాలని లేదా వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం'' అని హోంశాఖకు మారక ముందు షిండే చెప్పారు.
50వేల మెగావాట్ల విద్యుత్‌ నిలిచిపోవడంతో పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌, చండీగఢ్‌ (ఉత్తరాది గ్రిడ్‌), పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, సిక్కిం (తూర్పు గ్రిడ్‌), అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, మణిపూర్‌, మిజోరాం, త్రిపుర (ఈశాన్యగ్రిడ్‌)ల విలవిల్లాడాయి. ఈ సంక్షోభంతో సగం దేశంలో రైల్వే, నీటి సరఫరా సహా పలు పౌరసేవలు నిలిచిపోయాయి. సెల్‌ఫోన్ల ఛార్జింగ్‌ అయిపోయి సమాచారం స్తంభించింది. ఏటీఎంలు పనిచేయకపోవడంతో నగదు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. పది రాష్ట్రాల్లోని ఏడు జోన్లలో 300 రైళ్లను నిలిపివేశారు. రద్దీగా ఉండే ఢిల్లీ-హౌరా మార్గం దాదాపు స్తంభించిపోయింది. ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, తూర్పు, ఈశాన్య రైల్వేల సేవలపై ప్రభావం ఎక్కువగా పడింది. ముఖ్యమైన రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పారు.
ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తం 
ఉత్తరాది గ్రిడ్‌ వైఫల్యం ఢిల్లీపై మరోమారు తీవ్ర ప్రభావం చూపించింది. తాగడానికి నీళ్లులేవు. బయటికెళ్లడానికి రోడ్లు ఖాళీలేవు. ఊర్లకెళ్లడానికి రైళ్లులేవు. ఇంట్లోనే కూర్చుందామంటే ఫ్యాన్లులేవు. మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో దేశ రాజధాని మొత్తం విద్యుత్తు నిలిచిపోయింది. ఉత్తర గ్రిడ్‌ పడిపోయే సమయానికి ఢిల్లీలో 4 వేల మెగావాట్ల డిమాండ్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 1.45కు కేవలం 38 మెగావాట్లు మాత్రమే సరఫరాచేయగలిగినట్లు వెల్లడించారు. ప్రజారవాణాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మెట్రో రైలు సేవలు మధ్యాహ్నం ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సోమవారం నుంచే ఈ వ్యవస్థ స్తంభించింది. బ్యాకప్‌ జనరేటర్లతో నడిచినంతసేపు నడిచింది. తర్వాత మెట్రో రైల్వేస్టేషన్ల గేట్లు మూసేశారు. ఫలితంగా నగర ప్రయాణం నరకప్రాయంగా మారిపోయింది. కొన్ని రైళ్లు నడుస్తుండగానే ఆగిపోవడంతో ప్రయాణికులు మార్గమధ్యంలోనే చిక్కుకుపోయారు. తర్వాత అత్యవసర సరఫరా ద్వారా రైళ్లను గమ్యస్థానాలకు చేర్చి ఆపేశారు. కొన్ని రైళ్లు సొరంగాల్లో నిలిచిపోవడంతో వాటిని దగ్గరి స్టేషన్ల వరకు తీసుకొచ్చి ప్రయాణికులను ఖాళీ చేయించారు. మళ్లీ మధ్యాహ్నం మూడుగంటలకు సేవలను పునరుద్ధరించినా తక్కువ సంఖ్యలో నడిపారు. విమానాశ్రయంలో ముఖ్యమైన సేవలన్నింటినీ డీజిల్‌ జనరేటర్ల ద్వారా నడిపించారు. రోడ్లపై ట్రాఫిక్‌ సిగ్నళ్లు పనిచేయకపోవడంతో మొత్తం నగరమంతా ట్రాఫిక్‌ అస్తవ్యస్తమైపోయింది. ఆసుపత్రుల్లో సేవలకు ఇబ్బంది ఏర్పడింది. వివిధ పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లిన ప్రజలు సెల్‌ఫోన్లు పనిచేయక, రవాణా స్తంభించిపోయి నానా పాట్లు పడ్డారు. తూర్పు గ్రిడ్‌ విఫలమయిన సమయంలో బెంగాల్‌, జార్ఖండ్‌లోని బొగ్గుగనుల్లో 265 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కొన్ని గంటల నరకయాతన అనంతరం వారిని బయటకు తీసుకురాగలిగారు.

ఆ మూడు రాష్ట్రాలే కారణం 
హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు వాటి వాటాకంటే ఎక్కువ విద్యుత్తు లాక్కోవడమే మొత్తం సమస్యకు ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. జులై 14 నాడే ఈ మూడు రాష్ట్రాల అధికారులను కేంద్ర విద్యుత్తు నియంత్రణ సంస్థ పిలిచి మందలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతం పరిస్థితులను చక్కదిద్దడానికి దక్షిణ, పశ్చిమగ్రిడ్ల నుంచి విద్యుత్తు తీసుకుంటున్నారు. ఈశాన్య గ్రిడ్‌ పరిధిలో సరఫరాను పూర్తిగా పునరుద్ధరించినట్లు రాత్రి 8.30కు పవర్‌గ్రిడ్‌ తెలియజేసింది. ఢిల్లీలో పూర్తిగా, ఉత్తరాదిన 70శాతం వరకు సరఫనా పునరుద్ధరించినట్లు వెల్లడించింది. తూర్పు గ్రిడ్‌ పరిధిలో మాత్రం ఇంకా అంధకారం తొలగలేదు.
దక్షిణాదిగ్రిడ్‌ మినహా మిగతా గ్రిడ్లన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. వీటన్నింటినీ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 95వేల సర్క్యూట్‌ కిలోమీటర్ల మేర విద్యుత్‌ సరఫరా అవుతోంది. ఒక సర్క్యూట్‌ కి.మీ. అంటే ఒక కి.మీ. సరఫరా లైను. గ్రిడ్లు ఉత్పత్తి కేంద్రాలనుంచి విద్యుత్తును కేంద్రీకరించి లోడ్‌సెంటర్లకు అందిస్తుంటాయి. అక్కడ విద్యుత్‌ సరఫరా సంస్థలు వేటి వాటా అవి తీసుకుంటాయి. అక్కడినుంచి వినియోగదారులకు సరఫరా చేస్తారు. గ్రిడ్లకు అందుతున్న విద్యుత్తు, సరఫరా మధ్య సమతౌల్యం పాటించాల్సి ఉంటుంది. నిర్ణీత వాటాకంటే ఎవరైనా ఎక్కువ విద్యుత్తు లాక్కుంటే లైన్లు ట్రిప్‌ అయి గ్రిడ్‌ కుప్పకూలుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు