యువతరం 'కళ'వరం! (Eetaram 30/06/2012)



ప్రభుదేవాలా మెలికలు తిరగాలి... మైఖేల్‌ జాక్సన్‌లా 'డేంజరస్‌' స్టెప్పులేయాలి.. అదీ డ్యాన్సంటే! సగటు కుర్రకారు అభిప్రాయమిదే! దీనికి భిన్నంగా.. పెద్ద చదువులు చదివి, నాట్యంలో నంబర్‌వన్‌గా రాణించారు నలుగురు యువ తరంగాలు. పద కదలికలతో అదరగొడుతూ.. ఉపాధికి, సేవకు కళ ఓ సాధనమని నిరూపిస్తూ.. పురోగమిస్తున్న వారికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కారాలు సలాం కొట్టాయి. అవార్డులెన్నో గులాం అన్నాయి.పట్టా అందకుండానే కొలువు కోసం కలవరిస్తున్న రోజులివి. అవేమీ కాదనుకొని సంప్రదాయానికే జిందాబాద్‌ అంటున్నారు నలుగురు. చదివిన చదువుకు చక్కని ఉద్యోగాలు పొందే అవకాశమున్నా నాట్యకళపై మమకారం, సంప్రదాయాన్ని కాపాడాలనే తపనతో అటువైపు అడుగులేశారు. వారిలో ముగ్గురు యువకులది కూచిపూడి. అమ్మాయిది తణుకు.


కష్టపడి.. ఇష్టపడి
ఆరేళ్ల వయసులోనే రోజుకు ఆరుగంటల నృత్య సాధనతో రాటు దేలాడు చింతా రవి బాలకృష్ణఆ కష్టానికి ప్రతిఫలం బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కారం, పదుల అవార్డులు.'నాట్యం నీకేం ఇచ్చిందని కాదు నాట్యానికి నీవేం చేశావన్నదే ముఖ్యం' తండ్రి అన్న మాటలు చిన్నారి బాలకృష్ణలో నాటుకుపోయాయి. కూచిపూడి నృత్యమే లోకమైంది. తెల్లవారుజామున నాలుగింటికే లేచి సంగీత సాధన, సాయంత్రం బడి నుంచి రాగానే నాట్య శిక్షణ. వారిది అంత ఉన్నత కుటుంబం కాదు. చదవడానికి పేదరికం అడ్డొస్తే అతడి నృత్య ప్రతిభకు మెచ్చి ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు దాతలే చదివించారు. ఎనిమిదో ఏట మొదలైన అతడి ప్రదర్శనలు ఇప్పటికి రెండువేలు దాటాయి. తరంగ నృత్యం, పగటి వేషం, ఏకపాత్ర కేళిక ఏదైనా అతడు వేదికపై నర్తిస్తుంటే చప్పట్లే. అందిన పురస్కారాలూ తక్కువేం కాదు. కూచిపూడి నృత్యంలో ఎం.ఎ. గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. యువ సూత్రధారి, నృత్య కౌముది అవార్డులు గెల్చుకున్నాడు. అమెరికాలోని సిలికానాంధ్ర ఆధ్వర్యంలో 300 మందితో 2008లో నిర్వహించిన నృత్యోత్సవం గిన్నిస్‌ రికార్డులకెక్కింది. ఆ బృందంలో రవిబాలకృష్ణ సభ్యుడు. 2009లో ప్రతిష్ఠాత్మక బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కారం అందుకున్నాడు. తనని ఇంతటి స్థాయికి చేర్చిన కళామతల్లికి సేవ చేయాలనే ఉద్దేశంతో కూచిపూడి కళాపీఠంలో నృత్య బోధకుడిగా పనిచేస్తున్నాడు రవిబాలకృష్ణ.

నాట్య మయూరి... సేవల దారి!
పదం కదిపితే చప్పట్లు. కళ్లతో భావం పలికిస్తే కేరింతలు. నృత్య ప్రతిభకు వందల్లో అవార్డులు. ఇవేంజవ్వాది అంబికకి తృప్తినివ్వలేకపోయాయి. అడుగులు సేవల వైపు పడ్డాయి. పేరుతో పాటు ప్రశంసలందాయి.నాలుగేళ్ల కిందట. పోటీ గెలిచిన సంబరంలో ఉంది అంబిక. అదేరోజు హెచ్‌ఐవీ సోకిన చిన్నారుల హృదయ విదారక కథనం చదివింది. వెంటనే తన ప్రదర్శనకు వచ్చిన పారితోషికాన్ని ఆ చిన్నారులకు ఇచ్చేసింది. అది మొదలు. అంబిక పోటీలో గెల్చుకున్న నగదు, ప్రదర్శనకు అందే మొత్తాన్ని ఆ పిల్లలకివ్వడం అలవాటుగా మార్చుకుంది. నాలుగో ఏటే నృత్యంలో ఓనమాలు దిద్దిన అంబిక కూచిపూడి, జానపద, పాశ్చాత్య నృత్యాలపై పట్టు సాధించింది. ఆమెకే ప్రత్యేకమైంది రింగ్‌ డ్యాన్స్‌. ప్రదర్శన ముగిసే వరకూ తన నడుం చుట్టూ ఓ రింగ్‌ తిప్పుతూనే ఉంటుంది. పాఠశాల స్థాయిలో మొదలుపెట్టి ఇండియాతోపాటు కువైట్‌, మలేసియా, దుబాయ్‌, అమెరికాల్లో ఎనిమిది వందల ప్రదర్శనలిచ్చింది. విజయవాడ, ఏలూరు, తణుకు, కొవ్వూరుల్లో స్వచ్ఛంద సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న అనాథ పిల్లలకి స్వయంగా దుస్తులు, సామాగ్రి అందిస్తోంది. నాలుగేళ్లుగా తన పుట్టినరోజుని పిల్లల మధ్యే జరుపుకుంటోంది. నిరాదరణకు గురైన 20 మంది వృద్ధులకూ నెలనెలా కొంతమొత్తం ఆర్థిక సాయం చేస్తోంది. నృత్యంలోనూ అంబికది చెప్పుకోదగ్గ ప్రతిభ. నాట్య శిరోమణి, ప్రజ్ఞాబాల పురస్కారం, గోదావరి ప్రతిభ పురస్కారం, ఉగాది కళా విజ్ఞానవర్షిణి వంటి బిరుదులు జాతీయ స్థాయిలో సూపర్‌కిడ్‌, సంక్రాంతి బాల, ఉగాది పురస్కారాలు గెలిచింది.

- టి.దొరబాబు, న్యూస్‌టుడే: తణుకు

నాట్య వారసత్వం
కూచిపూడి నృత్యాన్నే శ్వాసించిన కుటుంబ నేపథ్యం వేదాంతం వెంకట నాగచలపతిది.తాతతండ్రుల్లా పేరు తెచ్చుకోవాలనే ఆరాటం చిన్నప్పుడే మొదలైంది. ఫలితం.. వందల ప్రదర్శనలు, చిన్న వయసులోనే పెద్దపేరు.ప్రఖ్యాత నాట్య గురువు వేదాంతం రాఘవయ్య, వెంకట నాగచలపతి (వెంకూ) పెదనాన్న. ఆయన ప్రేరణతో చిన్నప్పుడే కాలికి గజ్జె కట్టాడు. తండ్రి, బాబాయ్‌ల శిష్యరికంలో ఐదో ఏటే తొలి ప్రదర్శన ఇచ్చాడు. యుక్త వయసు వచ్చేసరికి క్లిష్టమైన ప్రహ్లాద యక్షగానంలో పట్టు సాధించాడు. ప్రముఖ నాట్యాచార్యుడు పద్మభూషణ్‌ వెంపటి చినసత్యం నేతృత్వంలో అమెరికా, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో 200కు పైగా నాట్య ప్రదర్శనలిచ్చాడు. పురుషుడిగా ఎంత రెచ్చిపోతాడో స్త్రీగా హావభావాలు పలికించడంలోనూ వెంకూ దిట్టే. ఆ ప్రతిభే కె.విశ్వనాధ్‌ శుభప్రదం సినిమాకి నృత్యరీతులు సమకూర్చేలా చేసింది. కేంద్ర సంగీత, నాటక అకాడమీ 2006లో ప్రవేశపెట్టిన 'బిస్మిల్లా ఖాన్‌ యువపురస్కారం' అందించింది. శిక్షణ, ప్రదర్శనలతో క్షణం తీరిక లేకున్నా చదువుపై మమకారంతో బీకామ్‌ పూర్తి చేశాడు వెంకూ. ప్రస్తుతం వేదాంత విజ్ఞానంపై పీహెచ్‌డీ చేస్తున్నాడు. పేద యువ కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 'భాగవతుల మేళా' పేరిట వాళ్లతో ప్రదర్శనలు ఇప్పిస్తున్నాడు.

అవకాశాలు వదిలి!
ప్రఖ్యాత గురువు వెంపటి పెదసత్యం తన శిష్యులకు నాట్యం నేర్పిస్తుంటే చాటుగా చూస్తూ పాదాలు కదిపేవాడు ఏలేశ్వరపు శ్రీనివాసులు. జిజ్ఞాస ఏడేళ్లకే అతడిని కూచిపూడి బాట పట్టించింది.దువు, నాట్య సాధనని ఒడుపుగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాడు శ్రీనివాసులు. పదిహేనో ఏట తొలి ప్రదర్శన. ఇప్పటికి పదిహేను వందలు దాటాయి.అమెరికా, కెనడా, యూరోప్‌ సహా మనదేశంలో రాష్ట్రాలన్నీ తిరిగాడు. కృష్ణుడు, రాముడు, బాణాసురుడు, స్త్రీ పాత్రలు ఏది వేసినా హావభావాల్ని అలవోకగా పలికించడమే. మనకే ప్రత్యేకమైన సంప్రదాయ కూచిపూడి నృత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందని శ్రీనివాసులు అభిప్రాయం. ఈ నృత్యంపై పట్టు సాధిస్తే లభించే గౌరవమే వేరుగా ఉంటుందంటాడు. ఉన్నత చదువులు చదివినా, వేరేచోటస్థిరపడే అవకాశమున్నా వంశపారంపర్యంగా వస్తున్న నాట్య సంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కూచిపూడి కళాపీఠంలోనే నాట్య పాఠాలు బోధిస్తున్నాడు. 2010కి బిస్మిల్లాఖాన్‌ యువపురస్కారానికి ఎంపికయ్యాడు. అంతకు ముందు నృత్యకౌముది, ఉగాది పురస్కారాలందాయి.
-డి.వి.వి.నాగేశ్వరరావు, న్యూస్‌టుడే: కూచిపూడి
























కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు