వ్యాపార వ్యూహాలకు రెక్కలొస్తాయి. క్త్లెంట్ల సమాచారం బట్టబయలు అవుతుంది. కీలక ఫార్ములాలను ఎవరో కొట్టేస్తారు. నెట్‌వర్క్‌లో ఏ అజ్ఞాతవ్యక్తో చొరబడతాడు - కార్పొరేట్ ప్రపంచంలో రకరకాల చౌర్యాలు. జేమ్స్‌బాండ్ చిత్రాలను తలపించే గూఢచర్యాలు.
ష్... నిశ్శబ్దం! అద్దాల గోడలకు చెవులుంటాయి. చీమ చిటుక్కుమన్నా రికార్డయిపోతుంది. నక్కినక్కి నడవండి! ధగధగల విద్యుత్ దీపాలకు కళ్లుంటాయి. ప్రతి కదలికా కెమెరాలకు ఎక్కుతుంది. ప్లీజ్ వెల్‌కమ్! రిసెప్షనిస్టు చిరునవ్వులకు ఫిదా అయిపోకండి. సుతిమెత్తని కరచాలనానికి కరిగిపోకండి. ఆమె కళ్లు స్కానర్లు. ఆమె స్పర్శ అయస్కాంతం! నమస్తే సార్! లిఫ్ట్‌బాయ్ వినయానికి మురిసిపోకండి. అతను గూఢచారి కూడా. ఎవరేం మాట్లాడుకున్నా...చేరాల్సిన వాళ్లకు చేరిపోతుంది. తప్పదు, ఎవర్నయినా అనుమానించాల్సిందే. ఎందుకంటే...కార్పొరేట్ కార్యాలయాలు యుద్ధరంగాలు అవుతున్నాయి. వ్యూహప్రతివ్యూహాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. నాణ్యత మాత్రమే సరిపోదు. అమ్మకాలు ఉన్నంత మాత్రాన పండగైపోదు. మనం ఎదగడం ముఖ్యమే. శత్రువు ఎదుగుదలను అడ్డుకోవడం అంతకంటే ముఖ్యం.ఎత్తులు వేయాలి. పోటీ సంస్థల్ని చిత్తుచిత్తు చేయాలి. వెనుక నుంచి కొట్టామా, ముందు నుంచి కొట్టామా అన్నది కాదు - కొట్టామా లేదా! నైతికమా, అనైతికమా అన్నది కాదు - నెగ్గామా లేదా! అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) తాజా సర్వే... అద్దాలగోడల వెనుక అతి రహస్యంగా వండివారుస్తున్న వ్యాపార వ్యూహాలను బట్టబయలు చేసింది. దేశంలోని దాదాపు 35 శాతం కార్పొరేట్ కంపెనీలు ఏదో ఒక రూపంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాయి. అది...కీలక గణాంకాల కోసం కావచ్చు, ఫార్ములాలు తెలుసుకోడానికి కావచ్చు, వ్యూహాలు పసిగట్టడానికి కావచ్చు, ఏకంగా పునాదుల్నే కూల్చేయడానికి కావచ్చు! అసోచామ్ దాదాపు 1500 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో మాట్లాడింది. ఆటోమొబైల్, బయోటెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆరోగ్యం, ఐటీ...ఒకటని ఏమిటి, పోటీ ఉన్న ప్రతిచోటా, వ్యూహ ప్రతివ్యూహాలకు ఆస్కారం ఉన్న ప్రతిరంగంలో...ఎంతోకొంత గూఢచర్యం తప్పదని వాళ్లంతా అంగీకరించారు. ఆలెక్కన...సూటూబూటూ వేసుకున్న ప్రతిబాసూ ఒక బాండే, జేమ్స్ బాండే! ఎవరికి తెలుసు, ఆ కార్పొరేట్ పౌరుడికి చాణక్యుడు పూనాడేమో, మాకియవెల్లీ ఆత్మ కంపెనీ ఆవరణలో పచార్లు చేస్తోందేమో.
తయారీ ఫార్ములా... ఏ సంస్థకైనా మేధోపరమైన ఆస్తి. దాన్ని రూపొందించడానికి ఎంతో శ్రమించి ఉంటారు. ఎన్నో కోట్లు ఖర్చుచేసి ఉంటారు. ఇక... బ్యాంకింగ్, బీమా తదితర రంగాల్లో ఖాతాదారుల వివరాలు అత్యంత గోప్యమైనవి. ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతే చాలా కష్టం, పూడ్చుకోలేని నష్టం. మార్కెటింగ్‌కు సంబంధించీ భవిష్యత్ విస్తరణకు సంబంధించీ ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. సప్తసముద్రాలకు అవతల, ఒంటిస్తంభం మేడ మీద, బంగారు పంజరంలోని అందాల రామచిలుకలో మాంత్రికుడి ప్రాణాలు ఉన్నట్టు...సంస్థల మనుగడంతా ఇలాంటి కీలక సమాచారం మీదే ఆధారపడి ఉంటుంది. బయటికి పొక్కకుండా ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. ఆ రక్షణ వలయాన్ని ఛేదించి...రహస్యాల్ని సాధించడానికి పోటీ సంస్థలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ కార్పొరేట్ యుద్ధం చాలా గుట్టుగా పకడ్బందీగా సాగుతుంది. గత ఏడాది, ఓ భారతీయ కంపెనీ అమెరికన్ సంస్థకు చెందిన నీటిశుద్ధి టెక్నాలజీని కాపీ కొట్టింది. అది సిబ్బంది సాయంతో కావచ్చు, మరో మార్గంలో కావచ్చు. మొత్తానికి వ్యవహారం బట్టబయలైంది. అమెరికన్ సంస్థ కోర్టుకెక్కింది. ముక్కుపిండి మరీ, నష్టపరిహారాన్ని వసూలు చేసింది.
ఆటోమొబైల్ రంగంలో డిజైనింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. బండి మార్కెట్‌లో విడుదలయ్యేదాకా కంపెనీలు ఆ సమాచారాన్ని రహస్యంగా ఉంచుతాయి. ఇటీవల ఓ ప్రసిద్ధ మోటారు వాహనాల కంపెనీ కొత్తబైక్ రూపకల్పనకు నడుంబిగించింది. ప్రాజెక్టు వివరాలు బయటికి పొక్కకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అయినా, డిజైన్ గేటు దాటింది. పోటీ సంస్థ సరిగ్గా అలాంటి ప్రత్యేకతలతోనే సరికొత్త బైక్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. క్యాంటీన్ కాంట్రాక్టరును ప్రలోభపెట్టి ఆ సమాచారాన్ని తస్కరించారని ఆతర్వాత తెలిసింది. అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ క్త్లెంటు దొరికాడంటే పండగే! బెంగళూరులోని ఓ చిన్న కంపెనీ, ఏకంగా దిగ్గజం మీదే డేగకన్నేసింది. ఆ సంస్థ ఏ దేశం మీద దృష్టిసారించిందో తెలుసుకుని, అంతకంటే ముందే అక్కడ ప్రత్యక్షమయ్యేది. క్త్లెంట్లను కలిసి ఆకర్షణీయమైన ఆఫర్లు ఇచ్చేది. తమ కంపెనీ ప్రతినిధుల పర్యటనల గురించి ఆ సంస్థకెలా తెలిసిపోతుందో దిగ్గజానికి అర్థంకాలేదు. అసలు రహస్యం ఏమిటంటే...పెద్ద కంపెనీకి విమానం టికెట్లు బుక్‌చేసి పెట్టే ట్రావెల్ ఏజెన్సీని అది బుట్టలో వేసుకుంది.
సమాచార చోరీ అయితే, చాలా గుట్టుగా జరిగిపోతుంది. పెన్‌డ్రైవ్‌లాంటి చిన్న పరికరం చాలు. కంపెనీ చరిత్రనంతా కాపీ చేసుకోవచ్చు. గొళ్లెం విరగ్గొట్టి ఇంట్లో ప్రవేశించినట్టు... హ్యాకింగ్ ద్వారా శత్రు సంస్థ నెట్‌వర్క్‌పై ఆధిపత్యం సంపాదించవచ్చు. కసిగా ఉంటే ధ్వంసం చేసేయవచ్చు. మరీ అరుదుగా తప్ప ఇలాంటి వ్యవహారాలు బయటికి పొక్కవు. చాలా సందర్భాల్లో నేరాల్ని నిరూపించడం అసాధ్యం. కోర్టుల చుట్టూ తిరగడం, మీడియాలో కనిపించడం చాలా సంస్థలకు ఇష్టం ఉండదు. దీంతో కార్పొరేట్ సంస్థలు ద్విముఖ వ్యూహంతో తంత్రరచన చేస్తున్నాయి. తమను తాము రక్షించుకుంటూనే, పోటీ సంస్థ కోటలో పాగా వేస్తున్నాయి. డిటెక్టివ్‌లు, హ్యాకర్లు, కోవర్టులు - ఈ గూఢచర్యంలో ప్రధాన పాత్రధారులు.
గూఢచారి నం.1 సౌందర్య సాధనాల తయారీలో అంతర్జాతీయంగా పేరున్న ఓ కంపెనీ పోటీసంస్థ తయారు చేస్తున్న షాంపూ ఫార్ములాను తెలుసుకోడానికి తన మనిషిని పంపింది. ఆ గూఢచారి కార్పొరేట్ ఆఫీసులో పాగా వేశాడు. పరిచయాలు పెంచుకున్నాడు. స్నేహం నటించాడు. ఎవరి బలహీనతలేమిటో తెలుసుకున్నాడు. ఎవరికేం సమర్పించాలో సమర్పించాడు. సరిగ్గా...ఫార్ములా కాగితం చేతికొచ్చే సమయానికి... మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందింది. పన్నాగం బెడిసికొట్టింది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇటీవలి కాలంలో కార్పొరేట్ వ్యవహారాల్లో డిటెక్టివ్‌ల ప్రాధాన్యం పెరుగుతోంది. నిఘా పెట్టినందుకు, నీడలా వెంటాడినందుకు, కోవర్టులను సాక్ష్యాలతోసహా పట్టించినందుకు డిటెక్టివ్ ఏజెన్సీలకు ముట్టే పారితోషికం లక్షల్లో ఉంటోంది. సంస్థ స్థాయిని బట్టి, కేసు తీవ్రతను బట్టి కోట్లలోనూ ఉండవచ్చు. అసోచామ్ దాదాపు పదిహేను వందలమందిని సర్వే చేయగా...అందులో పన్నెండు వందలమంది సీయీవోలు, 'నిజమే, పోటీ సంస్థల కదలికల్ని గమనించడానికి గూఢచార సంస్థల సహకారం తప్పనిసరి అవుతోంది' అని అంగీకరించారు. కార్పొరేట్ వార్‌లో ఎవరూ యుద్ధభేరి మోగించరు. సమరం...నిశ్శబ్దంగా మొదలవుతుంది. ఆవైపున ఉన్నది శత్రువులనీ ఈవైపున ఉన్నది మిత్రులనీ భ్రమపడటానికి వీల్లేదు. శత్రువు మిత్రుడిలా నటించవచ్చు. మిత్రుడు శత్రువుల్లో కలిసిపోయి ఉండవచ్చు. ఎవరూ ఎవరిమీదా భౌతికంగా దాడులుచేయరు. కానీ, కోలుకోలేని దెబ్బకొడతారు. 'అంతుచూస్తా'మంటూ ప్రతిజ్ఞలు చేయరు. తీయతీయగా కత్తిదూస్తారు. ఇది మేధోయుద్ధం. వ్యూహం ప్రతివ్యూహంతో ఢీకొంటుంది. పైఎత్తు, ఎత్తును చిత్తుచేస్తుంది. ఈ పోరులో డిటెక్టివ్ ఏజెన్సీలదే కీలకపాత్ర. అసోచామ్ సర్వేలో...దాదాపు 350 డిటెక్టివ్ ఏజెన్సీల ప్రతినిధులు కార్పొరేట్ యుద్ధంలో తమ పాత్రను నిర్ధరించారు.
సిబ్బందిపైనా డేగకన్ను... వేలకోట్ల ప్రాజెక్టుల వివరాలు, మనుగడకు సంబంధించిన రహస్యాలు, కీలక వ్యూహాలు, పుట్టిముంచే బలహీనతలు, చట్టానికి పట్టించే దొడ్డిదారి కార్యక్రమాలు - అన్నీ తెలుసు, సిబ్బందికి అన్నీ తెలుసు! కార్పొరేట్ సంస్థల్లో నమ్మకస్థులకే ప్రాధాన్యం. ఒకటిరెండు పరీక్షలు నెగ్గాక కానీ పెద్దపీట వేయరు. అయినా, ఎక్కడో అనుమానం. మనిషి స్వభావమే అంత - మహాచంచలం! పెద్దపెద్ద కంపెనీల టర్నోవరు చిన్నాచితకా దేశాల స్థూల దేశీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. కీలక వ్యక్తుల మీద కన్నేసి ఉంచకపోతే కొంపకొల్లేరవుతుంది. ఆఫీసు బయట డిటెక్టివ్‌ల 'షాడోయింగ్' ఉండనే ఉంటుంది. ఎక్కడికెళ్తున్నదీ ఎవరిని కలుస్తున్నదీ తెలుస్తూనే ఉంటుంది. ఇంట్లో ఏం జరుగుతోంది? క్యాబిన్‌లో కూర్చుని ఏం చేస్తున్నారు? కంపెనీ తరపున ఇచ్చే సెల్‌ఫోన్ల మీదే కాదు, వ్యక్తిగత నంబర్ల మీద కూడా నిఘా ఉంటుంది. ఎవరితో మాట్లాడిందీ ఎన్నిసార్లు మాట్లాడిందీ తెలుసుకోవడం ఈరోజుల్లో పెద్ద సమస్యేం కాదు. ఇక, ఈ-మెయిళ్లపై నిఘా ఉంచడానికి చాలా సంస్థలు నిపుణుల సహాయం తీసుకుంటున్నాయి.
బ్లాగు బాతాఖానీల్లో, ట్వీట్‌లలో 'నోరుజారే...' ఉద్యోగులు బోలెడంతమంది. ఇలాంటివారి వల్లే చాలా సమాచారం పోటీ సంస్థలకు చేరిపోతోంది. అవన్నీ పెద్దపెద్ద రహస్యాలు కానక్కర్లేదు. 'ఫలానా తేదీన ఫలానా నగరంలో మా కంపెనీ సమావేశం జరుగుతోంది. నేనూ వెళ్తున్నా' అని ఓ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో ప్రకటించాడు అనుకోండి. ఆ మాత్రం కూపీ చాలు. వైరి వర్గాలు మరింత లోతుగా వెళ్లి వివరాలు రాబడతాయి. 'మా బాసుకు స్కాచ్ అంటే చచ్చేంత ఇష్టం'.. అని ట్వీట్ ఇస్తే - ఓ ఉన్నతోద్యోగి బలహీనత గురించి ప్రత్యర్థి వర్గాలకు తెలిసిపోయినట్టే. సదరు ఉద్యోగిని దార్లోపెట్టడానికి ఓ చిట్కా అందించినట్టే. 'ప్చ్...ఎంత కష్టపడినా ప్రమోషన్ రావడం లేదు' అంటూ బ్లాగులో బాధపడిపోయే ఉద్యోగి అసంతృప్తిని, పోటీ సంస్థ స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశాలు పుష్కలం. ఇలాంటి చేపలు తొందరగా వల్లో పడిపోతాయి కూడా. అసోచామ్ నివేదికలో... దాదాపు పదకొండువందల మంది ఉన్నతాధికారులు పోటీ సంస్థల ఉద్యోగుల సోషల్‌నెట్‌వర్కింగ్‌పై గూఢచర్యాన్ని అంగీకరించారు. ఫేస్‌బుక్, ట్విటర్, యు-ట్యూబ్, గూగుల్ ప్లస్, లింక్డిన్, ఫ్రెండ్‌స్టర్ ...మొదలైన వాటిపైన ఓ కన్నేసి ఉంచుతామని చెప్పారు. నెట్‌వర్క్‌లపై దాడి చేయడానికీ శత్రువుల ఈ-మెయిళ్లు ఛేదించడానికీ ప్రత్యేకంగా నిపుణుల్ని నియమించుకుంటున్నట్టు నాలుగోవంతు కార్పొరేట్ పెద్దలు స్పష్టంచేశారు.
ఓ వాహన తయారీ సంస్థ ఉద్యోగులు హఠాత్తుగా సమ్మెకు దిగారు. ఫలితంగా ఉత్పత్తి పడిపోయింది. గిరాకీకి సరిపడా వాహనాల్ని అందించలేకపోయారు. సరిగ్గా అదే సమయంలో...పోటీ సంస్థ ఉత్పాదనలు మార్కెట్‌లో వెల్లువెత్తాయి. ప్రచారం హోరెత్తింది. అప్పటిదాకా రెండో స్థానంతో సర్దుకుపోయిన కంపెనీ మొదటి స్థానానికి చేరుకుంది. ఓ ఉద్యోగిపై భద్రతా సిబ్బంది చేయిచేసుకోవడం సమ్మెకు ప్రధాన కారణమని కార్మిక సంఘాలు ప్రకటించినా... ఒకరిద్దరు యూనియన్ నాయకులతో శత్రుసంస్థ కుదుర్చుకున్న రహస్య ఒప్పందం వల్లే ఇదంతా జరిగిందన్నది విశ్వసనీయ సమాచారం. అసోచామ్ సర్వే ...కార్మిక సంఘాలపై నిఘానేత్రాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. వివిధ ఆరోపణలతో గడపదాటిన మాజీ ఉద్యోగుల మీద కూడా చాలా సంస్థలు నిఘా పెడుతున్నాయి.
అనుకున్నపని అనుకున్నట్టుగా జరగాలంటే...శత్రు సంస్థల్లో మిత్రుల్ని సంపాదించుకోవాలి. కోవర్టుల కోసం అంజనమేసి గాలించాలి. అసోచామ్ నివేదిక కూడా ఇదే చెబుతోంది. చాలా కార్పొరేట్ కంపెనీలు చిన్నాచితకా ఉద్యోగుల నియామకాల్ని తేలిగ్గా తీసుకుంటాయి. లేదంటే ఆ బాధ్యత మరో సంస్థకు ధారాదత్తం చేస్తాయి. అదే అదనుగా భావించి... పోటీ కంపెనీల్లో తమ ప్రతినిధులకు (డిటెక్టివ్ భాషలో-అండర్ కవర్ ఏజెంట్లు!) ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటాయి శత్రు సంస్థలు. ముంబయిలోని ఓ బ్యాంకింగ్ సంస్థ గణాంకాలు ఎప్పటికప్పుడు ప్రత్యర్థి కంపెనీకి చేరిపోయేవి. ఎంత నిఘా పెట్టినా...ఫలితం లేకపోయింది. చివరికి, చిత్తుకాగితం కూడా ఆవరణ దాటడానికి వీల్లేదని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా, గణాంకాలు గల్లంతు అవుతూనే ఉన్నాయి. ఎందుకో అనుమానం వచ్చి, జెరాక్స్ ఆపరేటర్‌పై నిఘా పెడితే...బండారం బయటపడింది. కొన్ని సందర్భాల్లో..కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా కోవర్టులుగా మారుతున్నట్టు తెలుస్తోంది.నిఘా యంత్రాలు.. క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలూ (సీసీ టీవీలు) సూక్ష్మ కెమెరాలూ జేబు గుండీ పరిమాణంలోని రికార్డర్లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్... మొదలైన నిఘా పరికరాల మార్కెట్ భారత్‌లో అనూహ్యంగా పెరుగుతోందని అసోచామ్ సర్వే చెబుతోంది. ఆ విలువ .. దాదాపు 4,500 కోట్లని అంచనా. అందులో సీసీ టీవీల వాటా ఇరవైశాతం దాకా ఉంటుంది. 'ఎయిర్ ఫ్రెషనర్' అనే పరికరం, పేరుకు తగ్గట్టే గాల్లో సుగంధాలు వెదజల్లుతుంది. అందులో ఓ సిమ్‌కార్డు పెడితే... పరిసరాల్లోని కదలికలన్నీ మన బ్లాక్‌బెర్రీలో కనబడుతూ ఉంటాయి. నానో టెక్నాలజీ పుణ్యమాని ... గుండుసూది పరిమాణంలోనూ నిఘా పరికరాలు దొరుకుతున్నాయి. గూఢచర్య యంత్రాల్ని నిర్వీర్యం చేసే జామర్లు మార్కెట్లో ఉన్నాయి. హ్యాకింగ్ విషయానికొస్తే, మెయిల్స్ ట్రాక్ చేయకుండా, కాపీ చేయడం వీలుకాకుండా, కనీసం ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా... లక్ష్యానికి చేర్చే సాఫ్ట్‌వేర్లు అందుబాటులోకి వచ్చాయి. 'అయినా మన దేశంలో అత్యాధునిక పరికరాలతో పనేముంది? పూసగుచ్చినట్టు చెప్పడానికి బోలెడంతమంది కోవర్టులున్నారు' అని వ్యాఖ్యానిస్తారో డిటెక్టివ్ ఆఫీసర్. నిజమే, సాక్షాత్తు కేంద్ర మంత్రి కార్యాలయంలో నిఘా పరికరాలు ఏర్పాటు చేయడం సాధ్యమైన దేశంలో, ఏది మాత్రం అసాధ్యం?
వలపు బాణం... మహా నిజాయతీపరుడు, డబ్బుకు లొంగడు. చాలా తెలివైనవాడు, ఎంత ప్రయత్నించినా బుట్టలో పడడు. సంస్థ అంటే గౌరవం, ఒక్క రహస్యమూ బయటికి చెప్పడు. ఈకాలంలో పుట్టాల్సినవాడు కాదు, చిన్న వ్యసనం కూడా లేదు. ఇలాంటి సందర్భాల్లో కార్పొరేట్ చాణక్యులు...తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగిస్తారు -మగువ!
స్క్రీన్‌ప్లే సిద్ధమైపోతుంది. మెరుపుతీగ లాంటి అమ్మాయి రంగంలో దిగుతుంది. ఎక్కడో ఏ పార్టీలోనో యాదృచ్ఛికంగా పరిచయం అవుతుంది. లేదంటే, ఏ రాంగ్‌కాల్ రూపంలోనో తీయగా పలకరిస్తుంది. ఏ సోషల్ నెట్‌వర్క్‌సైట్ ద్వారానో 'ఫ్రెండ్ రిక్వెస్ట్' పంపుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రగాఢం అవుతుంది. వారాంతాల్లో .. రిసార్ట్స్‌కు చెక్కేయడం దాకా వస్తుంది. యథాలాపంగా అడిగినట్టే..అన్ని విషయాలూ అడుగుతుంది. ఒక్కో రహస్యం రాబడుతుంది. ఇంకేముంది, మేకపిల్ల బలైపోయినట్టే! ముద్దూమురిపాలతో పని కాకపోతే నయానోభయానో కక్కిస్తుంది. అప్పటికే అయ్యగారి అర్ధనగ్న వీడియోలు సిద్ధంగా ఉంటాయి. శృంగార సంభాషణల రికార్డులు భద్రంగా ఉంటాయి. డిటెక్టివ్ పరిభాషలో ఈ వ్యూహం పేరు...'హనీ ట్రాప్' - బ్రహ్మాస్త్రం టుది పవర్ ఆఫ్ బ్రహ్మాస్త్రం!
* * *వ్యూహ ప్రతివ్యూహాలు, గూఢచర్య ప్రతిగూఢచర్యాలు, ఎత్తులూ పైఎత్తులూ... వీటన్నిటిమధ్యా స్టాక్‌మార్కెట్‌లో షేర్ విలువ పైపైకి ఎగబాకవచ్చు. బ్యాలెన్స్‌షీట్‌లో అంకెల బరువు ఎక్కువ కావచ్చు. కంపెనీ ఆస్తులూ అంతస్తులూ పెరగొచ్చు. కానీ నైతిక పునాదులు మాత్రం బీటలు వారతాయి. నీదీ అద్దాల మేడే అయినప్పుడు, ప్రత్యర్థిదీ అద్దాల మేడే అయినప్పుడు... ఆవేశపడి రాళ్లు రువ్వుకుంటే... ఇద్దరూ నష్టపోతారు.కార్పొరేట్ ప్రపంచం ఆలోచించాల్సిన విషయం ఇది.
|
ష్...రహస్యం!''ఓకార్పొరేట్ సంస్థ వ్యాపార ఒప్పందాల వివరాలన్నీ శత్రువులకు తెలిసిపోయేవి. ఎంత నిఘా పెట్టినా ఫలితం లేకపోయింది. ఏదో సమావేశంలో, ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టరు సెల్‌ఫోన్ చేజారి కింద పడిపోయింది. మరమ్మతు కోసం సర్వీస్ సెంటర్‌కు పంపినప్పుడు, అసలు విషయం తెలిసింది. ఆ ఫోన్ నుంచి వెళ్లే ప్రతికాల్ మరో వ్యక్తికి వినిపించేలా ఓ సాఫ్ట్‌వేర్‌ను అందులో ఇన్‌స్టాల్ చేశారు. సెల్‌ఫోన్ కంపెనీ నుంచి 'ఫ్రీ సర్వీస్' ఇవ్వడానికి వచ్చానంటూ రెండు నెలల క్రితం ఓ యువకుడు తనముందే ఫోన్‌ను విప్పదీసిన సంగతి అప్పుడు గుర్తుకొచ్చిందా కార్పొరేట్ లీడర్‌కు'' |
క్లీన్ షేవ్..''ప్రఖ్యాత షేవింగ్ రేజర్ల తయారీ కంపెనీ త్వరలోనే మార్కెట్‌లో విడుదల చేయనున్న సరికొత్త మోడల్ వివరాలు శత్రుసంస్థ చేతికి అందాయి. అసలు సరుకు కంటే ముందే, కాపీ సరుకు మార్కెట్లోకి వచ్చింది. ఓ సూపర్ వైజర్ స్థాయి ఉద్యోగి వ్యక్తిగత మెయిల్ నుంచి వివరాలు బయటికి వెళ్లినట్టు పరిశోధనలో తేలింది. ఆ ఉద్యోగి కూడా నిజం ఒప్పుకున్నాడు. 'మా మేనేజరు పరమ దుర్మార్గుడు. ఆయన మీద కోపంతోనే ఈ పనిచేశాను' అని చెప్పాడు. ఎందుకు చేసినా తప్పు తప్పే. శిక్ష అనుభవించాల్సిందే'' |
లాప్‌టాప్ జాగ్రత్తఓఔషధ తయారీ కంపెనీ అమ్మకాల వివరాలూ డీలర్ల జాబితా పోటీ సంస్థ చేతికి చిక్కాయి. అదీ ఓ ఉన్నతోద్యోగి లాప్‌టాప్ నుంచే వెళ్లినట్టు ఆధారాలు దొరికాయి. కానీ ఆయన చాలా నమ్మకస్థుడు. వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం. మరి, ఎలా జరిగింది? సదరు అధికారి మార్కెటింగ్ బాధ్యతలమీద దేశమంతా తిరుగుతారు. పెద్దపెద్ద హోటళ్లలో బస చేస్తారు. పోటీ సంస్థ ఆయనను నీడలా వెంటాడింది. లాప్‌టాప్‌ను తన హోటల్ గదిలోనే వదిలేసి...పై అంతస్థులో ఉన్న రెస్టరెంట్‌కు వెళ్లినప్పుడు... 'రూమ్ సర్వీస్' సిబ్బంది వేషంలో ఓ వ్యక్తి తలుపు తెరుచుకుని వెళ్లి, డేటా దొంగిలించాడు. |
చెత్త ఐడియా...''పేర్లెందుకు కానీ, రెండూ అంతర్జాతీయ దిగ్గజాలే. రెండు సంస్థల అధినేతలూ ప్రపంచ కుబేరులే. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి రహస్యాలపై మరొకరికి ఆసక్తి. ఇద్దర్లో ఒకరు ... పోటీ సంస్థ అధినేత వ్యాపార బలహీనతలు తెలుసుకోడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఎక్కడా చిన్న సమాచారం కూడా బయటికి రాలేదు. ఇక లాభం లేదనుకుని.. స్వీపర్‌ను ప్రలోభపెట్టాడు. మొత్తానికి, చెత్తబుట్టలో ఓ కాగితం బయటికి వచ్చింది. తీరా చదివితే.. కిందిస్థాయి సిబ్బందితో తాను చేసుకున్న రహస్య ఒప్పందం వివరాలన్నీ అందులో ఉన్నాయి.ఎవరు తవ్విన గోతిలో వాళ్లే పడటం అంటే ఇదే కావచ్చు!'' |
చాణక్య నీతి...రహస్యం ఆయుధం లాంటిది. మన గుప్పిట్లో ఉన్నంతకాలం సురక్షితంగా ఉంటాం. ఇతరుల చేతిలో పడిందా... సంక్షోభమే
* మన బలాల్ని మనం రహస్యంగా ఉంచుకోవాలి. బలహీనతల్ని మరింత రహస్యంగా ఉంచుకోవాలి. ఈ విషయంలో తాబేలే మనకు ఆదర్శం. పైపొర చాటున తన పాదాల్ని ఎంత జాగ్రత్తగా దాచుకుంటుంది!* చేయి విషతుల్యమైతే చేతిని తీసెయ్యాలి. కాలు విషతుల్యమైతే కాలినీ తీసెయ్యాలి. ఆలస్యం చేస్తే... విషం నిలువెల్లా వ్యాపిస్తుంది. అవినీతిపరులూ నమ్మకద్రోహులూ కాలకూట విషం కంటే ప్రమాదం.
* రాజధాని (కార్పొరేట్ ఆఫీస్) గుండెకాయ వంటిది. శత్రు గూఢచారుల ప్రాబల్యం అక్కడా విస్తరించిందంటే..అది నాయకుడి వైఫల్యం, మొత్తం పాలన వ్యవస్థ వైఫల్యం.
* చిల్లుల పాత్రలో నీరు నిలవడం ఎంత అసాధ్యమో.. చంచల స్వభావుల నోట్లో రహస్యాలు దాగడమూ అంతే అసాధ్యం. అలాంటి వ్యక్తులకు కీలక సమాచారం తెలియనివ్వకూడదు. |
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి