దైవకణం.. దక్కింది! (Must read topic. Very useful)


దైవకణం.. దక్కింది!
'హిగ్స్‌ బోసన్‌' కణాన్ని గుర్తించినట్లు సెర్న్‌ శాస్త్రవేత్తల ప్రకటన
నిర్దిష్టంగా తేల్చేందుకు మరికొంత సమాచారం అవసరమని వెల్లడి
విశ్వసృష్టికి మూలాన్ని గుర్తించే క్రమంలో ఘనవిజయం
భారతీయ శాస్త్రవేత్త బోస్‌ పేరిటే.. బోసన్‌ కణం
పరిశోధనలో భారత్‌ పాత్ర కీలకం
మన శాస్త్రవేత్తలు, పరిశోధక సంస్థల చేదోడు
జెనీవా
మానవ నాగరికతలోనే ఘనమైన ఘనతను భౌతిక శాస్త్రవేత్తలు సాధించారు. చరిత్రలోనే విప్లవాత్మక ఆవిష్కరణగా భావిస్తున్న అనితరసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేశారు. మన మౌలిక పరిజ్ఞానానికే ఇదో గొప్ప విజయమని నిపుణులు అభివర్ణిస్తున్నారు. సామాన్యుల పరిభాషలో దైవకణంగా పిలుచుకుంటున్న 'హిగ్స్‌ బోసన్‌' ఉపపరమాణు కణాన్ని గుర్తించినట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ప్రకటించారు.విశ్వసృష్టికి మూలాధారంగా భావిస్తున్న ఈ కణం కోసం సాగిస్తున్న 50 ఏళ్ల అన్వేషణలో భారీ మైలురాయిని దాటినట్లు స్విట్జర్లాండులోని ఐరోపా అణు పరిశోధన కేంద్రం (సెర్న్‌) శాస్త్రవేత్తలు బుధవారం చరిత్రాత్మక ప్రకటన చేశారు. 'ప్రకృతిని అర్థం చేసుకోవడంలో కీలకమైన మైలురాయిని చేరుకున్నాం' అని సెర్న్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాల్ఫ్‌ హ్యుయెర్‌ పేర్కొన్నారు. ఈ కణ ఆవిష్కరణ మరిన్ని సమగ్ర అధ్యయనాలకు బాట వేసిందన్నారు. మన విశ్వంలోని ఇతర రహస్యాల చీకట్లు తొలగించేందుకు ఓ మార్గం దొరికిందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త కణం ఆనుపానులను నిక్కచ్చిగా నిర్ధరించేందుకు భారీ స్థాయిలో గణాంకాలు అవసరమన్నారు. బుధవారం సెర్న్‌లో పెద్ద సంఖ్యలో సమావేశమైన శాస్త్రవేత్తల మధ్య.. ఈ కణంపై పరిశోధనలు నిర్వహించిన రెండు శాస్త్రవేత్తల బృందాల్లో ఒకదానికి నేతృత్వం వహించిన జో ఇంకాండెలా మాట్లాడుతూ.. పరిశోధనలో కచ్చితత్వ స్థాయికి సరిపడే గణాంకాలు దొరికాయన్నారు. అయితే.. కొత్త కణం నిజంగానే మన విశ్వం.. పరిమాణం, ఆకృతికి కారణమైన 'హిగ్స్‌ బోసన్‌' కణమేనా అనేది ఆయన నిర్ధరించలేదు. భౌతిక శాస్త్రవేత్తలతో కూడిన రెండో బృందం.. తాము పరిశీలించిన కొత్త కణం 'హిగ్స్‌ బోసన్‌' కావచ్చని తెలిపింది. తమ గణాంకాల్లో కొత్త కణాన్ని సిగ్మా-5 కచ్చితత్వ స్థాయిలో గుర్తించినట్లు చెప్పింది. కాకపోతే ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించేందుకు మరికొంత సమయం అవసరమవుతుందని ప్రకటించింది.
దైవకణంపై ప్రకటన చేసినప్పుడు.. ఈ ఆవిష్కారానికి మూలాధారమైన శాస్త్రవేత్త పీటర్‌ హిగ్స్‌ కూడా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై హిగ్స్‌ ఓ ప్రకటనలో స్పందిస్తూ.. నా జీవితకాలంలో ఇది సాధ్యమవుతుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. సొరంగ పరిశోధన కేంద్రం ఎల్‌హెచ్‌సీలో గుర్తించిన ఈ దైవకణం 'హిగ్స్‌ బోసన్‌'కు అనుగుణంగానే ఉందనీ, నిర్దిష్టంగా తేల్చేందుకు మరింత గణాంక సమాచారం అవసరమని పరిశోధన కేంద్రం సెర్న్‌ పేర్కొంది.


ఇంతకీ.. దైవకణం ఏమిటి
విశ్వసృష్టికి మూలాధారమైన కణాన్ని సామాన్య పరిభాషలో దైవకణంగా భావిస్తున్నా.. శాస్త్ర ప్రపంచంలో దీనిపేరు 'హిగ్స్‌బోసన్‌'. దైవకణం అనే పేరును నోబెల్‌ గ్రహీత లియోన్‌ లెడెర్‌మ్యాన్‌ పెట్టినా భౌతిక శాస్త్రవేత్తలు 'హిగ్స్‌ బోసన్‌'గానే వ్యవహరిస్తున్నారు. ఈ హిగ్స్‌బోసన్‌ కణం వల్లే పరమాణువులకు ద్రవ్యరాశి ఉంటుందనీ, దానివల్లే విశ్వం ఏర్పడిందనీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ కణం లేకపోతే అణువులు ఏర్పడటం సాధ్యం కాదనీ, దాంతో విశ్వంలో నక్షత్రాలు, గ్రహాల దగ్గర నుంచి జీవం వరకూ దేనికీ స్థానం ఉండేది కాదనీ, పరిశోధకుల అంచనా. విశ్వసృష్టి క్రమంలో హిగ్స్‌బోసన్‌ కణం పరమాణు ద్రవ్యరాశిని లక్షలాది కణాలకు బదిలీ చేసిందని భావిస్తున్నారు.

సొరంగమే అద్భుత పరిశోధనకు కేంద్రం
1964లో బ్రిటన్‌ శాస్త్రవేత్త పీటర్‌ హిగ్స్‌తో పాటు ఆరుగురు భౌతిక శాస్త్రవేత్తలు దైవ కణానికి సంబంధించిన పరమాణు ప్రతిపాదనను రూపొందించారు. ఆ క్రమంలో కణానికి హిగ్స్‌ పేరునే పెట్టారు. అయితే.. ఈ హిగ్స్‌ కణంపై పరిశోధన దశాబ్దాలుగా క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో అంతుచిక్కని ప్రహేళికగానే నిలిచింది. చివరికి.. స్విట్జర్లాండు, ఫ్రాన్సు సరిహద్దుల్లో భూమి లోపల 70 మీటర్ల లోతులో, సొరంగంలో 27 కి.మీ. భారీ గొట్టంలో ఏర్పాటు చేసిన పరిశోధక కేంద్రంలో 3 బిలియన్‌ యూరోల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైన కణ వేగత్వరణమైన 'లార్జ్‌ హేడ్రన్‌ కొలైడర్‌(ఎల్‌హెచ్‌సీ)' ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఎల్‌హెచ్‌సీ ప్రయోగంలో.. రెండు ఫోటాన్‌ పరమాణువులను కాంతి వేగంతో ఢీకొట్టించడం వల్ల జనించే మూలకాలపై పరిశోధనలు జరిపారు. ఇందులో విశ్వసృష్టికి మూలాధారమైన మహా విస్ఫోటం (బిగ్‌బ్యాంగ్‌) తర్వాతి క్షణంలో ఏర్పడిన పరిస్థితులను పునఃసృష్టించారు. ఈ క్రమంలో హిగ్స్‌బోసన్‌ కణాల్ని గుర్తించినట్లు ప్రకటించారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రిజ్‌లాంటి ఎల్‌హెచ్‌ఎస్‌ సొరంగంలో ఎముకల్ని గడ్డకట్టించే స్థాయిలో మైనస్‌ 271 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ సొరంగంలో న్యూట్రినో క్షణానికి 11 వేల రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది.

భారతీయ బోస్‌ పేరిటే బోసన్‌
దైవకణానికి పెట్టిన 'హిగ్స్‌ బోసన్‌' పేరులోని బోసన్‌ను.. భారతీయ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్‌ బోస్‌ నుంచి తీసుకున్నారు. ఈయన దిగ్గజ శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ సమకాలీనులు. క్వాంటమ్‌ మెకానిక్స్‌పై బోస్‌ చేసిన అధ్యయనాన్ని ఐన్‌స్టీన్‌ ఆమోదించి 'బోస్‌-ఐన్‌స్టీన్‌ కండెన్సేట్‌' భావనకు రూపకల్పన చేశారు. బోస్‌ పరిశోధన కణ భౌతికశాస్త్ర దృక్పథాన్నే మార్చివేశాయి. విశ్వంలోని ప్రతిదానికీ ద్రవ్యరాశి ఉంటుందని గుర్తించారు. బోస్‌, ఐన్‌స్టీన్‌ జరిపిన ప్రయోగాలనే అందిపుచ్చుకున్న హిగ్స్‌ పరిశోధనలు చేపట్టారు. దాని ఆధారంగా ఆధునిక తరం భౌతిక శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే ప్రస్తుతం దైవకణాన్ని గుర్తించిన ఘట్టం సాధ్యమైంది.

దైవకణ శోధనలో భారత్‌ పాత్ర కీలకమే
దైవకణ పరిశోధన ప్రాజెక్టుతో భారత్‌కు కీలకమైన అనుబంధం ఉంది. ఈ ప్రఖ్యాత ప్రాజెక్టులో భారతీయ శాస్త్రవేత్తలు, శాస్త్ర పరిశోధక సంస్థలు తమ వంతు పాత్రపోషించాయి. సెర్న్‌ నిర్వహించిన ప్రయోగాత్మక ప్రాజెక్టుల్లో 100 మందికిపైగా భారతీయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కోల్‌కతాలోని సాహా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ (ఎస్‌ఐఎన్‌పీ), ముంబయిలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చి, అలహాబాద్‌లోని హరిశ్చంద్ర రీసెర్చి ఇనిస్టిట్యూట్‌, భువనేశ్వర్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌లకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రఖ్యాత ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు. అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం, జమ్మూ, పంజాబ్‌, గౌహతి, రాజస్థాన్‌ విశ్వవిద్యాలయాలు, వేరియబుల్‌ ఎనర్జీ సైక్లోట్రోన్‌ సెంటర్‌, బోస్‌ ఇనిస్టిట్యూట్‌, ముంబయి ఐఐటీలు తమ సేవలందించాయి.బుధవారం సెర్న్‌లో కొత్త ఉపపరమాణు కణానికి సంబంధించి చేసిన ప్రకటనలో సైతం భారత్‌ పేరును ప్రస్తావిస్తూ కితాబునిచ్చారు. సెర్న్‌ అధికార ప్రతినిధి పవోలో గియుబెలినో మాట్లాడుతూ 'ఈ ప్రాజెక్టుకు భారత్‌ చారిత్రక పిత' అని వ్యాఖ్యానించారు. సొరంగ ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు దైవకణాన్ని భౌతిక రూపంలో పరిశీలించినప్పుడు కోల్‌కతా ఎస్‌ఐఎన్‌పీలో ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. వీరు సెర్న్‌లో పరిశోధనల కోసం కాంపాక్ట్‌ మ్యుయాన్‌ సోలెనాయిడ్‌ (సీఎంఎస్‌)ను రూపొందించారు. ఎస్‌ఐఎన్‌పీ సంచాలకులు మిలన్‌ సన్యాల్‌ మాట్లాడుతూ.. శాస్త్రరంగంలో ఇది కీలక పరిణామమనీ, ఈ విప్లవాత్మక ఘట్టంలో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాజా పరిశోధనలను ఎలాంటి అనుమానాలు లేనిరీతిలో నిర్ధరించేందుకు మరింత గణాంకాలు అవసరమని పేర్కొన్నారు. ఎస్‌ఐఎన్‌పీ సెర్న్‌తో ఒక అవగాహన ఒప్పందం మేరకు సీఎంఎస్‌ పరిశోధనలో పాలుపంచుకుందన్నారు. తమ శాస్త్రవేత్తలు జెనీవాలో దశాబ్దకాలంపైగా శ్రమించారని వెల్లడించారు. ప్రొఫెసర్‌ సునందాబెనర్జీ నేతృత్వంలో ప్రొఫెసర్లు సాత్యకి భట్టాచార్య, సుచంద్ర దత్తా, సుబీర్‌ సర్కార్‌, మనోజ్‌ శరన్‌ల బృందం సీఎంఎస్‌లో కీలకంగా పనిచేసినట్లు వెల్లడించారు.
సెర్న్‌లోని ముఖ్యమైన హార్డ్‌వేర్‌ పరికరాల్లో ఒకటి.. 8 వేల టన్నుల అయస్కాంతం. ఇది ఈఫిల్‌ టవర్‌కన్నా బరువైనది. దీనిని రూపొందించడంలో భారత్‌దే ప్రధాన పాత్ర. లక్షలాది ఎలక్ట్రానిక్‌ చిప్‌లను చండీగఢ్‌లో తయారుచేశారు.
సొరంగానికి దన్నుగా నిలిపిన హైడ్రాలిక్‌ స్టాండ్లను భారత్‌లోనే తయారు చేశారు. 
సెర్న్‌లోని హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లోని కీలక భాగాలను కొన్నింటిని భారత్‌ సహకారంతో, మరికొన్నింటిని పూర్తిగా భారత్‌లోనే నిర్మించారు.
భారత అణు పరిశోధన విభాగం (డీఏఈ), శాస్త్రసాంకేతిక విభాగం (డీఎస్‌టీ)లు కూడా సెర్న్‌తో కలిసి పనిచేశాయి.
ఇండోర్‌లోని రాజారామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (ఆర్‌ఆర్‌సీఏటీ) ఎల్‌హెచ్‌సీకి ముఖ్యమైన విడిభాగాలను సరఫరా చేసింది. 
ఇండోర్‌కే చెందిన ఇండోజర్మన్‌ టూల్‌ రూం(ఐజీటీఆర్‌) ఎల్‌హెచ్‌సీని కూర్చోబెట్టడంలో ఉపయోగించే జాక్‌లను రూపొందించింది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు