మాట నిదానం...ఆట వేగం! (Eenadu Eetaram_11/07/2012)


దేశానికి ప్రాతినిధ్యం ప్రతి ఆటగాడి కల... అందునా ప్రతిష్ఠాత్మక ఒలిపింక్స్‌ అంటే మాటలా? ఈ ఘనత సాధించాడు మన తెలుగుతేజం జగదీశన్‌ విష్ణువర్థన్‌... తొలిసారిగా ఒలింపిక్స్‌కి లభించిన ఈ అవకాశం... అతని పదిహేనేళ్ల కష్టానికి ప్రతిఫలం! సరదాలు వదిలి టెన్నిస్‌కి అంకితమైతే దక్కిన ఫలం!! ఆటపై ఇష్టం, తదేక దీక్షతో ముందుకు సాగితే ఎవరికైనా ఇది సాధ్యమే అంటున్నాడు విష్ణు. అతగాడితో 'ఈతరం' ముఖాముఖి...
ఆటవైపు అడుగులు:విష్ణుకి అప్పుడు ఏడేళ్లు. స్కూల్‌ నుంచి రాగానే ఖాళీగా కూర్చోవడం అమ్మానాన్నలకి నచ్చలేదు. ఏదైనా ఆట ఎంచుకొమ్మని సూచించారు. స్నేహితుడు సారంగ్‌ టెన్నిస్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటే సరదాగా వెళ్లి అతడితో జత కలిశాడు.సరదా కెరీరైంది: మూడు నెలలకే మైదానం మొహం చూడ్డం మానేశాడు ఫ్రెండ్‌. అప్పటికే ఆటపై అభిమానం పెంచుకున్న విష్ణు ఒంటరిగా వెళ్లి సీరియస్‌గా సాధన చేసేవాడు. అది చూసి విష్ణు తండ్రి జగదీశన్‌ కోచ్‌ నాగరాజు దగ్గర మెలకువలు నేర్పించాడు. కొడుకుని రోజూ మైదానంలో దిగబెట్టడం, ఇంటికి తీస్కెళ్లడం అతడి దినచర్యగా మారింది.
ఆరుగంటల సాధన: ఉదయం ఐదున్నరకే విష్ణు సాధన మొదలయ్యేది. సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం మైదానమే చిరునామా. చెమటలు పట్టేలా సాధన చేశాక స్కూల్‌కెళ్లేవాడు. సాయంత్రం రాగానే మరో మూడుగంటల ప్రాక్టీస్‌. మధ్యలో ఐదు నిమిషాల్లోనే లంచ్‌ ముగించి అక్కడా రాకెట్‌ అందుకునేవాడు. ఇంటర్‌ పూర్తయ్యే వరకూ ఇదే షెడ్యూల్‌.
చదువులోనూ టాపే: తీరిక లేకుండా టెన్నిస్‌ ఆడుతున్నా విష్ణు చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఎప్పుడూ ఫస్ట్‌క్లాస్‌ స్టూడెంటే. ఆట కారణంగా తరగతులు మిస్‌ అయితే టీచర్లే ప్రత్యేక క్లాసులు తీసుకునేవారు. స్నేహితుల నుంచి నోటు పుస్తకాలందేవి. నోట్స్‌, కావాల్సిన మెటీరియల్‌ సేకరించే బాధ్యతను తల్లి పద్మావతి స్వీకరించారు. అదే వేగంతో ఫస్ట్‌క్లాస్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.
ప్రొఫెషనల్‌గా: విష్ణు వీలైనన్ని ఎక్కువ ఐ.టి.ఎఫ్‌. టోర్నీల్లో పాల్గొనేవాడు. ఇంటర్‌లోనే జాతీయ జూనియర్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచాడు. తర్వాత వరుసగా గ్రాస్‌కోర్ట్‌ ఛాంపియన్‌షిప్‌, పదిహేను ఐ.టి.ఎఫ్‌. డబుల్స్‌ టైటిళ్లు, 7 సింగిల్స్‌ నెగ్గాడు. ఏషియన్‌ గేమ్స్‌లో సానియాతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ గెలిచి దేశం దృష్టిని ఆకర్షించాడు. భారత డేవిస్‌కప్‌ జట్టులో సభ్యుడై సత్తా చూపాక పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు లండన్‌ ఒలింపిక్స్‌తో కల నెరేవరింది.
కల నిజమైన వేళ: విష్ణు టెన్నిస్‌ రాకెట్‌ పట్టడానికి స్ఫూర్తి లియాండర్‌ పేస్‌. తొమ్మిదేళ్ల వయసులో ఉన్నపుడు లియాండర్‌ మన దేశానికి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం అందించాడు. అప్పట్నుంచి ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమే విష్ణు లక్ష్యమైంది. అలాంటిది 'నా రోల్‌మోడల్‌తో కలిసి డబుల్స్‌ ఆడతాననని కలలో కూడా వూహించలేదు' అంటాడు విష్ణు. ఆల్‌ఇండియా టెన్నిస్‌ అసోసియేషన్‌ నుంచి మెసేజ్‌ రాగానే ముందు కలా? నిజమా? నమ్మలేకపోయాడు. ఆనందంతో తల్లిదండ్రుల్ని కౌగలించుకున్నాడు. 'ఈ పదిహేనేళ్ల కష్టం, కల నా ఒక్కడిదే కాదు. నా తల్లిదండ్రులది, నన్ను ఇంతటివాణ్ని చేసిన కోచ్‌ది' అంటాడు వినమ్రంగా.
నిగ్రహం కోల్పోడు: ప్రత్యర్థికి పాయింట్‌ కోల్పోగానే చిరాకు పడటం.. మ్యాచ్‌ చేజారితే రాకెట్‌ని నేలకేసి కొట్టడం.. టెన్నిస్‌ ఆటగాళ్లకి మామూలే. కానీ విష్ణు దీనికి భిన్నం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిగ్రహం కోల్పోడు. తన పనేదో తాను చేసుకొని పోయే స్వభావం. ఆరడుగుల రెండంగుళాల ఎత్తున్నా, ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా పెద్దలంటే ఇప్పటికీ గౌరవం.
కుటుంబం నేపథ్యం: అమ్మ గృహిణి. నాన్నది వ్యాపారం. తమిళనాడుకు చెందినవాళ్లు. వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. విష్ణు పుట్టిపెరిగిందంతా ఇక్కడే. వైజాగ్‌ ఓఎన్‌జీసీలో హెచ్‌.ఆర్‌. ఎగ్జిక్యూటివ్‌. అందుకే 'నేను అచ్చమైన తెలుగు కుర్రాడ్ని' అంటాడు.
మరుపురాని జ్ఞాపకాలు: సాటి కాలేజీమేట్స్‌ సరదాల్లో మునిగి తేలుతుంటే విష్ణు సాధనతో రాటు దేలాడు. స్నేహితులు అమ్మాయిలతో షికార్లు కొడుతుంటే విష్ణు రాకెట్‌ని వదల్లేదు. అందుకే కాలేజీ రోజుల్లో పెద్దగా అనుభూతులేం లేవు. స్కూల్‌ రోజుల్లో మారేడుపల్లి నుంచి సఫిల్‌గూడకి స్కూల్‌ బస్‌లో వెళ్తూ చేసిన అల్లరే అతడి తీపి జ్ఞాపకం.
మాటల్లో నెమ్మది: ఆటలో ఎంత వేగమో మాటల్లో అంత నెమ్మది. జీన్స్‌ ప్యాంట్‌, టీషర్టులే నచ్చిన ఫ్యాషన్‌. ఖాళీ దొరికితే చిన్ననాటి నేస్తాలతో కబుర్లు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో అకౌంట్లున్నాయి.
యువతకి సలహా
'టెన్నిస్‌ ఖరీదైన ఆట కాదు. మధ్యతరగతికి అందుబాటులో ఉన్న క్రీడ. ఇండియాలో ఈ ఆటకి వసతులు మెరుగయ్యాయి. ఎక్కువ ఐ.టి.ఎఫ్‌. టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ర్యాంకింగ్‌ మెరుగు పరుచుకోవడానికి ఇది సదావకాశం. అయితే రాత్రికి రాత్రే స్టార్లు అవడం కుదరదు. చాలా ఓపిక, ఆటపై ఇష్టం ఉండాలి. అదే సమయంలో చదువునూ నిర్లక్ష్యం చేయొద్దు'.
భవిష్యత్తు స్టార్‌
విష్ణుని మొదటిసారి జపాన్‌లో చూశా. యాభై ఐదో ర్యాంకు ఆటగాడు కీ నిషికోరితో తలపడుతున్నాడు. అతడిలో ఏమాత్రం తొణుకుపాటు లేదు. నిషికోరిని దాదాపు ఓడించినంత పని చేశాడు. అప్పుడే అనుకున్నా. భారత టెన్నిస్‌లో మరో స్టార్‌ పుట్టాడని.
- మహేశ్‌ భూపతి
నేర్చుకునే మనస్తత్వం
షియన్‌ గేమ్స్‌తో పాటు చాలాసార్లు విష్ణుతో మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆడా. మా ఇద్దరి మధ్య చక్కని సమన్వయం ఉంది. విష్ణుది ఇంకా నేర్చుకోవాలనే మనస్తత్వం, ఆటపై అంకిత భావం ఎక్కువ. అతడికి మంచి భవిష్యత్తు ఉంది.
- సానియా మీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు