ఏడడుగులు.. ఎన్నో ముళ్లు! (Sunday_22/07/2012)


ఏడడుగులు.. ఎన్నో ముళ్లు!
తలంబ్రాల చీరకు చిరుగులొచ్చేస్తాయి. లగ్నపత్రికలోని అక్షరాలు మసకబారిపోతాయి. పెళ్లినాటి ఆల్బమ్‌ పాతబడిపోతుంది. ఎంగేజ్‌మెంట్‌ ఉంగరాలు ఎక్కడున్నాయో ఇద్దరికీ గుర్తుండదు. అంతవరకూ ఫర్వాలేదు. ప్రేమ మసిబారితేనే కష్టం. ఆకర్షణ పాతబడితేనే ఇబ్బంది. నమ్మకానికి చెదలుపట్టిందా, వదిలించుకోవడం చాలా కష్టం. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ఆలూమగలు ఇద్దరిదీ!
'ఆమెకేమైంది?'
'నిరాసక్తత కమ్మేసింది'
'అతనెందుకిలా ఉన్నాడు?'
'జీవితం నిస్సారమైపోయింది'
'ఆ జంట ఎక్కడికెళ్తోంది?'
'విడాకుల కాగితాలు తెచ్చుకోడానికి'
పెళ్లి షాక్‌ అబ్జార్బర్‌ లాంటిది. ఎన్ని సమస్యలొచ్చినా తట్టుకునే శక్తినిస్తుంది. కానీ పెళ్లే ఓ సమస్య అయితే...
* * *
బోర్‌. రొటీన్‌. చల్తాహై.
వెధవ జీవితం.
గానుగెద్దు గుర్తుకొస్తోంది.
కొత్త అనుభవాల కోసం మనసు ఉవ్విళ్లూరుతోంది.
లైఫ్‌లో కిక్కు కావాలి.
షుగర్‌ లేదు, బీపీ లేదు, అంగస్తంభన సమస్య లేదు, అయినా శృంగారం ఇంత చప్పగా అనిపిస్తోందేమిటి?
మనసులోనో మందుపార్టీలోనో, పెళ్లి గురించో జీవితభాగస్వామి గురించో... ఒక్కమాట చెడుగా మాట్లాడినా వైవాహిక జీవితం సంక్షోభానికి దగ్గర్లో ఉందని అర్థం. ఆ సంక్షోభం పెళ్లయిన ఏడేళ్ల తర్వాత రావచ్చు. పదేళ్ల తర్వాత రావచ్చు. ఏడాదికే రావచ్చు. అసలు రాకపోనూవచ్చు. ముందుజాగ్రత్త ఎప్పుడూ మంచిదే. వచ్చాక సరిదిద్దుకున్నా కొంతవరకు ఫర్వాలేదు. మొత్తానికి బంధాన్ని బతికించుకుంటే చాలు.'సెవెన్‌ ఇయర్‌ ఇచ్‌'...ఇది జార్జ్‌ యాక్సెల్‌రాడ్‌ నాటకం పేరు. సినిమాగా కూడా వచ్చింది. పెళ్లయిన ఏడేళ్ల తర్వాత ఓ జంటకు జీవితం పాతబడిపోయినట్టు అనిపిస్తుంది. అనుభూతులన్నీ మొక్కుబడిగా మారిపోతాయి. మనసు మార్పు కావాలని మారాం చేస్తుంది. శరీరం కొత్త అనుభవాలు కోరుకుంటుంది. ఫలితం...దారితప్పిన ఆకర్షణలూ కూలిపోయే కాపురాలూ.
సంక్షిప్తంగా ఇదీ కథ.
సినిమా కాబట్టి, అందులోనూ హాలీవుడ్‌ మూవీ కాబట్టి, మార్లిన్‌మన్రో కథానాయిక కాబట్టి, ఘాటుగా గరంమసాలా దట్టించారు. అలా అని, పెళ్లి పాతబడిపోయాక అందరూ ఆ ఒక్క అనుభవం కోసమే తహతహలాడతారనో కోరికోరి దారితప్పుతారనో అనుకోడానికి వీల్లేదు. మొత్తానికి జీవితం రొటీన్‌గా మారిపోతుంది. నిర్లిప్తత చోటుచేసుకుంటుంది. ఆమె దృష్టంతా పిల్లల పెంపకానికీ వంటావార్పులకూ పరిమితమైపోతుంది. ఉద్యోగిని అయితే, వృత్తిజీవితం అదనం. అతనికేమో కెరీర్‌, అప్పులు, ఆస్తులు, పెట్టుబడులు, వ్యాపారాలు, రాజకీయాలు. ఎవరి ప్రపంచం వారిదైపోతుంది. ఎవరి జీవితాన్ని వారు జీవించడం తప్పుకాదు. రెండు జీవితాలమధ్యా ఓ వంతెనంటూ లేకపోవడం తప్పు. ఆ ఇద్దరూ ఎంతోకొంత సమయాన్ని తమ ఇద్దరి కోసమే కేటాయించకపోవడం తప్పు. ఒకరి మనసుని ఒకరు అర్థంచేసుకోడానికీ ఒకరి అవసరాల్ని ఒకరు గుర్తించడానికీ అసలు ప్రయత్నమంటూ లేకపోవడం తప్పు. అపోహల్నీ అనుమానాల్నీ తొలగించుకోడానికి ఇద్దర్లో ఏ ఒక్కరూ చొరవ చూపకపోవడం అంతకంటే తప్పు. అందుకే వైవాహిక జీవితం ఇంత నిస్సారంగా అనిపిస్తుంది. అలాంటప్పుడే... 'ఆయన చాలా మారిపోయారు. పెళ్లయిన కొత్తలో నన్నెంతగా ప్రేమించేవారో'... గతాన్ని తలుచుకుని తెగ బాధపడిపోతుంది ఇల్లాలు. 'మా ఆవిడకు నేనంటే లెక్కలేకుండా పోయింది. నిన్నమొన్నటిదాకా నా మాట జవదాటేది కాదు'... నిర్లక్ష్యాన్ని భరించలేకపోతారు శ్రీవారు.
ఆలూమగల అనుబంధం పూలమొక్కలాంటిది. తెచ్చుకున్నాం. పెరట్లో నాటుకున్నాం. దానిమానాన దాన్ని వదిలేశాం అంటే కుదర్దు. పాదుచేయాలి. నీళ్లుపోయాలి. పందిరేయాలి. కంచెపెట్టాలి. కంటికిరెప్పలా కాపాడుకోవాలి. అదో కళ. మనసుంటే, మనసుపెడితే... అందులో నిష్ణాతులు కావచ్చు.
అనుబంధాలే పునాది
ఆలూమగల అనుబంధాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా, అది జీవితంలోని అన్ని కోణాల్నీ ప్రభావితం చేస్తుంది. ఆ నిర్లిప్తత దెబ్బ పిల్లల మీద పడుతుంది. చింతలూ చికాకుల మధ్య పసివాళ్లకు ప్రేమాభిమానాలు పరిపూర్ణంగా అందవు. దీంతో వారికి బంధాలమీదే గౌరవం పోతుంది. కుటుంబ వ్యవస్థ అంటేనే అపనమ్మకం ఏర్పడుతుంది. పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా అదంత మంచిది కాదు. ఆలూమగల అసంతృప్తులు వృత్తి జీవితాన్నీ ప్రభావితం చేస్తాయి. వృత్తి ఉద్యోగాల్లోని ఒత్తిళ్లను తట్టుకోడానికి కుటుంబ జీవితంలోని ఆనందం ఓ రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆ కవచమే ముక్కలైతే కాపాడేదెవరు? అనుబంధాలకూ ఆరోగ్యానికీ కూడా దగ్గర సంబంధం ఉంది. ఆ ప్రభావం ముందుగా వంటింటి మీద కనిపిస్తుంది. చింతలతో చికాకులతో ఏ శ్రీమతీ కమ్మని భోజనం వండి వడ్డించలేదు. అందులో ఉప్పూకారం ఉంటే ఉండవచ్చు కానీ, మమకారపు మోతాదు తగ్గుతుంది. అతని ఆరోగ్యాన్నీ పిల్లల పౌష్ఠిక అవసరాల్నీ గుర్తుంచుకోడానికి బుర్రలో ఖాళీ ఎక్కడుంటుంది? సమస్యలతో అదెప్పుడో చెత్తకుండీలా తయారై ఉంటుంది. అతను మాత్రం తృప్తిగా ఎలా భోంచేస్తాడు. అన్యమనస్కంగా రెండు ముద్దలు తిని, చేతులు కడిగేసుకుంటాడు. శరీరం మీద మనసు ప్రభావం అపారమని ఆధునిక పరిశోధనలూ నిర్ధరిస్తున్నాయి. రక్తపోటు, హృద్రోగం వంటి సమస్యలకు ఆ చికాకులే పునాది కావచ్చు. అన్యోన్యత, అనురాగం, శృంగారానుభూతులు పుష్కలంగా ఉన్న ఆలూమగల్లో ఆక్సిటోసిన్‌ వంటి ఆరోగ్యకరమైన హార్మోన్ల వూట అధికంగా ఉంటుంది. వివాహబంధం అనేది మొత్తం జీవితానికి బలమైన పునాది. ఆరోగ్య సౌధానికైనా, ఆనంద నిలయానికైనా, కెరీర్‌ మేడలకైనా అదే ఆధారం. ఆ బంధం బెడిసికొడితే, ఏ ఎదుగుదలా సంతృప్తినివ్వదు. ఏ గెలుపూ సంతోషాన్నివ్వదు.పంచ'భూతాల' సాక్షిగా...
పెళ్లయిన కొత్తలో, తొలివలపు మత్తులో...
'ఒకరి కోసం ఒకరు పుట్టామేమో' కవితాత్మకంగా చెబుతాడతను. కిసుక్కున నవ్వేస్తుందామె, 'నిజమే సుమా!' అన్నట్టు. 'నిమిషం కూడా నిన్నొదిలి ఉండలేను' ప్రేమోద్వేగం పొంగుకొస్తుందతనికి. భర్త గుండెల్లో గువ్వలా ఒదిగిపోతుందామె, అదే సమాధానమన్నట్టు.
ఆ రోజులు వేరు. ఆ ఆకర్షణలు వేరు. ఆ అయస్కాంత శక్తి వేరు. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు.. ఏళ్లు గడిచేకొద్దీ వేళ్లతోసహా పెకిలించినట్టు, ఆ అనురాగమంతా మటుమాయమైపోతుంది. మాయదారి పొరలేవో దట్టంగా కమ్మేస్తాయి. ఇంకేముంది... అసంతృప్తిని మోస్తూ నిర్లిప్తతను భరిస్తూ నిరాసక్తంగా ఆమె. కుటుంబ జీవితంలో కోల్పోతున్న ఆనందాల్నీ అనుభూతుల్నీ వృత్తిలోనో ఉద్యోగంలోనో తాత్కాలిక మోహాల్లోనో వెతుక్కునే ప్రయత్నంలో అతను. పేరుకే ఆలూమగలు. ఒకే ఇంట్లో ఉంటారు. కలిసే భోంచేస్తారు. కలిసే పడుకుంటారు. అయినా కనిపించని గోడలేవో అడ్డుగా ఉంటాయి. మాయల ముళ్లకంచెలేవో నిలువునా విడదీస్తుంటాయి. కొన్ని కాపురాల్లో ఏర్పడే దూరాలకు ప్రధాన కారణాలు ఈ ఐదూ...
అహంభావాలు... భార్యాభర్తలు సమాన భాగస్వాములు! ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. ఇద్దర్లో ఏ ఒక్కరో తాము అధికులమని అనుకుంటే..సమతౌల్యం దెబ్బతింటుంది. అప్పుడది ఆలూమగల అనుబంధం కాదు, యజమాని-బానిస సంబంధం, ఆమె అతన్ని గౌరవించలేదు. అతను ఆమెను ప్రేమించలేడు.
అనుమానాలు... ఆమె అద్దంలో చూసుకుంటూ కిసుక్కున నవ్వినా అతనికి అనుమానం. అతను టిప్పుటాపుగా తయారై ఆఫీసుకు బయల్దేరినా ఆమెకు అనుమానం. ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండదు. ఒకరి ప్రమాణాల మీద ఒకరికి విశ్వాసం ఉండదు. పారదర్శకత అసలే ఉండదు.
అక్రమ సంబంధాలు... తాత్కాలిక వ్యామోహాలూ క్షణికావేశాలూ అనుబంధాల్ని పక్కదారిపట్టిస్తాయి. కుటుంబాన్ని ముక్కలు చేస్తాయి. నేరాలకూ ఘోరాలకూ దారితీస్తాయి.
ఆర్థిక సమస్యలు... పీకల్లోతు అప్పులు, అప్పులవాళ్ల వేధింపులు మనశ్శాంతిని మింగేస్తాయి. ఆర్థిక సమస్యల్లోంచి పుట్టుకొచ్చే చికాకులు కాపురాన్ని నరకంలా మార్చేస్తాయి.
మితిమీరిన ఆశలు... అన్నీ ఉంటాయి, అయినా ఏదీ లేని శూన్యం! అందనిదాని కోసం ఆరాటం. అందుబాటులో ఉన్నదాన్ని చులకన చేసే స్వభావం. ఆ అసంతృప్తీ దురాశా కాపురాల్ని కూల్చేస్తాయి.
పెళ్లయిన కొత్తలో, సరికొత్త మోహావేశంలో జీవితభాగస్వామిలో లోపాలున్నా కనిపించవు. అసలు లోపాల్లానే అనిపించవు. వివాహం పాతబడేకొద్దీ నిజరూపాలు తెలుస్తాయి. అంచనాలు తలకిందులైపోతాయి. ఓరకమైన నిస్పృహ ఆవరిస్తుంది. నిరాశ కమ్మేస్తుంది. అప్పుడే, ఎదుటి వ్యక్తి లోపాల్ని భూతద్దంలోంచి చూడటం ప్రారంభిస్తారు. మెల్లగా గొడవలు మొదలవుతాయి. అయినా... ఇవేవీ పరిష్కరించుకోలేని సమస్యలు కాదు. మందుల్లేని రోగాలు కాదు. సర్దుబాటు చేసుకోలేని సంక్షోభాలూ కాదు. దురదృష్టవశాత్తు చాలా కాపురాల్లో ఆ ప్రయత్నమే కనిపించదు. తాజా గణాంకాల ప్రకారం పెళ్లయిన ప్రతి వంద జంటల్లో పది జంటలు విడిపోతున్నాయి. వివాహ వ్యవస్థలోని లోపాలే దీనికంతా కారణమని అనలేం. ఎందుకంటే, విడాకులు తీసుకుంటున్నవారిలో ఎనభైశాతం రెండో పెళ్లికి సిద్ధపడుతున్నారు. రెండో పెళ్లి విఫలమైనవారు మూడో పెళ్లికి ముందుకొస్తున్నారు. అంటే, వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోలేదనేగా అర్థం. విఫలం అవుతున్నది జంటలే, వివాహ వ్యవస్థ కాదు.
ఇట్లు...మనస్ఫూర్తిగా
ఆలూమగల మధ్య నెలకొన్న అపోహల్నీ అనుమానాల్నీ తొలగించుకోడానికి కథారచన పద్ధతిని సూచిస్తారు 'ఫిప్టీఫిఫ్టీ మ్యారేజ్‌-రిటర్న్‌ టు ఇంటిమసీ' రచయిత విజయ్‌ నాగస్వామి. కలం కాగితం ముందేసుకుని కథా రచనకు ఉపక్రమించండి. ఎవరికథో కాదు. మీ కథే. శైలి, శిల్పం, ఎత్తుగడ, ముగింపు, పదాల పోహళింపు...ఏమీ అక్కర్లేదు. మీకు వచ్చిన భాషలోనే మీకు నచ్చిన పద్ధతిలోనే రాయండి. స్వగతం వద్దు. నేను, నువ్వు..వంటి మాటలు వాడాల్సిన పన్లేదు. మిమ్మల్ని మీరు ఓ ప్రధాన పాత్రగా మలుచుకోండి. దానికో పేరుపెట్టండి. జీవిత భాగస్వామికీ ఓ పేరు పెట్టండి. ఇద్దరూ తొలిసారిగా కలుసుకున్నది మొదలు ఈరోజు దాకా...మీ స్పందనలన్నీ అందులో ఉండాలి. అది మీ హృదయం! పెళ్లి గురించి కన్న కలలు, జీవిత భాగస్వామి మీద అంచనాలు, ఎదురైన అనుభవాలు, ఆ వ్యక్తి అలవాట్లు, దురలవాట్లు, స్నేహితులు, కుటుంబం..ఏదీ వదిలిపెట్టకండి. అయితే చిన్నషరతు. అనుభవాన్ని అనుభవంగానే రాయండి. వ్యాఖ్యలొద్దు. ఫిర్యాదులొద్దు. తిట్లూ శాపనార్థాలూ వద్దు. అది నవలంత పెద్దగా ఉండకూడదు. పోస్టుకార్డు కథంత క్లుప్తంగా ఉండకూడదు. ఓ చిన్న నవలలా, పెద్ద కథలా ఉంటే చాలు. ఆ పనంతా పూర్తయిన తర్వాత, ఇద్దరికీ అనువైన ఓ తేదీని నిర్ణయించుకోండి. ఏకాంతం చాలా అవసరం. ఇద్దర్లో ఎవరో ఒకరు, తమ కథ ముందుగా చదువుతారు. మరొకరు శ్రద్ధగా వింటారు. ఎంత సేపైనా కానివ్వండి. గడియారం చూసుకోవాల్సిన అవసరం రాకూడదు. 'కాస్త తొందరగా ముగించాలి' అన్న ఆలోచనే ఉండకూడదు. చదువుతున్నవారు తమ భావోద్వేగాల్ని దాచుకోవాల్సిన పన్లేదు. కన్నీళ్లు రావచ్చు. ఎక్కిళ్లుపట్టొచ్చు. కోపం వచ్చినట్టు అనిపిస్తే మాత్రం, కాసేపు ప్రశాంతంగా కళ్లు మూసుకుంటే సరిపోతుంది. ప్రేక్షక స్థానంలో ఉన్నవారు మధ్యలో అడ్డుతగలడం, తమ వాదన వినిపించే ప్రయత్నం చేయడం నిషిద్ధం. ఆతర్వాత, మరొకరు మొదలుపెట్టాలి. వారం రోజులయ్యాక మళ్లీ ఏకాంత సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోజంతా సందేహాల్ని నివృత్తి చేయడానికీ అపోహల్ని తొలగించుకోడానికీ కేటాయించాలి. అదీ వ్యక్తీకరణమాత్రమే. వాదనలొద్దు. ఎదురుదాడులొద్దు. ఇదంతా జీవిత భాగస్వామి కోణంలోంచి జీవితాన్ని అర్థంచేసుకునే ప్రయత్నం. ఈ ప్రక్రియ ఎంత నిజాయతీగా జరిగితే, ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి.భాగస్వామి మీ గురించి (ఓ పాత్ర ద్వారా) వ్యక్తంచేసిన అభిప్రాయాల్ని కాగితం మీద రాసుకోండి. మీ ఆలోచనల్లో, నడవడికలో లోపాలుంటే సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టండి. సాధారణంగా చేసే ఆరోపణలు...
1. కుటుంబానికి సమయం కేటాయించడం లేదు.
2. అభిరుచుల్నీ భావోద్వేగాల్నీ పట్టించుకోవడం లేదు.
3. లైంగిక జీవితంలో అసంతృప్తులు.
4. వ్యక్తిగత జీవితంలో స్నేహితుల పాత్ర, కుటుంబసభ్యుల పెత్తనం.
5. తాత్కాలిక ఆకర్షణలూ వివాహేతర సంబంధాలు. ఆర్థిక సమస్యల మీద శ్రద్ధ పెట్టకపోవడం.
6. వృత్తి జీవితానికే అధిక ప్రాధాన్యం.
7. అత్తమామల్ని/తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం.
వీటితోపాటు కొన్ని పరోక్ష వ్యక్తీకరణలూ ఉండవచ్చు. జీవిత భాగస్వామి మనసును అర్థంచేసుకోవడంతో ఈ అభ్యాసం పూర్తవుతుంది. సరిగ్గా అదే సమయానికి, వైవాహిక జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది.
మనం...మేము...నేను!
ప్రతిమనిషీ నాలుగైదు ప్రపంచాల్లో బతుకుతాడు. మొదటిది పూర్తిగా వ్యక్తిగత ప్రపంచం. అందులో మనం ఒక్కరమే ఉంటాం. రెండోది వైవాహిక ప్రపంచం. జీవితభాగస్వామి ఆ ప్రపంచ ప్రతినిధి. మూడోది బంధుప్రపంచం. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు...తదితరులు ఉంటారు. నాలుగోది సమాజ ప్రపంచం. స్నేహితులూ పొరుగువారూ ఆ జాబితాలోకి వస్తారు. ఐదోది కెరీర్‌ ప్రపంచం. వృత్తి ఉద్యోగాల చుట్టూ తిరుగుతుంది.
పెళ్లయ్యాక కూడా చాలామంది తమ ప్రాధాన్యాల్ని మార్చుకోరు. కేటాయింపుల్ని సర్దుబాటు చేసుకోరు. జీవితభాగస్వామికి ప్రత్యేక స్థానమంటూ ఇవ్వరు. సమయమే కేటాయించరు. పెళ్లికి ముందు, రోజూ ఓ గంటసేపు స్నేహితులతో బాతాఖానీ కొట్టే అలవాటు ఉండవచ్చు. పెళ్లి తర్వాత దాన్ని పదిహేను నిమిషాలకు కుదించుకోవచ్చు. అలాగే, రోజూ పడుకునే ముందు ఓ గంట నెట్‌ ముందు కూర్చోవడం వ్యసనమై ఉండవచ్చు. దాన్ని పదిహేను నిమిషాలకు పరిమితం చేసుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. అక్కడే తేడా వస్తుంది. దానికితోడు, కెరీర్‌ లక్ష్యాలూ పరుగులూ జాబ్‌మార్కెట్‌లో ఉనికి చాటుకోడానికి చేసే ప్రయత్నాలూ... వీటన్నిటి మధ్యా ఆలూమగల ప్రపంచం మరింత చిన్నదైపోయింది. ఇంటికొచ్చినా సెల్‌ఫోన్‌ చర్చలూ ఇ-మెయిల్‌ ఉత్తర ప్రత్యుత్తరాలూ ఉండనే ఉంటాయి. అనుబంధాలకు ఇదో దెబ్బే. కాస్త చొరవా నేర్పూ ఉంటే అధిగమించడమూ పెద్ద కష్టమేం కాదు.
ఎంత పని ఒత్తిడి ఉన్నా, పూటకో నిమిషం జీవిత భాగస్వామికి కేటాయించవచ్చు. సెల్‌ఫోన్‌లో పలకరించవచ్చు. ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపుకోవచ్చు.
ఎంత రాత్రయినా, ఎంత ఆలస్యమైనా రోజూ కనీసం ఒక భోజనమైనా కలిసి చేయాలన్న నిర్ణయం తీసుకోవచ్చు.
రోజుకు పదినిమిషాలైనా మరో వ్యాపకం పెట్టుకోకుండా (సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌) మాట్లాడుకోవచ్చు.
నెలకు ఒక ఆదివారమైనా ఇద్దరే బయటికి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదికో పదిహేనురోజులు ఎక్కడికైనా వెళ్లిరావచ్చు.జీవిత లక్ష్యాల గురించీ వూరించే వూహల గురించీ నేటి సవాళ్ల గురించీ రేపటి విజయాల గురించీ భవిష్యత్‌లో కలిసి అనుభవించబోయే ఆనందాల గురించీ జీవిత భాగస్వామితో కమ్మని కలల్ని పంచుకోవచ్చు.
ఆలూమగలు...తమ ఇద్దరి కోసమే సృష్టించుకున్న 'మన' ప్రపంచాన్ని గౌరవిస్తూనే, ఎవరికి వారు ఇష్టపడే 'నా' ప్రపంచాన్నీ గుర్తించాలి. ఆమెకు ఆ మూడు రోజులూ శృంగారంలో పాల్గొనడం ఇష్టం లేకపోవచ్చు. నెలకోసారైనా పుట్టింటికి వెళ్లాలన్న కోరిక ఉండవచ్చు. అతనికి ఎప్పుడో ఓసారి పబ్‌కు వెళ్లే అలవాటు ఉండవచ్చు. ఆదివారాలు మధ్యాహ్నం దాకా బద్ధకంగా నిద్రపోవాలని అనిపించవచ్చు. ఎందుకో చాలామంది దంపతులు, జీవితభాగస్వామికి సంబంధించిన ఆ చిన్ని (నా) ప్రపంచంలోకీ బలవంతంగా దూరాలనుకుంటారు. ఎంత అన్యోన్య దాంపత్యమైనా...ఎవరికి వారు ఎంతోకొంత వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడంలో తప్పులేదు. నిజానికి, ఆలూమగల మధ్య దగ్గరితనం పెరిగేకొద్దీ 'మనం' అనే ప్రపంచం విస్తరిస్తూ 'నా' అన్న ప్రపంచం చిన్నదైపోతుంది.
అలక మంచిదే!
పోట్లాడుకోండి. బాగా పోట్లాడుకోండి. తిట్టాలనుకున్న తిట్లన్నీ తిట్టేయండి. అనాలనుకున్న మాటలన్నీ అనేయండి. అలక పాన్పు ఎక్కేయండి. మూతి మూడొంకర్లు తిప్పేయండి. కాకపోతే అదంతా తాత్కాలికమే కావాలి. పంతాలూ పట్టింపులూ ఉండకూడదు. టీవీ కట్టేయగానే సీరియల్‌లోని పాత్రల్ని మరచిపోయినంత సులభంగా ఈ గొడవల్నీ మరచిపోవాలి. అదేదో డిటర్జెంట్‌ ప్రకటనలో 'మరక మంచిదే' అన్నట్టు, పాజిటివ్‌ ధోరణితో ఆలోచిస్తే అలకలూ కోపాలూ ఎంతోకొంత మంచే చేస్తాయంటారు మానవ సంబంధాల నిపుణులు. వృత్తి ఉద్యోగాల్లోని ఒత్తిడంతా గాల్లో కలిసిపోవడానికి తాత్కాలిక కోపాలు 'ప్రెషర్‌ వాల్వ్‌'లా పనిచేస్తాయి. ఆఫీసులో బాసు మీద పీకల్దాకా కోపమొస్తుంది. ఎదురుచెప్పలేని పరిస్థితి. ఇంటికి రాగానే శ్రీమతి మీద కేకలేస్తాడు. ఆ బరువు దిగిపోతుంది. కాకపోతే, ఆ చికాకు ఒత్తిడివల్ల వచ్చిందే అన్న విషయాన్ని ఆమె గ్రహించాలి. చికాకు తగ్గగానే 'సారీ' చెప్పే విజ్ఞత ఇతడికీ ఉండాలి. ఆమె అరుపుల్నీ అంతే సహనంగా భరించగలగాలి. అలాగే, అందరూ తమ ఆలోచనల్నీ ఇష్టాయిష్టాల్నీ నిర్మొహమాటంగా వ్యక్తం చేయలేరు. అలాంటి అంతర్ముఖుల్ని అర్థంచేసుకోడానికి జీవితభాగస్వాములకు అలకలే శరణ్యం. ఆయన అలిగాడంటే వంకాయకూర ఇష్టంలేదని అర్థమేమో. ఆమె అలిగిందంటే సిగరెట్‌ కంపు నచ్చలేదని సూచనేమో. అలకలు తీర్చడంలో, బతిమాలడంలో 'నువ్వు బాధపడితే నేను చూడలేను' అన్న సంకేతమూ ఉంటుంది. ఇదో ప్రేమ వ్యక్తీకరణ మార్గం కూడా. జీవిత భాగస్వామి 'ఇగో'నూ సంతృప్తిపరచవచ్చు. కోపతాపాల్ని లోలోపలే మురగబెట్టుకోవడం మానసిక ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలక ద్వారా ఆ బరువు దించేసుకోవచ్చు. ఒకటి మాత్రం నిజం. ఈ అలకపాన్పులూ మూతివిరుపులూ తాత్కాలిక పరిష్కారాలే. ఎంతోకాలం పనిచేయలేవు. దీర్ఘకాలంలో ఉండాల్సింది...పారదర్శకత, భావవ్యక్తీకరణ, పరస్పర నమ్మకం.
శృంగారం..బంగారం!
బండి మొండికేయగానే సర్వీసింగ్‌కు తీసుకెళ్తారు. గోడలు వెలిసిపోయినట్టు అనిపించగానే ఏ ఏషియన్‌ పెయింట్‌ వాళ్లనో పిలిపిస్తారు. కనుమరుగవుతున్న శృంగార జీవితాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుకోడానికీ, మొక్కుబడిగా మారిన లైంగిక అనుభవాలను ముద్దూముచ్చట్లతో నిత్యనూతనం చేసుకోడానికీ మాత్రం ఎందుకు చొరవతీసుకోరు? పెళ్లి పాతబడేకొద్దీ శృంగారం ఘోరమైన నిర్లక్ష్యానికి గురవుతుంది. ఆ నిర్లక్ష్యం మితిమీరితే, ఏదో ఒక రూపంలో కాపురాన్ని బలితీసుకుంటుంది. అది మానసిక వ్యాధులకు మూలం కావచ్చు. ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అనుబంధాల్ని దెబ్బతీయవచ్చు. ఆలోచనల్ని పక్కదారి పట్టించవచ్చు. పెళ్లయిన పదేళ్ల తర్వాత కూడా భాగస్వామి ఇష్టాల్ని అర్థం చేసుకోలేని భార్యలున్నారు. భార్య అవసరాల్ని గుర్తించలేని భర్తలున్నారు. శృంగారం మూడుముళ్లలో ఒకటైన...వలపుముడిని మరింత పదిలం చేస్తుంది. ఇదో అద్భుతమైన అనురాగ వ్యక్తీకరణ మార్గం...వేయి వజ్రపుటుంగరాలకూ లక్ష గులాబీ గుచ్ఛాలకూ సరిసమానం. నాలుగుపదులు దాటగానే లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీసే సమస్యలేవైనా ఉంటే సెక్సాలజిస్టుల్ని సంప్రదించి చికిత్స చేయించుకుంటే తప్పేం కాదు. వ్యాయామం ద్వారా సౌందర్య చికిత్సల ద్వారా ఆహార నియమాల ద్వారా ఆరోగ్యంగా ఆకర్షణీయంగా కనిపించాలన్న ఆలోచన ఇద్దర్లోనూ ఉండాలి. వయసు పెరిగేకొద్దీ మునుపటి పటుత్వం తగ్గవచ్చు, ఉరుకూ ఉత్సాహం తగ్గవచ్చు. అయితేనేం, శృంగారంలో తనువుల పాత్ర నలభైశాతమైతే, మనసుల పాత్ర అరవైశాతం.
ఇది కథ కాదు!
(...ఓ సైకాలజిస్టు కేస్‌స్టడీ)
ప్రేమ, సురేష్‌ పెళ్లికిముందు నుంచే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. పెళ్లయిన నెలరోజులకే ఇద్దరికీ ప్రమోషన్లు వచ్చాయి. మరింత బిజీ అయిపోయారు. తన భార్య ఆఫీసు పనులు తగ్గించుకుని, వీలైతే రాజీనామా చేసి వృద్ధులైన తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని సురేష్‌ కోరిక. ఆమెకు అలాంటి ఆలోచనే లేదు. సురేష్‌ చెప్పినా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇద్దరూ ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుంటారు. అలసిపోయేదాకా ఆ విషయమే వాదులాడుకుంటారు. ఆతర్వాత చెరోవైపు ముఖం తిప్పి పడుకుంటారు. ఒక ముద్దూలేదు, ఒక ముచ్చటాలేదు. అంతలోనే ప్రేమకు విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. అడిగితే సురేష్‌ కాదంటాడని తెలుసు. అందుకే మాటమాత్రంగా అయినా చెప్పకుండా బయల్దేరింది. అక్కడికెళ్లాకా గొడవలు తగ్గలేదు. ఫోన్లో తిట్టుకునే వారు. ఎస్సెమ్మెస్‌ల ద్వారా వాదులాడుకునేవారు. ఛాటింగ్‌లో దుమ్మెత్తిపోసుకునేవారు. అప్పుడే, విడాకుల ఆలోచన వచ్చింది. ఒకరు ప్రతిపాదించారు. మరొకరు సరేనన్నారు. ప్రేమ విదేశాల నుంచి వచ్చీరాగానే న్యాయవాదిని కలుసుకున్నారు. తొందర్లోనే విడాకులు వచ్చేశాయి. ఆ కాగితాలు తీసుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.ఒకటిరెండు నెలలు బాగానే అనిపించింది. ఎంత సేపు ఆఫీసులో ఉన్నా అడిగేవారు ఉండరు. ఏ పనిచేసినా ప్రశ్నించేవారు ఉండరు. మెల్లమెల్లగా ఆ హద్దుల్లేని స్వేచ్ఛ వెగటుపుట్టేసింది. తమ కోసం ఎదురుచూసేవారు, ప్రేమగా తలుపుతీసేవారు, ఉన్నతికి సంతోషించేవారు, బాధలో ఓదార్చేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరన్న ఆలోచనే నరకంలా అనిపించింది. 'మళ్లీ పెళ్లిచేసుకుంటే?'... ఇద్దర్లోనూ ఒకే ఆలోచన. పెళ్లి గురించి ఆలోచన రాగానే, పాత జీవితభాగస్వామే గుర్తుకొచ్చారు. విడాకులు తీసుకునే దాకా ఎదుటి వ్యక్తిలోని చెడును మాత్రమే భూతద్దంలోంచి చూసినవారు, మెల్లమెల్లగా మంచినీ గుర్తించడం మొదలుపెట్టారు. ఫోన్‌ కబుర్లు, ఎస్సెమ్మెస్‌లూ మరింత దగ్గర చేశాయి. విడాకులు తీసుకుని తొందరపడ్డామేమో అన్న పశ్చాత్తాపం ఇద్దరికీ కలిగింది.రెండు సంక్షిప్త సందేశాలు వాళ్లిద్దర్నీ మళ్లీ ఒక్కటి చేశాయి.

'నేను లెక్చరర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. ఇంటిపనులు చూసుకోడానికి బోలెడంత ఖాళీ దొరుకుతుంది.'
- ప్రేమ

అతనికి సందేశం పంపిస్తున్న సమయానికే, ఆమె ఇన్‌బాక్సులో ఓ మెసేజ్‌ వచ్చి పడింది.

'ఇంట్లోనే కూర్చుని పనిచేసుకోడానికి మా కంపెనీ సరేనంది. ఇక నీ కెరీర్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.'
- సురేష్‌

నీతి: ఏ ఆలూమగలూ అయినా... సమస్య గురించి ఆలోచించి బుర్రపాడుచేసుకునే సమయంలో పదిశాతం సమయాన్ని పరిష్కారానికి కేటాయించినా చాలు వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది.
* * *
అన్యోన్య దాంపత్యం అంటే...అలకలూ గొడవలూ అభిప్రాయభేదాలూ మచ్చుకైనా లేని కాపురం కాదు. అవన్నీ ఉన్నా తట్టుకుని నిలబడిన కాపురం, ప్రతి సంక్షోభం తర్వాతా మరింత బలపడిన కాపురం.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు