మన బ్యాండ్ భళారే! ఒలింపిక్స్ హుషారే!!! (Eenadu Eetaram_28/07/2012)


ఒలిపింక్స్‌లో ఈసారి మన మోత మోగబోతోంది... అది పతకాలకు సంబంధించింది కాదు... కొందరు కుర్రాళ్ల కేరింతలకు చెందినది! వీళ్లు పలికించే సంగీతం... ప్రారంభోత్సవంలో సంబరం నింపనుంది! చెన్నై నుంచి 'స్టకాటో' బ్యాండ్‌గా వెళ్లనున్న వీళ్లు... దేశం నుంచి వెళుతున్న ఏకైక బృంద సభ్యులు! 21 వేల దరఖాస్తుల నుంచి... అవకాశాన్ని దక్కించుకున్న కళాకారులు! ఆ బ్యాండ్‌ వీరులతో మాట కలిపింది 'ఈతరం'.

కుర్రాళ్లు వాయిద్యాలు మీటడం వింత కాదు. ఒక చోట చేరి సాధన చేయడం అరుదేమీ కాదు. ఊళ్లు తిరుగుతూ ప్రదర్శనలు ఇవ్వడం కూడా అసాధారణం కాదు. కానీ ప్రపంచ దేశాల క్రీడాకారులు పాల్గొనే ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలకు సంగీత హోరును అందించే 'బ్యాండ్‌' కళాకారులుగా ఎంపికవడం మాత్రం ఘనంగా చెప్పుకోదగిన అంశమే. అలాంటి అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు చెన్నైకి చెందిన 'స్టకాటో' బ్యాండ్‌ సభ్యులు. అందునా ఆసియా నుంచి ఎంపికైన రెండే రెండు జట్లలో ఒకటిగా నిలవడం మరీ విశేషం. 21 వేల బృందాలు దరఖాస్తులు చేసుకోగా వీళ్లకే అవకాశం లభించింది. అభిరుచి కొద్దీ ఒకటైన కుర్రాళ్లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరు ఆసక్తికరం.
తొలి అడుగులు ఇలా...
విక్రం సారథి చెన్నై కుర్రాడు. ఇళయరాజా, ఎ.ఆర్‌.రెహమాన్‌ పాటలంటే పిచ్చి అభిమానం. ఆసక్తి గమనించి అమ్మానాన్నలు కీబోర్డుపై శిక్షణ ఇప్పించారు. స్కూళ్లో ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా బహుమతి అతడిదే. విక్రం స్నేహితులు శృతిసాగర్‌, బాలసుబ్రహ్మణ్యం సైతం ప్రతిభావంతులే. ఒకరు వేణువులో, మరొకర్‌ డ్రమ్స్‌లో దిట్టలు. ముగ్గురూ జట్టు కట్టారు. బ్యాండ్‌ మోత మొదలైంది. ప్రదర్శనలు బడి గడప దాటి బయటికి బయల్దేరాయి. సత్తా ఉన్న వాళ్లని ఒక్కొక్కరుగా చేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్లస్‌వన్‌కి వచ్చేసరికి సభ్యుల సంఖ్య 16కు చేరింది. 2010లో తమ బ్యాండ్‌కు 'స్టకాటో' అనే పేరు పెట్టుకున్నారు. బాణీ స్వరాల వరసని లెగాటో అంటారు. బాణీని ఒకదానికి ఒకటి అనుసంధానం చేయకుండా వేరువేరుగా విడదీసి ఇంపుగా పలికించడాన్ని స్టకాటో అంటారు.
ప్రపంచ గుర్తింపు
పాఠశాల చదువు పూర్తయ్యేసరికే స్టకాటోకి వందల ప్రదర్శనలు పూర్తయ్యాయి. తర్వాత వేర్వేరు కళాశాలల్లో చేరినా సంగీతాన్ని వదలలేదు. ప్రదర్శన ఉంటే ప్రత్యేక అనుమతితో ఏకమయ్యేవారు. అలాగని చదువుల్లో వెనకబడలేదు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సత్యపాల్‌ తన బ్రాండ్‌ దుస్తుల్ని చెన్నైలో ప్రారంభించినప్పుడు చేసిన ప్రదర్శనతో తొలిసారి దేశం దృష్టిని ఆకర్షించారు. ఆపై వరుస పరిధి మరింత పెరిగింది. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతంలో రూపొందించిన 'సత్యమేవ జయతే' లాంచ్‌ కార్యక్రమంలో షోతో అలరించారు. బ్రెజిల్‌లో 'టుం టుం పా' సంగీత పోటీల్లో 40 బ్యాండ్లతో పోటీ పడి ఏడో స్థానంలో నిలిచారు. చెన్నై హిందుస్థాన్‌ యూనివర్సిటీ-బ్రిటిష్‌ హైకమిషన్‌ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో అదరగొట్టారు. బృందంలో ఒకే వాద్య పరికరాన్ని గంటలకొద్దీ వాయించే కళాకారులున్నారు. ఫ్లూటిస్ట్‌ శ్రుతిసాగర్‌ విడిగా వందల ప్రదర్శనలు ఇచ్చాడు. బాలా తబలా ఆణిముత్యం. విక్రం సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్‌ దగ్గర కీబోర్డు ఆర్టిస్టు. ఇంతేకాదు వీళ్లంతా ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు.సంప్రదాయం.. పాశ్చాత్యం
సంప్రదాయ, పాశ్చాత్య సంగీతమే కాదు లాటిన్‌, అరబిక్‌ సంగీతంపై కూడాజట్టు సభ్యులు పట్టు సాధించారు. ఈ బాణీలన్నీ కలిపి 'సౌండ్‌ ఆఫ్‌ ఎయిర్‌' అనే ట్రాక్‌ రూపొందించారు. దీంతోపాటు సల్సా నృత్యం ఆధారంగా మరో ట్రాక్‌ రూపొందించారు. వీటిని ఒలింపిక్‌ క్రీడల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహక బృందానికి పంపారు. రెండు వారాల కిందట 'లండన్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ ప్రదర్శనకు ఎంపికయ్యార'ంటూ అధికారిక సందేశం అందింది. సంతోషం పట్టలేక గంతులేశారు యువబృందం. టాటా గ్రూపు సాయంతో లండన్‌ ఫ్త్లెటెక్కనున్నారు.
సమాయత్తం
ఒలింపిక్స్‌ వేదికపై ప్రదర్శన ఇస్తున్నందుకు స్టకాటో సభ్యులందరికీ గర్వంగానే ఉంది. అదే సమయంలో మరోవైపు టెన్షన్‌. ఇప్పటిదాకా చేసినవన్నీ ఆడుతూ పాడుతూ చేసిన ప్రదర్శనలే. ఇప్పుడేమో దేశం తరపున సత్తా చూపాలి. అందుకే ఆ గౌరవాన్ని నిలబెట్టాలని చెమటలు చిందేలా కష్టపడుతున్నారు. 'విద్యార్థులుగా ఉన్నపుడు ఏదైనా సాధ్యమయ్యేది. ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు మా సాధనకు అడ్డంకిగా మారాయి. అయినా ప్రాక్టీసులో ఎక్కడా రాజీపడం' అంటున్నాడు కీలక సభ్యుడు విక్రం సారథి. జులై 30, ఆగస్టు రెండున స్టకాటో సభ్యుల ప్రదర్శన ఉంటుంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కన్నడ, ఒరియా, పంజాబీ గీతాలకు పాశ్చాత్య బాణీలు జోడించి ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇళయయరాజా సంగీతంలో మలయాళ చిత్రం 'ఓలంగల్‌'లోని 'తుంచి వా..', ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతంలో 'రంగ్‌దే బసంతి' టైటిల్‌సాంగ్‌, 'హే రాం'లో 'ఇసయిల్‌ తొడంగుదు..', 'ఉయిరే'లో 'నెంజినిలే.. నెంజినిలే..' పాటలు వాళ్ల ప్రదర్శనలో ఉన్నాయి. నలభై నిమిషాల చొప్పున రెండు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
- టి.ఉదయ్‌కుమార్‌, న్యూస్‌టుడే: చెన్నై
బృంద సభ్యులు 
గాయకులు: వందన, గౌతం భరద్వాజ్‌ కీబోర్డు: విక్రంసారథి, కార్తిక్‌ ఫ్లూట్‌: శ్రుతిసాగర్‌ మృదంగం: ప్రవీణ్‌ 
వయోలిన్‌: మనోజ్‌ బేస్‌: షాలూ గిటార్‌: శబరీశ్‌ డ్రమ్స్‌: తపస్‌, ఇలవరసన్‌




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు