బహుదూరపు బాటసారి (Eenadu Sunday Mag_29/07/12)




బహుదూరపు బాటసారి
ఇందిర నుంచి సోనియా దాకా - ఎందరో నేతలు. రాజ్యసభ సభ్యత్వం నుంచి కేంద్రమంత్రి హోదా దాకా - ఎన్నో పదవులు. మిరాటీ నుంచి కొత్తఢిల్లీ దాకా - ఎన్నో మైళ్లు. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జీవితం ఓ సుదీర్ఘ ప్రయాణం.
క్ల చొలో... ఎక్ల చొలో... ఎక్ల చొలోరే! 'ఎవరూ నీవెంట రాకున్నా... ఎవరూ నీ పిలుపు వినకున్నా...కారుచీకటైనా కారడవైనా... ఒంటరిగా... ఒంటరిగా... ఒంటరిగానే ముందుకు సాగవోయ్‌!' ప్రణబ్‌ముఖర్జీకి ఠాగూర్‌ సాహిత్యమంటే ప్రాణం. ఆనందంగా ఉన్నా, విషాదమనిపించినా పడక్కుర్చీలో సేదతీరుతూ రవీంద్ర సంగీతం వింటారు. అందులోనూ 'ఎక్ల చొలో..' గీతమంటే మరీ ఇష్టం. ఆ పాటకూ తన జీవితానికీ ఎక్కడో పోలిక ఉన్నట్టు అనిపిస్తుంది. నిజమే, నాలుగున్నర దశాబ్దాల ప్రజా జీవితంలో ఆయనదెప్పుడూ ఒంటరి ప్రయాణమే. అధికారగణం, ప్రొటోకాల్‌ హంగామా, గాంధీ-నెహ్రూ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు...ఎన్నున్నా, అంతరాంతరాల్లో ప్రణబ్‌ ఏకాకే. ఎంతోకొంత అంతర్ముఖుడే!
మూడుతరాలు...
'భారత ప్రజాస్వామ్యం వెనుక నెహ్రూ, ఆధునికత వెనుక ఇందిర, టెక్నాలజీ వెనుక రాజీవ్‌'... ప్రణబ్‌ ప్రసంగాల్లో మూడుతరాల ముచ్చట ఉండితీరుతుంది. దేశం మీదే కాదు, ఆయన రాజకీయ జీవితం మీదా ఆ ముగ్గురి ప్రభావం అపారం. నెహ్రూతో తనకున్నది భావజాల అనుబంధం. తొలిప్రధాని ఉపన్యాసాలన్నీ శ్రద్ధగా చదివారు. కొన్ని కంఠతా వచ్చు కూడా. గాంధీ-నెహ్రూ కుటుంబంతో ప్రత్యక్ష పరిచయం మాత్రం ఇందిర హయాంలోనే!
ఓసారి రాజ్యసభలో బ్యాంకుల జాతీయీకరణపై చర్చ జరుగుతోంది. ప్రణబ్‌వంతు వచ్చింది. బిత్తరచూపులతో మైకు అందుకున్న ఆ కొత్త ఎంపీని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. క్రమంగా ఉపన్యాసం వూపందుకుంది. అంకెలు రంకెలేశాయి. విమర్శలు చురుకుపుట్టించాయి. చరిత్ర, అర్థశాస్త్రం, సామ్యవాదం- ప్రణబ్‌ స్పృశించని కోణమంటూ లేదు. ప్రసంగం ముగిసింది. చప్పట్లు మోగాయి. ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఆ ఉపన్యాసాన్ని విన్నారు. ఆవేశం వచ్చినా, ఆనందం కలిగినా ఆమె ఆపుకోలేరు. వెంటనే ప్రణబ్‌ను పిలిపించి అభినందించారు. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించినంత వరకూ అధినేత్రి దృష్టిలోపడటం అంటే... పెద్ద పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉండటం. అందులోనూ మంత్రివర్గ విస్తరణపై వూహాగానాలు వినిపిస్తున్న సమయమది. ప్రణబ్‌ ఎలాంటి ఆశలూ పెట్టుకోలేదు. సాధారణ అతిథిగానే ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారు. మొత్తం ఏడు పేర్లు ఖరారయ్యాయి. ఇందిర సంఖ్యాశాస్త్రాన్ని నమ్మేవారు. ఆ అంకె అశుభసూచకమని అనిపించింది. మరో మంత్రిని తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. ఎవరా ఎనిమిదో వ్యక్తి? రాజ్యసభలో ప్రణబ్‌ గంభీరోపన్యాసం గుర్తుకొచ్చింది. ఎంపీల మధ్య ఉన్న ప్రణబ్‌ను పిలిచి, 'మంత్రిగా ప్రమాణం చేస్తారా?' అనడిగారు. ఎవరైనా కాదనగలరా! పారిశ్రామిక అభివృద్ధిశాఖ సహాయమంత్రి హోదాలో రాష్ట్రపతి భవన్‌ నుంచి బయటికొచ్చారు ప్రణబ్‌ముఖర్జీ. 'ఇదంతా మీడియా వండివార్చిన మసాలా కథనం మాత్రమే. వాస్తవం ఏమిటంటే.. ప్రణబ్‌ రాజకీయ గురువు అజయ్‌ ముఖర్జీ స్వయంగా ఇందిరాగాంధీకి ఫోన్‌ చేసి మంత్రిపదవి ఇప్పించారు' అంటారు నాటి పరిణామాలను దగ్గర నుంచి పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.
ప్రణబ్‌ మితభాషి కావచ్చు. కానీ ప్రియభాషి. ఆయన సంభాషణల్లో పదాడంబరం ఉండదు. సాహితీ గుబాళింపు కనిపిస్తుంది. తరచూ భగవద్గీతను ఉటంకిస్తారు. ఠాగూర్‌ ప్రస్తావన సరేసరి. ఆయన మాటతీరే కాదు, పనితీరూ ఇందిరకు నచ్చింది. రెండేళ్లలో రెవెన్యూ, బ్యాంకింగ్‌ విభాగాల సహాయమంత్రి అయ్యారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యత్వం లభించింది. అంతలోనే అత్యవసర పరిస్థితి! ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. ఆ సమయంలో ప్రణబ్‌ పార్టీకి అండగా నిలబడ్డారు. ఆ కృతజ్ఞతతోనే, అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు ఇందిర. సమర్థతతో, విశ్వసనీయతతో వాణిజ్యశాఖ నుంచి ఆర్థికశాఖ దాకా ఎదిగారు ప్రణబ్‌. క్యాబినెట్‌లో ఆయనే 'నంబర్‌ టూ'.
ఇందిరతో ఆయనకున్నది...కేంద్రమంత్రి-ప్రధాని సంబంధానికి అతీతమైన అనుబంధం. ఓసారి 'ప్రణబ్‌! మన క్రికెట్‌ జట్టు వరల్డ్‌ కప్‌ గెలిచింది...' ఎంతో ఉత్సాహంగా ఫోన్‌ చేశారు ఇందిరాగాంధీ. ఆయనకు క్రికెట్‌లో ఓనమాలు తెలియవు. ఆసక్తి కూడా లేదు. 'అలాగా...గ్రేట్‌...వెరీగుడ్‌' అంటూ లేని ఉత్సాహాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. ఇద్దరికీ ఆసక్తి ఉన్న అంశం మాత్రం ... పుస్తక పఠనమే. తనకు బాగా నచ్చిన పుస్తకాలను ప్రణబ్‌కు పంపేవారు ఇందిరాగాంధీ. ప్రణబ్‌ కూడా ఆమెకు మంచి పుస్తకాల్ని సిఫార్సు చేసేవారు. ఎర్వింగ్‌ టోఫ్లెర్‌ రాసిన పుస్తకం ప్రణబ్‌కు తెగ నచ్చింది. చదవమంటూ ప్రధానికి పంపారు. రెండ్రోజుల్లోనే పుస్తకం వెనక్కి వచ్చింది. చివరిపేజీలో... 'పుస్తకం బావుంది, కృతజ్ఞతలు. కానీ నా ఆర్థిక మంత్రి టోఫ్లెర్‌ పుస్తకాన్ని చదువుతూ కూర్చుంటే, బడ్జెట్‌ గతేంకాను'...అంటూ ఇందిర స్వదస్తూరీలో రాసిన చీటీ. అది బడ్జెట్‌ సీజన్‌ మరి! ఏదో హాస్యానికి అలా రాశారు కానీ, తన ఆర్థికమంత్రి సామర్థ్యం ఆమెకు తెలియంది కాదు. ప్రణబ్‌ పనిరాక్షసుడు. రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడగలరు. ఉద్యోగులంతా వెళ్లిపోయాక...ఆయన సొరుగులోని ఫైళ్లు తెరుచుకుంటాయి. రాత్రంతా ఆఫీసు లైట్లు వెలుగుతూనే ఉంటాయి.
ఇందిర దుర్మరణం ప్రణబ్‌ రాజకీయ జీవితంలో పెద్ద కుదుపు. నాటి అనిశ్చిత పరిస్థితుల్లో...రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకాలని ప్రణబ్‌ ఆశించడంలో తప్పులేదు. వారసత్వ రాజకీయాలకు నెలవైన కాంగ్రెస్‌ పార్టీలో అది నేరం, విశ్వాసఘాతుకం! రాజీవ్‌ ప్రధాని కావడంతో పరిస్థితులు మారిపోయాయి. ప్రణబ్‌కు కష్టాలు మొదలయ్యాయి. ప్రణబ్‌కు రాజీవ్‌ కేబినెట్‌లో స్థానం లభించలేదు. బెంగాల్‌ బాధ్యతలు అప్పగించి ఢిల్లీ నుంచి వెళ్లిపొమ్మని పరోక్షంగా సంకేతాలిచ్చారు. తర్వాత ఆ పీఠం నుంచీ తొలగించారు. ఉనికి చాటుకోడానికి, తనలాగే వివక్షకు గురవుతున్న సీనియర్లతో జతకట్టారు ప్రణబ్‌. రాజీవ్‌ విధాన నిర్ణయాలను విమర్శిస్తూ కమలాపతి త్రిపాఠి ఓ లేఖ రాశారు. అదికాస్తా పత్రికల చేతికి చిక్కింది. పెద్ద గొడవైంది. ఏదో సాకు చూపించి..ప్రణబ్‌ను పార్టీ నుంచి వెలివేశారు. 'అప్పటికి నా వయసు నలభై ఎనిమిది. తొమ్మిదేళ్లు కేంద్ర క్యాబినెట్‌లో ఉన్నాను. పద్నాలుగేళ్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించాను. మిగిలిన జీవితమంతా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి'..అంటూ ఆ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటారు ప్రణబ్‌. ఇష్టం ఉన్నా లేకపోయినా... తనకంటూ ఓ రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరైంది. రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ను స్థాపించి...ఎన్నికల బరిలో దిగారు. ఘోరపరాజయం ఎదురైంది. రాజకీయాల అసలు రంగు తెలిసింది. మనసు మళ్లీ కాంగ్రెస్‌వైపు మళ్లింది. ఆ సమయానికి రాజీవ్‌ పూర్వవైభవాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బోఫోర్స్‌ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రణబ్‌ను ఇబ్బందులకు గురిచేసిన అరుణ్‌నెహ్రూ తదితరులు పార్టీని వదిలి వెళ్లిపోయి, విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ మంత్రివర్గంలో చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్‌ కూడా ప్రణబ్‌ వంటి అనుభవజ్ఞుల అవసరాన్ని గుర్తించింది. అప్పుడే, త్రిపుర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. 'పార్టీని గట్టెక్కించాల్సిన బాధ్యత మీదే..' అన్నారు రాజీవ్‌. ఇందిర హయాంలో సాధించుకున్న ప్రతిష్ఠ పూర్తిగా మసకబారిపోయింది. ఒక్కో ఇటుకా పేర్చుకుని కాంగ్రెస్‌లో తనకంటూ ఓ పునాది నిర్మించుకోవాల్సిన పరిస్థితి. ఆ అవకాశాన్ని వదులుకోలేదా ఆశావాది. 'తప్పకుండా...'అని భరోసా ఇచ్చారు. కాలం కూడా కలిసొచ్చింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చింది. రాజీవ్‌తో సాన్నిహిత్యమూ పెరిగింది. ఏదో సందర్భంలో... 'ప్రణబ్‌జీ! అప్పట్లో కమలాపతి త్రిపాఠి పేరు మీద వచ్చిన సుదీర్ఘలేఖ రచయిత మీరే కదూ! నాకు అప్పుడే అనిపించింది.. అంత చక్కగా, అంత విమర్శనాత్మకంగా మీరు తప్ప ఎవరూ రాయలేరు' అనడిగారు రాజీవ్‌. బదులు చెప్పలేదు ప్రణబ్‌. అవుననలేరు. కాదనలేరు.
రాజీవ్‌ దుర్మరణంతో పార్టీలో నాయకత్వ సమస్య మొదలైంది. బయటికెళ్లిరావడం ప్రణబ్‌ ప్రధాన అనర్హతగా మారింది. ప్రధాని పదవి మీద ఆశ ఉన్నా...పోటీపడలేకపోయారు. దూరం నుంచే ఆ పరుగుపందాన్ని గమనించారు. ప్రధాని పీఠం పీవీ నరసింహారావును వరించింది. ఆయన సర్కారులో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, విదేశాంగమంత్రిగా పనిచేశారు. సోనియా రాజకీయ ప్రవేశం... ప్రణబ్‌ జీవితంలో కీలకమైన మలుపు. ఆమెను నాయకత్వ బాధ్యతలకు ఒప్పించిన వారిలో ప్రణబ్‌ ఒకరు. 'విదేశీయత' కారణంగా సోనియా ప్రధాని పదవి వద్దనుకున్నప్పుడు, ప్రణబ్‌కే పీఠం దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆమె మన్మోహన్‌సింగ్‌ పేరు సిఫార్సు చేశారు. మరోసారి ఆశాభంగం. ఇందిర క్యాబినెట్‌లో ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు, తాను రిజర్వు బ్యాంకు గవర్నరుగా నియమించిన వ్యక్తి ప్రధానమంత్రి కావడం, ఆయన నాయకత్వంలో పనిచేయాల్సి రావడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. అదీ తాత్కాలికమే. విభేదించడం, వ్యతిరేకించడం, విమర్శించడం...అన్నపదాల్ని ప్రణబ్‌ ఎప్పుడో తన నిఘంటువు నుంచి తొలగించారు. సంక్షోభాల్లో సమస్యల్లో అధినాయకురాలికి అండగా నిలిచారు. కురువృద్ధుడైన ప్రణబ్‌ తన మంత్రివర్గంలో సర్దుకుపోగలరా అన్న అనుమానం, కొంతకాలం మన్మోహన్‌నూ పీడించేది. మనసులో ఏం ఉన్నా...చక్కని సమన్వయంతో పనిచేసుకుపోయారు ప్రణబ్‌. అణు ఒప్పందం వంటి సంక్షోభ సమయాల్లో ప్రధానికి రక్షణ కవచమయ్యారు. ఎనిమిదేళ్ల అనుబంధం మన్మోహన్‌కు ప్రణబ్‌ అంటే గౌరవాన్ని పెంచింది. రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలపాలైనప్పుడు...ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం పంపారు. స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రణబ్‌ముఖర్జీ ఆర్థిక మంత్రిగా రాజీనామా చేసిన రోజు.. కాంగ్రెస్‌ పార్టీ యువనేత రాహుల్‌గాంధీ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదా చెప్పిన నానమ్మ కబుర్లూ, నాన్న జ్ఞాపకాలూ వింటూ చాలాసేపు కూర్చుండిపోయారు. కాంగ్రెస్‌ చరిత్రకు సంబంధించి ప్రణబ్‌ నడిచే ఎన్‌సైక్లోపిడియా. ఓసారి ఇందిర వెంట సౌదీ అరేబియా వెళ్లారు. సౌదీ రాజు తమ ప్రణాళికల గురించి వివరించారు. ఇందిర కూడా తమ ప్రభుత్వం పనితీరును చెప్పాలనుకున్నారు. అప్పటికప్పుడు ఎవరైనా ఏం మాట్లాడగలరు? అధికారులు తెల్లమొహం వేశారు. ప్రణబ్‌వైపు చూశారామె. అధినేత్రి ఆదేశం అర్థమైంది. పంచవర్షప్రణాళికల గురించీ ఇరవైసూత్రాల పథకం గురించీ అంకెలతో సహా వివరించారు. 'మిమ్మల్ని అంతా హ్యూమన్‌ కంప్యూటర్‌ అని ఎందుకంటారో ఇప్పుడు నాకు అర్థమైంది' అని ప్రశంసించారు ప్రధాని. ఏ సంవత్సరం ఎన్నికోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు, ఏ సందర్భంలో ఇందిరాగాంధీ ఎలా వ్యవహరించారు... ఇలా ఎవరూ గుర్తుంచుకోలేని, ఎవరికీ చూచాయగా అయినా తెలియని చాలా విషయాలు ప్రణబ్‌ బుర్రలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇంకొన్ని పాత డైరీల్లో భద్రంగా ఉన్నాయి. ఇప్పటికీ ఆయన డైరీ రాసుకుంటారు. 'ప్రజల భూముల్ని లాక్కునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? పేదల పొట్టకొట్టి పారిశ్రామికవేత్తల కడుపు నింపడం ఎంతవరకు న్యాయం? తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చినా సరైన ధర చెల్లించాలి. అభివృద్ధిలో వారినీ భాగస్వాములను చేయాలి'...నందిగ్రామ్‌ ఉదంతం జరిగిన రోజు ప్రణబ్‌ డైరీలో అక్షర అంతర్మథనమిది.
రాజకీయ యోధుడు.. 
చేతిలో బంతి పెట్టి వెళ్లిపోయారు డ్రిల్‌ మాస్టరు. ఫుట్‌బాల్‌ ఆడుకుందామంటే...దాన్లో గాలి లేదు. స్టోర్‌రూమ్‌లోంచి మరొకటి తీసుకురావడానికి ఎవరికీ ధైర్యం చాల్లేదు. అక్కడ హెడ్‌మాస్టరు ఉన్నారు. పిల్లలంతా నిరాశపడిపోయారు. ప్రణబ్‌కు ఓ ఆలోచన వచ్చింది. పక్కనే ఉన్న దుకాణంలో సైకిలు పంపు తెచ్చాడు. తన దగ్గరున్న పాతపైపు జోడించి ... బంతిలో గాలి నింపాడు. సహపాఠీల ఆనందానికి అవధుల్లేవు. 'మనోడు సైంటిస్టురా...' అంటూ ఆకాశానికెత్తేశారు. శాస్త్రవేత్త కాదుకానీ, ప్రణబ్‌లో గొప్ప క్రైసిస్‌ మేనేజర్‌ ఉన్నాడు. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ మీటింగులో అయినా, క్యాబినెట్‌ సమావేశంలో అయినా, గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యులతో ఆంతరంగిక సమావేశంలో అయినా... ఏదైనా సంక్షోభం గురించి చర్చిస్తున్నప్పుడు ప్రణబ్‌ అభిప్రాయానికి చాలా విలువ ఉంటుంది. సమస్యల పరిష్కారంలో ఆయన నేర్పరి. కాంగ్రెస్‌లో చాలామంది విధేయులే ఉన్నారు. సీనియర్లూ ఉన్నారు. వక్తలకూ కొదవలేదు. ఆ సంక్షోభ నివారణ నైపుణ్యమే..ప్రణబ్‌కు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టింది. ఆ పరిణతి యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, అనుభవంతో పదునుపెట్టుకున్నది. తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన సహాయ మంత్రులు కూడా..తమ సమయంలో కొంత రాజకీయాలకూ కొంత పాలనకూ కొంత నియోజకవర్గానికీ కేటాయించుకుంటారు. సొంత వ్యాపారాలూ వ్యవహారాలూ ఉండనే ఉంటాయి. ప్రణబ్‌ మాత్రం...పూర్తి సమయాన్ని బాధ్యతలకే అంకితం చేశారు. అదే సర్వస్వం! విద్యార్థి పాఠ్యపుస్తకాన్ని చదివినంత శ్రద్ధగా తన దగ్గరికొచ్చిన ఫైళ్లను చదివారు. విలుకాడు లక్ష్యానికి గురిపెట్టినట్టు... సంక్షోభాలపై దృష్టి సారించారు. 'ఫ్రొఫెషనలిజమ్‌' ఆయన ప్రధాన అర్హత. అదే అనర్హతగానూ మారింది. గత రాష్ట్రపతి ఎన్నికలప్పుడే, ఎవరి ద్వారానో సోనియాకు తన మనసులోని మాట చెప్పించారు. 'ప్రణబ్‌జీ! మీరు రాష్ట్రపతి అయితే, సంతోషించే మొదటి వ్యక్తిని నేనే. మీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలో చెప్పండి. ఆపని చేసిపెట్టి... నిరభ్యంతరంగా వెళ్లండి' అన్నారు సోనియా. నిజమే, ఎవరున్నారు? మారుమాట్లాడలేక పోయారు. ఇప్పటికీ, ఆలోటు భర్తీ చేయడం అసాధ్యమే. కానీ, దశాబ్దాలుగా పార్టీకి సేవచేస్తున్న డెబ్భై ఏడేళ్ల వయోధికుడిని ఇంకా ఇబ్బందిపెట్టడం సముచితం కాదని అధిష్ఠానం భావించినట్టుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేసింది.
ఇన్నేళ్లు, ఇన్నిసార్లు తనతో దాగుడుమూతలాడిన ప్రధాని పీఠం... భవిష్యత్‌లో అయినా వరిస్తుందన్న నమ్మకం లేదు. ఆ అవకాశం కనుచూపుమేరలో కూడా లేదు. అంతా అనుకూలిస్తే, 2014 ఎన్నికల తర్వాత అధికారం చేపట్టడానికి రాహుల్‌ సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో, ఈ వయసులో...చిటారు కొమ్మన మిఠాయి పొట్లాన్ని ఎగిరి అందుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. అన్నివైపుల నుంచీ ఆలోచించాక... రాష్ట్రపతి పదవినే తుది మజిలీగా ఎంచుకున్నారు ప్రణబ్‌. పరుగు ఆపడమూ ఓ కళే. ప్రణబ్‌ అందులోనూ నిష్ణాతులు.
ప్రధాని కాలేకపోయానన్న అసంతృప్తి ఆయన్ని వెంటాడుతోందా? అంటే, 'లేదులేదు. నాకెలాంటి అసంతృప్తీ లేదు. నేనేం పొడగరిని కాదు. అయినా, చాలా ఎత్తులే అందుకున్నాను. ఎంపీనయ్యాను. కేంద్రమంత్రినయ్యాను. ఇప్పుడు, రాష్ట్రపతి పదవి. బెంగాల్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో పుట్టిన నాలాంటి మామూలు మనిషి .. ఇంతకుమించి ఏం కోరుకుంటాడు?' అంటారు ప్రణబ్‌. నిజమే, ఆయన వెనుక బలమైన రాజకీయ వారసత్వం లేదు. ఆస్తిపాస్తుల్లేవు. జనాకర్షణా లేదు. ఒక సాధారణ వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమే. ప్రణబ్‌ లాయరు కావాలని కలలుకనేవారు. లెక్చరర్‌ కావాలనీ ఉండేది. దీంతో ఆ రెండు చదువులూ చదివారు. రెండు వృత్తుల్లోనూ కాలుపెట్టారు. కొంతకాలం పాత్రికేయుడిగానూ పనిచేశారు. లెక్చరరు ఉద్యోగం చేస్తున్న సమయంలో బెంగాల్‌ కాంగ్రెస్‌ నేత అజయ్‌ముఖర్జీ నేతృత్వంలో 'సేవ్‌ బెంగాల్‌' ఉద్యమం మొదలైంది. అప్పుడే, ప్రణబ్‌ మనసు రాజకీయాలవైపు మళ్లింది. ముఖర్జీకి మద్దతుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన స్థాపించిన బంగ్లా కాంగ్రెస్‌లో ప్రధాన నాయకుడిగా ఎదిగారు. బంగ్లా కాంగ్రెస్‌, మార్క్సిస్టుల సంకీర్ణ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారు. ఆయన సమర్థతకు బహుమతిగా పార్టీ రాజ్యసభకు పంపింది. కొంతకాలానికి అజయ్‌ ముఖర్జీ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్రణబ్‌ తండ్రి కమదా కింకర్‌ కూడా కాంగ్రెస్‌వాదే. ఏఐసీసీ సభ్యుడిగానూ ఉన్నారు. తల్లిపేరు రాజ్యలక్ష్మి. బీర్బమ్‌ జిల్లాలోని మిరాటీ స్వగ్రామం. ఆరుగురు పిల్లల్లో ప్రణబ్‌ చివరివాడు. మిరాటీలో హైస్కూలు లేకపోవడంతో, ఏడు కిలోమీటర్లు నడిచి పొరుగూరికి వెళ్లేవాడు. వర్షాకాలంలో...పుస్తకాలూ యూనిఫామ్‌ ఓ గుడ్డలో చుట్టుకుని.. తడుస్తూ ఇంటికొచ్చిన రోజులున్నాయి. ఆ కష్టాలు ఆయనకు బాగా గుర్తున్నాయి. కాబట్టే, కేంద్రమంత్రి అయ్యాక సొంతూరి సమస్యల్ని చాలా వరకు పరిష్కరించారు. ఏడాదికి ఒకసారైనా స్వగ్రామానికి వెళ్తారు. దేవీ నవరాత్రులు పూర్వీకుల ఇంట్లోనే జరుపుకుంటారు. గ్రామంలోని పాఠశాల దగ్గర నిలబడి 'ప్రణబ్‌..' అని పిలిస్తే, చాలా తలలు మనవైపు తిరుగుతాయి. తమ వారసులూ ఆయనంతవాళ్లు కావాలని ఆపేరు పెట్టుకుంటారు గ్రామస్థులు.

పైపు పైపుకో చరిత్ర
ఒకప్పటి నలుపు-తెలుపు ఛాయాచిత్రాల్లో పైపులేని ప్రణబ్‌ముఖర్జీని చూడలేం. మధుమేహం కారణంగా, ఇరవై ఏళ్లక్రితం పైపును వదిలేయాల్సి వచ్చింది. అయినా మమకారం పోలేదు. ఆయన సొరుగులో ఇప్పటికీ ఒకటిరెండు పైపులైనా ఉంటాయి. వాటిలో ఒకటి ఇందిరాగాంధీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు తెచ్చినది.
సినిమాయణం
ప్రణబ్‌ ఇప్పటిదాకా రెండంటే రెండు సినిమాలే చూశారు. ఒకటి... 'రోమన్‌ హాలిడే', భార్య బలవంతం మీద వెళ్లాల్సి వచ్చింది. మరొకటి 'రంగ్‌ దే బసంతి', రక్షణశాఖ అనుమతి అవసరం కావడంతో, సెన్సార్‌ బోర్డు అధ్యక్షురాలు షర్మిలా ఠాగూర్‌ పట్టుబట్టి చూపించారు.
భోజనానికి...దాదా!
దాదా భోజనప్రియుడు. సంప్రదాయ బెంగాలీ వంటకాలంటే ప్రాణం. చిన్నప్పుడు ... ఉదయం లేవగానే 'అమ్మా బ్రేక్‌ఫాస్ట్‌ ఏమిటి?' అనడిగేవారట. బ్రేక్‌ఫాస్ట్‌ కాగానే 'మధ్యాహ్నానికి ఏం వండుతున్నారేమిటి?' అని వాకబు చేసేవారట. మధ్యాహ్న భోజనం తర్వాత చేయికడుక్కుంటూ రాత్రి భోజనం గురించి ఆరా తీసేవారట. వివిధ వంటకాల చరిత్రపై ఆయన సాధికారికంగా మాట్లాడగలరు.
జయజయతే...
ప్రణబ్‌ మహాభక్తుడు. కాళీ మాతను పూజిస్తారు. రోజూ ఉదయాన్నే ఓ గంట పూజ చేసికానీ బయటికి రారు. ఆ సమయంలో సందర్శకుల్ని అనుమతించరు. ఫోన్లో కూడా మాట్లాడరు - అది ప్రధానమంత్రి కాల్‌ అయినా సరే!
బెంగ్లీష్‌!
ప్రణబ్‌ ఆంగ్ల ఉచ్చారణ కాస్త తేడాగా ఉంటుంది. ఓసారి జయలలిత గురించి మాట్లాడుతూ 'జయలలిత కెనాట్‌ బి ...సేవ్డ్‌' అని పలకాల్సిన చోట 'కెనాట్‌ బి...షేవ్డ్‌' అన్నారు. అంతే, ఒకటే నవ్వులు! కెరీర్‌ తొలిరోజుల్లోనే ఇందిరాగాంధీ 'ఓ మంచి ట్యూటర్‌ను పెట్టుకుని ఇంగ్లిష్‌ ఉచ్చారణ మెరుగుపెట్టుకోవచ్చుగా ప్రణబ్‌!' అని సలహా ఇచ్చారు కూడా. 'ఎంత ప్రయత్నించినా గుండుసున్నాను చతురస్రం చేయగలమా మేడమ్‌!' అని గడుసుగా జవాబిచ్చారు దాదా.
రాకరాక వచ్చిన గెలుపు
ప్రణబ్‌కు ప్రత్యక్ష ఎన్నికలు కలిసిరాలేదు. పోటీచేసిన ప్రతిసారీ ఓడిపోయారు. ఓసారైతే ఇందిరాగాంధీ వద్దని చెప్పినా వినకుండా బరిలో దిగి, చిత్తుగా ఓడిపోయారు. 'నువ్వు గెలవవని అందరికీ తెలుసు, చివరికి మీ ఆవిడకి కూడా. ఓడిపోయి నాకు తలనొప్పి తెచ్చిపెట్టావు' అని చివాట్లేశారు ఇందిర. కాసేపటికే సంజయ్‌గాంధీ ఫోన్‌ చేసి, 'అమ్మ మీమీద చాలా కోపంగా ఉన్నారు. కానీ, ప్రణబ్‌ లేకుండా క్యాబినెట్‌ ఏమిటి... అంటున్నారు. మిమ్మల్ని వెంటనే బయల్దేరి రమ్మన్నారు' అని చెప్పి పెట్టేశారు. ప్రణబ్‌ను రిసీవ్‌ చేసుకోడానికి సంజయ్‌గాంధీ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. చాన్నాళ్ల తర్వాత.. 2004 ఎన్నికల్లో జంగీపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రణబ్‌ గెలిచారు. 2009 ఎన్నికల్లో ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
క్లుప్తంగా...
పేరు : ప్రణబ్‌ ముఖర్జీ
పుట్టిన తేదీ : డిసెంబరు 11, 1935
ముద్దుపేరు : పోల్తూ
కన్నవారు : అమ్మ రాజ్యలక్ష్మి, నాన్న కమదాకింకర్‌ ముఖర్జీకుటుంబం : అర్ధాంగి సువ్ర. ఇద్దరు కొడుకులు (అందులో ఒకరు శాసనసభ్యులు), ఒక కూతురు.
చేపట్టిన పదవులు: రాజ్యసభ సభ్యుడు, లోక్‌సభ సభ్యుడు, కేంద్రమంత్రి (విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, రక్షణ, నౌకాయాన, రెవెన్యూ- బ్యాంకింగ్‌, వాణిజ్య తదితర), ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు తదితర సంస్థల్లో కీలక బాధ్యతలు. దాదాపు 30 మంత్రిత్వ బృందాలకు నాయకత్వం.
అవార్డులు : ఉత్తమ పార్లమెంటేరియన్‌, పద్మవిభూషణ్‌
* * *
ఇందిర, రాజీవ్‌, పీవీ, సోనియా, మన్మోహన్‌ ... ప్రణబ్‌ రాజకీయ జీవితమంతా సలహాదారుగానో, వ్యూహరచయితగానో గడచిపోయింది. రాష్ట్రపతి హోదాలో సర్వస్వతంత్రంగా వ్యవహరించాల్సివస్తే.. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీతోనే విభేదించాల్సి వస్తే... ఆయనెలా స్పందిస్తారు? అందరు రాష్ట్రపతుల్లో ఒకరిగా మిగిలిపోతారా, తనదైన ముద్ర వేసుకుంటారా? ప్రణబ్‌ ఐదేళ్ల పదవీకాలమే ఈ ప్రశ్నకు జవాబు.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు