అక్కడ మంచినీళ్లు దొరకవు!


అక్కడ మంచినీళ్లు దొరకవు!
'చారిత్రక పిరమిడ్లూ... మోజెస్‌, క్రీస్తు నడయాడిన పవిత్రస్థలాలూ... ఎడారి పంటలూ... ఇలా మరెన్నో విశేషాల సమాహారమే మా త్రిదేశయాత్ర' అంటున్నారు ఆయా దేశాల్ని చుట్టివచ్చిన హైదరాబాద్‌ వాసి గీతాంజలికుమార్‌.
నేనూ మావారూ మా చెల్లీ మరికొందరు మిత్రులం మొత్తం 24 మందిమి కలిసి హోలీలాండ్‌ ట్రిప్‌గా పిలిచే ఈ త్రిదేశయాత్రకు బయలుదేరాం. ఎయిర్‌ అరేబియాలో దాదాపు ఏడెనిమిది గంటలు ప్రయాణించి ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరానికి చేరుకున్నాం. అక్కడకు వెళ్లేసరికి ఎయిర్‌పోర్టు బయట మాకోసం గైడ్‌ ఏసీ లగ్జరీబస్‌లో ఎదురుచూస్తూ ఉన్నాడు. అలెగ్జాండ్రియా నగరం చాలా పెద్దది. తనకోసం ఈ నగరాన్ని నిర్మించమన్న అలెగ్జాండర్‌ ఇది చూడకుండానే మరణించాడట. అక్కడ ఈతపండ్లూ, ఆలివ్‌లూ, టొమాటోలూ ట్రక్కుల్లో రవాణా చేస్తున్నారు. అక్కడ నుంచి బస్సులో ముందుగా కైరో నగరానికి చేరుకున్నాం. దార్లో ఓ హోటల్లో కాఫీ తాగి ఇరవై డాలర్ల నోటిస్తే అతను కొన్ని ఈజిప్షియన్‌ పౌండ్లు, చిల్లర నోట్లు ఇచ్చాడు. అదెంతో తెలియక చాలాసేపు ఇబ్బందిపడ్డాం. దాదాపు ఐదుగంటల ప్రయాణం చేశాక కైరో చేరుకున్నాం. గిజా, కైరో కలిసే ఉన్నాయి. నగరవీధులన్నీ శుభ్రంగా ఉన్నాయి. అక్కడ అన్నీ పాలిష్‌ చెయ్యని పాలరాతి భవంతులే. కంచరగాడిదలకి కట్టిన బండ్లమీద పండ్లు అమ్ముతుంటారు. కైరో చేరకముందే పిరమిడ్లు దూరంగా కనిపిస్తూ మాలో ఆసక్తిని రేకెత్తించాయి.
కైరోలోని హొరైజన్‌ పిరమిడ్స్‌ అనే హోటల్లో దిగాం. స్నానపానాలు ముగించి ముందుగా నైల్‌క్రూయిజ్‌కి బయల్దేరాం. నైలునది నగరం మధ్యలోనే ప్రవహిస్తుంటుంది. ఓడలో బెల్లీ, ఈజిప్టు సంప్రదాయ నృత్యం 'తన్నోరా' చూశాం. తన్నోరా చాలా అద్భుతంగా ఉంది. క్రూయిజ్‌లో ఆర్కెస్ట్రా కూడా ఉంది. దాదాపు నాలుగు గంటలపాటు నదిలో విహరించాం.రాతి మ్యూజియం!
తరవాత రోజు ఉదయమే బయలుదేరి కైరో మ్యూజియంకి వెళ్లాం. రాళ్లను ఈజిప్టువాసులు ఉపయోగించుకున్నంతగా ప్రపంచంలో మరెవ్వరూ వాడి ఉండరేమో. అక్కడున్న రాతి మ్యూజియంలో ఫారో చక్రవర్తి, నెఫ్రితి రాణిల విగ్రహాలూ, మేక, కుక్క ముఖాలతో చేసిన బొమ్మలూ, తొట్టెలూ వాటి మూతలూ నగలూ ఆయుధాలూ రథాలూ... ఇలా అన్నీ రాళ్లతో చేసినవే. ఇటీవల ప్రజల తిరుగుబాటు కారణంగా కాల్చివేసిన భవనాలనీ చూశాం. ముబారక్‌ను ఉంచిన జైలుని కూడా బయటనుంచే చూసి పాపిరస్‌ మ్యూజియంకి వెళ్లాం. ప్రపంచంలో తొలిసారిగా కాగితాన్ని తయారుచేసిన ఘనత ఈజిప్టుకే దక్కుతుంది. నైలునది పరిసరాల్లో మొలిచే తుంగ మొక్క లాంటి ఓ మొక్క నుంచే వీళ్లు కాగితం తయారుచేస్తారు. ఈ మ్యూజియంలో కాగిత కళారూపాలు చాలానే ఉన్నాయి. అవన్నీ చూశాక వేలాడే చర్చి, రోమన్‌ సిటాడెల్‌ చూశాం. వేలాడే చర్చ్‌ ఉన్న రాతి ఇంట్లోనే బెత్లెహాంనుంచి పారిపోయి వచ్చిన మేరి, జోసెఫ్‌లు పసివాడైన క్రీస్తుతో తలదాచుకున్నారట. తరవాత పిరమిడ్స్‌ చూడ్డానికి బయల్దేరాం. మరణించిన ఫారో చక్రవర్తుల దేహాలను మమ్మీలుగా చేసి సంపదతో సహా పిరమిడ్లలో భద్రపరిచారు. కాలక్రమంలో అనేకమంది వీటిని దోచుకున్నారు. ప్రస్తుతం ఇవి ఖాళీగా ఉన్నాయి. రెండో పిరమిడ్‌కు దూరంగా సింహపుదేహం, ఫారో తల కలిగిన స్ఫింక్స్‌ విగ్రహం ఉంది. పిరమిడ్ల గురించి తెలుసుకోవాలంటే ఎంతో ఉంది. ఆనాటి రాజులు ప్రజాసంపదను దోచుకున్న తీరు, బానిసలను స్వప్రయోజనాలకోసం వాడుకున్న విధానం, వాళ్ల మూఢనమ్మకాలూ వింటుంటే అవి కళారూపాలుగా అనిపించలేదు. ఈజిప్టులోని ఒక షెపర్డ్స్‌ హోటల్లో తప్ప ఇంకెక్కడా మంచినీళ్లు దొరకవు. వాటికి బదులుగా కోక్‌, పండ్లరసాలే ఇస్తారు.
ఎర్రసముద్రం దారిచ్చింది...
తరవాతి రోజు కైరో నుంచి సీనాయ్‌కి వెళ్లాం. మహమ్మద్‌తోపాటు నూర్‌ అనే మరో గైడు కూడా మాతో ఉన్నాడు. ఒక పక్క ఎర్ర సముద్రం, మరో పక్క అందమైన కొండల మధ్య రోడ్డు ప్రయాణం ఎంతో బాగుంది. మధ్యధరా సముద్రానికీ ఎర్ర సముద్రానికీ మధ్య వస్తు రవాణాకోసం నిర్మించిన సూయిజ్‌కాలువను దాటి వచ్చాం. లక్షలమంది ఇజ్రాయెల్‌వాసులను ఫారో చక్రవర్తి చెర నుంచి విడిపించుకు వస్తోన్న మోజెస్‌ ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చాడని ఆ మార్గంలోనే ఇజ్రాయెల్‌వాసులు దాన్ని దాటి వచ్చారని బైబిల్‌ పాత నిబంధనలో ఉంటుంది. ఆ దారిలో వారిని వెంటాడిన సైనికులను సముద్రం ముంచివేసిందట. అయితే ఇక్కడ ఎర్రసముద్రం రెండుగా చీలిన ప్రదేశాన్ని ఎందుకో మూసివేశారు. ఎడారిలో ఆనాడు వాళ్లకోసం నిర్మించిన ఏడు బావుల్లో ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. దీన్నే 'మోజెస్‌ వెల్‌' అంటారు. ఆ చారిత్రక ప్రయాణాన్ని మననం చేసుకుంటూ మేం చీకటిపడేసరికి సీనాయ్‌కి చేరాం.సీనాయ్‌ చాలా సుందర ప్రదేశం. ఈ వూరిని సెయింట్‌ కేథరీన్‌ అనీ పిలుస్తారు. పక్కనే ఉన్న సీనాయ్‌ కొండల సమీపంలోనే మోజెస్‌ తనవాళ్లతో విడిది చేశాడట. వాళ్లను కొండ కింద వదిలి నలభై రోజులపాటు కొండమీద ప్రార్థనలు చేశాడట. సీనాయ్‌ కొండ ఎక్కడానికి దాదాపు నాలుగుగంటల సమయం పడుతుంది. అందువల్ల మా బృందంలో ముగ్గురు మాత్రమే వెళ్లగలిగారు.
పవిత్రప్రదేశం
మర్నాడు ఉదయం సీనాయ్‌ కొండ పాదం దగ్గర సెయింట్‌ కేథరిన్‌ మొనాస్ట్రీనీ అక్కడున్న బర్నింగ్‌ బుష్‌నీ చూశాం. అక్కడ నుంచి ఈజిప్టు దాటి ఇజ్రాయెల్‌లోకి అడుగుపెట్టాం. గైడ్‌లు అక్కడే ఆగిపోయారు. చెకిన్‌ తరవాత మాకోసం కేటాయించిన బస్‌లోకి ఎక్కాం. ఇజ్రాయెల్‌ చాలా సస్యశ్యామలంగా ఉంది. ఎటు చూసినా ఆలివ్‌ తోటలే. డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా అనేక పంటల్నీ పండ్లనీ పండిస్తున్నారు. పరిశుభ్రమైన రోడ్లు దేశఆర్థికస్థితిని తెలియజేస్తున్నాయి. ఇక్కడనుంచే అనేక వ్యవసాయ ఉత్పత్తుల్ని అరబ్‌దేశాలకు ఎగుమతి చేస్తారు. జీసస్‌ పుట్టి పెరిగి మరణించి మళ్లీ జీవించింది ఇక్కడే కాబట్టి ఈ దేశాన్ని 'హోలీల్యాండ్‌' అని పిలుస్తారు. ఈ దేశాన్ని ఈజిప్టు, ఇటలీ, టర్కీ, బ్రిటన్‌... వంటి దేశాలు పాలించాయి. కాబట్టి ఇక్కడి నిర్మాణాలన్నీ ఆయా దేశసంస్కృతుల్ని ప్రతిబింబిస్తుంటాయి. 1948లో ఇజ్రాయెల్‌ స్వతంత్రదేశంగా రూపొందింది. ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాలు దాదాపు ఆనుకునే ఉంటాయి. మా గైడ్‌ బిషౌరా పాలస్తీనీయుడు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ పాలనలో ఉన్న పాలస్తీనా గురించి అక్కడ తాము పడుతున్న బాధల గురించీ వాపోయాడు.
డెడ్‌సీ పక్కనుంచే బెత్లెహాంకి వెళ్లాం. ప్రపంచ నలుమూలలనుంచీ వచ్చే క్రైస్తవ, ముస్లిం, యూదు యాత్రికులతో జెరూసలేం, బెత్లెహాం కిటకిటలాడుతుంటాయి. బెత్లెహాంలో జీసస్‌ జీవితంతో ముడిపడ్డ అనేక ప్రదేశాలను చూశాం. స్వర్గారోహణ చర్చి, ప్రభువుని పీటర్‌ తిరస్కరించిన స్థలం, కింగ్‌ డేవిడ్స్‌ సమాధి... అన్నీ చూశాం.మృతసముద్రంలో తేలాం!
తరవాతిరోజు జెరూసలేంకి వెళ్లాం. అటు క్రైస్తవులకీ ఇటు ముస్లింలకీ కూడా ఇది పవిత్ర ప్రదేశమే. ప్రపంచంలోని యూదులంతా ఏనాటికైనా ఇక్కడికి తిరిగిరాక తప్పదన్న నమ్మకంతో యూదులంతా ఏడ్పులగోడ (వెయిలింగ్‌వాల్‌)దగ్గర ఏడుస్తూ ప్రార్థనలు చేస్తుంటారు. సాల్మన్‌ చక్రవర్తి కట్టించిన దేవాలయ శిథిలమే ఈ వెయిలింగ్‌ వాల్‌. రోమన్‌ సైనికులు ఏసుని బంధించిన స్థలం, కొట్టిన స్థలం, విచారణకు గురైన స్థలంతోబాటు శిలువ వేసిన కల్వరిగిరి... ఇలా ఒక్కో సంఘటనకి సంబంధించీ ఒక్కో చర్చి గుర్తుగా ఉంది. ఈ గొల్గొతా లేక కల్వరి మార్గంలో నడుస్తున్న భక్తుల హృదయాలు వేదనతో నిండిపోతాయి. అక్కడ ఆయనను శిలువపై నుంచి దించి పడుకోబెట్టిన రాతిని భక్తితో కళ్లకి అద్దుకుంటారు. తరవాత ఇజ్రాయెల్‌లో మృత సముద్రంలో మునిగిపోతామన్న భయం లేకుండా ఆటలాడాం. ఎందుకంటే ఇక్కడి నీళ్లలో చాలా ఉప్పు ఉంటుంది. దాంతో ఏ పదార్థాన్నీ మునగనివ్వవు. ఈ నీటిలో ఉన్న ఖనిజలవణాల వల్ల చర్మవ్యాధులు తగ్గుతాయట. ఈ బురదను యాత్రికులంతా ఒంటికీ ముఖానికీ పులుముకుంటారు. ఈ బురదతో తయారుచేసే క్రీములూ, లవణాలూ మొదలైన వాటివల్ల ఈ దేశానికి 25 శాతం ఆదాయం రావడం గమనార్హం.
జెరికో ప్రాంతంలో సికమోర్‌ వృక్షం, లాజరస్‌ సమాధి, మౌంట్‌ ఆఫ్‌ టెంప్టేషన్స్‌ మొదలైన ప్రదేశాలు చూశాం. మర్నాడు ఉదయాన్నే టెల్‌అవీవ్‌, యాఫొ, హైఫా మీదుగా నాజరేత్‌కు వెళ్లాం. మేరీమాత పుట్టిపెరిగిన ప్రదేశం, జీసస్‌ పెరిగిపెద్దవాడైన స్థలం కావడంవల్ల నాజరేత్‌కి ఎంతో ప్రాశస్త్యం ఉంది. మొదటిసారి మేరీమాతకు దేవదూత దర్శనమిచ్చిన స్థలం, జోసెఫ్‌ కొయ్యపని చేసే దుకాణం, క్రీస్తు నీటిని ద్రాక్షరసంగా మార్చిన స్థలాల్లో పెద్ద పెద్ద చర్చిలు కట్టారు. యోర్దాను నదిని దర్శించాం. ఇక్కడే చాలామంది బాప్టిస్టులు మళ్లీ బాప్టిజం తీసుకుంటారు. ఈ నది సిరియాలో పుట్టి జోర్దాన్‌ దేశంమీదుగా ఇజ్రాయెల్‌లోని మృతసముద్రంలో కలుస్తుంది.మర్నాడు గలీలీ ప్రాంతానికి వెళ్లాం. ఇది ఏసుకి ఇష్టమైన ప్రదేశం. ఆయన నీటిపై నడిచిన ఈ గలీలీ సముద్రంమీద బోటింగ్‌కి వెళ్లాం. అక్కడ భారతీయ జెండా ఎగురవేసి జనగణమన గీతం ఆలపించాం. సాయంత్రానికి మేం 500 మీటర్ల ఎత్తుగల మౌంట్‌ టాబోర్‌ ప్రదేశానికి చేరాం. ఈ శిఖరంమీద చర్చ్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫిగరేషన్‌ ఉంది. ఏసు దివ్య రూపం ధరించి... ఎప్పుడో మరణించిన మోజెస్‌ ఎలీజాలతో మాట్లాడిన దృశ్యాన్ని ఆయన శిష్యులు చూసిన స్థలమిదే.
మర్నాడు ఉదయం ఇజ్రాయెల్‌ నుంచి చెకౌట్‌ చేసి జోర్డాన్‌లోకి వెళ్లాం. ఇది చాలా ఖరీదైన ప్రదేశం. ఇక్కడ జ్వరమొస్తే వేసుకునే ఓ టాబ్లెట్‌ ఖరీదు 150 రూపాయలు. ఇక్కడ మేం మౌంట్‌ నీబో చూశాం. మోజెస్‌ ఇజ్రాయెలీయులతో వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయాడట. ఇక్కడ అంతా అమితాబ్‌, సల్మాన్‌, షారుఖ్‌ల గురించి మాట్లాడటం వింటే ఆశ్చర్యం కలిగింది. మరోచోట ఎన్టీఆర్‌ అని కూడా ఎవరో అరిచారు. రాజ్‌కపూర్‌ పాటలు వినిపించాయి. సాయంత్రానికి అమ్మన్‌ నగరానికి చేరుకున్నాం. అప్పటికే చలి వణికిస్తోంది. మర్నాడు ఉదయమే అక్కడ విమానమెక్కాం. దారిలో షార్జాలో ఎనిమిదిగంటల సమయం దొరకడంతో షాపింగ్‌ చేసి రాత్రి పది గంటలకి విమానం ఎక్కి తెల్లవారుజామున హైదరాబాద్‌లో దిగాం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)