Eenadu Eetaram (28/04/2012)


వెక్కిరించు వైఫల్యాన్ని... అందుకో ఆకాశాన్ని!
పరీక్షల ఫలితాలు వెలువడుతున్నాయి... ఆ వెనకే విద్యార్థుల ఆత్మహత్యల వార్తలూ కనబడుతున్నాయి... ఫెయిలయ్యామనే బాధ కొందరిది. తక్కువ మార్కులు వచ్చాయన్న బెంగ మరొకరిది. కారణం ఏదైనా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి... టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఎంసెట్‌, ఐఐటీ., చదువేదైనా...ఫలితాలు వచ్చిన ప్రతిసారీ ఇదే చేదు ఫలితం... ఈ అఘాయిత్యాలను ఆపడమెలా? కారణాలు వెతుకుతూనే బయటపడే దారులు చూపిస్తోంది 'ఈతరం'. మానసిక నిపుణుల సూచనలూ అందిస్తోంది!
శ్చర్యంగా ఉన్నా నిజం. మన దేశంలో ఎయిడ్స్‌, గుండె జబ్బులు, క్యాన్సర్‌ లాంటి రోగాల వల్ల కంటే ఆత్మహత్యలతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. తొంభై నిమిషాలకో టీనేజీ అమ్మాయో, అబ్బాయో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఐదు గంటలకు ఒకరు చివరి మజిలీ చేరుకుంటున్నారు. ముప్ఫై నాలుగేళ్ల లోపు యువతను తీసుకుంటే ఆ సంఖ్య ఏడాదికి లక్ష. వీరిలో ఇరవై ఆరువేల మంది చదువుల ఒత్తిడి, పరీక్షల్లో ఫెయిలైన పసిమొగ్గలే. నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డ్స్‌ బ్యూరో చెబుతున్న గుండెలు పిండేసే లెక్కలివి.వైఫల్యం చింతను మోసుకొస్తుందనేది నిజం. కానీ తేరుకుని కారణాలు విశ్లేషించుకోవాల్సింది పోయి, నిరాశలో కూరుకుపోయి జీవితాన్ని ముగించాలనుకోవడం అవివేకం! 'చదువులో ఫెయిలైతే జీవితమే శూన్యం అనుకునేవాళ్లే ఇలా చేస్తారు' అంటున్నారు కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌ వీరజారావు. ఇంటర్‌లో తొంభై ఏడు శాతం మార్కులు సాధించిన ఓ అమ్మాయి ఇంజినీరింగ్‌లో ఒక్క సబ్జెక్టులో ఫెయిలైందని ప్రాణం తీసుకుంది. మరో అమ్మాయి పరీక్షల్లో ఫెయిలవుతానని భయపడి ఫలితాలకు ముందే ప్రాణం తీసుకుంది. తీరా చూస్తే ఫలితాల్లో పాస్‌. 'నేటి యువత తమను తాము ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారు. అందువల్ల వాస్తవాన్ని జీర్ణించుకోలేని స్థితిలో పడిపోతున్నారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగకపోవడం, పోల్చి చూసుకోవడం, ఓటమిని అవమానంగా భావించడం, నలుగురూ ఏమనుకుంటారోననే భయం... ఇలాంటి కారణాలెన్నో అఘాయిత్యాలకు కారణమవుతాయి' అంటూ విశ్లేషిస్తున్నారు మరో సైకాలజిస్టు డాక్టర్‌ విశ్వనాథ్‌.
రెండు రకాలు
డాక్టర్‌ విశ్వనాథ్‌ అభిప్రాయంలో ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తులు రెండు రకాలు. మొదటి రకం వాళ్లు ఫెయిలవ్వగానే విపరీతంగా ఒత్తిడికి గురవుతారు. ఏడుస్తారు. ఆ భావనల నుంచి త్వరగా బయటపడలేరు. చచ్చిపోతే నయమనే భావాలు వెల్లడిస్తారు. తమని తాము గాయపరుచుకోవడం కూడా చేస్తారు. నిజానికి వాళ్లు చనిపోవాలో, వద్దో తేల్చుకోలేని సందిగ్ధావస్థలో ఉంటారు. రెండోరకం వాళ్లలో చనిపోవాలనే దృఢ నిర్ణయం ఉంటుంది. వాళ్ల నడత, తీరులను సునిశితంగా పరిశీలిస్తే తప్ప గ్రహించలేకపోవచ్చు కూడా. తల్లిదండ్రులు, స్నేహితులు వారి ప్రవర్తనను అంచనా వేయడానికి ప్రయత్నించాలి.
లక్షణాలివే!
* తీవ్ర మానసిక ఒత్తిడి * ఒంటరితనం కోరుకోవడం *చావు గురించి తరచూ మాట్లాడ్డం * ప్రమాదకర వస్తువుల సేకరణ * ఎవర్నీ లెక్కచేయని మనస్తత్వం *దైనందిన కార్యక్రమాలపై నిరాసక్తి * అతి నిద్ర, నిద్రలేమి *పెండింగ్‌ పనులు ముగించాలనే ఆతృత * దేవుడిపై నిందలు వేయడం * నేనెందుకూ పనికిరాననే భావజాలం.
ఏంచేయాలి?
ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తే వారిని ఒంటరిగా వదల కూడదు. ఆత్మీయ స్పర్శ, సాంత్వన కలిగించే మాటలు వాళ్ల మనసు మార్చొచ్చు. ముందు వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. విమర్శలు మనసుని మరింత గాయపరుస్తాయి. ఇంతకు ముందు వాళ్లు సాధించిన విజయాలు గుర్తు చేయాలి. ప్రొఫెషనల్‌ సైకాలజిస్టును సంప్రదిస్తే మంచిది.
ఆదుకునే నేస్తం
తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయస్థితిలో ఉన్న యువతకు చేయూతనిస్తోందో సంస్థ. వివరాలు గోప్యంగా ఉంచుతారు.
రోష్నీ కౌన్సిలింగ్‌ సెంటర్‌,
కళావతి నివాస్‌, సింధీ కాలనీ,
సికింద్రాబాద్‌.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000, 040-27848584
ఆశయాల్ని రుద్దుతున్నారు
దువులు, మార్కులు, కెరీర్‌ అంటూ తల్లిదండ్రులు నేటి యువతపై తమ ఆశలు, ఆశయాల్ని రుద్దుతున్నారు. వైఫల్యం ఓ భూతం అనే స్థాయికి వాళ్లని తీసుకొస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచే చోదకులుగా మారాలి. వాళ్ల అభిప్రాయాలు, భావాలు పంచుకునే అవకాశం కల్పించాలి. అలాగే సెల్ఫ్‌ ఎడ్యుకేషన్‌, ఆత్మవిశ్వాసం పెంచే విధానం కాలేజీల్లో రావాలి. బాగా చదివేవాళ్లని మెచ్చుకోవడం, వెనకబడ్డ వాళ్లని చిన్న చూపు చూడటం లాంటి విభజన సిద్ధాంతం ప్రమాదకరం.
- వీరజారావు, సైకాలజీ హెడ్‌,
లయోలా అకాడెమీ
భిన్న పరిష్కారాలు
త్మహత్యలు ఆపడం సాధ్యమే. అందుకు ప్రయత్నించే వాళ్ల మానసిక స్థితిని గమనించాలి. ఏదీ సాధించలేని అసమర్థులమనే అపరాధ భావాన్ని పదే పదే వ్యక్తం చేస్తుంటారు. స్నేహితులు, తల్లిదండ్రులు కలుగజేసుకుని సమస్యకు రకరకాల పరిష్కారాలు ఉంటాయని చెప్పాలి. చదువులో వైఫల్యం చెందినా జీవితంలో విజయం సాధించే ప్రత్యామ్నాయాలు చూపించాలి.
నిలిచి గెలిచిన హీరోలు!
థామస్‌ అల్వా ఎడిసన్‌: అతడి పేరుమీద వెయ్యికి పైగా పేటెంట్‌లున్నాయి. విద్యుత్తు బల్బు, ఫోనోగ్రాఫ్‌, మోషన్‌ పిక్చర్‌ కెమెరా... ఎన్నో. చిన్నప్పుడు అతడికి చదువు రాదంటూ స్కూళ్లో నుంచి గెంటేశారు.ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌: ఈ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త చిన్నప్పుడు హైస్కూల్‌తోనే చదువు మానేశాడు. తల్లిదండ్రుల బలవంతంతో స్విస్‌ ఫెడరల్‌ ఇనిస్టిట్యూట్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష రాస్తే రెండుసార్లు ఫెయిలయ్యాడు.
ప్రిన్సెస్‌ డయానా: చదువులో సగటు విద్యార్థి కూడా కాదు. బ్రిటన్‌ ఓ లెవెల్‌ పరీక్షల్లో ఫెయిలైంది. మళ్లీ అక్కడ అవకాశం లేకపోవడంతో స్విట్జర్లాండ్‌కెళ్లి చదువుకుంది. ఆత్మవిశ్వాసంలో నెంబర్‌వన్‌.
అబ్రహం లింకన్‌: జీవితమంతా వైఫల్యాలే. చదువుల్లో ఫెయిల్‌. ఉద్యోగం పోయింది. లెజిస్లేటర్‌గా పరాజయం. వ్యాపారంలో నష్టం. భార్య మరణం. నరాల వ్యాధి. స్పీకర్‌గా, అధ్యక్షుడిగా పోటీ చేస్తే ఓటమి వెక్కిరించింది. చివరికి 1860లో అమెరికా అధ్యక్షుడై అత్యుత్తమ పాలన అందించాడు.
అమీర్‌ఖాన్‌: బాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసిన ఇతడు పన్నెండో తరగతిలోనే డింకీ. బాధ పడ్లేదు. నాటక రంగంలో శిక్షణ తీసుకొని రాణించాడు!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

Ratan Tata special article on Eenadu