సమాజ హితమే లక్ష్యం! అవార్డులే సాక్ష్యం! (Eenadu etaram 26/05/2012)
పచ్చదనానికి వూతం! అంతర్జాతీయ పోటీ. బరిలో యాభై ఒక్క దేశాలు. మూడు వందల విశ్వవిద్యాలయాలు. నెలలో ఎవరు ఎక్కువ పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపడితే వాళ్లే విజేతలు. కలసికట్టుగా అడుగేశారు పెరంబదూరులోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు.విజయలక్ష్మి వరించింది. అంతర్జాతీయ అవార్డు అందింది. ![]() ఇందుకోసం ఇరవై రకాల కార్యక్రమాలు చేశారు. అంతరించిపోతున్న పిచ్చుకల్ని లెక్కించారు. కాలేజీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా చేసి మొక్కలు నాటారు. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తాబేళ్ల రక్షణ, పక్షులకు నీరందించడం, అవగాహన సదస్సులు ఇలాంటివెన్నో. దీంతోపాటే తీవ్ర విద్యుత్తు సమస్యతో సతమతమవుతున్న తెన్నాలూర్, శివన్‌తాంగల్ గ్రామాల్ని దత్తత తీసుకొని ఉచితంగా సౌర దీపాలు అందించారు. అవసరమైన డబ్బుని చెన్నైలోని వస్త్ర దుకాణాల నుంచి విరాళంగా సేకరించారు. వివరాల్ని ఎర్త్ డే నెట్‌వర్క్ సంస్థకి వారానికోసారి ఆన్‌లైన్‌లో పంపించారు. సంబంధిత ఫొటోల్ని ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. వీటి ఆధారంగానే సంస్థ పాయింట్లు కేటాయించేది. ఉదాహరణకు ఐదుగురు విద్యార్థుల బృందం ఒక్కొక్కరు రెండేసి మొక్కలు నాటితే 5X2=10 పాయింట్లు. మొదటి, రెండోవారం ముగిసే నాటికి బృందం 14, 12 స్థానాల్లో నిలిచింది. వెంటనే కార్యక్రమాల వేగం పెంచారు. మూడో వారానికి 5వ స్థానానికి, చివరి వారానికి అగ్రస్థానానికి చేరుకున్నారు. పోటీ పూర్తయ్యేనాటికి 300 విశ్వవిద్యాలయాల్ని వెనక్కినెట్టి 89230 పాయింట్లతో విజేతగా నిలిచారు. అవార్డు అందుకోగానే బాధ్యత తీరిపోయిందనుకోలేదు విద్యార్థి బృందం. రెండేళ్లలో కాలేజీని ప్లాస్టిక్, వ్యర్థరహిత కాలేజీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల్ని దత్తత తీసుకుని సౌర విద్యుద్దీపాల ఏర్పాటు, వాననీటి నిల్వ, చెత్తతో ఎరువు తయారీ కార్యక్రమాలతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
- రుద్రరాజు సుభాష్, న్యూస్‌టుడే: తమిళనాడు డెస్క్
|




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి