ఆనందమానందమాయె (Chess Champion Vishwanath Anand)
విషీ ఖాతాలో ఐదో ప్రపంచ చెస్ టైటిల్
టైబ్రేక్‌లో 2.5-1.5తో గెల్ఫాండ్‌పై గెలుపు
![]() ఉత్కంఠభరితంగా..:ర్యాపిడ్ టైబ్రేక్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. చల్లని మాస్కో వాతావరణం దాదాపు భారత్‌లో వేసవిలా తయారైంది. టైబ్రేక్‌లో ఆనంద్ స్పష్టమైన ఆధిక్యం సంపాదించాడు. అతడి విజయానికి ప్రధాన కారణం అతని వేగమే. ఆ వేగాన్ని గెల్ఫాండ్ అందుకోలేకపోయాడు. తొలి గేమ్‌ను తెల్లపావులతో ఆడిన గెల్ఫాండ్.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. గెల్ఫాండ్‌లో కచ్చితత్వం లోపించడంతో ఓ దశలో ఆనంద్ ఆధిక్యం సాధించాడు కూడా. ఐతే ఆనంద్ కూడా తప్పు చేయడంతో గేమ్ డ్రాగా ముగిసింది. తెల్లపావులతో ఆనంద్ రెండో గేమ్‌లో గెలిచాడు. ఐతే ఈ గేమ్‌లో అదృష్టం చేతులు మారుతూ వచ్చింది. ఎండ్‌గేమ్‌లో కూడా గేమ్ డ్రా అయ్యేలానే కనిపించింది. కానీ స్పీడ్ కింగ్ ఆనంద్..ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేశాడు. సమయం అయిపోతుండడంతో గెల్ఫాండ్ తప్పులు చేసి బోల్తాకొట్టాడు. మూడో గేమ్‌లో గెల్ఫాండ్ మళ్లీ తడబడ్డాడు. త్వరగా గెలవగలిగే స్థితికి చేరుకున్న అతడు.. సమయం మించి పోతుండడంతో మరోసారి పొరపాటు చేశాడు. ఫలితంగా ఆనంద్ గేమ్ డ్రా చేశాడు. నాలుగో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ఆనంద్ త్వరగా.. ప్రత్యర్థి క్వీన్‌ను తీసుకుని, తన క్వీన్‌నూ కోల్పోయాడు. గెల్ఫాండ్ నల్లపావులు చాలాసేపు కాస్త ఆధిక్యంలో ఉన్నాయి. కానీ పరిస్థితి ఎప్పుడూ మెరుగుపడలేదు. 56 ఎత్తుల తర్వాత గేమ్ డ్రాగా ముగిసింది. ఆనంద్‌ను విజేతగా నిలిపింది. 2000లో తొలి టైటిల్ సాధించిన విషీ.. 2007, 2008, 2010లో వరుసగా టైటిళ్లు చేజిక్కించుకున్నాడు. |
చెస్ మహా సమరం డ్రాల మీద డ్రాలతో సాగుతుంటే ఆనంద్ మళ్లీ ఛాంపియన్‌గా చూడగలమా..? అని అభిమానులకు అనిపించివుడొచ్చు. కానీ ఆనంద్ పూర్తి విశ్వాసంతో కనిపించాడు. ఎందుకంటే ప్రత్యర్థి బోరిస్ గెల్ఫాండ్. అతడు బలహీన ప్రత్యర్థి అని కాదు. కాకపోతే అతడి బలమేంటో, బలహీనతలేంటో ఆనంద్‌కు బాగా తెలుసు. చెస్‌లో మానసికంగా ఎంత దృఢంగా ఉన్నారన్నదే కీలకం. ఇక్కడే ఆనంద్ గెలిచాడు. గెల్ఫాండ్‌పై మానసికంగా ఆనంద్‌దే పైచేయి. అందుకే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో వెనకబడినా వెంటనే పుంజుకున్నాడు. నిజానికి ఈసారి మ్యాచ్ చాలా కఠినంగా సాగింది. ఆనంద్ మొదట రక్షణాత్మకంగా వెళ్లాడు. తొలి ఆరు గేమ్‌లు డ్రా చేసుకున్నాడు. ఎందుకనో ఏడో గేమ్‌లో ఆనంద్ ఆట పేలవంగా సాగింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న గెల్ఫాండ్ ఆధిక్యం సంపాదించాడు. నల్ల పావులతో స్లావ్ డిఫెన్స్‌తో ఆడిన గెల్ఫాండ్ 37 ఎత్తుల్లో ఆనంద్‌ను ఓడించగలిగాడు. తర్వాతి గేమ్‌లో గెల్ఫాండ్ సంయమనంతో ఆడివుంటే ఆనంద్‌కు పరిస్థితి క్లిష్టంగా మారేదే. ఆ మ్యాచ్ డ్రా అయివుంటే ఆఖరికి ఫలితం ఎలాగుండేదో.. కానీ ఆనంద్ సరైన సమయంలో పుంజుకున్నాడు. ఎనిమిదో గేమ్ ఆరంభంలోనే గెల్ఫాండ్‌ను దెబ్బతీశాడు. నల్లపావులతో ఆడినా విశ్వనాథన్ కేవలం 17 ఎత్తుల్లోనే మ్యాచ్ నెగ్గాడు. బహుశా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇంత తక్కువ ఎత్తుల్లో మ్యాచ్ నెగ్గిన ఘనత ఆనంద్‌దే. ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఇదే కీలక మలుపు. మిగతా గేమ్‌లను ఆనంద్ డ్రాగా ముగించడంతో మ్యాచ్ టైబ్రేక్‌కు దారితీసింది. ర్యాపిడ్ చెస్‌లో ఆనంద్‌కు సాటిలేరు. కాస్పరోప్, కార్పోవ్ లాంటివారికే స్పీడ్ చెస్‌లో ఆనంద్ చెమటలు పట్టించాడు. మ్యాచ్ టైబ్రేక్ వెళ్లిందనగానే ఛాంపియన్‌షిప్ ఆనంద్‌దే అన్న నమ్మకం కలిగింది. ఆనంద్ దాన్ని నిజం చేశాడు. ఈ విజయంలో సెకండ్స్‌ది కీలకపాత్ర. రుస్తుమ్ కసిమిడ్జనోవ్ (ఉజ్బెకిస్థాన్) అతడి సెకండ్స్‌లో ఉండడం కలిసొచ్చింది.
- లంక రవి, ఇంటర్నేషనల్ మాస్టర్
|
| ''మ్యాచ్‌లో అవకాశాలు సమంగా ఉండడంతో టైబ్రేక్‌లో ఏం కాబోతోందో అర్ధం కాలేదు. ఇప్పటికి భారం దిగింది. సంతోషించలేనంత ఒత్తిడి ఉంది. టైబ్రేక్‌లో న్యాయం ఉందనను. కానీ 12 గేమ్‌లాడిన తర్వాత మా ఇద్దరిలో విజేతను తేల్చడానికి టైబ్రేక్ సరైందే. నేను గెలిచాను కాబట్టి గెలిచానని అంటాను''
- విశ్వనాథన్ ఆనంద్
|
![]()
- విశ్వనాథన్ అయ్యర్ (తండ్రి)
''ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది''
- సుశీల (తల్లి)
''అది చాలా కఠినమైన మ్యాచ్. ఐతే మా వైపు మొగ్గినందుకు సంతోషంగా ఉంది. చాలా ఉత్కంఠ భరించాం. టైబ్రేక్‌లో ఏదైనా జరగొచ్చు. టైబ్రేక్ కోసం ముందుగా సమాయత్తం కాలేం''
- అరుణా ఆనంద్
''ఆనంద్ భారత అత్యుత్తమ క్రీడాకారుడు. అతను అత్యంత కఠిన పోరాటం జరిపాడు. ఆనంద్‌కిది అత్యుత్తమ విజయం. ఆరు మాసాల పాటు సాగిన మా సంసిద్ధత విజయవంతమైంది''
- సూర్య శేఖర గంగూలీ (ఆనంద్ సహాయకుడు)
''దేశ యువతకు ఆనంద్ స్ఫూర్తి ప్రదాత. ప్రత్యేకించి క్రీడా ఔత్సాహికులకు అతడు ఎనలేని స్ఫూర్తి. ఇలాంటి చరిత్రాత్మక క్షణాల్లో ఆనంద్‌ను చూసి జాతి గర్విస్తోంది''
- ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్
''ఆనంద్.. జాతి గర్వించేలా చేశాడు. వరుసగా నాలుగో సారి టైటిల్ గెలవడం అద్భుతం''
- సోనియా గాంధీ
''యువతకు ఆనంద్ ఆదర్శప్రాయుడు''.
- చంద్రబాబునాయుడు
''మీ విజయం ప్రతీ భారతీయుడిని గర్వించేలా చేసింది. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను ఐదోసారి గెలుపొందినందుకు మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు''
- తమిళనాడు గవర్నర్ రోశయ్య
|




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి