నారాయణుడు వరుడైన క్షేత్రం


నారాయణుడు వరుడైన క్షేత్రం
పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం అంగరంగవైభవంగా జరిగిన ఆ ప్రాంతం... ఓ దేవాలయమైంది. ఆ జంట వివాహ వేడుకకు సంబంధించిన వస్తువులే అందులోని ప్రధాన ఆకర్షణ. పద్మావతిని పరిణయమాడటానికి నారాయణుడు వరుడిగా వచ్చిన ఆ పవిత్రక్షేత్రమే తిరుపతికి సమీపంలోని నారాయణవరం.
కుడిచేతికి కల్యాణ కంకణం... నడుముకు దశావతార వడ్డాణంతో అలరారే ఆ వేంకటేశ్వరుణ్ణి చూస్తే కల్యాణశోభ ఉట్టిపడుతుంది. పరిణయమాడింది పద్మావతినే అయినా ఆ స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి మాత్రమే కనిపిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరుడు 'కల్యాణ వేంకటేశ్వరుడు'గా వెలసిన ఆ క్షేత్రమే నారాయణవరం. ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా పద్మావతీ శ్రీనివాసుల పరిణయ ఘట్టం గురించి తెలుసుకోవాలి.పెళ్లికి 14.14 కోట్ల అప్పు
తిరుమలకు ఆగ్నేయంగా ఉన్న నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని ఆకాశరాజు పాలించేవాడట. సంతానం లేని ఆకాశరాజు... పండితుల సలహా మేరకు పుత్రకామేష్ఠి యాగం మొదలుపెట్టాడు. అందులో భాగంగా పొలాన్ని బంగారు నాగలితో దున్నుతుంటే నాగలికి ఓ పెట్టె అడ్డు తగిలింది. దాన్ని తెరిచిచూస్తే అందులో ఒక శిశువు ఉందట. ఆ పాపకు పద్మావతి అని పేరుపెట్టి, అల్లారుముద్దుగా పెంచుకున్నాడు ఆకాశరాజు.
యుక్తవయసులో ఉన్న పద్మావతి ఓరోజు చెలికత్తెలతో కలసి ఉద్యానవనంలో విహారానికి బయలుదేరుతుంది. వేటకోసం బయలుదేరిన శ్రీనివాసుడు శేషాచలం అడవుల నుంచి వస్తుండగా ఓ ఏనుగు కనిపించిందట. దాన్ని వెంటాడుతూ నారాయణవనంలోని ఉద్యానవనానికి చేరుకున్నాడు. వెంటనే అది అదృశ్యమైంది. అప్పుడు, అక్కడున్న పద్మావతీదేవిని చూశాడు. ఇద్దరి చూపులూ కలిశాయి. పద్మావతిని మోహించిన శ్రీనివాసుడు... తిరుమలకు వెళ్లి తన తల్లి వకుళమాతకు ఆ విషయం చెబుతాడు. పెళ్లి విషయం మాట్లాడాల్సిందిగా... తల్లిని ఆకాశరాజు వద్దకు పంపుతాడు. వాళ్ల వివాహానికి రెండు కుటుంబాలూ అంగీకరించాయి.
వైశాఖమాస శుక్లపక్ష దశమినాడు (శుక్రవారం) వారి పెళ్లి నారాయణవనంలో జరిగింది. ఐదు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకల్లో చివరి రోజున కల్యాణం నిర్వహించారు. శ్రీనివాసుడు తన కల్యాణానికి కుబేరుడి దగ్గర 14.14 కోట్ల రామ నిష్కములు (అప్పటికి వాడుకలో ఉన్న ద్రవ్యము) అప్పుగా తీసుకున్నాడని బ్రహ్మాండపురాణం చెబుతోంది. ఈ రుణం ఇప్పటికీ వడ్డీతో సహా చెల్లిస్తున్నాడని నమ్మిక.
వివాహ వేదికే ఆలయం
నారాయణుడు ఈ ప్రాంతంలో వరుడిగా అడుగుపెట్టాడు కాబట్టి దీనికి నారాయణవరం అనే పేరు వచ్చింది. వివాహం జరిగిన ప్రాంతంలో అప్పట్లో ఆకాశరాజు చిన్న గుడిని నిర్మించాడనీ... ఆ తరువాత యాదవరాజులు, కార్వేటినగర సంస్థానాధీశులు, శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారనీ పురాణాలూ చరిత్రా చెబుతున్నాయి. ఆలయ ఆవరణలో పద్మావతి అమ్మవారి సన్నిధి, గోదాదేవి సన్నిధి, రామాలయం ఉన్నాయి. ఆలయ ముఖద్వారంలో ఎత్తయిన గోపురం ఉంది. దీన్ని శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు నిర్మించారు. తిరుత్తణి దేవస్థానం ఆధీనంలో ఉన్న ఈ ఆలయం... 1967లో తిరుమల తిరుపతి దేవస్థానం కిందికి వచ్చింది.
భిన్నమైన వెంకన్న
తిరుమల తిరుపతి అనుబంధ ఆలయాల్లో ఉన్న వేంకటేశ్వర స్వామికన్నా ఇక్కడి స్వామి భిన్నంగా కనిపిస్తాడు. సాధారణంగా వేంకటేశ్వరస్వామికి వక్షస్థలంలో ఓ వైపు లక్ష్మీదేవి, మరోవైపు పద్మావతి అమ్మవారు కనిపిస్తారు. కానీ, ఈ ఆలయంలో స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి మాత్రమే కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో పద్మావతి అమ్మవారు వేంచేసి ఉన్నందున స్వామివారి వక్షస్థలంలో ఆమె కనిపించదు. శ్రీనివాసుడు వేటకోసం వచ్చినప్పుడు తెచ్చినట్లుగా చెప్పే వేటఖడ్గాన్ని ఈ ఆలయంలో చూడవచ్చు.ఆలయ ఆవరణలో ఓ తిరగలి ఉంది. కల్యాణం సందర్భంగా అమ్మవారికి నలుగు పెట్టడానికి పిండికోసం దీన్ని ఉపయోగించినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న పారిజాత వృక్షం అలనాడు సత్యభామ కోసం శ్రీకృష్ణుడు తీసుకొచ్చి నాటినదని ప్రతీతి. సాధారణంగా వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం జరుగుతుంది. కానీ, ఇక్కడ ద్వాదశి రోజున జరుగుతుంది. పెళ్లికానివారు పద్మావతి అమ్మవారి గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే వెంటనే పెళ్లి జరుగుతుందని భక్తుల విశ్వాసం.
'స్వామి, అమ్మవార్ల కల్యాణానికి గుర్తుగా ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ మాసంలో వారి పరిణయం జరిగినందున ఏటా ఆ నెలలోనే (సౌరమానం ప్రకారం) ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ' అని చెబుతారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర భట్టాచార్యులు. స్వామివారు పుట్టిన శ్రవణా నక్షత్రానికి పదిరోజుల ముందుగా వీటిని ప్రారంభిస్తారు. ఎనిమిదో రోజున శ్రీనివాసుడు, పద్మావతీదేవిల కల్యాణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ఈనెల 31 నుంచి ప్రారంభమవుతాయి.
నారాయణవరం తిరుపతికి 40 కి.మీ దూరంలో ఉంది. తిరుపతి-చెన్నై బస్సుల్లో నారాయణవరం వెళ్లొచ్చు. రైలు ద్వారా రేణిగుంట చేరుకొని, అక్కడినుంచి పుత్తూరు వెళ్లి ఐదు కి.మీ. దూరంలో ఉన్న నారాయణవరం చేరుకోవచ్చు.
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)