నాలుగువేల ఏళ్ల పూర్వం నుంచీ మనదేశంలోని కేరళ రాష్ట్రంలో మాత్రమే నిర్వహిస్తూ వస్తున్న ఉత్కృష్ట సోమయాగం అతిరాత్రం. విశ్వశాంతి, పర్యావరణ పరిరక్షణకోసం చేసే ఈ యాగాన్ని మొదటిసారి మనరాష్ట్రంలో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకూ భద్రాచలంలో జరిగే ఈ మహాయాగ విశేషాలు... వే దాలకు సంబంధించిన మూలగ్రంథాల్లో పేర్కొన్న ఒక అతిప్రాచీన, సంక్లిష్టమైన కర్మకాండే అతిరాత్రం. పన్నెండు రోజులపాటు అహోరాత్రాలూ అగ్నిహోమంతో నిర్వహించే అతిరాత్రం ప్రస్తావన... వాల్మీకి రామాయణం బాలకాండ 14వ సర్గలో కనిపిస్తుంది. అతిరాత్రం ఇప్పటికీ ఉందంటే అందుకు కారణం కేరళలోని నంబూద్రి బ్రాహ్మణులే. వైదిక ఆచారాలు అంతరించిపోకుండా వీళ్లు కాపాడుకుంటూ వస్తున్నారు. గతంలో 1901, 1918, 1956, 1975, 2011లలో దీన్ని నిర్వహించారు. ప్రస్తుతం మనరాష్ట్రంలో భద్రాచలం సమీపంలోని ఎటపాక జటాయువు మండపం దగ్గర 12 రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ యాగానికి యజమాని, ప్రధాన పూజారి కేరళకు చెందిన నారాయణన్ సోమయాజి. జైమినీ సామవేదంలో దిట్టలు, ఘనాపాఠీలు; రుగ్, యజుర్వేదాలను ఔపోసన పట్టిన కృష్ణన్ నంబూద్రి, కడలూర్ దాస్ నంబూద్రి అనే వైదిక పండితులు... అతిరాత్రాన్న...