నా దారి కొత్తదారి (Eenadu Sunday Magazine 08/04/2012)




ఎవరో నడిచిన ఎంగిలిదార్లో వెళ్లేదిలేదని తెగేసి చెబుతారు. ఎవరో పాతిన మైలురాళ్లను దాటేదిలేదని బహిరంగంగా ప్రకటిస్తారు. ఎలా వెళ్లాలో చెప్పే హక్కు ఆ బాణంగుర్తుకెక్కడిదని దబాయిస్తారు.అది అహంభావం కాదు, ఆత్మవిశ్వాసం. వారిది సాదాసీదా ప్రయాణం కాదు, సాహసయాత్ర!
సూచిక సిద్ధంగా ఉంటుంది. ఎలా వెళ్లాలో చెబుతుంది. ఎన్నిమైళ్లు వెళ్లాలో చెబుతుంది. అంతకుముందు ఆ దార్లో నడిచినవారెవరో ముళ్లపొదలు తొలగించి ఉంటారు. రాళ్లూరప్పలూ ఏరేసి ఉంటారు. ఎగుడుదిగుళ్లు సరిచేసి ఉంటారు. ఏం భయంలేదు. కళ్లుమూసుకుని నడిచినా గమ్యాన్ని చేరుకోవచ్చు.
హెచ్చరిక:ఆ దార్లో వెళ్తే యాత్రికులుగానే మిగిలిపోతాం. విజేతలం కాలేం.
ఎలా వెళ్లాలో తెలియదు. ఎన్నిమైళ్ల ప్రయాణమో ఎవరూ చెప్పరు. పలుగూపారా పట్టుకుని బయల్దేరాలి. ఓపిగ్గా కొత్తదారి నిర్మించుకోవాలి. సొంతంగా రూట్‌మ్యాప్‌ గీసుకోవాలి. ముళ్లపొదలు కొట్టేయాలి. రాళ్లూరప్పలూ ఏరెయ్యాలి. క్రూరమృగాల్ని తరిమెయ్యాలి. జాగ్రత్తగా అడుగులేస్తూ ఒక్కో మజిలీ దాటుకుంటూ... గమ్యం దిశగా సాగిపోవాలి.
షరా: విజయానికి దొడ్డిదార్లుండవు. అసలు ఓ దారంటూ ఉండదు. మన చేతులతో మనమే నిర్మించుకోవాలి.
ఐటీ బూమ్‌ ఉంటే సాఫ్ట్‌వేర్‌వైపు పరుగుపెట్టడం, రిటైల్‌బూమ్‌ మొదలుకాగానే సూపర్‌మార్కెట్లే సూపరన్న నిర్ణయానికొచ్చేయడం, స్టాక్‌మార్కెట్‌ మాంచి జోరుమీదున్నప్పుడు... దలాల్‌స్ట్రీట్‌లో ఈగల్లా మూగిపోవడం - కొందరికి నచ్చదు. ఎవరికీ రాని ఆలోచనతో ఎవరూ నడవని మార్గంలో వ్యాపారయాత్ర ప్రారంభిస్తారు. కష్టాలూ నష్టాలూ సవాళ్లూ సంక్షోభాలూ ఎన్నొచ్చినా వెనుకంజవేయరు. వ్యాపారదిగ్గజాలుగా అవతరించినా, విశ్వసంపన్నుల జాబితాలో స్థానం సంపాదించినా... వీళ్లే వీళ్లే!

వ్యవసాయ వ్యాపారం! 

బాసును భరించాలి. పని చేయడానికి గంట, చేసినపని గురించి మెయిల్స్‌ పెట్టడానికి రెండుగంటలు. పాతికమందికి 'కాపీ టు..' తప్పనిసరి. యాన్యువల్‌ అప్రెయిజల్‌ (వార్షిక పనితీరు మదింపు) సమయంలో తెగ ఓవరాక్షన్‌ చేయాలి. సరిగ్గా అలాంటి కార్పొరేట్‌ వాతావరణంలోనే పన్నెండేళ్లు నెగ్గుకొచ్చాడు వెంకట్‌ సుబ్రహ్మణ్యం. ఇంకో ఆర్నెల్లు ఆగితే, ఏ వైస్‌ప్రెసిడెంట్‌ స్థాయికో చేరుకునేవాడేమో. ఎందుకో ఆ పరుగు నచ్చలేదు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పనిముట్లు పట్టుకుని కొత్తదారి నిర్మించుకోడానికి బయల్దేరాడు. సేద్యంతో వ్యాపారం... వెంకట్‌ ఆలోచన. ఏ ఐటీ నిపుణుడూ చేయని సాహసం. పన్నెండేళ్ల ఉద్యోగ జీవితంలో పొదుపుచేసుకున్న డబ్బుతో కొంత పొలం కొన్నాడు. కూరగాయలూ పండ్లూ పండించి... సూపర్‌మార్కెట్లకు సరఫరా చేశాడు. ఆ అనుభవం చాలా పాఠాలే నేర్పింది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లోని లోపాలు తెలిసిపోయాయి. రైతుకు పెద్ద చదువులేదు. డబ్బు లేదు. టెక్నాలజీ లేదు. రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకునే కుర్రాడు కూడా తన సరుకుకు తానే ధర నిర్ణయించుకుంటాడు. రూపాయికి ఎన్ని గింజలు ఇవ్వాలో లెక్కలేసుకుంటాడు. రైతు విషయానికి వచ్చేసరికి, ఎవరో ప్రతిపాదిస్తారు, ఎవరో నిర్ణయిస్తారు. ఇష్టమున్నా లేకపోయినా ఆ ధరకే అమ్ముకోవాలి.
ఎంత అన్యాయం?
ఆ లోపాన్ని సరిదిద్దాలనుకున్నాడు వెంకట్‌. తన 'ఇ-ఫామ్‌' ద్వారా తమిళనాడులోని వివిధ గ్రామాల రైతుల నుంచి కూరగాయలూ పండ్లూ సేకరించి, చిల్లర వ్యాపారులకు చేరవేయడం మొదలుపెట్టాడు. గిరాకీ-సరఫరా సూత్రం ఆధారంగా ధర నిర్ణయిస్తాడు. ప్రత్యేకించి చిల్లర వ్యాపారులనే ఎంచుకోడానికి ఓ కారణం ఉంది. ఇప్పటికీ 95 శాతం కూరగాయలూ పండ్ల మార్కెట్‌ను చిల్లర వ్యాపారులూ తోపుడుబండ్ల వారే శాసిస్తున్నారు. పెద్దపెద్ద దుకాణాలూ వందలమంది సిబ్బందీ ప్రచార ఆర్భాటాలూ లేకపోవడం వల్ల నిర్వహణ ఖర్చు ఉండదు. ఆర్థిక వ్యవస్థలోని సంక్షోభాలు వారిని ప్రభావితం చేయలేవు. అలాంటి వారితో వ్యాపారమంటే పెద్దగా ఇబ్బందులుండవు. రైతుకూ లాభసాటిగా ఉంటుంది. 'ఇ-ఫామ్‌' రంగప్రవేశంతో దళారీల బెడద తప్పింది. రైతు సంతోషించాడు. చిల్లర వ్యాపారి సంబరపడ్డాడు. ఇదంతా తొలిదశ. మలి అడుగులో వెంకట్‌ రెస్టరెంట్లు, అపార్ట్‌మెంట్లు, మెస్‌ల మీద దృష్టిపెట్టాడు. వీళ్లందరికీ కచ్చితమైన మెనూ ఉంటుంది కాబట్టి, గిరాకీని అంచనా వేయడం కష్టం కాదు. ఆ మేరకు సరఫరా ఏర్పాట్లు చేసుకోవచ్చు. వ్యాపారం అంటే అమ్మకాలూ కొనుగోళ్లే అనుకుంటే, అందులో సామాజిక బాధ్యత ఏముంది? రైతుల కోసం 'ఇ-ఫామ్‌' అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. తాజా పరిశోధనల గురించి చెబుతుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తుంది. గిడ్డంగి సౌకర్యం కల్పిస్తుంది. వెంకట్‌ సేంద్రియ కూరగాయల వ్యాపారంలోకీ ప్రవేశించాడు. మహానగరాల ప్రజలు శుభ్రంగా తరిగిన కూరగాయల పట్ల ఆసక్తి చూపుతుండటంతో... స్వచ్ఛంద సంస్థలూ వృద్ధాశ్రమాల్లోని మహిళలకు ఆ పనులు అప్పగిస్తున్నాడు. ఏదో ఒకరోజు రైతులు తమ పంటను తామే ఆన్‌లైన్‌లో అమ్ముకోడానికి ఈబే లాంటి వేదికను ఏర్పాటు చేయాలన్నది వెంకట్‌ కల.

'డిస్కౌంట్‌' ఎస్‌ఎమ్‌ఎస్‌! 

చేతిలో సెల్‌ఫోన్‌ లేకపోతే వూపిరాడదు. ప్రపంచానికీ మనకూ మధ్య ఎవరో అడ్డుగోడ కట్టేసినంత అసహనం. రిటైల్‌ హంగామా గురించి చెప్పనక్కర్లేదు. ప్రపంచ దిగ్గజాలన్నీ ఆశగా మన వైపు చూస్తున్నాయి. కొనుగోలుదారుడికీ రిటైల్‌ బ్రాండ్స్‌కూ మధ్య సెల్‌ఫోన్‌ను ఓ వారధిలా వాడుకుంటే?
ఎవరికీ రాని ఐడియా. కృష్ణ మెహ్రాకు వచ్చింది. మిత్రుడు అనీశ్‌రెడ్డి మద్దతు పలికాడు. ఇద్దరూ ఐఐటీలో సహపాఠీలు. ఇద్దరూ కూడా, ఎవరో నడిచిన దార్లో నడుస్తూ ఎవరో నిర్దేశించిన లక్ష్యాల్ని అందుకుంటూ ఎవరో ఇచ్చే జీతాల్ని జాగ్రత్తగా ఖర్చుచేసుకుంటూ అప్పటికే రెండుమూడేళ్లు గడిపేశారు. ఇద్దరికీ వ్యాపారం కొత్తే. తమ ఆలోచన ఎంత లాభసాటిగా ఉంటుందో తెలియదు. సలహా తీసుకోడానికి... ఆ రంగంలో నిష్ణాతులెవరూ లేరు. రిస్క్‌ అనేది ఎక్కడైనా ఉంటుంది. ధైర్యే సాహసే... బిజినెస్‌ అనుకున్నారు. తలో పాతికవేలూ పెట్టి 'క్యాపిల్లరీ టెక్నాలజీస్‌'ను స్థాపించారు. ఖరగ్‌పూర్‌ ఐఐటీ క్యాంపస్‌లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణ సంస్థ ఆ కుర్రాళ్ల ఉత్సాహాన్ని చూసి పాతిక లక్షలు అప్పుగా ఇచ్చింది. దీంతో ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. లక్ష్యం మీదే దృష్టిపెట్టారు.
ఇప్పటిదాకా రిటైలర్లు కూపన్‌ పుస్తకాలనూ లాయలిటీ కార్డులనూ ఉపయోగిస్తున్నారు. వీటి తయారీ ఖర్చు ఎక్కువ. కొనుగోలుదారుడు షాపింగ్‌కు బయల్దేరుతున్నప్పుడు..మరచిపోకుండా వాటిని తీసుకెళ్లాలి. లేదంటే డిస్కౌంట్‌ ఇవ్వరు. బట్టల మధ్యో పుస్తకాల మధ్యో నలిగిపోయి చెత్తబుట్ట పాలయ్యేవే ఎక్కువ. ఇక్కడా అవకాశమే లేదు. కొనుగోలుదారుడికి నేరుగా ఎస్‌ఎమ్‌ఎస్‌ వెళ్లిపోతుంది. దాన్ని చూపిస్తే చాలు. క్యాష్‌ కౌంటర్‌ సిబ్బంది తమ దగ్గరున్న సమాచారంతో సరిపోల్చుకుని డిస్కౌంట్‌ ఇచ్చేస్తారు. రిటైల్‌ వ్యాపారంలో కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడం సులభమే. కాని, పాతవారిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. వారి అభిరుచులనూ ఆసక్తులనూ విశ్లేషించుకోవడం ద్వారా... కొత్తకొత్త ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. అది కూడా వెనువెంటనే. ఓ కస్టమర్‌ తనకు నచ్చిన బ్రాండ్‌ చొక్కా కొనుక్కోగానే, ప్యాంటుకు సంబంధించి ఆకర్షణీయమైన డిస్కౌంట్‌ అందిస్తున్నట్టు ఎస్‌ఎమ్‌ఎస్‌ చేరిపోతుంది. ప్యాంట్‌, షర్ట్‌ కొంటే... షూకు సంబంధించిన డిస్కౌంట్‌. అది కూడా కొంటే, తగ్గింపు ధరలో చలువ కళ్లజోడు! 'జాన్‌ మిల్లర్‌' విక్రేతలకు ఆ ఆలోచన నచ్చింది. 'పీటర్‌ ఇంగ్లాండ్‌' కూడా ఆ జాబితాలో చేరింది. రెస్టరెంట్లు, సూపర్‌ మార్కెట్లకు కూడా ఈ సూత్రాన్ని అన్వయించారు. 'క్యాపిల్లరీ' ఉద్యోగుల సంఖ్య తొలి ఏడాదే ఏడుకు పెరిగింది. ప్రస్తుతం 150 మంది దాకా పనిచేస్తున్నారు. లండన్‌, దుబాయ్‌లకూ వ్యాపారం విస్తరించింది. దాదాపు వంద మహాబ్రాండ్లు 'క్యాపిల్లరీ టెక్నాలజీస్‌' సేవల్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇదంతా మూడేళ్లలోనే!
అప్పులు ఇవ్వబడును
'ప్చ్‌... కష్టం. వర్కవుట్‌ కాదు' అని నిరుత్సాహపరిచారు.
'ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టాల్సినోడివి' అని హెచ్చరించారు.
అయినా వినీత్‌ రాయ్‌ పట్టించుకోలేదు. ''నా దారి స్పష్టంగా కనిపిస్తోంది. మీ మాటలు పట్టించుకునేంత తీరిక నాకులేదు. మంచి పనికి తలోచేయీ వేసినట్టు... మంచి వ్యాపారానికి మాత్రం తలో కొంతా ఎందుకివ్వరు? అదీ పుణ్యానికేం కాదు. వచ్చిన లాభంలో వాటా ఇస్తాం. ఆ 'సామాజిక నిధి'ని పెట్టుబడిగా పెడతాం''... అని ప్రకటించాడు. ఇన్వెస్టర్ల వేట మొదలైంది. 'మంచి ఆలోచన', 'చిన్నవయసులోనే చాలా బాధ్యతగా ఆలోచిస్తున్నావ్‌', 'దేశానికి కావలసింది నీలాంటివాళ్లే' ...వగైరా వగైరా ప్రశంసలైతే దక్కాయి కాని, నిధులు రాలలేదు. ప్రవాస మిత్రుల సహకారంతో వినీత్‌ తన కల నిజం చేసుకున్నాడు. కార్యాచరణ సిద్ధమైంది. పత్తికాయల్ని ఒలిచే యంత్రాన్ని ఆవిష్కరించిన ఓరైతుకు రుణం ఇచ్చి... భారీ స్థాయిలో ఉత్పత్తికి ప్రోత్సహించాడు. తక్కువ కిరోసిన్‌తో పనిచేసే బర్నర్లను తయారుచేసే సాంఘిక వ్యాపార సంస్థలో పెట్టుబడి పెట్టాడు. చౌకగా ఏటీఎంలను తయారు చేసే ఓ సేవా వ్యాపార సంస్థకు అండగా నిలబడ్డాడు. బ్యాంకుల సహకారంతో వాటిని పల్లెల్లో నెలకొల్పాలన్నది ఆ సంస్థ ఆలోచన. 'ఆవిష్కార్‌' ఇప్పటిదాకా దాదాపు పాతిక కంపెనీల్లో డబ్బు పెట్టింది. చాలావరకూ విజయవంతంగా నడుస్తున్నాయి. పెట్టుబడులు పెట్టినవారికి లాభాలూ వస్తున్నాయి.
ఆ లైబ్రరీలో మాట్లాడుకోవచ్చు!
ఉమేష్‌ మల్హోత్రా ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరంలో ఉన్నప్పుడు, వాళ్లనాన్నగారు తనతోపాటు ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. అది బల్బుల తయారీ యూనిట్‌. 'రెండేళ్ల తర్వాత కంపెనీ బాధ్యతలన్నీ నీవే..' అని చెప్పారు. 'ఓ జీవితకాలం ... ఈ నాలుగు గోడల మధ్యే నలిగిపోవడం నాకిష్టం లేదు. క్షమించండి' అని చాలా స్పష్టంగా చెప్పాడు ఉమేష్‌. ఆ మాటమీదే నిలబడ్డాడు కూడా. కొంతకాలం ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసినా తన లక్ష్యాన్ని పక్కనపెట్టలేదు. ఆలోచనలకు స్పష్టత రాగానే రాజీనామా ఇచ్చేశాడు. భార్య విమలతో కలిసి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో 'హిప్పోకాంపస్‌' పేరుతో పిల్లల లైబ్రరీ ప్రారంభించాడు. ఆమె కూడా ఐటీ ఉద్యోగే. లైబ్రరీ కోసం గాలీ వెలుతురూ ధారాళంగా ప్రవహించే ఓ భవనాన్ని ఎంచుకున్నారు. ముచ్చటైన రంగులు వేయించారు. ఆకట్టుకునే ఫర్నిచర్‌ డిజైన్‌ చేయించారు. పిల్లలకు ఇష్టమైన పుస్తకాలన్నీ తెప్పించారు. మల్టీమీడియా కిట్స్‌ కొన్నారు. ఆరునెలల కాలానికి ప్రవేశ రుసుము పదమూడు వందలు. సాధారణ లైబ్రరీల్లో ఉన్నట్టు 'ష్‌... నిశ్శబ్దం' తరహా హెచ్చరికలుండవు. గంభీర వాతావరణం కనిపించదు. వారాంతాల్లో చిన్నచిన్న నాటికలూ పాటలపోటీలూ ఉంటాయి. తొలిఏడాదే రెండున్నరవేల సభ్యత్వాలు వచ్చాయి. శాఖలు విస్తరించాయి. సంపాదనలో కొంత మొత్తాన్ని... గ్రామీణ ప్రాంతాల్లో లైబ్రరీల ఏర్పాటుకు కేటాయిస్తున్నారు ఉమేష్‌ దంపతులు. ఆ ప్రయత్నంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నారు. 'మా బాబు కోసం మంచి అద్దె పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయా అని ప్రయత్నించినప్పుడు నిరాశే ఎదురైంది. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది' అంటారా దంపతులు.
సవాళ్లకు సై...
సుబ్రహ్మణ్యం, కృష్ణమెహ్రా, అనీశ్‌రెడ్డి, ఉమేష్‌ మల్హోత్రా, వినీత్‌రాయ్‌ తదితరుల సాహస యాత్రలో ఎన్నో అనుభవాలు. పెట్టుబడి ప్రధాన సమస్య. ఏ బ్యాంకులూ ముందుకురావు. ఏ వెంచర్‌ క్యాపిటలిస్టులూ ధైర్యం చేయరు. సమాజం నుంచి ఒత్తిడి ఉంటుంది. లక్షణమైన ఉద్యోగాన్ని వదులుకుని లక్షల జీతాన్ని కాదనుకుని కెరీర్‌తో ప్రయోగాలు చేస్తామంటే... కుటుంబ సభ్యులకు కూడా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. దాదాపుగా అందరివీ మధ్యతరగతి నేపథ్యాలే. క్త్లెంట్లకూ బోలెడన్ని సందేహాలు. కొన్ని ఆలోచనలు ఆలోచనలుగా మాత్రమే బావుంటాయి. ఆచరణకు వచ్చేసరికి తుస్సుమంటాయి. అలాంటి అపోహలు అక్కర్లేదని ఎదుటివారిని ఒప్పించాలి, మెప్పించాలి. ఆలోచన అమలుకు నోచుకుని, లాభదాయకమైన ప్రాజెక్టుగా మారడానికి ఎంతోకొంత సమయం పడుతుంది. ఆ రోజు వచ్చేదాకా ఓపిగ్గా ఎదురుచూడాలి. బాలారిష్టాల్ని భరించాలి. చికాకుల్ని తట్టుకోవాలి.
ఇంజినీరింగ్‌ చదువుకున్నా మరెన్నో అవకాశాలు ఎదురుచూస్తున్నా కార్పొరేట్‌ ఆఫీసుల్ని శుభ్రంగా దుమ్ముదులపడమే తన వ్యాపారమంటూ 'భారత్‌వికాస్‌ గ్రూప్‌'ను ప్రారంభించిన హన్మంత్‌ గైక్వాడ్‌... ఎయిర్‌ కండిషన్డ్‌ వాతావరణం లోంచి బయటికి వచ్చి మారుమూల నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బొత్తిగా మర్యాద తెలియని రాజకీయనాయకులకు కన్సల్టెన్సీ సేవలు అందించే 'పొలిటికల్‌ ఎడ్జ్‌' సౌరభ్‌... ఎవరి జీవితాల్ని పరికించినా తమ ఆలోచనల మీద తమకు అపారమైన నమ్మకం. రాహుల్‌ బాలచంద్రన్‌ పద్నాలుగేళ్ల కార్పొరేట్‌ జీవితం నుంచి బయటికొచ్చి ప్రత్యేకంగా మహిళల కోసం అత్యాధునికమైన సెలూన్లు ప్రారంభించాడు. ఏటా ఇరవై అయిదుశాతం పెరుగుతున్న సౌందర్య వ్యాపారం ఆ యువకుడిని ఆకర్షించింది. చాలా సెలూన్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఉండదు. శుభ్రంగా అత్యాధునికంగా ఉండే సెలూన్లలో ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు పరిమితుల్నీ అధిగమిస్తూ పరిశుభ్రమైన వాతావరణంలో సరసమైన ధరలకే సేవలు అందించడం రాహుల్‌ క్షౌరశాల - వైఎల్‌జీ ప్రత్యేకత.
మన అభిరుచే మన దారి, మన ఆసక్తే మన మార్గదర్శి. రేవా బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేస్తున్న చేతన్‌ మైనీకి చిన్నప్పటి నుంచీ ఎలక్ట్రానిక్స్‌ అంటే ప్రాణం. ఆటో దిగ్గజం జనరల్‌ మోటార్స్‌ కూడా ఆయనతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. సాహసక్రీడల్ని అమితంగా ప్రేమించే శంతను సవ్రేకర్‌ రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్‌లాండ్‌లో వెల్త్‌ మేనేజరుగా సంపదను సృష్టించే పనిని మానుకుని... 'ప్రొబోసిక్స్‌' పేరుతో సాహసక్రీడల సంస్థను స్థాపించాడు. తనకి సాహసాలంటే ప్రాణం. 'మన అభిరుచే మన వ్యాపారం అయితే... వ్యాపారం ఓ ఆటలా అనిపిస్తుంది' అంటాడు శంతను.
'కొత్తదారి' ప్రయాణికులకు తమ పరిమితులేమిటో తెలుసు. హంగులకూ ఆర్భాటాలకూ దూరంగా పనిచేసుకుపోతున్నారు. చాలావరకూ 'క్లౌడ్‌ కంప్యూటింగ్‌' టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల డేటాను కాపాడుకోడానికి ఖరీదైన కంప్యూటర్ల అవసరం ఉండదు. కొద్దిమంది సిబ్బందితోనే నెట్టుకొస్తారు. రాహుల్‌ ఇప్పటికీ సెక్రెటరీని కూడా నియమించుకోలేదు. వినీత్‌రాయ్‌ నిన్నమొన్నటిదాకా అసలు జీతమే తీసుకోలేదు. పార్ట్‌టైమ్‌గా ఓ సంస్థకు కన్సల్టెన్సీ సేవలు అందించి... నాలుగురాళ్లు సంపాదించుకునేవాడు. బెంగళూరు శివార్లలో పచ్చని ప్రకృతి మధ్య సైకిలు యాత్రలు నిర్వహించే పంకజ్‌ మంగళ్‌... సరికొత్త వ్యాపారం పట్టాలపైకి ఎక్కేదాకా మార్కెటింగ్‌ ఉద్యోగాన్ని మానలేదు. విదేశీయులూ ప్రవాసులూ ఈ యాత్రల మీద బాగా ఆసక్తి చూపుతున్నారు. కాబట్టే, రెండేళ్లలోనే రాబడి కోటి రూపాయలకు చేరింది. చాలామంది తొలిదశలో డ్రాయింగ్‌రూమ్‌నే ఆఫీసుగా వాడుకున్నారు. 'హమ్మయ్య! దార్లోపడ్డాం...' అన్న ధైర్యం వచ్చాకే మిగతా హంగుల జోలికి వెళ్తున్నారు.
మేనేజ్‌మెంట్‌ సూత్రాల్లోని 'ఫిక్స్‌-గ్రో-లీడ్‌' విధానాన్ని కచ్చితంగా పాటిస్తున్నారు. రెండుమూడేళ్లు స్థిరపడటానికి కేటాయిస్తున్నారు. మరో రెండేళ్లు ఎదగడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మూడోది 'లీడ్‌' దశ. ఇప్పుడు విస్తరణే ప్రధాన లక్ష్యం. మన కథానాయకులంతా రెండోదశ చివర్లో మూడోదశ ప్రారంభంలో ఉన్నారు.
నిన్నమొన్నటిదాకా రాళ్లూరప్పలతో నిండిన రహదార్లన్నీ... మెత్తని తివాసీలు పరుచుకుని, పూలరెక్కలు చల్లుకుని ఆ హీరోలకు స్వాగతం పలుకుతున్నాయి.

వరూ నడవని దారిలో ఎన్ని సమస్యలుంటాయో, అన్ని అవకాశాలూ ఉంటాయి. నిరాశావాదులను సమస్యలు భయపెడతాయి. ఆశావాదులను అవకాశాలు వూరిస్తాయి. ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో పనిచేస్తున్నా నిరాశ వద్దు, నిరాసక్తత వద్దు. ఆ రంగానికి సంబంధించి మనకు పరిజ్ఞానం లేదనో, అందులో డిగ్రీలూ గట్రా లేవనో వెనకడుగు వేయాల్సిన పన్లేదు. ఆసక్తి ముఖ్యం.
- వెంకట్‌ సుబ్రహ్మణ్యం, ఇ-ఫామ్‌
సైకిల్‌ యాత్రలు నిర్వహించడం ద్వారా... ఓ కొత్త వ్యాపార అవకాశాన్ని సృష్టించవచ్చని నేను బలంగా నమ్మాను. ఎంత బలంగా అంటే, నెలకు అరవైవేల జీతం వచ్చే మార్కెటింగ్‌ ఎనలిస్ట్‌ ఉద్యోగం కూడా దాని ముందు దిగదుడుపే అనిపించింది. మన మీద మనకు ఎంత నమ్మకం ఉంటే, అంత ధైర్యంగా అడుగు ముందుకు వేయగలం.
- పంకజ్‌ మంగళ్‌,

www.artofbicycle.com
నం అనుసరిస్తున్న టెక్నాలజీ, మన ఆలోచనల మీద మనకున్న స్పష్టత, మార్కెట్‌ గురించి అవగాహన... ఇవే వ్యాపార యాత్రలో మన పనిముట్లు. తొలిరోజు నుంచీ ఇప్పటిదాకా.. ఆత్మవిశ్వాసాన్ని ఏ మాత్రం కోల్పోలేదు. ఖాతాదారులను సంతృప్తిపరచడంలో మాతర్వాతే ఎవరైనా అని గట్టిగా నమ్ముతాను.
- కృష్ణ మెహ్రా, క్యాపిల్లరీ టెక్నాలజీస్‌
మేం పిల్లల కోసం లైబ్రరీ పెడతామని చెప్పినప్పుడు అంతా నవ్వారు. ఇన్ఫోసిస్‌ లాంటి మంచి సంస్థలో ఉద్యోగాన్ని వదులుకుని ఇలాంటి ప్రయోగాలు ఎందుకన్నారు. నేను పట్టించుకోలేదు. ఓ కొత్తదారిని నిర్మించాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఒత్తిడిని భరించాల్సిందే.
- ఉమేష్‌ మల్హోత్రా, హిప్పోక్యాంపస్‌ లైబ్రరీ
మాజం, వ్యాపారం వేరువేరు కాదు. వ్యాపారం సమాజంలో ఓ భాగం. వ్యాపారం ద్వారానే సమాజం తనకు అవసరమైన సాధనసంపత్తిని సమకూర్చుకుంటుంది. నా దృష్టిలో సామాజిక బాధ్యత, వ్యాపార బాధ్యత వేరువేరు కాదు. అందుకే, సమాజానికి ఉపయోగపడే వస్తువుల ఆవిష్కరణకు వ్యాపార సూత్రాలు జోడించాలని భావించాను. మొదట్లో నా ప్రయత్నాన్ని అనుమానించినవారు కూడా, ఇప్పుడు అభినందనలు తెలుపుతున్నారు.
- వినీత్‌రాయ్‌, ఆవిష్కార్‌ సోషల్‌ వెంచర్‌ ఫండ్‌
నాణ్యమైన, అత్యాధునికమైన సేవలు అందించే సెలూన్లు మహిళలకు అందుబాటులో లేవని నాకు అర్థమైపోయింది. ఆ లోటు తీర్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఆ అవకాశం నాకోసమే ఎదురుచూస్తోందేమో అనిపించింది. ఆలస్యం చేయకుండా రంగంలో దూకాను.
- రాహుల్‌ రామచంద్రన్‌, వైఎల్‌జీ సెలూన్స్‌
* * *
బరువును బట్టి, రెక్కల పరిమాణాన్ని బట్టి కొన్ని జీవులకు మాత్రమే ఎగిరే సామర్థ్యం ఉంటుందని 'ఏరో డైనమిక్స్‌' సూత్రాలు చెబుతాయి. ఆ లెక్కన తుమ్మెద గాల్లో ఎగిరే అవకాశమే లేదు. ఎందుకంటే, దాని బరువు ఎక్కువ, రెక్కలు చిన్నవి. అయితేనేం... హాయిగా ఆకాశయానం చేస్తుంది. ఏ పూవు మీద కావాలంటే ఆ పూవు మీద వాలిపోతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు