Health notes
ఎముక పుష్టికి ఏం చేద్దాం! వయసు యాభై దాటడం ఆలస్యం.. చాపకింద నీరులా అనారోగ్యాలు ఒక్కొక్కటీ దాడిచేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు.. ఇన్‌ఫెక్షన్లు లాంటివే కాదు.. ఎముకల సాంద్రత తగ్గి.. ఆస్టియోపోరోసిస్ కూడా వేధిస్తుంది. పురుషుల కన్నా మహిళల్ని ఎక్కువగా వేధించే ఈ సమస్య వచ్చాక కన్నా.. ముందు జాగ్రత్తతో నివారించడం సులువంటున్నారు నిపుణులు.అరవై ఎనిమిదేళ్లయినా చకచకా పనులు చేసేస్తుంది శ్యామల. అయితే ఆర్నెల్ల క్రితం గబగబా నడుస్తూ కాలుజారి కింద పడింది. అదే తగ్గుతుందని రెండుమూడు రోజులు తేలిగ్గా తీసుకున్నా.. చివరకు వైద్యుల్ని సంప్రదించాల్సి వచ్చింది. పరీక్షలన్నీ చేసి.. ఆస్టియోపోరోసిస్ అని తేల్చారు వైద్యులు. శ్యామల లాంటి పరిస్థితి ఈ రోజుల్లో చాలామందికీ అనుభవమే. లక్షణాలు పెద్దగా కనిపించకుండా చుట్టుముట్టే అనారోగ్యాల్లో ఆస్టియోపోరోసిస్ కూడా ఒకటి. ఎముక సాంద్రత తగ్గడమే ఈ సమస్య.ఈస్ట్రోజెన్ ప్రభావమే మెనోపాజ్ దశ దాటాకే ఆస్టియోపోరోసిస్ ఎందుకు ఎదురవుతుంటే.. ఈస్ట్రోజెన్ తగ్గడమే కారణమంటారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె. కృష్ణయ్య. 'మహిళలకు మెనోపాజ్ దశ వచ్చేవరకు స్త్రీలల్లో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోను ఆస్టియోపోరోసిస్, గుండెజబ్బుల వంటివాటి నుంచి కాపాడటంలో కీలక పాత్ర వహిస్తుంది. ఒక్కసారి మెనోపాజ్ దశ మొదలయ్యాక, నెలసరి ఆగిపోయాక.. అండాశయాల నుంచి ఆ హార్మోను ఉత్పత్తి దాదాపుగా ఆగిపోతుంది. ఆ రక్షణ ఎప్పుడైతే తొలగిపోతుందో సమస్యలు మొదలవుతాయి. హృద్రోగాలు, ఎముకల సమస్యలు అప్పుడే దాడిచేస్తాయి. కేవలం వారిలోనే కాదు.. మెనోపాజ్ దశ కన్నా ముందే నెలసరి ఆగిపోతుంటుంది కొందరికి. అలాగే కొన్ని కారణాల వల్ల చిన్నవయసులోనే గర్భాశయంతో పాటు అండాశయాలనూ తొలగించుకుంటారు కొందరు. ఫలితంగా హార్మోన్ల తయారీ ఆగిపోతుంది. అలాంటప్పుడూ ఈ సమస్య తప్పదు. సమస్య ఎప్పుడు మొదలైనా వయసు పెరిగేకొద్దీ ఈ సమస్యా పెరుగుతుంది. శరీరంలో సహజసిద్ధంగా జరిగే మెనోపాజ్ మార్పు ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సాంద్రత తగ్గితే సమస్యే ఎముకలు చూడటానికి సాధారణంగా ఉంటాయి కానీ.. వాటిల్లో సాంద్రత మాత్రం తగ్గిపోతుంది. పలుచబడి.. గుల్లబారతాయి. దీనికి దారితీసే కారణాల్లో వయసు ప్రధానమైతే.. కొన్నిరకాల ఉత్ప్రేరకాలు దీర్ఘకాలంగా తీసుకోవడం కూడా ఈ ప్రమాదాన్ని సూచిస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల సులభంగా విరిగిపోతుంటాయి. సాధారణంగా వెన్నుపూస, మణికట్టు, భుజాలు, తుంటి ఎముకల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అంటే శరీరానికి ఆసరా ఇవ్వాల్సిన ఎముకలే ఎక్కువగా ప్రభావితమవుతాయి. అవి పటుత్వం కోల్పోతాయి. అలాంటప్పుడే కొద్దిగా బెణికినా, నడుస్తూనడుస్తూ జారినా విరిగిపోతుంటాయి. దీనికి పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా.. వయసుపైబడ్డాక వచ్చే నడుం, మెడ నొప్పుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. బాత్రూంలో జారిపడినా.. కాలు మడతపడినా.. సాధ్యమైనంత త్వరగా వైద్యుల్ని సంప్రదించాలి. గుర్తించే పరీక్ష.. వయసు నలభై దాటిన తరవాత చేయించుకునే ఇతర పరీక్షలతో పాటు.. ఎముకల సాంద్రతను తెలియజేసే బీఎండీ (బోన్ మినరల్ డెన్సిటోమెట్రీ)కూడా చేయించుకోవాలి. మణికట్టు, నడుం, తుంటి భాగాల దగ్గర చేసి ఈ పరీక్షచేసి ఎముకల సామర్థ్యాన్ని నిర్థారిస్తారు. ఈ ఫలితాల్లో ఉండాల్సిన ఎముకల సాంద్రత.. తగ్గిన శాతం.. లాంటి సమాచారాన్ని అందిస్తారు. దాన్ని బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరవాత మళ్లీ ఏడాది రెండేళ్లకోసారి బీఎండీ చేయించుకోవాలి. ముందు జాగ్రత్తలే మేలు సమస్య ఎదురయ్యాక చికిత్స తీసుకోవడం కన్నా.. దీన్ని సాధ్యమైనంతవరకు రాకుండా నివారించడమే మంచిది. అదెలాగంటే.. * దైనందిన జీవితంలో వ్యాయామం ఓ భాగం కావాలి. కనీసం అరగంటైనా నడక, ఈత, సైక్లింగ్ ఇలా ఏదో ఒకటి తప్పనిసరి. * ఎముకలు పటుత్వం కోల్పోకుండా చేయడంలో క్యాల్షియం, ఫాస్పేట్ పాత్రా ప్రధానమే. ప్రతిరోజూ కనీసం గ్రాము క్యాల్షియం అయినా శరీరానికి అందాలి. అయితే కొందరిలో అది కూడా ఉండదు. అలాంటివారికి వైద్యులు క్యాల్షియం సప్లిమెంట్లను సిఫారసు చేస్తారు. అది తీసుకుంటున్నా.. ఆహారం నుంచి ఆ పోషకం అందేలా చూసుకోవాలి. పాలు, సపోటా, పనస, ఆకుకూరలు, మాంసం, చిన్నచేపలు.. లాంటి పదార్థాల మోతాదును పెంచాలి. అయితే దాంతోపాటు డి విటమిన్ కూడా అందితేనే.. శరీరానికి క్యాల్షియం చేరుతుంది. చేపలు, మాంసం, బొప్పాయి, ఆకుకూరల్లోనే కాదు.. ఎండ నుంచీ ఈ పోషకాన్ని పొందవచ్చు. పరిష్కారాలున్నాయి.. ఈ జాగ్రత్తలు తీసుకున్నా ఆస్టియోపోరోసిస్ ఎదురైనప్పుడు.. క్యాల్షియం, డి విటమిన్ కలిపిన మందులు అందుబాటులో ఉంటాయి. వారానికి తీసుకునే మందులు కూడా లభిస్తాయి. అవీ కాదనుకుంటే.. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఏడాదికోసారి ఇంజెక్షను చేయించుకోవచ్చు. అయితే ఆ తరవాత కూడా రోజూ క్యాల్షియం మాత్ర వేసుకోవడం తప్పనిసరి. శరీరానికి మళ్లీ ఈస్ట్రోజెన్ అందాలని ఆ హార్మోన్‌ను మాత్ర రూపంలో (హెచ్‌ఆర్‌టీ) తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తుంటారు కొందరు. అయితే వాటివల్ల గర్భాశయం, రొమ్ముక్యాన్సర్ వచ్చే ఆస్కారం అధికం కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే ఎంచుకోవాలి. వయసు నలభై దాటినప్పటినుంచీ ఎముకల సాంద్రతను తెలిపే పరీక్షను చేయించుకోవాలి. మందులు, ఇంజెక్షన్లు ఏవయినా సమస్య తీవ్రతను బట్టి వైద్యులే నిర్థారిస్తారు. అంతేకానీ సొంతంగా వేసుకునే ప్రయత్నం సరికాదు. అండాశయాలు పదిలం ముందునుంచీ ఆహార రూపంలో క్యాల్షియంను తీసుకుంటున్నా.. నలభై ఏళ్లు దాటినప్పటి నుంచీ ఆ అవసరం పెరుగుతుంది. దాదాపు వెయ్యి మిల్లీగ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆహారం నుంచి అది సరిపడా అందనప్పుడు మాత్రల రూపంలో ఎంచుకోవచ్చు. ఇతర కారణాల వల్ల గర్భాశయాన్ని తొలగించుకుంటున్నప్పుడూ అండాశయాలూ అనవసరం అనుకుంటారు కొందరు. అది కేవలం అపోహే. కనీసం ఒక్క అండాశయాన్నైనా పదిల పరుచుకోవాలి..' అని వివరిస్తారు గైనకాలజిస్టు డాక్టర్ మంజుల. |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి