Eenadu Eetaram (21/04/2012)
విదేశాల్లో మనోళ్లు అదుర్స్! సందర్భం 1 : ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ స్ట్రీట్ మ్యూజిక్... ప్రదేశం: హాంబర్గ్ నగరం... పదిమంది సభ్యుల కుర్రబృందం భాంగ్రా, జాజ్, బాలీవుడ్ పాటల్ని కలగలిపి వాయించేస్తున్నారు. అనుగుణంగా ప్రేక్షకులు వూగిపోతున్నారు. కేకలు, చప్పట్ల మోతలు.సందర్భం 2 : ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభోత్సవం... ప్రదేశం: ప్యారిస్ నగరం... ముప్ఫై రెండు దేశాల క్రీడాకారులు, 80 వేల మంది అభిమానుల ముందు వేదికపై 'ఏక్ దో తీన్...' పాటతో కుర్రకారు బృందం ఉర్రూతలూగిస్తోంది. ప్రేక్షకుల పాదాలు నేలపైన నిలిస్తే ఒట్టు. రెండు సందర్భాల్లో వూగిపోయింది విదేశీయులే. వూపేసింది మాత్రం మన భారతీయ కళాకారులు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలతోపాటు విదేశీ పెళ్లిళ్లు, పండగలు, ఉత్సవాల్లోనూ మన బ్రాస్‌బ్యాండ్ల ప్రతిభ వెలిగి పోతోంది. ఇందులో బాలీవుడ్ సినీ సంగీతానిదే అగ్రస్థానం!పెళ్లయ్యాక కొత్త జంటను మేళతాళాలతో వూరేగించడం మన సంప్రదాయం. ఆ సందడిలో పుట్టుకొచ్చిన బ్రాస్‌బ్యాండ్ల హంగామా ఇప్పుడు విదేశాల్లో సందడి చేయడం సరికొత్త ధోరణి. మొదట్లో బ్రిటిష్‌వారి నుంచి ఇండియాకి దిగుమతి అయిన ఈ సంప్రదాయం, తాజాగా ఇంగ్లండ్‌తోపాటు యూరోప్‌నీ వూపేస్తోంది.కలిపి కొడతారు పాప్ ప్రియులైన పాశ్చాత్యులు మన బ్యాండ్లకు ఫిదా అవడానికి కారణం మనోళ్లు వాళ్ల నాడి పట్టుకోవడమే. అక్కడి అభిరుచికి తగ్గట్టు వెస్ట్రన్ సంగీతానికి హిందుస్థానీ, భాంగ్రా, బాలీవుడ్ గీతాలు జోడించి మరింత మజా పంచడమే. తబలా, ధోలక్, శాక్సాఫోన్, కార్నెట్, బ్యారిటోన్‌లతో మనవాళ్లు చేసే సరిగమల విన్యాసాలు పరదేశీయుల్ని ఓలలాడిస్తున్నాయి. అందుకే మన బ్యాండ్‌లు ఐ.ఎస్.ఐ. బ్రాండ్‌లా అక్కడ తిష్ట వేస్తున్నాయి. ఈ మెప్పు కోసం మనోళ్లు పడుతున్న కష్టమూ తక్కువేం కాదు. కొత్త బాణీ సృష్టించడానికి గంటలు, రోజుల కొద్దీ సాధన చేస్తారు. 'ఒక గంట అంతర్జాతీయ ప్రదర్శన కోసం మేం రోజుకు నాలుగు గంటల చొప్పున పదిహేను రోజులు కష్టపడతాం' అంటున్నాడు కావా బ్రాస్‌బ్యాండ్ వ్యవస్థాపకుడు హమీద్‌ఖాన్. 'అన్నిరకాల సంగీతం సాంకేతికంగా మారిపోయిన ఈ రోజుల్లో కొత్త తరహాలో మేం చేసే ప్రదర్శన కచ్చితంగా ప్రేక్షకుల మనసుని తాకుతుంది' అంటాడు శ్యామ్ బ్రాస్‌బ్యాండ్ యజమాని మనోజ్ ఈశ్వరీ ప్రసాద్. ఇలా విదేశీయులని అలరిస్తున్న బ్యాండ్లలో ఎక్కువ శాతం రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవే. డబ్బులే డబ్బులు మన బ్యాండ్‌ల స్త్టెల్ విదేశీయులకు నచ్చడంతో ఈ కళాకారులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఇక్కడ ఒక పెళ్లి లేదా ఉత్సవానికి అందుకునే మొత్తం ఐదువేల రూపాయలు. మహా అయితే పదిహేను వేలు. అదే విదేశాల్లో ఒక్క షోకి మినిమమ్ లక్ష గ్యారెంటీ. ఇలా ఇంగ్లండ్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, కెనడా, రొమేనియా, మలేసియా, స్విట్జర్లాండ్, లిథువేనియాల్లో మన బ్యాండ్‌లకు రెడ్‌కార్పెట్ స్వాగతాలందుతున్నాయి. దాంతోపాటే ఒక్కసారి విదేశీ ప్రదర్శన ఇస్తే సహజంగానే ఇక్కడా గిరాకీ పెరుగుతుంది. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు! పాశ్చాత్యులూ సలాం భారతీయ సంగీతం, భారతీయ బ్యాండ్ల హవా ఇంతటితోనే ఆగిపోవడం లేదు. ఈ స్ఫూర్తి పుణికిపుచ్చుకున్న కొందరు ఔత్సాహిక విదేశీ కుర్రాళ్లు కూడా ఈ బాట పడుతున్నారు. బాలీవుడ్ సంగీతమే వాళ్ల ముడిసరుకు. అలా బాగా పాపులరైనవి 'రెడ్ బారాత్', 'బాంబే బాజా', 'బాలీవుడ్ బ్రాస్ బ్యాండ్' బ్యాండ్లు. తొమ్మిది మంది రెడ్ బారాత్ బృందంలో ముగ్గురు భారతీయులే. వెస్ట్రన్ సంగీతానికి భాంగ్రా బాణీలు జోడించడం వాళ్ల ప్రత్యేకత. వీళ్లతోపాటు లండన్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్ నగరాల్లో ఇలాంటి బ్యాండ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి