గుహకు చేరిన అంతరిక్ష మృగరాజు!



వాసన.. వాసన... అపురూపమైన అంతరిక్షం వాసన.. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన అగ్నిశిఖల వాసన.. భూకక్ష్యల నిప్పుల కొలిమిలో ఎర్రటి కర్రులా కాలి మాడిన లోహపు తునకల వాసన.. ఉపరితల ఆవరణాల్లోని 'ఓజోన్‌' వాయువుల వాసన... అమెరికాలోని 'స్మిత్సోనియన్స్‌ నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌' మ్యూజియానికి వెళితే ఇప్పుడీ తాజా అంతరిక్ష వాసన మన ముక్కుపుటాలను తాకే అవకాశం ఉంది. కారణం... 39 సార్లు అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చిన, గత 28 ఏళ్లలో దాదాపు 365 రోజులు అంతరిక్షంలోనే గడిపిన, అమెరికా వ్యోమనౌకల విశ్వసనీయతను, 'నాసా' ప్రతిష్ఠను దిగ్దగంతాలకు వ్యాపింపజేసిన విఖ్యాత 'డిస్కవరీ' వ్యోమనౌక... ఇప్పుడు అక్కడే శాశ్వతంగా కొలువుతీరింది. అక్కడి హ్యాంగర్లలో నిలిచిన డిస్కవరీని చూస్తే.. దిక్కులుపిక్కటిల్లే గాండ్రిపులతో అడవిని గడగడలాడించిన ఓ మృగరాజు.. జరాభారంతో చివరికి ఓ మారుమూల గుహలో మౌనంగా నిద్రిస్తున్నట్టు అనిపించవచ్చు! ఇక నేలని వీడని ఈ 'డిస్కవరీ'.. శిఖరసమానమైన తమ అంతరిక్ష చరిత్రకు నిలువెత్తు తార్కాణమని.. భవిష్యత్తరాలకు స్ఫూర్తిని మిగిల్చే ఘన సంకేతమని అమెరికా భావిస్తోంది. అయితే... మరో వ్యోమనౌక ఏదీ సిద్ధం కాకుండానే డిస్కవరీని అటకెక్కించటం.. సరైన ప్రణాళికా వ్యూహాలేవీ లేకుండానే అంతరిక్ష కార్యక్రమాలకు చాపచుట్టెయ్యటం.. అన్ని విధాలా చేతులు ముడుచుకుంటున్న అమెరికా వర్తమానికి అద్దం పడుతోందని నిపుణులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి 'డిస్కవరీ' మ్యూజియం యాత్రతో అమెరికా అంతరిక్ష చరిత్ర.. నింగి నుంచి నేలకు దిగజారినట్లేనా?
నిప్పులు కక్కుతూ.. కక్ష్యలను చీల్చుకుంటూ అంతరిక్షంలోకి ఎగసి పలుమార్లు అమెరికా ఘనతను చాటిన 'డిస్కవరీ' వ్యోమనౌక గత వారం.. 'బోయింగ్‌ 747' వీపు మీద ఎక్కి.. చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ వైట్‌హౌస్‌తో సహా అమెరికాలోని ప్రఖ్యాత ప్రాంతాలన్నీ చుట్టబెట్టి.. ప్రజలను అలరిస్తూ.. చివరికి డల్లస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది! కనులపండువగా సాగిన అత్యంత అరుదైన ఈ ప్రయాణం దారివెంబడి ఎంతో కోలాహలాన్ని రేపింది. కప్పల్లా కరుచుకున్న 'బోయింగ్‌-డిస్కవరీ'ల ద్వయం ప్రయాణించినంత మేరా.. అమెరికన్లు కింది నుంచే పార్కుల్లో తండోపతండాలుగా చేరి.. ఘనంగా స్వాగతిస్తూ కేరింతలు కొట్టారు.. భవనాలెక్కి కోలాహలంతో చూశారు.. ఫోటోలు తీసుకున్నారు. బోయింగ్‌ మీంచి కిందికి దిగిన డిస్కవరీ.. గురువారం స్మిత్సోనియన్‌ మ్యూజియాన్ని చేరుకుంది. దీంతో అమెరికా ఘన అంతరిక్ష చరిత్రలో కీలక పాత్ర పోషించిన ఒక ముఖ్య నౌక.. అటకెక్కినట్త్లెంది!
వాస్తవానికి ఘనత వహించిన 'డిస్కవరీ' ఒక్కటే కాదు.. ఎండీవర్‌, అట్లాంటిస్‌ వ్యోమనౌకలకు కూడా అమెరికా ఇదే బాటలో విరమణ ఇచ్చి.. వాటినీ వేర్వేరు మ్యూజియాలకు తరలించింది. దీంతో 30 ఏళ్ల అమెరికా అంతరిక్ష యాత్రా చరిత్రలో ఒక ఉజ్జ్వల ఘట్టం ముగిసినట్లే అంటున్నారు విశ్లేషకులు! ఖరీదైన అంతరిక్ష నౌకా ప్రయాణాలను కట్టిపెట్టే ఉద్దేశంతో గత సంవత్సరం అమెరికా మొత్తం వ్యోమ నౌకా కార్యక్రమాలనే నిలిపివేసింది. ఇప్పుడు అమెరికా వద్ద ప్రయాణానికి సిద్ధంగా అంతరిక్ష నౌకలేవీ లేవు. ఒకవేళ నాసా పరిశోధకులు అంతరిక్ష ప్రయోగశాలకు వెళ్లాలనుకుంటే లక్షల డాలర్లు చెల్లించి రష్యా 'సోయజ్‌' నౌకల్లో వెళ్లాల్సిందే! అందుకే డిస్కవరీ విరమణ పట్ల పరిశోధకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. చాలామంది దీన్నో 'విషాదకర, మరువలేని మధుర ఘట్టం' అని వ్యాఖ్యానించారు. నాసా ప్రతినిధులు మాత్రం ఈ ప్రయాణాలను నిలిపివెయ్యటం ద్వారా ఆదా చేసిన డబ్బుతో.. వ్యోమగాములను అంతరిక్ష కేంద్రం కంటే మరింత దూరంగా చంద్రుడు, అంగారకుడు వంటి గ్రహ తీరాలకు తీసుకువెళ్లే బృహత్తర కార్యక్రమాలను, 'ఓరియన్‌' వంటి కొత్త తరహా రాకెట్లను రూపొందించనున్నట్టు చెబుతున్నారు.
మరోవైపు అంతా ప్రైవేటు అంతరిక్ష రంగం వూపందుకుంటుందని భావిస్తున్నారు. 'ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య' విధానానికి అనుగుణంగా క్యాలిఫోర్నియాలోని స్పేస్‌-ఎక్స్‌ సంస్థ తొలిగా సరకు రవాణా వ్యోమనౌకతో సిద్ధమై.. క్రమేపీ వ్యోమగాములనూ తీసుకువెళ్లే స్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తోంది. డిస్కవరీ నిపుణుల బృందం ఇప్పుడు 'సియరా నెవడా కార్పొరేషన్‌' అనే ప్రైవేటు సంస్థతో కలిసి వాణిజ్య అంతరిక్ష ట్యాక్సీలను అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ ప్రైవేటు రంగం కూడా పుంజుకోవటానికి ఐదారేళ్లకు తక్కువేం పట్టదు! మొత్తానికి 2017 వరకూ కూడా అమెరికా ఎటువంటి అంతరిక్ష యాత్రలకూ సిద్ధంగా ఉండదన్నది స్పష్టం!
ఇదో తిరుగుప్రయాణం! 
డిస్కవరీ ప్రయాణం.. ఇన్నేళ్లుగా గగనంలో రారాజుగా నిలుస్తున్న అమెరికా అంతరిక్ష కార్యక్రమాల చరమాంకానికి చిహ్నమా? అన్నది ఇప్పుడు పలువురిని కలవరపెడుతున్న ప్రశ్న. ఎటువంటి ప్రత్యామ్నాయాలు సిద్ధం చేయకుండా.. ఇప్పుడు చేజేతులా ఈ నౌకలను మ్యూజియాలకు పంపించటం.. తమ దేశ ప్రజల హృదయాల నుంచి 'అమెరికన్లమన్న' గర్వకారణాన్నీ, ఆ దేశాభిమానాన్నీ తుడిచిపెట్టేస్తుందని కొందరు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ''ఇప్పటికే మన జాతి.. దేన్నైనా కొనుక్కోవటం, అమ్ముకోవటం అన్న భావనకు అలవాటుపడింది. ఒక జాతిగా మనం కలిసికట్టుగా సాధించే ఘనకార్యాలు నానాటికీ కరవైపోతున్నాయి. ఒక జాతిగా మనకు పెనుసవాళ్లను విసిరే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది'' అని డేవిడ్‌ గెర్గెన్‌ వంటి సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు 2030 నాటికి చైనా- అమెరికాను మించిపోయి తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలబడుతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్న తరుణంలో ఇది మరీ అవసరమని వీరు వాదిస్తున్నారు. 2025 నాటికి చంద్రమండల యాత్రలు చేపట్టాలని చైనా సన్నాహాలు చేస్తోంది. దీన్నో ప్రతిష్ఠాత్మక అంశంగా కూడా తీసుకుంటోంది. ఒబామా ప్రభుత్వ నిర్ణయాలతో 2010లో అమెరికా ఇదే తరహా కార్యక్రమాన్ని అర్థాంతరంగా నిలిపివేసింది. దీనిపై నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ వంటి పలువురు అంతరిక్ష ప్రముఖులు అప్పుడే ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అమెరికాలో ఇప్పటికే ఉత్పాదనా రంగం కుంటుబడిందని భావిస్తున్న తరుణంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే ఇటువంటి అంతరిక్ష కార్యక్రమాలను... మాంద్యం వంటి ఆర్థిక కారణాలను చూపించి మూసివెయ్యటం సరికాదని విశ్లేషకులు ఆక్షేపిస్తున్నారు.
మొత్తానికే నష్టం? 
అసలు అమెరికా తాజా నిర్ణయాలతో మొత్తం ప్రపంచ అంతరిక్ష పురోగతేమూలనబడుతోందని వాదించేవారూ ఉన్నారు. ''చంద్రుడిపై మనిషి కాలు పెట్టిన నాడు అంతా... ఈ రోజు నాటికి మనం అంగారకుడి మీదకు వెళ్లిపోతామని భావించారు. కానీ ఇప్పుడు మనం వెనక్కి వెళుతున్నాం'' అని కొందరు వాదిస్తున్నారు. భారీ వ్యయం, రకరకాల ప్రమాదాల వంటివన్నీ దృష్టిలో ఉంచుకుని రష్యా కూడా ఇటీవలి కాలంలో కాస్త వెనకడుగు వేస్తోంది. పరిశోధనల కోసం వ్యోమగాములను పంపించటం తగ్గించి.. శాటిలైట్లు కక్ష్యలో ప్రవేశపెట్టటం వంటి వాణిజ్య కార్యక్రమాలకు దిగుతోంది. ఐటీ రంగంలో పురోగతి, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వంటివన్నీ వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మనుషులను పంపే కంటే రోబోలతో పరిశోధనలు కానివ్వటం మేలన్న వాదనా ఉంది. అందరికంటే ముందు- మళ్లీమళ్లీ వాడటానికి పనికొచ్చే నౌకలు, అంతరిక్ష యానం, అంతరిక్ష పరిశోధనలు.. ఇవన్నీ సాధ్యమేనని నిరూపించిన అమెరికా.. ఇప్పుడు ఆ డబ్బును వేర్వేరు ప్రయోజనాలకు వినియోగించాలని నిర్ణయిస్తూ వీటిని మూసేయటం ద్వారా.. మరో తరహా కొత్త ఆలోచనలకు తెర తీస్తోందని నమ్మేవాళ్లూ ఉన్నారు.
అద్భుతాల డిస్కవరీ 
1984 ఆగస్టు 30న బయల్దేరి.. అమెరికా అంతరిక్ష కార్యక్రమంలో కీలక నౌకగా నింగికి-నేలకి ప్రయాణాలు చెయ్యటం ఆరంభించిన డిస్కవరీ... ఈ 28 ఏళ్లలో 39 సార్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చింది. ఇన్నిసార్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన మరో వ్యోమనౌక ఏదీ లేదు. ఇది మొత్తమ్మీద 365 రోజులు అంతరిక్షంలో గడిపింది. 14.8 కోట్ల మైళ్లు ప్రయాణించింది. భూమిచుట్టూ 5,830 పరిభ్రమణాలు చేసింది.
1990లో హబుల్‌ టెలిస్కోప్‌ను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టింది డిస్కవరీనే. రష్యా వ్యోమగామిని తొలిసారిగా అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన అమెరికా నౌక, 1995లో రష్యా అంతరిక్ష పరిశోధనాశాల 'మిర్‌'తో అనుసంధానమైన మొదటి నౌక, తొలి మహిళా వ్యోమగామి పైలెట్‌ను తీసుకువెళ్లిన నౌక.. డిస్కవరీనే.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నిర్మాణంలో కీలక సామగ్రిని మోసింది, మరే నౌకా వెళ్లనంతగా 13 సార్లు అక్కడకు వెళ్లింది ఇదే.
1998లో ఛాలెంజర్‌, 2003లో కొలంబియా అంతరిక్ష నౌకలు వ్యోమగాములతో సహా పేలిపోయి.. అంతరిక్ష కార్యక్రమాల్లో విషాద ఛాయలు అలముకున్న తరుణంలో తిరిగి నాసా శాస్త్రవేత్తలకు విశ్వాసాన్నీ, ఉత్తేజాన్నీ ఇచ్చి నిలబెట్టింది ఈ డిస్కవరీనే.
డిస్కవరీ అంతరిక్ష యాత్రల పరంపర.. 2011 మార్చి 9న.. కొలంబియా స్పేస్‌ స్టేషన్లో దిగటంతో ముగిసింది. అదే చిట్టచివరి అంతరిక్ష ప్రయాణం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు