ఎండలు మండిపోతాయి. ఉక్కపోత వేధిస్తుంది. పచ్చని మొక్కలు పాలిపోతాయి. చిన్నారుల మొహాలు మాడిపోతాయి. చెమటలే చెమటలు. ఎముకలేని నాలుకకు ఓపిక్కూడా తక్కువే. 'దాహం -దాహం' అంటూ ఒకటే నస. వేసవి ప్రభావాలు ఒకటారెండా! ఆ తీవ్రతను తట్టుకోవాలంటే...పక్కా వ్యూహం ఉండాలి. దానిక్కాస్త ఆరోగ్యస్పృహా తోడైతే తిరుగేలేదు. సూరీడి కళ్లకు గాగుల్స్ వేసి, వడదెబ్బగారితో అబ్బా అనిపించే కాటన్ చొక్కా తొడిగించి, చెమటకు శుభ్రంగా రోజ్‌వాటర్ స్నానం చేయించి, ఎండాకాలానికి టోకుగా 'టోపీ' పెట్టేయొచ్చు.
చలువ భోజనంపరిపూర్ణ ఆహారం, తగినంత విశ్రాంతి, మండుటెండ నుంచి రక్షణ, చిన్నచిన్న చిట్కాలు, అవసరమైతే వైద్యుల సలహాలు...వేసవిని ఎదుర్కోడానికి, ఇంతకు మించిన జాగ్రత్తలేం ఉంటాయి? బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి. ఏదో ఒకటి కడుపులో పడ్డాకే కాలు బయటపెట్టాలి. లేదంటే, నిస్సత్తువ ఆవహిస్తుంది.ఎండకు ఆకలి మందగిస్తుంది. ఫలితంగా, పోషక విలువల లోపం ఏర్పడుతుంది. మంచి భోజనం, పండ్లూ కూరగాయల ముక్కలూ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. మద్యం, కాఫీ, టీ, ధూమపానం...ఒంట్లోని నీటి నిల్వల్ని అడుగంటేలా చేస్తాయి. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.
మసాలా రుచులు ఎంత తగ్గిస్తే అంత మంచిది. వేపుడు కూరలూ సమోసాలూ మిర్చీబజ్జీలను ఆమడ దూరంలో ఉంచాలి. అవేకాదు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఏ పదార్థమైనా దూరందూరం. ఎందుకంటే, ఎండవేడిమి కొవ్వుపై చెడు ప్రభావం చూపుతుంది.
వేసవి ప్రకృతి పెట్టే పరీక్ష. పరిష్కారం కూడా ప్రకృతిలోనే ఉంది... పాలకూర, కీరా, అల్లం, వెల్లుల్లి, బీట్‌రూట్ వంటివి వేసవి దెబ్బను తట్టుకునే శక్తినిస్తాయి. నీరు అధికంగా ఉండే సొరకాయ, టమాటా, దోసకాయ, పుచ్చకాయ ఎక్కువగా తీసుకోవాలి.
సొరకాయ అరికాళ్లకు రుద్దుకుంటే వేడితగ్గిపోతుందనీ, మొహం మీద కీరా దోసకాయ ముక్కలు పెట్టుకుంటే చలువనిస్తుందనీ, నుదుటి మీద మంచిగంధం రాసుకుంటే హాయిహాయిగా ఉంటుందనీ, రోజ్‌వాటర్‌ని రిఫ్రిజిరేటర్ ఐస్‌ట్రేలో పెట్టేసి ఆ ముక్కలతో ఒళ్లంతా రుద్దుకుంటే ఆనందమే ఆనందమనీ...చాలా చిట్కాలే ప్రచారంలో ఉన్నాయి. వీటివల్ల వేసవి సమస్యకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుందని చెప్పలేం కాని, ఎంతోకొంత ఉపశమనం లభిస్తుంది. |
ఆరోగ్యం జాగ్రత్త!వేసవిలో మనం ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఆ ప్రభావం ముందుగా చర్మం మీదే పడుతుంది. మిట్టమధ్యాహ్నాలు బయటికి వెళ్లకపోవడమే మంచిది. తప్పనిసరై వెళ్లాల్సి వచ్చినప్పుడు టోపీ, కళ్లజోడు వంటివి కొంత రక్షణనిస్తాయి. ఒంట్లో తగిన మోతాదులో నీళ్లు లేకపోవడం వల్ల కూడా చర్మం పొడిబారిపోతుంది. ఆభరణాలు ధరించేవారికి...మెడ చుట్టూ, ఉంగరం అడుగు భాగంలో చెమట కారణంగా కొన్నిరకాల అలర్జీలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. పరిశుభ్రత గురించి పట్టించుకోనివారికి ... చంకలు, తొడల మధ్య భాగంలో ఫంగస్, బాక్టీరియా చేరిపోవచ్చు. రోజూ రెండుపూటలా స్నానం చేయాలి. శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకోవాలి.ఎండాకాలం నీటికొరత తీవ్రంగా ఉంటుంది. అడుగూబొడుగు నీటిని కూడా నల్లాల్లో వదుల్తారు. దీని వల్ల...నీటికి సంబంధించిన వ్యాధులు రాజ్యమేలతాయి. వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా, టైఫాయిడ్ విజృంభించే ప్రమాదం ఉంటుంది. నీటి పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. కాచి వడపోసిన నీళ్లే తాగాలి. ఈరోజూ రేపూ అంటూ వాయిదా వేస్తున్నవారు...వ్యాయామం ప్రారంభించడానికి వేసవే సరైన సమయమంటారు ఫిట్‌నెస్ నిపుణులు. |
ఇంటికి రక్ష...ఇల్లంటే నాలుగు గోడలే కాదు. ఆ గోడల మధ్య నివసించే మనుషులూ ఆ మనుషుల తాలూకు ఆశలూ ఆశయాలూ! ఇల్లు భద్రంగా ఉంటే, మనుషులు సురక్షితంగా ఉంటారు. మనసూ నిశ్చింతగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, వేసవిలో ఇళ్లకూ వడదెబ్బలు తప్పవు. ఏప్రిల్, మేలలో చాలా ఇళ్లకు తాళాలు పడతాయి. ఎటూ సెలవులే కాబట్టి, వెళ్లినవారు వారంపదిరోజుల దాకా వచ్చే అవకాశమే ఉండదు. చోరాగ్రేసరులకు కావలసిందీ అదే. ఓ చీకటిరాత్రి తాళాలు పగులగొట్టి ఉన్నదంతా వూడ్చుకెళ్లిపోతారు. బస్సు దిగేసరికి ఇల్లు గుల్ల! అలా అని, పెళ్లిళ్లూ పర్యటనలూ మానుకోలేం. కాకపోతే, గడప దాటేముందు తగిన ఏర్పాట్లు చేసుకుంటే సరిపోతుంది.* బంగారం, వెండి, నగదు, డాక్యుమెంట్లు..బ్యాంకు లాకర్లో భద్రపరచాలి. విలువైన ఎలక్ట్రానిక్ ఉపకరణాల్ని...బంధువులకో స్నేహితులకో అప్పగించి వెళ్లడం సురక్షితం. * పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించడమూ మంచిదే. * డేగకళ్ల కెమేరాలూ చీమచిటుక్కుమన్నా 'కుయ్ కుయ్' అని మోగే అలారమ్ వ్యవస్థలూ మార్కెట్లో ఉన్నాయి. ధరలు కూడా అందుబాటులో లేనంత ఎక్కువేం కాదు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. ....ఇవన్నీ భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు. గృహ సంరక్షణ విషయంలోనూ కొన్ని ఏర్పాట్లు తప్పవు. * కుండీల్లోని చెత్తాచెదారాల్ని తీసుకెళ్లడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటారు. రెండ్రోజులు ఆగేసరికి కొండలా పేరుకు పోతుంది. దీంతో అగ్గిపుల్ల గీసి తగులబెట్టేస్తారు. వేసవి అగ్ని ప్రమాదాలకు ఈ నిప్పు రవ్వలు కూడా ఓ కారణమే. పరిసరాల్లో 'చెత్త దహనాలు' జరక్కుండా జాగ్రత్తపడాలి. అవసరమైతే, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. * 'షార్ట్ సర్క్యూట్స్' ఎప్పుడూ ఉండేవే. కాకపోతే, ఎండాకాలంలో వాటి తీవ్రత ఎక్కువ. వేసవి వేడి కారణంగా నష్టం అపారంగా ఉంటుంది. పాతబడిన కరెంటు వైర్లను వెంటనే మార్పించాలి. అవసరాన్ని బట్టి, ఉపకరణాలకు స్టెబిలైజర్లు బిగించాలి. * చాలామంది గృహబీమాకు ప్రాధాన్యం ఇవ్వరు. అదో దండుగమారి ఖర్చని భావిస్తారు. నిండామునిగాక కానీ తత్వం బోధపడదు. ప్రమాదాల నుంచీ దొంగతనాల నుంచీ బీమా రక్షణ చాలా అవసరం. |
అందానికి ఎండదెబ్బ!ఒకట్రెండు జాగ్రత్తలైనా తీసుకోకపోతే, వేసవి పూర్తయ్యేసరికి 'అందంగా లేనా, అస్సలేం బాలేనా..' అని బాధపడాల్సి వస్తుంది. అందంలో అంతర్లీనంగా ఆరోగ్యమూ దాగుంది. |
చర్మానికి సవాల్ఎండ చర్మానికి తొలిశత్రువు. ఏ కాస్త అశ్రద్ధచేసినా చర్మం నిగారింపును కోల్పోతుంది. కళావిహీనంగా తయారవుతుంది. సాధ్యమైనంత వరకూ మండుటెండ ప్రయాణాలు మానుకోవాలి. వెళ్లినా, తగిన జాగ్రత్తలతో బయటికెళ్లాలి. టోపీ లేదా గొడుగు తీసుకెళ్లాలి. సన్‌స్క్రీన్ లేదా సన్‌బ్లాక్ లోషన్లు చర్మానికి రక్షణ కవచాల్లా పనిచేస్తాయి. ఇలాంటి లోషన్లలో 35 నుంచి 45 శాతం సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్.పి.ఎఫ్) ఉండేలా చూడాలి. |
కేశాలూ క్లేశాలూసూర్యకిరణాల బారినపడితే జుత్తు దెబ్బతింటుంది. బయటికెళ్తున్నప్పుడు స్కార్ఫ్ కట్టుకోవడమో, టోపీ పెట్టుకోవడమో తప్పనిసరి. * అసలే వేడి, మళ్లీ హెయిర్ డ్రయర్లు ఎందుకు? వాటి వాడకాన్ని బాగా తగ్గించాలి. * వేడివేడి నీళ్లతో స్నానం వద్దు, తలస్నానం అసలే వద్దు. జుత్తు పొడిబారిపోకుండా వారానికి ఒకటిరెండుసార్లయినా నూనె రాసుకోవాలి. * స్విమ్మింగ్‌పూల్స్‌లోని నీళ్లలో క్లోరిన్ కలుపుతారు. క్లోరిన్ కేశసౌందర్యానికి శత్రువు. ఇంటికిరాగానే మంచి షాంపూతో తలస్నానం చేయడం మంచిది. |
వేసవి నేస్తాలుమామిడి: వేసవి అంటే చెమటలే. ఒంట్లోని సోడియం క్లోరైడ్ బయటికెళ్లిపోకుండా మామిడిలోని పోషక విలువలు అడ్డుకుంటాయి. విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. విరేచనాలు, అజీర్ణం, మలబద్ధకం వంటి వేసవి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.నిమ్మకాయ: విటమిన్-సి అపారం. రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఎండ వేడిమి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఆకలిని పెంచుతుంది. జీర్ణశక్తిని ప్రసాదిస్తుంది. శరీరంలోని చెడును తొలగిస్తుంది. పానీయంగానూ ఆస్వాదించవచ్చు.
నీరు: రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి ఆ మోతాదును పెంచుకోవచ్చు. నీరు చర్మంలోని తేమను కాపాడుతుంది. కాలుష్యాల్ని బయటికి పంపుతుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది. బయటికెళ్తున్నప్పుడు, నీళ్లసీసా తీసుకెళ్లడం మరచిపోకూడదు. దాహంగా అనిపించేదాకా ఆగక్కర్లేదు. తీరిక దొరికినప్పుడల్లా గొంతు తడుపుకోవడమే. మరీ చల్లని నీళ్లు మంచిది కాదు.
మజ్జిగ: ఇందులో ఆరోగ్యకరమైన బాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. పోషక విలువలు, విటమిన్ల తయారీలో ఇది ఉపయోగపడుతుంది. మజ్జిగ జీర్ణశక్తిని ఇస్తుంది. జావ, కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, జల్‌జీరా (జీలకర్ర నీళ్లు) వంటివి కూడా ఉత్తమం.
కొబ్బరి బొండాం: ప్రకృతి ప్రసాదించిన శీతలపానీయం! దప్పిక తీరిపోతుంది. అలసట గాలికెగిరిపోతుంది. జీర్ణశక్తిని పెంచడం మొదలుకొని మూత్రపిండాల్ని శుభ్రంచేయడం దాకా...బోలెడన్ని ఆరోగ్య సేవలు అందిస్తుంది. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే డీహైడ్రేషన్ సమస్య ఉండదు. |
పెద్దల సేవలో...వాతావరణంలో వచ్చే మార్పులు పండుటాకుల్ని ఇబ్బందిపెడతాయి. దీనికితోడు చెమటలూ విద్యుత్‌కోతలూ చికాకు తెప్పిస్తాయి. ఈ పరిస్థితుల్లో వయోధికుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత సంరక్షకులదే. * నడక అయినా, వ్యాహ్యాళి అయినా...ఉదయం ఎనిమిదింటిలోపే. సాయంత్రాలు ఎండ తీవ్రత తగ్గాకే. * కనీసం రెండు గంటలకు ఒకసారైనా పెద్దల్ని పలకరిస్తూ ఉండాలి. ఆఫీసులకు వెళ్లేవారు ఫోన్ ద్వారా పరామర్శించవచ్చు. * తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఎండ వేడిమికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్ ప్రభావమూ తీవ్రంగా ఉంటుంది. * ఎండ తీవ్రత కారణంగా...గుండెపోటు పెరగడం, రక్త ప్రసరణలో తేడాలు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణులను సంప్రదించాలి. 'ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్' ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలి. * పెద్దల్ని ఒంటరిగా వదిలి విహారయాత్రలకు వెళ్తున్నప్పుడు అవసరమైన మందులూ కూరగాయలూ పండ్లూ సమకూర్చి వెళ్లాలి. ఫ్యామిలీ డాక్టరు నంబరు అందుబాటులో ఉంచాలి. దోపిడీలూ దొంగతనాలూ సర్వసాధారణమైన పరిస్థితుల్లో...పెద్దల భద్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. * వయోధికుల్ని వేసవి యాత్రలకు తీసుకెళ్తున్నప్పుడు...అత్యవసర ఔషధాలు తప్పనిసరి. మరీ ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది. * పెద్దలు తొందరగా వడదెబ్బ బారినపడతారు. కుప్పకూలిన వ్యక్తి అపరిచితుడైనా సరే...ఆ పరిస్థితుల్లో సాయం అందించడం మన బాధ్యత. వెంటనే నీడకు తీసుకెళ్లండి. ధారాళంగా గాలిసోకే ప్రదేశంలో పడుకోబెట్టండి. తడిగుడ్డతో ఒళ్లంతా తుడవండి. కోలుకున్నాక, అడ్రస్ తెలుసుకుని ఇంట్లో వదిలేసి రండి. |
పిల్లల విషయంలో...
అసలే పసివాళ్లు. భానుడి ప్రతాపానికి చిగురుటాకుల్లా వణికిపోతారు. మండే ఎండలకు లేతమొగ్గల్లా కందిపోతారు. ఆటల్లో పడితే ఆకలి దప్పికలుండవు. ఎప్పుడు ఏం తినాలో, ఏం తినకూడదో తెలియని ఆ అమాయకులకు కన్నవారే దారిచూపాలి. గొడుగులా రక్షణనివ్వాలి.
* మధ్యాహ్నాలు ఇంట్లోనే ఆడుకోమని చెప్పాలి. మైదాన క్రీడలు సాయంత్రాలకే పరిమితం చేయాలి. కథల పుస్తకాలు, పజిల్స్ అందుబాటులో ఉంచాలి. మార్కెట్‌లో దొరికే ప్యాకేజీ ఆహారం జోలికెళ్లకుండా పుష్ఠికరమైన చిరుతిళ్లు చేసిపెట్టాలి. * నిపుణుల సంరక్షణ ఉన్న స్విమ్మింగ్‌పూల్స్‌కే పంపాలి. * రెండుపూట్లా శుభ్రంగా స్నానం చేయించాలి. * బయటి తిళ్లను ప్రోత్సహించకూడదు. అందులోనూ నిల్వ రుచులు, శీతలపానీయాలు అస్సలు మంచిది కాదు. కలుషిత జలాలతో చేసిన ఛాట్ రుచులు, సురక్షితంకాని ఐసుముక్కలు కలిపిన చెరుకురసాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. * వెంటబడి మరీ మంచినీళ్లు తాగించాలి. డీహైడ్రేషన్ బారినపడకుండా...పళ్లరసాలు, మజ్జిగ లాంటివి ఇస్తూ ఉండాలి. చెమట రూపంలో శరీరంలోని ఉప్పు బయటికి వెళ్లిపోతుంది కాబట్టి, మజ్జిగలో చిటికెడు ఉప్పు ఎక్కువైనా ఫర్వాలేదు. |
నేత్రారోగ్యంకళ్లు అందానికీ ఆరోగ్యానికీ సాక్షి సంతకాలు. చారడేసి ఉన్నా తామరపూలను తలపించినా...ఎండ వేడి తగలగానే మెరుపూ చురుకూ తగ్గిపోతుంది. అలసట ప్రస్ఫుటం అవుతుంది. నల్లచారలు ప్రత్యక్షం అవుతాయి. పరిస్థితి అంతదాకా రాకూడదనుకుంటే...నేత్రసౌందర్యాన్ని కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టాలి. కంటికి రక్ష చలువ కళ్లజోడు. నూటికినూరుశాతం అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడే రకాల్నే ఎంచుకోవాలి. |
వస్త్ర సౌందర్యంకాటన్కే తొలి ఓటు. బట్టలు వదులుగా ఉంటే మంచిది. లేతరంగులకే ప్రాధాన్యం. ఆఫీసుకెళ్లేవారు సాక్సు వాడకపోవడమే మంచిది. తప్పనిసరైతే సింథటిక్ సాక్సులే వాడాలి. కాటన్ వద్దు. ఎందుకంటే, కాటన్ సాక్సులు తేమను పట్టేసుకుంటాయి. కాళ్లచుట్టూ తేమ పోగవుతుంది. దుర్వాసనకూ అలర్జీలకూ కారణం అవుతుంది. |
మొక్కలకు మనమే దిక్కుకొందరికి మొక్కలంటే పిచ్చి. రెప్పల్లా కాపాడుకుంటారు. బిడ్డల్లా చూసుకుంటారు. ప్రాణానికి ప్రాణమైన మొక్కలు... వేసవి దెబ్బకు వాడిపోతుంటే, మనసు విలవిల్లాడిపోతుంది. ఏప్రిల్, మే మాసాల్లో మొక్కలకు ప్రత్యేక సంరక్షణ అవసరం. * ఏచిన్న తేడా కనిపించినా, నానా హైరానాపడిపోయి ఘాటైన రసాయనాలు పిచికారీ చేయడం మంచిపద్ధతి కాదు. నిజానికి వేసవిలో చీడపీడల సమస్య తక్కువ. అయినా కూడా ఏదైనా సమస్య ఉంటే, చల్లనివేళల్లో అదీ కొద్దిమోతాదులోనే మందులు వాడాలి. * మొక్కలకు నీరు సమృద్ధిగా అందేలా చూసుకోవాలి. అలా అని, బురదబురదగా ఉంటే .. వేళ్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. తగిన మోతాదులో నీళ్లు పెడితే చాలు. * మిగిలినవాటితో పోలిస్తే, పూల మొక్కలకు ఎండను తట్టుకునే శక్తి ఎక్కువ. * ఎండాకాలంలో మొక్కల్ని ఒక చోటి నుంచి మరో చోటికి తరలించే ప్రయత్నం వద్దు. పెకిలించిన మొక్కలు బతికే అవకాశాలు తక్కువ. * అలంకరణ మొక్కలు ఎండల్ని భరించలేవు. నీడలో ఉంచాలి. లేదంటే,తెరలు ఏర్పాటు చేయాలి. ఈ మధ్య షేడ్‌నెట్స్ ధరలు కాస్త తగ్గాయి. *వారంపదిరోజులు వేసవి యాత్రలకు వెళ్తున్నప్పుడు మొక్కల్ని ప్రేమించే బంధుమిత్రులకు వాటి బాధ్యత అప్పగించడం మంచిది. |
బండి భద్రం!వేసవి అంటే...ఎండలే కాదు, ప్రయాణాలూ! అప్పుడప్పుడూ లాంగ్ డ్రైవ్‌లు కూడా. బండి కండిషన్‌లో ఉన్నప్పుడే ప్రయాణం సురక్షితంగా సాగుతుంది. క్షేమంగా ఇంటికి తిరిగొస్తాం. ఎండాకాలం వాహన సంరక్షణ సూత్రాలివి... * కారైనా బైకైనా నీడపట్టున ఉంటేనే మంచిది. ఎండ వేడికి వాహనాలు రంగు వెలిసిపోతాయి. మెరుపు తగ్గిపోతుంది. మరీ తప్పనిసరి అయినప్పుడు వాటి మీద ముసుగు వేయడం తప్పనిసరి. * భారతీయ వాతావరణానికి తట్టుకునేలా రూపొందించినా, మండే ఎండల ప్రభావం విడిభాగాల పనితీరును ఎంతోకొంత దెబ్బతీస్తుంది. * మండుటెండలో సుదూర ప్రయాణం చేస్తున్నప్పుడు ... కార్లో అయితే యాభై యాభై అయిదు కిలోమీటర్లకు ఒకసారి, బైకు మీద అయితే ఇరవై అయిదు ముప్ఫై కిలోమీటర్లకు ఒకసారి బండికి కాస్త విశ్రాంతి ఇవ్వడం మంచిది. * మిట్ట మధ్యాహ్నం తారు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ వేడిమికి తారు కరిగిపోయి, వాహనం జారిపడే ప్రమాదం ఉంది. *చెమట కారణంగానో అసౌకర్యంగా ఉంటోందనో హెల్మెట్ తీసేయకండి. సౌకర్యం కంటే భద్రత ముఖ్యం. * ఐపాడ్, కెమెరా వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కార్లో ఉంచకండి. వాతావరణంలోని వేడికి అవి దెబ్బతినే ప్రమాదం ఉంది. *సాయంత్రాలు లేదా ఉదయం పూట మాత్రమే పెట్రోలు కొట్టించండి. ఎందుకంటే, వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇంధన ఉష్ణోగ్రత కూడా తక్కువగా ఉంటుంది. అంటే, సాంద్రత ఎక్కువగా ఉంటుందని అర్థం. ఎంతోకొంత అదనంగా ట్యాంకులో పడ్డట్టే. |
పెంపుడు జంతువులకు...నోరులేని మూగజీవాలు ఏం చెబుతాయి? మనమే అర్థంచేసుకోవాలి. సమయానికి అన్నీ సమకూర్చిపెట్టాలి. కుక్కలు మనలాగా చెమట కక్కవు. అందుకే, మనిషితో పోలిస్తే వాటి శరీర ఉష్ణోగ్రత ఎక్కువ. రెండుమూడు డిగ్రీలు తేడా వచ్చినా...విలవిల్లాడిపోతాయి. కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతాయి. వాటికి తగినంత నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. వేసవిలో తడి ఆహారాన్నివ్వడమూ మంచిదే. వాటి అలవాట్లలో ప్రవర్తనలో ఏ మాత్రం తేడా కనిపించినా, నిపుణుడిని సంప్రదించాలి. అది ఎండవేడిమి ప్రభావమే కావచ్చు. పిల్లుల్ని, పక్షుల్నీ ఎండకు వదిలేయడం మంచిది కాదు. వీలైతే, వాటి పంజరాల చుట్టూ, బోన్ల చుట్టూ తడిగుడ్డలు చుట్టాలి. ఫ్యాను గాలిలో మూగజీవాలకూ వాటా ఇవ్వాలి. |
వడదెబ్బ, మండుటెండలు, చెమటలు, రోగాలు, సమస్యలు - అనుకుంటే వేసవి నిజంగానే రాక్షసిలా కనిపిస్తుంది. చుట్టూ మంటలు ముసురుకుంటున్న భావన కలుగుతుంది. వేసవిలోని అందమైన కోణాన్ని గుర్తుచేసుకోండి. బోలెడన్ని సెలవులు, సకుటుంబ ప్రయాణాలు, మామిడిపండ్లు, తాటిముంజలు, గుండుమల్లెలు, అపురూప అతిథులు, చల్లని పానకాలు - తలుచుకుంటే ఎండాకాలం ఆత్మీయ నేస్తాన్ని తలపిస్తుంది. మండే సూర్యుడు వరాల దేవుడిలా అనిపిస్తాడు. ముళ్లున్నాయని గులాబీని బహిష్కరించలేం. ఎండలున్నాయని వేసవినీ తిరస్కరించలేం! ఒడుపుగా గులాబీని అందుకున్నట్టు... జాగ్రత్తగా వేసవిని ఆస్వాదించాలి! |
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి