Eenadu Ruchulu_1


మష్రూమ్‌ కుర్మా
కావల్సినవి:మష్రూమ్స్‌- రెండు కప్పులు, ఉల్లిపాయలు- రెండు, టమాటాలు- రెండు, అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా, కారం- రెండుచెంచాలు, మిరియాల పొడి- చెంచా, కొబ్బరిపాలు- అరకప్పు, పచ్చిమిర్చి- రెండు, ఉప్పు- తగినంత, కొత్తిమీర తురుము - కొద్దిగా నూనె- వేయించడానికి సరిపడా.తయారీ: మష్రూమ్స్‌ను చిన్న ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయ, టమాటాలను ముక్కలుగా తరగాలి.టమాటా ముక్కలు, సగం ఉల్లిపాయ ముక్కలు, మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి అందులో మిగిలిన ఉల్లిపాయ వేయించి అల్లం వెల్లులి ముద్ద, కారం, టమాటా ముద్ద వేయాలి. తరవాత మష్రూమ్‌ ముక్కలు కూడా వేసి బాగా కలియబెట్టాలి. కొద్దిసేపటికి అందులో కొబ్బరిపాలు, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి మూతపెట్టాలి. గ్రేవీ తయారయ్యాక కొత్తిమీర చల్లి దించేస్తే సరిపోతుంది. వేడివేడి మష్రూమ్‌ కుర్మాను పలావు, రోటీలతో కలిపి తీసుకుంటే ఆ రుచే వేరు.
-మేఘన, నిజామాబాద్‌




కరాచీ దోశ
కావలసినవి
బొంబాయిరవ్వ: కప్పు, మైదా: కప్పు, బియ్యప్పిండి: కప్పు, నూనె: టేబుల్‌స్పూను, ఆవాలు: ఒకటిన్నర టీస్పూన్లు, జీలకర్ర: టీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, అల్లంతురుము: టీస్పూను, పచ్చిమిర్చి: మూడు, కొత్తిమీర: టేబుల్‌స్పూన్లు, పుల్లటి పెరుగు: 2 టేబుల్‌స్పూన్లు, కరివేపాకు: 2 రెబ్బలు, ఉప్పు: తగినంత.
తయారుచేసే విధానం
రవ్వ, మైదా, బియ్యప్పిండి అన్నీ కలపాలి. తగినన్ని నీళ్లు పోసి ఉండలు కట్టకుండా మృదువుగా కలుపుకోవాలి. తరవాత ఉప్పు, పెరుగు కూడా వేసి కలపాలి.
విడిగా బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక వీటిని పిండిలో కలపాలి. 
తరవాత సన్నగా తరిగిన ఉల్లి, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని ఓ గంటసేపు నాననివ్వాలి. తరవాత పెనంమీద పలుచగా వేసి నూనె వేస్తూ కాల్చాలి.



టమాటా కోకోనట్‌ సూప్‌
కావల్సినవి:కొబ్బరి ముక్కలు- కప్పు, ఆవాలు- అరచెంచా, పంచదార- రెండు చెంచాలు ఇంగువ- చెంచా, టమాటా గుజ్జు- రెండు కప్పులు, పచ్చిమిర్చి- రెండు, గోరువెచ్చటి నీళ్లు- రెండుకప్పులు, కరివేపాకు- నాలుగు రెబ్బలు, ఉప్పు - రుచికి తగినంత, నూనె- చెంచా.తయారీ: పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి గింజలు తీసేయాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు వేయించి కరివేపాకు, ఇంగువ, టమాటా గుజ్జు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి. కొద్దిసేపయ్యాక గోరువెచ్చటి నీళ్లు పోసి మూతపెట్టాలి. టమాటాగుజ్జు దగ్గరగా అయ్యాక దింపేయాలి. చలారనిచ్చి మిక్సీలో వేయాలి. ఈ మిశ్ర మాన్ని మళ్లీ గిన్నెలో పోసి ఉప్పు, పంచదార వేసి ఐదునిమిషాలు మగ్గిస్తే టమాటా, కొబ్బరి సూప్‌ సిద్ధమయినట్టే.
- గంగరాజు సరోజ, హైదరాబాద్‌



మామిడి పెసర వడియాల కూర

కావల్సినవి: పెసర వడియాలు- కప్పున్నర, ఉల్లిపాయలు- రెండు, మామిడికాయ- ఒకటి, పచ్చిమిర్చి- ఆరు, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, కారం- అరచెంచా, నూనె- నాలుగు చెంచాలు.తయారీ: పెసర వడియాలను నూనెలో ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ చెక్కు తీసి సన్నగా తరగాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, పసుపు వేయాలి. అవి వేగాక మామిడి తురుము వేసుకోవాలి. కొద్దిసేపయ్యాక వడియాలు చేర్చి నీళ్లు పోసి మూత పెట్టాలి. మామిడి ముక్కలు, వడియాలు బాగా ఉడికాక ఉప్పు, కారం వేసి కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూర వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది.
- నెక్కంటి రమ్య


కొత్త రుచితో కొరమీను పులుసు
కావల్సినవి: బొచ్చె లేదా కొరమీను చేప - కేజీ; చిక్కని చింతపండు గుజ్జు - రెండు కప్పులు; ఉల్లిపాయలు - రెండు (సన్నగా తరగాలి); కారం, ధనియాలపొడి - నాలుగు చెంచాల చొప్పున; పసుపు - పావు చెంచా; ఉప్పు - రుచికి సరిపడా; నీళ్లు - రెండు కప్పులు; ఆవాలు - రెండు చెంచాలు; మెంతులు - చెంచా; వెల్లుల్లి పాయ - ఒకటి (రెబ్బలు తీసుకోవాలి మరీ మెత్తగా కాకుండా దంచుకోవాలి); కరివేపాకు రెమ్మలు - రెండు; టమాటా - ఒకటి (సన్నగా తరగాలి); నూనె - పావుకప్పు.
తయారీ: ఆవాలు, మెంతుల్ని నూనె లేకుండా వేయించి పొడిచేసిపెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో చింతపండు గుజ్జు, నీళ్లు, కారం, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు తీసుకుని కలపాలి. చేపను ముక్కల్లా చేసుకుని ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న వెడల్పు గిన్నె తీసుకుని నూనె వేడి చేసి దంచిన వెల్లుల్లి ముద్ద వేయించి.. ఆ తరవాత టమాటా ముక్కలు, కరివేపాకు రెమ్మలు వేయాలి. ఇందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు మిశ్రమం వేసి ఇరవై నుంచి ఇరవై అయిదు నిమిషాలు ఉడికించాలి. చింతపండు ఉడికి నూనె పైకి తేలిన తరవాత చేపముక్కలు చేర్చి మూత పెట్టేయాలి. ఐదునిమిషాలయ్యాక సిద్ధం చేసి పెట్టుకున్న పొడి చల్లాలి. చేపముక్కలు ఉడికేదాకా పొయ్యిమీద ఉంచి. దించేస్తే చాలు.. నోరూరించే చేపల పులుసు తయార్‌. దీని రుచిని పూర్తిగా ఆస్వాదించాలంటే.. నాలుగైదు గంటలయ్యాక అన్నం లేదా చపాతీలతో తిని చూడండి. ఇడ్లీ దోసెల్లోకి కూడా తీసుకోవచ్చు.




వన్నెల ఘుమఘుమలు
ఆకాశపు హరివిల్లుని... కురిసే రంగుల జల్లుని గుర్తుచేసుకొంటూ .. ఆరోగ్యకరమైన రంగుల మేళవింపుతో చేసిన మిఠాయిలను పిల్లల ముందుంచితే ఎగిరి గంతేసి తింటారు. ఇంటిల్లిపాదికీ మజామజా రుచుల పండగే! అంతేకాదు... ప్రత్యేక సందర్భాలు, పండగ వేళల్లో వాటిని వడ్డించవచ్చు.
వావ్‌! బీట్‌రూట్‌ లడ్డూ
కావల్సినవి: బీట్‌రూట్‌ తురుము - కప్పు, గింజల్లేని ఖర్జూరాలు - వంద గ్రా, తేనె - రెండు టేబుల్‌స్పూన్లు, బొంబాయి రవ్వ, పంచదార - టేబుల్‌స్పూను చొప్పున, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు, బాదం పలుకులు - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి - చెంచా.తయారీ: బీట్‌రూట్‌ తురుమును ఓ వస్త్రంలో వేసుకొని నీటిని పిండేయాలి. బాణలిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి డ్రైఫ్రూట్స్‌ను వేయించి తీసిపెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి వేసుకుని బీట్‌రూట్‌ తురుమును వేయించి తీసుకోవాలి. ఖర్జూరాలను మిక్సీలో వేసుకుని మరీ మెత్తగా కాకుండా మిశ్రమంలా చేసుకోవాలి. బొంబాయిరవ్వను కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ ఓ పాత్రలో తీసుకుని బాగా కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి. పైన బాదం, జీడిపప్పు పలుకుల్ని అలంకరిస్తే సరిపోతుంది. పసందైన బీట్‌రూట్‌ లడ్డూ సిద్ధం.
భలే భలే బఠాణీ బర్ఫీ
కావల్సినవి: పచ్చిబఠాణీలు - కప్పు, పంచదార - కప్పు, కోవా - వంద గ్రా, పాలు - కప్పు, కరిగించిన నెయ్యి - కప్పు, టూటీఫ్రూటీ పలుకులు - నాలుగు, జీడిపప్పు పలుకులు - పది. తయారీ: పచ్చిబఠాణీలు కుక్కరులో ఉడికించుకోవాలి. ఆ తరవాత నీళ్లు వంపేసి మెత్తని గుజ్జులా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తరవాత పంచదార చేర్చాలి. కరిగాక మరిగించి చలార్చిన పాలు, కోవాను ఒకదాని తరవాత ఒకటి వేయాలి. పాలన్నీ ఆవిరైపోయే దాకా మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక దింపేసి నెయ్యి రాసిన పళ్లెంలోకి మార్చుకోవాలి. నచ్చిన ఆకృతిలో బిళ్లల్లా కోసుకుని పైన టూటీఫ్రూటీ, జీడిపప్పు పలుకులు అలంకరిస్తే చాలు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే బఠాణీ బర్ఫీ తినడమే ఆలస్యం.
గోకేడ పద్మావతి, హైదరాబాద్‌
కమ్మని కార్న్‌్‌ఫ్లేక్స్‌ బార్స్‌
కావల్సినవి: కార్న్‌ఫ్లేక్స్‌, ఓట్స్‌ - ముప్పావు కప్పు చొప్పున, పంచదార - కప్పు, బాదం, జీడిపప్పు పలుకులు - అరకప్పు, నెయ్యి - కొద్దిగా.తయారీ: కార్న్‌ఫ్లేక్స్‌, ఓట్స్‌ను ఒకదాని తరవాత ఒకటి బాణలిలో దోరగా వేయించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి అడుగున్న పాత్రలో పంచదార, కాసిని నీళ్లు తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. పంచదార కరిగాక... ఓట్స్‌, కార్న్‌ఫ్లేక్స్‌ వేయాలి. మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. పంచదార కరిగి లేతపాకం వచ్చాక జీడిపప్పు, బాదంపలుకుల వేసి నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకోవాలి. బిళ్లల్లా కోసుకున్నాక.. గాలిచొరని డబ్బాలోకి మార్చుకుంటే.. నిల్వ ఉంటాయివి.
నిర్మలశ్యామ్‌సుందర్‌, హైదరాబాద్‌
పసందైన పాలరేకలు
కావల్సినవి: పాలు - మూడు కప్పులు, మైదా - కప్పు, పచ్చి కొబ్బరి తురుము - టేబుల్‌స్పూను, నెయ్యి - పావుకప్పు, యాలకులపొడి - చెంచా, బాదం, జీడిపప్పు పలుకులు - టేబల్‌స్పూను, పంచదార కప్పు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు - కొద్దిగా.తయారీ: పంచదారను తీగపాకం పట్టుకోవాలి. బాణలిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి కొబ్బరి తురుము, జీడిపప్పు బాదం పలుకుల్ని వేయించి తీసుకోవాలి. పాలల్లో మైదా వేసుకుని ఉండల్లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు పంచదార పాకంలో నెయ్యి, కొబ్బరి తురుము, డ్రైఫ్రూట్స్‌, యాలకుల పొడి చేర్చాలి. ఇప్పుడు ఓ వైపు పంచదార పాకాన్ని కలుపుతూ మైదా కలిపిన పాలను చేర్చాలి. మిగిలిన నెయ్యిని మధ్య మధ్య వేస్తుండాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక మూడు భాగాలుగా చేసుకొని రంగుల్ని కలపాలి. ఒక్కోభాగంలో ఒక్కో రంగు వేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యిరాసుకుని ఈ మిశ్రమాన్ని రేకల్లా చేసుకుని ఓ పళ్లెంలోకి తీసుకోవాలి.
ఎన్‌.అన్నపూర్ణ తిరుపతి.
నోరూరించే గులాబీ హల్వా
కావల్సినవి: తాజా ఎర్ర గులాబీలు - పది, పంచదార - రెండు కప్పులు, పాలు - కప్పు, యాలకులు - నాలుగు, జీడిపప్పు, ఎండుద్రాక్ష - తగినన్ని, నెయ్యి - పావుకప్పు. తయారీ: గులాబీ పువ్వుల నుంచి రేకల్ని విడదీసుకుని పెట్టుకోవాలి. పొయ్యి మీద దళసరి పాత్రను ఉంచి.. నెయ్యి వేయాలి. అది కరిగాక జీడిపప్పు, ఎండుద్రాక్షను వేయించి తీసుకోవాలి. అదే నెయ్యిలో గులాబీ రేకల్ని కూడా వేయించాలి. అవి కొద్దిగా వేగాక పాలు, పంచదార చేర్చి మంట తగ్గించాలి. పాలల్లో గులాబీరేకలు ఉడుకుతాయి. పంచదార కూడా పాకం వస్తుంది. మిశ్రమం కొద్దిగా దగ్గరగా అయ్యాక యాలకుల పొడి చల్లి పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకోవాలి. జీడిపప్పు, ఎండుద్రాక్ష అద్ది బిళ్లల్లా కోసుకుంటే సరిపోతుంది. ఈ హల్వా ఆరోగ్యానికి కూడా మంచిది.
కోటా సంతోషలక్ష్మి, హైదరాబా





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు