రాక్‌మెల్ట్‌ - The Browser (Eenadu Thursday 12/04/2012)



ఫేస్‌బుక్‌.. ట్విట్టర్‌.. జీమెయిల్‌.. యూట్యూబ్‌.. వెబ్‌ ఎఫ్‌ఎంలు.. వీడియో ఛానళ్లు.. వార్తలు.. వెబ్‌ సర్వీసులు! ఇలా ఒకటా రెండా... అన్నీ ఒకే బ్రౌజర్‌లో! అదే సరికొత్త 'రాక్‌మెల్ట్‌'
వెబ్‌ విహారానికి బ్రౌజరే వారధి. ఇప్పటి వరకూ ఫైర్‌ఫాక్స్‌, ఎక్స్‌ప్లోరర్‌, క్రోమ్‌, ఒపేరా... లాంటివే మనకు తెలుసు. వీటన్నిటికీ భిన్నంగా సరికొత్త అవతారంతో ముందుకొచ్చిందే రాక్‌మెల్ట్‌. దీన్ని బ్రౌజర్‌ అని పిలవకుండా 'వావ్‌!' అంటూ 'వావ్‌జర్‌' అని పిలుస్తున్నారు రూపకర్తలు. సోషల్‌ మీడియాని మరింత సులువుగా పొందేందుకు అనువుగా క్రోమియం ఓపెన్‌ సోర్స్‌ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. చెప్పాలంటే గూగుల్‌ క్రోమ్‌కి కొత్త వెర్షన్‌ అన్నమాట. క్రోమ్‌లో ఉన్న ఆప్షన్లతో పాటు అదనపు సౌకర్యాల్ని పొందుపరిచారు. అవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!అది ఉంటే సరి!
రాక్‌మెల్ట్‌ని వాడేందుకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో లాగిన్‌ అవ్వాల్సిందే. ఫేస్‌బుక్‌ని పూర్తిస్థాయిలో వాడుకునేలా అనుమతిస్తూ Allow చేయాలి. తర్వాత వచ్చే విండోలో విభాగాల వారీగా వెబ్‌ సర్వీసులు కనిపిస్తాయి. వాటిల్లో కావాల్సిన వాటిని ఎంపిక చేసుకుని Add and Continue క్లిక్‌ చేయాలి. వచ్చిన విండోలోని Invite and Startతో ఫేస్‌బుక్‌ స్నేహితులకు రాక్‌మెల్ట్‌ ఆహ్వానాన్ని పంపొచ్చు. సరికొత్త హోం పేజీతో బ్రౌజర్‌ సిద్ధం అవుతుంది. పై భాగంలో ఫేస్‌బుక్‌ ఫ్రొఫైల్‌ ఫొటో, మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ల ఐకాన్లతో ప్రత్యేక టూల్‌బార్‌ ఉంటుంది. ఫేస్‌బుక్‌లో మాదిరిగానే అప్‌డేట్స్‌ సమాచారమంతా ఇక్కడే చూడొచ్చు. ఆ పక్కనే వరుసగా ట్యాబ్‌ విండోలు. వాటితో క్రోమ్‌ బ్రౌజర్‌లోలానే వెబ్‌ విహారం చేయవచ్చు.
పంచడం భలే వీజీ!!
బ్రౌజింగ్‌లో తారసపడిన ఆసక్తికరమైన అంశాన్ని సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో పంచుకోవాలంటే ఇప్పటి వరకూ కొంచెం క్లిష్టమైన ప్రక్రియే. వాడుతున్న సోషల్‌ నెట్‌వర్క్‌లోకి లాగిన్‌ అయ్యాకగానీ షేర్‌ చేయలేం. అదే రాక్‌మెల్ట్‌లో ఒకే క్లిక్కుతో ఫేస్‌బుక్‌ వాల్‌పై పోస్టింగ్‌లు చేయవచ్చు. ట్యాబ్‌ విండోలో బ్రౌజ్‌ చేసిన అంశాన్ని అలాగే ఉంచి బ్రౌజర్‌ పై భాగంలో బాణం గుర్తుతో కనిపించే Share ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేస్తే సరి. ఫేస్‌బుక్‌లో మీ వాల్‌పై చేరిపోతుంది. అలాగే, ఫేస్‌బుక్‌ స్టేటస్‌ని మార్చాలంటే ప్రొఫైల్‌లోకి వెళ్లక్కర్లేదు. అడ్రస్‌బార్‌ పక్కన కనిపించే New Postతో స్టేటస్‌ని కంపోజ్‌ చేసి పెట్టుకోవచ్చు. లింక్స్‌ని ఎటాచ్‌ చేసే వీలుంది. బ్రౌజింగ్‌లో ఏదైనా అంశాన్ని తీరిగ్గా చూడాలనిపిస్తే ఎడమవైపు ఉన్న సైడ్‌బార్‌లోని View Laterఆప్షన్‌తో బ్యాక్‌అప్‌ చేసి పెట్టుకోవచ్చు. అందుకు ట్యాబ్‌ విండోల్లో చూడాలనుకునే అంశాన్ని ఓపెన్‌ చేసి వ్యూ లేటర్‌ గుర్తుని క్లిక్‌ చేయాలి. ఫేస్‌బుక్‌లో అంశాలే కాకుండా ఇతర వెబ్‌సైట్లు, వీడియోలు, చిత్రాలను కూడా దీంట్లో నమోదు చేసి ఖాళీ సమయంలో చూడొచ్చు.
చిటికెలో ఛాటింగ్‌
బ్రౌజర్‌లో ముఖ్యమైన సౌకర్యం ఛాటింగ్‌. ఓపెన్‌ చేయగానే కుడివైపు సైడ్‌ బార్‌లో ఫేస్‌బుక్‌ స్నేహితుల జాబితా కనిపిస్తుంది. దీంతో ట్యాబ్‌ విండోల్లో బ్రౌజింగ్‌ చేస్తూనే ఫేస్‌బుక్‌ స్నేహితులతో ఛాటింగ్‌ కొనసాగించొచ్చు. ప్రొఫైల్‌ ఫొటోపై క్లిక్‌ చేస్తే ఛాటింగ్‌ విండో వస్తుంది. దీన్ని మినిమైజ్‌ చేయవచ్చు కూడా. ప్రొఫైల్‌పై రైట్‌ క్లిక్‌ చేసి Open Profile intabతో స్నేహితుల ఫ్రొఫైల్స్‌ని కొత్త ట్యాబ్‌లో ఓపెన్‌ చేయవచ్చు. మెనూలోని Send Messageతో మెసేజ్‌ పంపే వీలుంది. కుడివైపు సైడ్‌బార్‌ కింది భాగంలోని బాణం గుర్తు Expand this edge క్లిక్‌ చేస్తే ఫ్రొఫైల్‌ ఫొటోలు పేరుతో పాటు కనిపిస్తాయి. దాంట్లోని Find a friendతో జాబితాలోని స్నేహితుల్ని వెతకొచ్చు. Invite Friend to useRockMeltతో ఒక్కొక్కరికీ ఆహ్వానాన్ని పంపొచ్చు.
అన్నీ ఒకే చోట
ఎడమవైపు సైడ్‌బార్‌లో డీఫాల్ట్‌గా ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌... లాంటివి కొన్ని వచ్చి చేరతాయి. కావాల్సిన వెబ్‌ సర్వీసుల్ని 'ప్లస్‌' గుర్తుతో యాడ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు నిత్యం వాడే జీమెయిల్‌ని సైడ్‌బార్‌లో పెట్టుకోవాలంటే ప్లస్‌గుర్తుపై క్లిక్‌ చేసి జాబితాలోని జీమెయిల్‌ సెలెక్ట్‌ చేసి Add App క్లిక్‌ చేయాలి. దీంతో జీమెయిల్‌ సైడ్‌బార్‌లో చేరిపోతుంది. ఎకౌంట్‌ వివరాలతో లాగిన్‌ అయ్యి మెయిల్‌ సర్వీసుని వాడుకోవచ్చు.RockMelt App Centerలో వందల వెబ్‌ సర్వీసుల్ని అందుబాటులో ఉంచారు. Culture and lifestyle, Fashion, Games, Humor, Industry News, Sports, Technology... ఇలా చాలానే ఉన్నాయి. విభాగాల వారీగా అప్లికేషన్‌ సెంటర్‌లో వందల్లో పొందుపరిచారు. అదనంగా కావాలనుకుంటేMoreమెనూలోకి వెళ్లి యాడ్‌ చేసుకోవచ్చు.
ఒక్కటే మెనూ!
క్రోమ్‌లో మాదిరిగానే ఒక్కటే మెనూని ఏర్పాటు చేశారు. అదే రాక్‌మెల్ట్‌ మెనూ.
బ్రౌజర్‌లో కుడివైపు ఛాటింగ్‌ సైడ్‌బార్‌ (Friend Edge),ఎడమవైపు అప్లికేషన్‌ సైడ్‌బార్‌ (App Edge) వద్దనుకుంటే మెనూబార్‌ నుంచి తీసేయవచ్చు. అందుకు RockMelt-> Edges-> App Edge, Friend Edgeలోకి వెళ్లి ఆన్‌చెక్‌ చేయాలి.
ప్రైవేటు బ్రౌజింగ్‌ కోసం incognito windowపై క్లిక్‌ చేయాలి.
ఫేస్‌బుక్‌ ఛాటింగ్‌ స్టేటస్‌ని Available, Offlineలోకి మార్చేందుకు 'ఛాట్‌ స్టేటస్‌'ని సెలెక్ట్‌ చేయాలి. హిస్టరీ, డౌన్‌లోడ్స్‌, ఆప్షన్స్‌ కూడా క్రోమ్‌లానే ఉంటాయి. హోం పేజీ, ట్యాబ్స్‌, ఎక్స్‌టెన్షన్స్‌ని నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు.
సైడ్‌బార్‌లు, ప్రొఫైల్‌ ఫొటోలు... లాంటివి లేకుండా సాధారణ క్రోమ్‌ బ్రౌజర్‌ మాదిరిగా రాక్‌మెల్ట్‌ని మార్చేయాలంటే అడ్రస్‌బార్‌ పక్కన కనిపించే బెల్‌ గుర్తుEnter Quiet Modeపై క్లిక్‌ చేయాలి. * కొత్త ట్యాబ్‌ని ఓపెన్‌ చేస్తే స్పీడ్‌ డయల్‌ ట్యాబ్‌ విండోలతో పాటు ఫేస్‌బుక్‌ స్నేహితుల ఫ్రొఫైల్స్‌ కనిపిస్తాయి. Inviteతో ఆహ్వానాన్ని పంపొచ్చు.
మరికొన్ని...
బ్రౌజర్‌ నిర్వహణ, సెట్టింగ్స్‌, ఆప్షన్స్‌ అన్నీ గూగుల్‌ క్రోమ్‌లాగానే పొందుపరిచారు. అదనపు సౌకర్యాల్ని అందించే 'ఎక్స్‌టెన్షన్స్‌'ని వెబ్‌స్టోర్‌ నుంచి పొందే వీలుంది. క్రోమ్‌లో సపోర్ట్‌ చేసే ఎక్స్‌టెన్షన్స్‌ అన్నీ రాక్‌మెల్ట్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడొచ్చు.
ఎడమవైపు సైడ్‌బార్‌లో అక్కర్లేని అప్లికేషన్స్‌ని తొలగించాలంటే ఐకాన్‌ గుర్తుపై రైట్‌క్లిక్‌ చేసి Deleteను క్లిక్‌ చేయండి.
డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు www.rockmelt.com
- బొల్లంపల్లి వేణుగోపాల్‌, (న్యూస్‌టుడే-హైదరాబాద్‌)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు