మహాయాగం అతిరాత్రం
నాలుగువేల ఏళ్ల పూర్వం నుంచీ మనదేశంలోని కేరళ రాష్ట్రంలో మాత్రమే నిర్వహిస్తూ వస్తున్న ఉత్కృష్ట సోమయాగం అతిరాత్రం. విశ్వశాంతి, పర్యావరణ పరిరక్షణకోసం చేసే ఈ యాగాన్ని మొదటిసారి మనరాష్ట్రంలో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకూ భద్రాచలంలో జరిగే ఈ మహాయాగ విశేషాలు...వేదాలకు సంబంధించిన మూలగ్రంథాల్లో పేర్కొన్న ఒక అతిప్రాచీన, సంక్లిష్టమైన కర్మకాండే అతిరాత్రం. పన్నెండు రోజులపాటు అహోరాత్రాలూ అగ్నిహోమంతో నిర్వహించే అతిరాత్రం ప్రస్తావన... వాల్మీకి రామాయణం బాలకాండ 14వ సర్గలో కనిపిస్తుంది.
అతిరాత్రం ఇప్పటికీ ఉందంటే అందుకు కారణం కేరళలోని నంబూద్రి బ్రాహ్మణులే. వైదిక ఆచారాలు అంతరించిపోకుండా వీళ్లు కాపాడుకుంటూ వస్తున్నారు. గతంలో 1901, 1918, 1956, 1975, 2011లలో దీన్ని నిర్వహించారు. ప్రస్తుతం మనరాష్ట్రంలో భద్రాచలం సమీపంలోని ఎటపాక జటాయువు మండపం దగ్గర 12 రోజులపాటు నిర్వహిస్తున్నారు.
ఈ యాగానికి యజమాని, ప్రధాన పూజారి కేరళకు చెందిన నారాయణన్ సోమయాజి. జైమినీ సామవేదంలో దిట్టలు, ఘనాపాఠీలు; రుగ్, యజుర్వేదాలను ఔపోసన పట్టిన కృష్ణన్ నంబూద్రి, కడలూర్ దాస్ నంబూద్రి అనే వైదిక పండితులు... అతిరాత్రాన్ని నిరాటంకంగా జరిపించేందుకు గత ఆరు నెలలుగా దీక్షలో కూర్చున్నారు.
సమతాలోక్ సేవా సమితి ఆధ్వర్యంలో...
హైదరాబాద్‌కు చెందిన పండితులు హరిహరనాథశర్మ, ఆయన కుమారుడు రాజశేఖరశర్మ సమతాలోక్ సేవాసమితిని ఏర్పాటుచేశారు. వైదిక ఆచారాల పరిరక్షణే దీని ధ్యేయం. వాళ్లిద్దరూ గతేడాది కేరళ వెళ్లి, పంజాల్‌లో జరిగిన అతిరాత్రం యాగాన్ని పరిశీలించారు. అక్కణ్ణుంచి వచ్చాక మన రాష్ట్రంలోనూ దీన్ని నిర్వహించాలనుకున్నారు. హరిహరనాథశర్మకు ఇప్పటికే 16 స్మార్త యాగాలను నిర్వహించిన అనుభవం ఉంది.
హైదరాబాద్‌కు చెందిన పండితులు హరిహరనాథశర్మ, ఆయన కుమారుడు రాజశేఖరశర్మ సమతాలోక్ సేవాసమితిని ఏర్పాటుచేశారు. వైదిక ఆచారాల పరిరక్షణే దీని ధ్యేయం. వాళ్లిద్దరూ గతేడాది కేరళ వెళ్లి, పంజాల్‌లో జరిగిన అతిరాత్రం యాగాన్ని పరిశీలించారు. అక్కణ్ణుంచి వచ్చాక మన రాష్ట్రంలోనూ దీన్ని నిర్వహించాలనుకున్నారు. హరిహరనాథశర్మకు ఇప్పటికే 16 స్మార్త యాగాలను నిర్వహించిన అనుభవం ఉంది.
'ఎనిమిదేళ్లలోపు ఉపనయనం జరిగి, 14 ఏళ్లలోపు వివాహమై (పెళ్లినాటికి వధువు రజస్వల కాకుండా ఉండాలి), అప్పట్నుంచి నిత్యం ఉపాసన చేస్తున్నవాళ్లే ఈ యాగాన్ని చేస్తారు. ఇలాంటివాళ్లు అయిదుగురున్నారు' అంటారు హరిహరనాథ శర్మ.
యజ్ఞ నిర్వహణకు భద్రాచలం దేవాలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కె.పాండురంగారావు తాత్కాలిక ప్రాతిపదికన 50 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. పనిముట్లను, ఇటుకలను కేరళలో లభ్యమయ్యే కట్టెలతో తయారుచేశారు. ఈ యాగాన్ని చూడటానికి దేశవిదేశాలనుంచి సుమారు పదిలక్షలమంది భక్తులు వస్తున్నారు. వారికోసం స్నానాలకు చెరువులు, మరుగుదొడ్లు, వైద్యశిబిరాలు, పోలీసు భద్రత... ఇలా అన్ని సౌకర్యాలూ ఏర్పాటుచేశారు. రోజూ మధ్యాహ్నం యాభైవేలమందికి, సాయంత్రం అయిదువేలమందికి ఉచిత భోజనం ఉంటుంది. వీటన్నింటికీ దాదాపు రూ.12 కోట్లు ఖర్చుచేస్తున్నారు.
యాగంలో మొదటిరోజున యజమాని... ప్రత్యేకంగా బంకమట్టితో తయారుచేసిన మూడు కుండలలో పవిత్రమైన అగ్నిని నింపుకుని యాగవాటికలోకి ప్రవేశిస్తాడు. వాయుదేవుడికి పిష్టబలి (పిండితో చేసిన జంతువు బొమ్మను బలి ఇవ్వడం) ఇస్తారు. ఆ తరవాత... పూజకోసం అయిదుగురు ప్రధాన పూజారులను ఎంపికచేస్తారు. వైదిక గ్రంథాల్లో చెప్పిన రెండు రకాల కట్టెలను రాపిడి చేసి నిప్పు పుట్టిస్తారు. యజమాని తలకు తలపాగా కడతారు. ఈ పన్నెండు రోజులూ అతడు మౌనంగా, పిడికిళ్లు బిగించి ఉండాలి. మంత్రాలు చదివేటప్పుడు నోరు, కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు పిడికిళ్లు తెరవొచ్చు.
రెండో రోజున బంకమట్టితో కుండను, మూడోరోజున ఒక స్తంభాన్ని తయారుచేస్తారు. మహావేదిగా పిలిచే యజ్ఞవాటికలో పిష్టబలి ఇవ్వడానికి... పక్షి ఆకారంలో ఉండే బలిపీఠం నమూనాను తయారుచేస్తారు. ఇంద్రుణ్ణి యాగానికి ఆహ్వానించే ప్రక్రియ నాలుగోరోజున జరుగుతుంది. మహావేది ప్రదేశాన్ని నాగలితో దున్ని, అందులో విత్తనాలు చల్లి మొదటిరోజు చేసిన కుండను భూమిలో పాతిపెడతారు. గరుడపక్షి ఆకారంలో ఉండే బలిపీఠం నిర్మాణం మొదలవుతుంది. నాలుగురోజులపాటు ఈ నిర్మాణం జరుగుతుంది. మరోపక్క రాత్రుళ్లు అగ్నిహోత్రాన్నీ నిర్వహిస్తుంటారు. ఎనిమిదో రోజున బలిపీఠంలో మరో అంతస్తు నిర్మిస్తారు. దానికి వాడిన ఇటుకలు గోవులుగా మారాలని యజమాని ప్రార్థిస్తాడు. తొమ్మిదోరోజున... అంతవరకూ ఉపయోగించిన పనిముట్లను బలిపీఠంలో మానవాకారంలో పేరుస్తారు. అక్కడ అగ్నిని ఉంచి, మంత్రోచ్చారణల మధ్య అగ్నిహోమంలో ఆజ్యంపోస్తూ యాగాన్ని నిర్వహిస్తారు. తరవాత పిష్టబలి ఇస్తారు. చివరి మూడురోజులూ రాత్రింబవళ్లూ యాగం కొనసాగుతుంది. పదోరోజున యజమాని పూజారులతో కలిసి బలిపీఠం చుట్టూ పాములా తిరగాలి. 11 పిష్టలను బలిస్తారు. కేరళ అడవుల్నుంచి తీసుకొచ్చిన మొక్కలతో పదకొండో రోజున సోమరసం తయారుచేస్తారు. దీంతో ఆహుతి ఇస్తారు. పన్నెండో రోజున యజమాని భార్యా సమేతంగా స్నానం చేసి, పిష్టబలి ఇవ్వాలి. తరవాత ఇంటికొచ్చి మూడుచోట్ల అగ్నిని పేర్చి ఆ అగ్నిహోత్రాన్ని జీవితాంతం మండిస్తూనే ఉండాలి. అలా అతిరాత్రం పూర్తవుతుంది.
'దీనివల్ల యాగప్రాంతంలో మొక్కలు, పంటలు మూడు రెట్లు పెరుగుతాయి. ఇప్పటికే కేరళలో ఈ విషయం రుజువైంది. శాస్త్రవేత్తలు కూడా దీనికి హాజరై పరిశోధనలు చేస్తున్నారు' అంటారు మూడుసార్లు అతిరాత్రం నిర్వహించిన శివకరణ్ నంబూద్రి.
- బచ్చలకూర వెంకన్న, న్యూస్‌టుడే, ఖమ్మం డె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి