Eenadu eetaram (07/04/2012)
అనుకోని అలుపు... అధిగమిస్తే గెలుపు! సంతోషాల్ని జుర్రుకునే ప్రాయంలో పరధ్యానం... కళ్లెంలేని గుర్రంలా దూసుకెళ్లాల్సిన చోట గెలుపుపై అపోహ... సాధ్యంకాని లక్ష్యాలతో కొత్త చిక్కులు... ప్రేమకి దూరం... పెళ్లంటేనే జడుపు... అన్నీ వెరిసి ఇరవైల్లోనే అరవై భావన... తమ ఆనందాన్ని తామే చిదిమేసుకునే... మానసిక సంక్షోభం! అదే 'క్వార్టర్ లైఫ్ క్రైసిస్'! కుర్రకారును వేధిస్తున్న వింత సమస్య... దీన్ని ఎలా ఎదుర్కోవాలి? నిపుణులతో సూచనలిప్పిస్తోంది 'ఈతరం'.
మౌనిమ, వినయ్ ఇద్దరూ క్వార్టర్ లైఫ్ క్రైసిస్ బాధితులే.
ఇది కేవలం పాతికేళ్ల యువతకే పరిమితం కాదు. 'డిగ్రీ పట్టా పుచ్చుకున్న కుర్రాడి నుంచి ముప్ఫై అయిదేళ్ల యువత వరకూ అంతా బాధితులే' అంటాడు లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్‌విచ్ పరిశోధకుడు డాక్టర్ ఒలివర్ రాబిన్సన్. చదువైపోగానే ఉద్యోగం సంపాదించడం... వెనువెంటనే విజయాల నిచ్చెన ఎక్కేయాలని కలలు కనడం... అవి చేరలేక ఒత్తిడితో గిలగిలలాడటం... ఇవీ బాధితుల లక్షణాలు. చిన్నచిన్న వైఫల్యాలకే కుంగిపోతుంటారు. తమ సత్తాపై తమకే అనుమానం. చేతకాని వాడినన్న సందేహం. జీవితంలో స్థిరపడలేదన్న సాకుతో పెళ్లిని సైతం వాయిదా వేసే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్యా తక్కువేం కాదు. ప్రేమలు, బంధాలు, అనుబంధాలు వీరికి పడని విషయాలు. ఆర్థిక విషయాలు, కెరీర్‌కే అధిక ప్రాధాన్యం. దాంట్లోనైనా సంతృప్తి ఉంటుందా, అంటే అదీ లేదు. చేసే ఉద్యోగం నచ్చదు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎత్తుకు ఎదగాలనే అత్యాశ. ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లని చూసి పదేపదే కుమిలిపోతుంటారు. ఇరవై మూడున్నర గంటలూ ఈ ఆలోచనలే. వెరసి ఈ మానసిక సంఘర్షణ ఒక్కోసారి ఆత్మహత్యలకు పురికొల్పవచ్చు.
హుషారుతో ఉరకలెత్తాల్సిన యువతరానికి ఎందుకీ పరిస్థితి? అంటే బోలెడు సాకులు. 'మన యూనివర్సిటీలు డిగ్రీ పట్టాలైతే కట్టబెడుతున్నాయి గానీ వృత్తిలో రాణించడానికి ఉపయోగపడే నైపుణ్యాలు నేర్పడం లేదు. ఉన్నతాధికారులు, సహోద్యోగులతో ఎలా మసలుకోవాలో వాళ్లకి తెలియదు. ఇలాంటపుడు ఉద్యోగులు ఒత్తిడిలో కూరుకోక ఏం చేస్తారు?'... ఇదీ క్లినికల్ సైకాలజిస్టు డాక్టర్ నిరంజన్‌రెడ్డి అభిప్రాయం. అయితే ఈ భావాల వెల్లువలు, మానసిక అంతస్సంఘర్షణలు ఒక్కోసారి విజయానికీ బాటలు పరుస్తాయి అంటారాయన. 'పుట్టుకతో వచ్చిన వ్యక్తిత్వం, పెరిగిన వాతావరణ పరిస్థితులూ ఇలాంటి బలహీన వ్యక్తుల్ని తయారు చేస్తాయ'ంటాడు రాబిన్సన్. నిజానికి చదువు పూర్త్తెన యువత తొలిమెట్టుపై ఉంటారు. ఎదగడానికి బోలెడంత సమయముంటుంది. కానీ తక్కువ సమయంలోనే ఎత్తుకు ఎదగాలనుకోవడంతోనే వస్తుంది చిక్కంతా. తరుముకొచ్చే లక్ష్యాలు... పెళ్లి ఒత్తిళ్లు... కొత్తగా పెళ్త్లెతే వచ్చే అదనపు బాధ్యతలు... ఇతరులతో పోల్చి చూసుకోవడం... ఒత్తిడి సంక్షోభంగా మారడానికి కారణమవుతాయి.
* పోలికలు: నా క్లాస్‌మేట్‌కి మంచి ఉద్యోగమొచ్చింది. నా వయసు ఉన్నవాడు బాగా స్థిరపడ్డాడు. ఇలాంటి పోలికలు మనసును గాయపరుస్తాయి. * ఆలోచనలు: ప్రతి పనికీ మెచ్చుకోలు, విమర్శలుంటాయి. సద్విమర్శను స్వాగతించండి. దురుద్దేశపూర్వక విమర్శలు పట్టించుకోవాల్సిన పన్లేదు. * అనుమతి: అమ్మ డాక్టర్ కావాలంటుంది. నాన్నకు ఇంజినీర్ అవ్వాలని కోరిక. కానీ నీ సత్తా ఏంటో నీకు తెలుసు. నీ భావాలు వాళ్లకి అర్థమయ్యేలా చెబుతూనే సొంత నిర్ణయాలు తీసుకోవాలి. * నిర్ణయం: వెల్లువలా వచ్చిపడే అవకాశాల్లో ఒక్కోసారి దేన్ని ఎంచుకోవాలో తెలియదు. అప్పుడు నీ నిర్ణయమే నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. లక్ష్యం ముందే నిర్ణయమైతే ఏ బాధలుండవు. * తప్పులు: తప్పులు చేయకుండా ఎవరూ విజేత కాలేరు. అవి లక్ష్య సాధనకి దగ్గర చేసే అనుభవాల మెట్లు. * మార్పు: జీవితాంతం ఒకే ఉద్యోగం చేయాలనే నియమం లేదు. పరిస్థితిని తిట్టుకుంటూ ఉండే బదులు తప్పుకుపోవడమే ఉత్తమం. |
*నలుగురిలో కలవలేకపోవడం *బలవంతపు బ్రహ్మచర్యం *పనిలో అసంతృప్తి *ఆర్థిక చిక్కులు *ఏకాంతం కోరుకోవడం *ఆత్మహత్య ఆలోచనలు *తనపై తను నమ్మకం కోల్పోవడం *విజయాల్ని ఆస్వాదించలేకపోవడం |
- డాక్టర్ నిరంజన్‌రెడ్డి, క్లినికల్ సైకాలజిస్టు
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి