Eenadu Eetaram (12/05/2012)


రోబో మెరిసెన్‌... ప్రశంసలు కురిసెన్‌!
ఐదుగురు ఇంజినీరింగ్‌ కుర్రాళ్లు... ఆశయం ఒకటే... దేశానికి ఉపయోగపడాలని! ముంబై దాడుల నేపథ్యంలో అది మరింత పదునెక్కింది... ఇలాంటి సంఘటనలకు పరిష్కారం చూపాలనుకున్నారు... ఏడాదిన్నరలో ఓ రోబో తయారు చేశారు! డీఆర్‌డీవో శాస్త్రవేత్తలనే మెప్పించారు!! దీని కోసం... కొలువుల్ని వదులుకున్నారు... సరదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు... ఆ స్ఫూర్తిగాథని 'ఈతరం'తో పంచుకున్నారు!
'కుర్ర వయసులో సరదాలను వదులుకోవడం కష్టమే. కానీ అవన్నీ తాత్కాలికం. అనుకున్నది సాధించాక కలిగే ఆనందం ముందు అవెంత?' అనే ఆ కుర్రాళ్ల మాటలు ఆషామాషీగా చెప్పినవేమీ కావు. ఆ ఆనందాన్ని స్వయంగా అనుభవించి ఆత్మవిశ్వాసంతో చెప్పినవే. వాళ్లు అనుకున్నది కూడా చిన్న లక్ష్యమేం కాదు. దేశానికే ఉపయోగపడే గొప్ప ఆలోచనకు రూపం. అందుకే వాళ్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) శాస్త్రవేత్తలనే మెప్పించారు. తమ ప్రాజెక్ట్‌కు నిధులు అందుకోవడమే కాదు, దానికి కొనసాగింపుగా మరో కొత్త ప్రాజెక్ట్‌కు అనుమతి పొందారు. దేశంలో ఉగ్రవాద చర్యల నివారణలో తన వంతు సాయం చేసే రోబో రూపకల్పనతో వాళ్లిదంతా సాధించారు! వాళ్లే యువ ఇంజినీర్లు పి. భరత్‌, జి. రమేశ్‌బాబు, జి. హరీశ్‌కుమార్‌ రెడ్డి, వి. సాయిరాహుల్‌, డి. వినయ్‌కుమార్‌లు. ఏడాది కిందట వాళ్లు గుత్తిలోని గేట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థులు. ఇప్పుడు బాధ్యతాయుతమైన పనిలో నిమగ్నమైన యువ శాస్త్రవేత్తలు.కలతలోంచి పుట్టిన ఆలోచన!
2008లో ముంబైపై దాడి చేసిన కొద్ది మంది తీవ్రవాదులు, వందలాది మంది ప్రాణాలను పొట్టన బెట్టుకున్నారు. దేశమంతా భయోత్పాతాన్ని సృష్టించారు. వారిని ఎదుర్కొనే ఆపరేషన్‌లో మెరికల్లాంటి అధికారులు, సైనికుల్ని కోల్పోయాం. ఈ సంఘటన ఇంజినీరింగ్‌ విద్యార్థి భరత్‌ని కదిలించింది. 'ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శత్రువుల ఆనుపానులు ముందే తెలిస్తే ప్రాణనష్టం తప్పేదిగా?' అనుకున్నాడు. అలా కనిపెట్టే ఓ రోబోను తయారు చేయాలనుకున్నాడు. ఈ ఆలోచనని మిత్రులతో చెబితే 'మేమూ జత కలుస్తాం' అన్నారు. కాలేజీ యాజమాన్యమూ వెన్నుతట్టింది. కొందరి సాయంతో నేరుగా హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అధికారుల్ని కలిశారు.
మెప్పించారు
యువ బృందం ఆలోచన అధికారులకి నచ్చింది కానీ, 'మీరేం చేయబోతున్నారో వివరించేలా పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వండి' అన్నారు. ఎదురుగా ఉన్నది గొప్ప శాస్త్రవేత్త వి.కె. సారస్వత్‌. ఆ ఉద్వేగంలో చెప్పాలనుకన్నది సరిగా చెప్పలేకపోయారు. మొదటి ప్రయత్నం విఫలం. 'మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇంకో రోజు టైమిస్తున్నా' అన్నారు సారస్వత్‌. ప్రాణం లేచొచ్చింది. పద్దెనిమిది గంటలు కష్టపడ్డారు. ఈసారి అదిరిపోయే ప్రెజెంటేషన్‌. కుర్రాళ్ల పట్టుదలకి సారస్వత్‌ మురిసిపోయారు. 'ఖర్చులన్నీ మావే. ప్రాజెక్టు మొదలుపెట్టండి' అని అభయమిచ్చారు.
అడుగడుగునా అవాంతరాలు!
కాలేజీ స్టోర్‌ రూం దుమ్ము దులిపి ప్రయోగశాలగా మార్చేశారు. సాయంత్రం దాకా క్లాసులు. తెల్లవారేదాకా పనితో కుస్తీ. డిజైనింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ రాయడం, కావాల్సిన పరికరాలు తెప్పించడం... ఒక్కొక్కరిది ఒక్కో బాధ్యత. రోబో డిజైన్‌ కోసమే నెలలు పట్టింది. ముడి విభాగాలకు ఆర్డర్లిచ్చారు. అప్పుడే చైనాలో కొత్త సంవత్సరం సెలవులు. ఇరవై రోజులు ఆలస్యమైంది. మరోవైపు తరుముతున్న టార్గెట్‌. మధ్యలో రోబోకి ప్రాణమైన ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్‌ మొరాయించింది. తయారీ ఓ కొలిక్కి రాగానే సాఫ్ట్‌వేర్‌ హార్డ్‌డిస్క్‌ కరప్ట్‌ అయింది. మళ్లీ మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇలా ఎన్నో అవాంతరాలు ఎదురైనా, ఏడాదిన్నరలో అనుకున్నది సాధించారు. ఈ సమయంలో కాలేజీలోనే తిండి, పడక. సరదాలు, సినిమాల్లేవు. ఇష్టమైన క్రికెట్‌ వదిలేశారు. అనారోగ్యం బారినపడ్డారు. అయినా దేశానికి ఉపయోగపడే ఓ క్రతువులో భాగస్వాములం అవుతున్నామనే ఆలోచనతో దేన్నీ లెక్క చేయలేదు. మధ్యలో నలుగురికి క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలొచ్చాయి. తమ కలల ప్రాజెక్టు కోసం వాటినీ వదులుకున్నారు. 'ప్రయత్నిస్తే ఇంకో ఉద్యోగం దొరుకుతుంది. దేశానికి సేవ చేసే అవకాశం మళ్లీ రాదు' అని తల్లిదండ్రుల్ని ఒప్పించారు.శత్రువు ఆటకట్టు
ఈ నమూనా రోబో తయారైతే ఒక బలమైన సాంకేతిక ఆయుధం మన చేతిలో ఉన్నట్టే. దీంతో శత్రువుపై తేలికగా దాడి చేయొచ్చు. కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌కి అనుగుణంగా రోబో పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌లోని ప్రోగ్రామ్‌ ఆజ్ఞల్ని వైర్‌లెస్‌ టవర్‌ సాయంతో రోబోలోని ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్‌కి స్వీకరిస్తుంది. అప్పుడు ఎటు కావాలంటే అటువైపు రోబోని నడిపించవచ్చు. ఈ కదలికలు ల్యాప్‌టాప్‌లో వీడియో రూపంలో కనిపిస్తాయి. రోబోకి అమర్చిన కెమెరాతో ఎదురుగా ఏముందో తెలిసిపోతుంది. దీంతో తీవ్రవాదులు ఏ మూలన దాక్కున్నా తేలిగ్గా పట్టేయొచ్చు. కేవలం ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడానికే కాదు అగ్నిప్రమాదం, భూకంపం లాంటి ప్రమాదాల్లోనూ ఈ రోబో సాయ పడుతుంది. ఎదురుగా ఏవైనా అడ్డంకులుంటే సులువుగా దాటుకుంటూ వెళ్లడానికి ఫోమ్‌ టైర్స్‌ వాడారు. బ్యాటరీతో కావాల్సిన శక్తి అందుతుంది.
మొదటి ప్రయత్నం సఫలం కావడంతో మిత్ర బృందంపై డీఆర్‌డీవో అధికారులకు నమ్మకం పెరిగింది. ఈసారి దీన్నే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల రోబోగా మలచమని మరో బాధ్యత అప్పజెప్పారు. ఉత్సాహంగా స్పందించిన మిత్రబృందం మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. 'ఇంజినీరింగ్‌ కాగానే అందరిలా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో చేరడమంటే మాకు బోర్‌. కఠినమైన లక్ష్యం, దేశానికి సాయపడటం ఇవే మాకిష్టం. అందుకే ఇందులోనే మా భవిష్యత్తు' అంటున్నారు ధీమాగా.
సహకారం
జూపల్లి రమేశ్‌, ఈటీవీ2

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు