శృంగార 'గురుబోధ' (Eenadu Sunday Magazine 20/05/2012)
దాంపత్య విద్యాలయం...
హెడ్మాస్టరు పేరు వాత్స్యాయనం మాస్టారు.
కొఠారి సాబ్, కృష్ణమూర్తిసార్, నారాయణరెడ్డిసార్, బెర్మన్ మేడమ్ - ఉపాధ్యాయ వర్గం.
ఆలూమగలూ విద్యార్థినీ విద్యార్థులు. అనుబంధాల పీరియడ్ ప్రారంభం...
అక్షరాస్యత పెరిగింది. టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇంటర్నెట్ - ఆధునిక విజ్ఞాన సర్వస్వంగా అవతరించింది. మీట నొక్కితే చాలు... సమస్త సమాచారం కళ్లముందు కనిపిస్తుంది. డాక్టర్లకు కొరత లేదు. అత్యాధునిక వైద్య విధానాలకు కొదవ లేదు. అందులోనూ భారత్ 'మెడికల్ టూరిజం' కేంద్రంగా అవతరించింది. అయినా, లైంగిక విజ్ఞానం విషయంలో అజ్ఞానానిదే రాజ్యం. పరిమాణాన్ని చూసుకునీ, సామర్థ్యాన్ని వూహించుకునీ లోలోనే కుమిలిపోతున్నవారు ఎంతోమంది. రకరకాల లైంగిక సమస్యలతో సతమతమవుతూ దాంపత్య జీవితాన్ని నిస్సారం చేసుకుంటున్నవారు కోటానుకోట్లు. ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లు పడకగదినీ ఆక్రమించేశాయి. ఆలూమగల మధ్య ఇనుప గోడలు మొలిచాయి. ఇదీ నేపథ్యం. ఏదీ పరిష్కారం?అపోహల్ని తొలగించుకోవడం ఎలా? కాపురాన్ని నిత్యనూతనంగా తీర్చిదిద్దుకోవడం ఎలా? బంధాల బీటల్ని పూడ్చుకునే దారేది? నిర్లిప్తతను పటాపంచలు చేసే ఆయుధం ఏదైనా ఉందా?... ప్రజల మనసుల్లో అనేకానేక సందేహాలు. ప్రఖ్యాత సెక్సాలజిస్టులు 'శృంగార గురుబోధ'తో మనసు కళ్లు తెరిపిస్తున్నారు. వలపు మంత్రం వల్లెవేయిస్తున్నారు. ప్రణయ వ్రతవిధానం బోధిస్తున్నారు. |
-వాత్స్యాయనుడు (ప్రపంచంలోనే మొట్టమొదటి లైంగిక విజ్ఞాన గ్రంథం 'కామసూత్ర' రచయిత. శతాబ్దాల క్రితమే భావప్రాప్తి గురించి చర్చించిన స్త్రీవాది. ఇప్పటికీ వాత్స్యాయనంపై రకరకాల పుస్తకాలూ సమకాలీన వ్యాఖ్యానాలూ వస్తున్నాయి. వచ్చినంతవేగంగా అమ్ముడుపోతున్నాయి)వలపుదేవర మన్మథుడు. మనసిజుడని మారుపేరు. మనసే ఆయన మందిరం. శృంగారం కూడా ప్రాథమికంగా మనసుకు సంబంధించినదే. మనసులో పుట్టి తనువులకు విస్తరిస్తుంది. తనువునూ మనసునూ మురిపిస్తుంది. జీవితభాగస్వామికి మనసులో ఎంత స్థానం కల్పిస్తే... అంత లోతైన అనుభూతి, అంత గొప్ప ఆనందం! ఆ 'ఎంత'కు కొలమానం... వ్యక్తీకరణ! మాటలతో మురిపించాలి. ముద్దులతో ముంచెత్తాలి. సపర్యలతో మెప్పుపొందాలి. శృంగారంతో ప్రేమా ఆకర్షణా అవగాహనా రెట్టింపు అవుతాయి. మనస్పర్ధలుంటే తొలగించుకోవాలి. అర్థంలేని గొడవలతో లైంగిక జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఎడబాటు క్షేమం కాదు. శృంగారం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి దివ్య ఔషధం. అలా అని, కామం హద్దులు దాటినా ప్రమాదమే. కాముకత్వం వల్ల సర్వనాశనమైపోయినవారు ఎందరో! శృంగారానికి అనురాగం పునాది. అనురాగానికి ధర్మం పునాది. పక్కదార్లు పట్టే ప్రణయం అంతిమంగా కష్టాలపాలు చేస్తుంది. ఎంత ప్రతిభావంతుడైనా, ఎంత సంపన్నుడైనా, ఎంత శక్తిమంతుడైనా సమాజం దృష్టిలో కొరగానివాడైపోతాడు. అంతుచిక్కని రోగాలు అంతుచూసే ప్రమాదం ఉంది.దంపతులు కామాన్ని ఒక చదువులా, ఒక శాస్త్రంలా అధ్యయనం చేయాలి. దీనివల్ల అపోహలు తొలగిపోతాయి. అనుమానాలు పటాపంచలు అవుతాయి. పరిమితులు అర్థమవుతాయి. మనసు గురించీ శరీరం గురించీ మునుపెన్నడూ తెలియని విషయాలెన్నో తెలుస్తాయి. పరిపూర్ణ అవగాహనతో పొందే ఆనందమే వేరు! చేయితిరిగిన రైతు పొలాన్ని దున్నే పద్ధతి ఒకలా ఉంటుంది, అందులో ఓనమాలు కూడా తెలియని అమాయకుడి సేద్యం మరోలా ఏడుస్తుంది. కామశాస్త్రం అనేది..పడకగదికే పరిమితమైన అంశం కాదు. చక్కగా ఇల్లు కట్టుకోవడం ఎలా అన్నది కూడా అందులో భాగమే. ఇరుకిరుకు ఇంట్లో గాలీ వెలుతురూ ధారాళంగా సోకని పడకగదిలో వలపు వికసించదు. తనువు పులకించదు. కళలు మనిషి ఆలోచనల మీదా ప్రభావం చూపుతాయి. కళాత్మక జీవనం శృంగార భావనలను ఇనుమడిస్తుంది. సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం... సున్నితమైన భావాలను అర్థంచేసుకునే శక్తినిస్తాయి. అతి సున్నితమైన స్త్రీ అంతరంగాన్ని ఆకళింపు చేసుకోవడం అప్పుడిక చాలా సులభం. కామశాస్త్రం ఆలూమగల అనుబంధాలకు చాలా ప్రాధాన్యం ఇచ్చింది. భర్తను భార్య ప్రేమించడం అంటే, భార్య భర్తను ప్రేమించడం అంటే... ఆ వ్యక్తిని మాత్రమే ప్రేమించడం కాదు. ఆ వ్యక్తి అభిరుచుల్నీ ఇష్టాల్నీ పరిమితుల్నీ బాధ్యతల్నీ కూడా ప్రేమించడం. అలా ప్రేమించే భాగస్వామి మీద అనురాగం రెట్టిస్తుంది. ఒకరినొకరు అర్థంచేసుకున్నప్పుడు, ఒకరి భావాల్ని ఒకరు గౌరవించుకున్నప్పుడు... శృంగారం హృదయపూర్వకం అవుతుంది. తనువులే కాదు, మనసులూ ఒక్కటవుతాయి. నిజానికి, ఆలూమగలు వేరువేరు కానేకాదు... ఒకరికి ఒకరు కొనసాగింపు. ఒకరు బింబమైతే, మరొకరు ప్రతిబింబం. ఆ అద్వైతానంద స్థితికి శిఖరస్థానం శృంగారం. |
- డాక్టర్ ప్రకాశ్ కొఠారి (పద్మశ్రీ ప్రకాశ్ కొఠారి ప్రఖ్యాత సెక్సాలజిస్టు. మూడున్నర దశాబ్దాల అనుభవం. జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగించారు. అనేక వ్యాసాలు రాశారు, పరిశోధనపత్రాలు సమర్పించారు. వివిధ సందర్భాల్లో ఆయన వెల్లడించిన అంశాలు...)పురుషుడి దృష్టిలో శృంగారం ఒక ఆట. గెలుపును కోరుకుంటాడు. స్త్రీ దృష్టిలో శృంగారం పుస్తక పఠనం.అనుభూతిని ఆశిస్తుంది. ఆటనుకున్నా అనుభూతి యాత్రనుకున్నా... ఒకరి అవసరాల్ని మరొకరు గుర్తించడం, గౌరవించడం చాలా ముఖ్యం. భారతీయ మహిళలోని గొప్పదనం ఏమిటంటే, ఆమె తన జీవిత భాగస్వామిని అర్థంచేసుకుంటుంది, ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది. ఆ అవగాహన వల్ల..అతని లైంగిక బలాల్నీ బలహీనతల్నీ తెలుసుకోగలుగుతుంది. అతన్లో గూడుకట్టుకున్న అపనమ్మకాల్నీ అపోహల్నీ తొలగించడానికి తన పరిధిలో ప్రయత్నిస్తుంది. భారతీయ కుటుంబాల్లో... భర్తలోని సగానికిసగం లైంగిక సమస్యల్ని భార్యలే సమర్థంగా పరిష్కరిస్తున్నారు. అతనికి సంబంధించి ఆమే తొలి సెక్సాలజిస్టు. తరాలుగా ఎన్నో చిక్కుముళ్లు విప్పుతున్న మహిళకు, తాజాగా టెక్నాలజీ సవాలు విసురుతోంది. ఆలూమగల ఏకాంతానికి సాంకేతిక పరిజ్ఞానం పెద్ద అవరోధంగా మారింది. మొన్న టెలివిజన్, నిన్న సెల్‌ఫోన్. ఇప్పుడు లాప్‌టాప్, టాబ్లెట్. ఎదురుగా కంప్యూటర్ లేకపోతే, తమ సమస్య ఏమిటో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు చాలామంది. అంత సాంకేతిక బానిసత్వం. శృంగారం సంగతి తర్వాత..ముందు ఆలూమగల మధ్య కమ్యూనికేషన్ పెరగాలి. పెళ్లయి సంవత్సరాలు గడిచినా, దంపతుల్లో దగ్గరితనం ఉండటం లేదు. ఒకరి శరీరభాష మరొకరికి అర్థం కావడం లేదు. అర్థంచేసుకునే ప్రయత్నమూ పెద్దగా జరగడం లేదు. ఆధునిక జీవితాల్లో లైంగిక సంక్షోభాలకు ఇదో ప్రధాన కారణం. ఆ అసంతృప్తి ఏదో ఒక రూపంలో బయటపడుతుంది... ఆలోచనలు పక్కదారి పట్టవచ్చు లేదంటే విడాకులకు దారితీయవచ్చు. ఓ పద్ధతంటూ లేని జీవనశైలి లైంగిక జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. సమయానికి భోంచేయాలి. అర్ధరాత్రి విందులొద్దు. వ్యసనాలకు బానిసకావొద్దు. మధుమేహం, మద్యం, ధూమపానం, ఒత్తిడి... శృంగార జీవితానికి ప్రధాన శత్రువులు. ఈ నాలుగూ జీవనశైలి సమస్యలే. వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో భారతీయులు చాలాచాలా వెనకబడ్డారు. ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మనసుపడినా... గుప్పుమనే దుర్వాసన భాగస్వామి ప్రణయావేశంపై నీళ్లు పోస్తుంది. గుడికెంత శుభ్రంగా వెళ్తారో, పడకగదిలోకీ అంత నీటుగా వెళ్లాలి. ఘాటుగా జర్దా నములుతూనో, గుప్పుమంటూ సిగరెట్టు పొగ వదుల్తూనో పడకటింట్లో కాలుపెట్టకండి. అయినా, మనసైన భాగస్వామి సన్నిధిలో పొందే ప్రేమమత్తు ముందు పొగాకు మత్తు ఒక మత్తేనా! అందులోనూ శృంగారం హానికరం కాని మత్తు. ఆరోగ్యకరమైన మత్తు! విజయానందాన్నిచ్చే మత్తు! వ్యాయామం చేసినంత ఫలితం.ధ్యానం చేసినంత విశ్రాంతి. చంద్రమండలానికి వెళ్లొచ్చినంత సంతృప్తి! |
- డాక్టర్ సుధాకర్ కృష్ణమూర్తి (పురుషుల లైంగిక సమస్యల శాస్త్రీయ అధ్యయనం... ఆండ్రాలజీ. ఆ విభాగాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లిన నిపుణుడు డాక్టర్ కృష్ణమూర్తి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా విధానపరమైన నిర్ణయాలలో ఆయన సలహా సేవలను స్వీకరిస్తోంది)పురుషుడి లైంగిక సమస్యలు వైద్యుడి దాకా రావడం లేదు. జలుబు చేస్తే డాక్టరు దగ్గరికి వెళ్తారే! తలనొప్పి అనిపించగానే ఏదో ఓ గోళీ వేసుకుంటారే! శృంగార జీవితాన్ని సర్వనాశనం చేసే లైంగిక సమస్యల విషయంలో మాత్రం ఎందుకింత నిర్లిప్తత? అవగాహన లేమి అసలు కారణం. తనలోని లోపాన్ని బయటికి చెప్పుకోలేని పిరికితనం. ఒత్తిడివల్లో చికాకువల్లో లైంగిక సామర్థ్యంలో తేడా వచ్చి ఉంటుందన్న మిడిమిడిజ్ఞానపు ఆలోచన ఒకటి. నూటికి తొంభైశాతం కేసుల్లో పురుషుల్లో వైఫల్యానికి మానసిక సమస్యల కంటే శారీరక సమస్యలే కారణం. కొన్నిసార్లు ఇంకేవో రుగ్మతల వల్ల కూడా తాత్కాలిక నపుంసకత్వం రావచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు...పరోక్షంగా కారణం కావచ్చు. వైద్యుడి సహకారంతో ఆ లోపాల్ని సరిచేసుకోవడం సాధ్యమే. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ ఉండటం లేదు. ఫలితంగా... కాపురాలు కూలిపోతున్నాయి. ఆలూమగల మధ్య అగాథం ఏర్పడుతోంది. పడకగదిలో నిర్లిప్తత రాజ్యమేలుతోంది.నూటికి పదిమంది పురుషుల్లో అందులోనూ నలభై దాటిన వారిలో సగానికి సగంమందికి అంగస్తంభన సమస్య ఉంది. డెబ్భై అయిదు శాతం పురుషుల్లో శీఘ్రస్ఖలన సమస్య ఉంది. దీనికితోడు పరిమాణానికి సంబంధించీ సామర్థ్యానికి సంబంధించీ ఎన్నో అపోహలూ అనుమానాలూ. ఇన్ని భయాల మధ్య, శృంగార రసానుభూతుల్ని ఎవరైనా ఎలా జుర్రుకోగలరు? నడివయసులో ప్రారంభమయ్యే 'ఆండ్రోపాజ్' కూడా లైంగిక జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. నపుంసకత్వం పురుషుడిని నిలువునా కుంగదీస్తుంది. అంత ధైర్యవంతుడు కూడా నిస్పృహకు లోనవుతాడు. ఎవరికీ చెప్పుకోడు. చెబితే చులకనైపోతానన్న భయం. కావాలనే, జీవిత భాగస్వామిని దూరంగా ఉంచుతాడు. ఆమే చొరవ తీసుకున్నా స్పందించడు. పొడిపొడి మాటలతో, పొడిపొడి సమాధానాలతో..తన చుట్టూ ఓ గోడ కట్టుకుంటాడు. ఆ ప్రవర్తన ఆమెలో విష బీజాలు మొలకెత్తిస్తుంది. తన మీద మోజు తీరిందనుకుంటుంది. ఇంకెవరితోనో సంబంధాలు పెట్టుకున్నాడని అనుమానిస్తుంది. ఎయిడ్స్ లాంటి ఏ మాయరోగమో సోకిందని భీతిల్లుతుంది. ఇలాంటి సమయాల్లో... నిశ్శబ్దం పరిష్కారం కాదు. జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడాలి. సమస్య ఏమిటో చెప్పాలి. ఎందుకంటే, లైంగిక అసంతృప్తి ఆలూమగల అనుబంధంపై చాలా ప్రభావం చూపుతుంది. ఏ ఒక్కరు తీవ్రంగా స్పందించినా తీరని నష్టమే. చెప్పాల్సిన పద్ధతిలో చెబితే, ఆమె తప్పకుండా అర్థంచేసుకుంటుంది. సంక్షోభం నుంచి బయటపడటంలో తనవంతు సహకారం అందిస్తుంది. శృంగారానికి ఎక్స్‌పైరీ డేట్ లేదు. జీవితాంతం ఆస్వాదించవచ్చు. ఏడుపదులు దాటినవారిలో... నూటికి ముప్ఫైశాతం వయోధికులు చక్కని లైంగిక జీవితాన్ని అనుభవిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. స్పర్శ ద్వారా ఆలింగన చుంబనాదుల ద్వారా ఆనందిస్తున్నవారి సంఖ్యా తక్కువేం కాదు. సమస్య వస్తే, ఎలాంటి బిడియం లేకుండా వైద్యుల్ని సంప్రదిస్తున్నారు కూడా. 'జెరియాట్రిక్ సెక్సువాలిటీ' ప్రత్యేక విభాగంగా అభివృద్ధి చెందుతోంది. ఎవరైనా, ఏ వయసువారైనా లోపాలుంటే సరిచేసుకుని, అవరోధాలుంటే అధిగమించుకుని... పరిపూర్ణమైన శృంగార జీవితాన్ని ఆస్వాదించాలి. ఏం భయంలేదు, అత్యాధునిక వైద్య విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. |
- ప్రొఫెసర్ డి.నారాయణరెడ్డి (లైంగిక వైద్యంలో నిష్ణాతులు. చెన్నై కేంద్రంగా వైద్యసేవలు అందిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో లైంగిక విద్యపై ఉపన్యసించారు)
ఆఫీసులో... బాసుతో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడ్డానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం! ఉన్నతాధికారి హుషారుగా ఉన్నప్పుడే మన సెలవు సంగతో ప్రమోషన్ సంగతో ప్రస్తావిస్తాం! మరి, జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఏకపక్ష ధోరణి ఎందుకు? ఆమె మూడ్‌ను తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయం? శృంగారమంటే... కోరిక తీర్చుకోవడం కాదు, వలపు పంచుకోవడం! ఇద్దరి పరిపూర్ణ భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. ఆ దిశగా ఆమెను సమాయత్తం చేయాల్సిన బాధ్యత కూడా పురుషుడిదే.
|
- లారా బెర్మన్ (ప్రేమ వైద్యురాలని అమెరికాలో ముద్దుపేరు. ఆలూమగల అనుబంధానికి సంబంధించి, శృంగార జీవితంలోని సమస్యలకు సంబంధించి చాలా పుస్తకాలు రాశారు. సంక్షిప్తంగా వాటి సారం...)ప్రేమలేని శృంగారం ఉండవచ్చు. శృంగారం లేని ప్రేమా ఉండవచ్చు.కానీ ప్రేమ తోడైతే, నమ్మకం జతకూడితే, దగ్గరితనం పెరిగితే..ఆ ప్రణయానందం శిఖరాగ్రాన్ని చేరుతుంది. ఆ మూడూ ఉన్న కాపురాల్లో... నిత్యం ఉల్లాసమే, ఉత్సవమే! ఆలూమగలెప్పుడూ శృంగారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని సమస్యలైనా రానివ్వండి, ఎన్ని ఒత్తిళ్లయినా వేధించనీయండి, కుటుంబ బాధ్యతలూ ఆర్థిక సమస్యలూ, చింతలూ చికాకులూ వస్తుంటాయి, పోతుంటాయి! ఒత్తిళ్లున్నాయని గాలి పీల్చడం మానేస్తామా, నీళ్లు తాగడం మానేస్తామా... ప్రణయ భోజనానికి మాత్రం ఎందుకు దూరం కావాలి? వలపు తోడైనప్పుడే కాపురంలో మెరుపు! ఆ ప్రభావం వల్లే..ఈ రోజు నిన్నటిలా అనిపించదు. రేపు ఈరోజులా ఉండదు. కాలం గడిచేకొద్దీ బంధం పాతబడేకొద్దీ..లైంగిక జీవితం మొక్కుబడిగా మారిపోతుంది. జీవితభాగస్వామిలో అయస్కాంతత్వమేదో మాయమైన భావన కలుగుతుంది. కత్తిపీట మొద్దుబారిందని అటకెక్కిస్తామా, నగోనట్రో నల్లబడిందని ధరించడం మానేస్తామా, బండి రిపేరుకొచ్చిందని తూకానికేయలేం కదా! రకరకాల పరిష్కారాలు ఆలోచిస్తాం. సానబెట్టుకుంటాం, మెరుగు దిద్దుకుంటాం, మరమ్మతు చేయించుకుంటాం. శృంగార జీవితంలోనూ అలాంటి చొరవే అవసరం. ఆలూమగల మధ్య రసశోధన ఆగిపోకూడదు. సాఫ్ట్‌వేర్‌లలో ఏడాదికో కొత్త వెర్షన్ విడుదలవుతూ ఉంటుంది. సరికొత్త ఫీచర్స్ జోడిస్తారు. ఖాతాదారుల్లో 'పాతబడిపోవడం' అన్న ఆలోచనే రాకూడదన్నది తయారీ సంస్థల వ్యూహం. ఇదే సూత్రాన్ని శృంగారానికీ ఎందుకు అన్వయించకూడదు? వలపు చిట్కాలూ ప్రణయ వ్యూహాలూ పడకగది ప్రయోగాలూ... వలపుబడిలో మొక్కుబడికి అవకాశం లేకుండా చేస్తాయి. ఆమె సౌందర్యాన్ని అతను, అతని రసికతను ఆమె - మనసారా ప్రశంసించి ఎంతకాలమైందో! ఎప్పుడో పెళ్లికి ముందో పెళ్లయిన కొత్తలోనో కావచ్చు! ఆతర్వాత కూడా చాలాసార్లు లోలోపల మెచ్చుకునే ఉంటారు. ప్రేమలో వ్యక్తీకరణ ముఖ్యం. శృంగారం శక్తిమంతమైన వ్యక్తీకరణ మార్గం. లీడర్ చేయి వూపగానే ఆర్కెస్ట్రా బృందంలోని వాద్యకారులంతా ఎవరిపనివారు చేసుకుపోయినట్టు... అద్భుతమైన సంగీతాన్ని సృష్టించినట్టు... మనసులో శృంగార భావనలు మొలకెత్తగానే శరీరంలోని ప్రతిభాగం తనదైన రీతిలో స్పందిస్తుంది. నాడులు నవచైతన్యాన్ని పొందుతాయి. ఆలోచన, ఒక చిన్న ఆలోచనతోనే... ఇదంతా సాధ్యమైంది. ఎప్పుడు ఏం ఆలోచించాలో నిర్ణయించుకునే శక్తిని మన దగ్గరే అట్టిపెట్టుకుంటే... జడత్వం దరిదాపుల్లోకి కూడా రాదు. ఆఫీసు ఆలోచనల్ని పడకగదితో పడకగది ఆలోచనల్ని ఆఫీసుతో కలగాపులగం చేసుకుంటే రెండు చోట్లా వైఫల్యం తప్పదు. 'రోజుకో చుంబనం' (కనీసం..) పథకాన్ని అమలు చేయండి. ముద్దంటే మరీ మొక్కు బడిగా ఉండకూడదు. పొడిపొడిగా ముగిసిపోకూడదు. కనీసం ఒకటి నుంచి పది లెక్కబెట్టేంత సమయం అయినా చుంబన ప్రక్రియ కొనసాగాలి (అలా అని, లెక్కబెడుతూ కూర్చోమని కాదు). సెల్‌ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టే... ఆకర్షణనూ ఎందుకు చేసుకోకూడదు. ముద్దు... వలపు పలకరింత, సంక్షిప్త సంభాషణ. మగవాళ్లు మైక్రోవేవ్ ఒవెన్ లాంటివాళ్లు. తొందరగా వేడెక్కిపోయి, అంతే తొందరగా చల్లబడతారు. స్త్రీలు బొగ్గులపొయ్యి లాంటివాళ్లు. నిప్పు రాజుకోడానికి సమయం పడుతుంది. రాజుకుందా, ఓపట్టాన చల్లబడదు. శృంగారంలో భాగస్వామిని అర్థంచేసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు ఎదుగుతున్నకొద్దీ... వ్యక్తిగత సమయం అంటూ లేకుండా పోతుంది. ఏకాంతం దాదాపుగా అసాధ్యం అవుతుంది. ఈ దశలో ఆలూమగలు తమ ఇద్దరి కోసమే ఓ ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. నెలకు ఒకరోజు, ఏడాదికో పదిహేనురోజులు... ఎక్కడికైనా దూరంగా! పడకగది స్టోర్‌రూమ్ కాదు. పడకగది పూజామందిరం కాదు. పడకగది ఆఫీస్‌రూమ్ కూడా కాదు. పడకగది పడకగదే! బెడ్‌రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇద్దరి అభిరుచులకూ తగినట్టుగా అలంకరించుకోవాలి. ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. నడక, యోగా, ప్రాణాయామం, డాన్స్, క్రీడలు... ఏదో ఓ వ్యాపకం తప్పనిసరి. లైంగిక ఆరోగ్యం... పరిపూర్ణ ఆరోగ్యంలో ఓ భాగమే. తెలిసిన దార్లోనే, వెళ్లిన చోటికే మళ్లీమళ్లీ వెళ్లడం ప్రయాణం. ఈమాత్రం దానికి పెద్దగా ప్రణాళిక అక్కర్లేదు. అనుభూతుల అంచనాలూ ఉండవు. వెళ్లిన పని పూర్తయిందా లేదా అన్నదే ముఖ్యం.సరికొత్త దార్లో సరికొత్త అనుభవాలతో వూహించని మలుపులతో గమ్యం దిశగా వెళ్లడమే యాత్ర. అడుగడుగునా ఆశ్చర్యమే... మజిలీ మజిలీ మధ్య బోలెడంత ఉత్కంఠ! ఇక్కడ అనుభూతి ప్రధానం. దాంపత్యం అనుభూతి యాత్ర. నిత్యనూతనంగా ఉండాలి. తప్పనిసరి ప్రయాణంలా చప్పచప్పగా ముగిసిపోకూడదు. అవసరమైతే, ప్రయాణాన్ని కూడా వలపుయాత్రలా మలుచుకోగల శక్తి దంపతులకు ఉంది. అదే శృంగారంలోని గొప్పదనం. సిద్ధంగా 'ఏకాంతం ఎక్స్‌ప్రెస్'! |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి