గూగుల్‌ గూట్లో...కొత్త 'డ్రైవ్‌' (Eenadu Thursday 10/05/2012)



గూగుల్‌ గూట్లో...కొత్త 'డ్రైవ్‌'

ఎంతో సమాచారాన్ని సేకరిస్తాం... ఫైల్స్‌ రూపంలో భద్రపరుస్తాం... ఎన్ని యూఎస్‌బీ డ్రైవ్‌లైనా సరిపోవు... మరేం చేయాలి?ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంది! అదే గూగుల్‌ అందిస్తున్న 'డ్రైవ్‌'!

మాచారాన్ని భద్రపరచడానికి సాధారణంగా మనం వాడే యూఎస్‌బీ డ్రైవ్‌లు 4జీబీ సామర్థ్యంతో ఉంటాయి. అంతకన్నా ఎక్కువ సమాచారాన్ని దాచుకోవాలంటే ఎక్కువ డ్రైవ్స్‌ కావాల్సిందే. ఇలా చేసినా ఒకోసారి వైరస్‌ వల్ల అవి పనిచేయకపోతే ఇబ్బంది తప్పదు. సరిగ్గా ఇలాంటి సమయాల్లో ఉపయోగపడేలా గూగుల్‌ సంస్థ 'డ్రైవ్‌' సర్వీసును రూపొందించింది. ఇందులోకి లాగిన్‌ అయితే ఉచితంగా 5 జీబీ స్పేస్‌ను పొందవచ్చు. ఇంకా కావాలంటే మరింత మెమొరీని కొనుక్కోవచ్చు కూడా. అంటే ఇది ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసుకునే బుల్లి హార్డ్‌డ్రైవ్‌ అన్నమాట. డాక్యుమెంట్‌లు, ఇమేజ్‌లు, ప్రజంటేషన్లు, వీడియోలు... ఇలా రకరకాల ఫైల్స్‌ని భద్రం చేసుకుని కావలసినప్పుడు వాడుకోవచ్చు. పీసీ, మ్యాక్‌, ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ పరికరాల్లో ఈ సర్వీసుని పొందొచ్చు.లాగిన్‌ ఇలా...
డ్రైవ్‌లోకి లాగిన్‌ అవ్వాలంటే జీమెయిల్‌ ఐడీ ఉండాల్సిందే. https://drive.google.comలోకి వెళ్లి డ్రైవ్‌ని వాడుకునేందుకు అనుమతి పొందగానే హోం పేజీలో Go to Google Drive బటన్‌ వస్తుంది. క్లిక్‌ చేసి లాగిన్‌ అవగానే మెనూబార్‌, ఐకాన్‌ గుర్తులతో డ్రైవ్‌ ఓపెన్‌ అవుతుంది. ఇక ఫైల్స్‌ని డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేయాలంటే ఎడమవైపు నావిగేషన్‌ మెనూలోని Upload గుర్తుపై క్లిక్‌ చేయాలి. వచ్చిన మెనూలోని Filesపై క్లిక్‌ చేసి సిస్టంలోని ఫైల్స్‌ని ఎంపిక చేసి అప్‌లోడ్‌ చేయవచ్చు. డాక్యుమెంట్స్‌, ప్రజంటేషన్స్‌, స్ప్రెడ్‌షీట్‌లు, డ్రాయింగ్స్‌ని 'గూగుల్‌ డాక్స్‌' ఫార్మెట్‌లోకి మార్చుకునే వీలుంది. ఒకవేళ పీడీఎఫ్‌ ఫైల్‌ని అప్‌లోడ్‌ చేస్తే దాన్ని ఇమేజ్‌, టెక్ట్స్‌ ఫైల్‌గా మార్చేయవచ్చు. సిస్టంలో మాదిరిగానే ప్రత్యేక ఫోల్డర్లు క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం New Folder in My Drive క్లిక్‌ చేయాలి. ఆ ఫోల్డర్‌ని ఇతరులతో పంచుకోవచ్చు.
అంతా విండోస్‌లానే!
సిస్టంలో మాదిరిగానే డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌ని ఓపెన్‌ చేసి చూడొచ్చు. ఎక్కువ రకాల ఫైల్‌ ఫార్మెట్‌లను డ్రైవ్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఉదాహరణకు Photoshop, Illustrator Designసాఫ్ట్‌వేర్‌లు సిస్టంలో లేకపోయినప్పటికీ ఆయా ఫైల్స్‌ని బ్రౌజర్‌ ఇంటర్ఫేస్‌లోనే ఓపెన్‌ చేసి చూడొచ్చు. 'ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నేషన్‌'తో ఇమేజ్‌ ఫైల్స్‌ నుంచి టెక్ట్స్‌ని వేరు చేసి సేవ్‌ చేసుకునే వీలుంది. ఎడిట్‌ చేసిన ఫైల్స్‌ని(Revision Copy) 30 రోజుల పాటు భద్రంగా ఉంచుతుంది. ఉదాహరణకు వర్డ్‌ డాక్యుమెంట్‌ని గూగుల్‌ డాక్స్‌లో ఎడిట్‌ చేస్తే పాత డాక్యుమెంట్స్‌ని భద్రంగా ఉంటాయన్నమాట. తిరిగి కావాలంటే వాటిని రీస్టోర్‌ చేయవచ్చు. అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌ని విండోస్‌లో మాదిరిగా వివిధ రకాలుగా చూడొచ్చు. Sort మెనూలో ఫైల్స్‌ని క్రమ పద్ధతిలో చూడొచ్చు. ఫైల్స్‌ని థంబ్‌నెయిల్‌ బాక్స్‌ల్లా కావాలనుకుంటే Switch to Grid గుర్తుపై క్లిక్‌ చేయాలి. లిస్ట్‌ మాదిరిగా కావాలంటే Swith to List ఎంపిక చేయాలి.
సులువుగా... సింక్రనైజ్‌
ఒక్కో ఫైల్‌ని ఎంచుకోవడం, అప్‌లోడ్‌ చేయడం కష్టమనుకుంటే సాఫ్ట్‌వేర్‌ రూపంలో గూగుల్‌ డ్రైవ్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో ఫైల్స్‌ని దాచుకోవచ్చు. అందుకు ఎడమవైపు నావిగేషన్‌ మెనూ కింద కనిపించే Download Google Driveపై క్లిక్‌ చేయాలి. సెట్‌అప్‌ని ఇన్‌స్టాల్‌ చేయగానే డెస్క్‌టాప్‌పై డ్రైవ్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. రన్‌ చేసి లాగిన్‌ వివరాలతో సైన్‌ఇన్‌ అవ్వగానే సిస్టం ట్రేలో డ్రైవ్‌ చేరిపోతుంది. మై డాక్యుమెంట్స్‌లో Google Drive ఫోల్డర్‌ క్రియేట్‌ అవుతుంది. డ్రైవ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌ అన్నీ సింక్రనైజ్‌ అయ్యి ఫోల్డర్‌లో కనిపిస్తాయి. ఇక మీదట మీరు ఏది డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేయాలన్నా డ్రాగ్‌ అండ్‌ గ్రాప్‌ చేస్తే సరిపోతుంది. సింక్రనైజ్‌ నుంచి బయటికి రావాలంటే సిస్టం ట్రేలోని గుర్తుపై రైట్‌క్లిక్‌ చేసి Quit Google Driveపై క్లిక్‌ చేయాలి. అదే మెనూలోని Buy more storageతో అదనపు మెమొరీ కొనుక్కోవచ్చు.
మరికొన్ని ప్రయోజనాలు
డాక్యుమెంట్స్‌, ప్రజంటేషన్స్‌, స్ప్రెడ్‌షీట్‌లు... క్రియేట్‌ చేసుకునేందుకు అనువుగా ఆఫీస్‌ సూట్‌ని డ్రైవ్‌లో పొందుపరిచారు. నావిగేషన్‌ మెనూలోని Createపై క్లిక్‌ చేసి కావాల్సిన అప్లికేషన్‌ను ఓపెన్‌ చేయవచ్చు. ముందుకుగానే క్రియేట్‌ చేసిన డాక్యుమెంట్‌ టెంప్లెట్స్‌ కావాలంటే From Template ఉంది.
డ్రైవ్‌లో సుమారు 30 రకాల ఫైల్‌ ఫార్మెట్స్‌ని బ్రౌజర్‌ ఇంటర్ఫేస్‌లోనే ఓపెన్‌ చేసుకునే వీలుంది. హెచ్‌డీ వీడియోలను కూడా చూడొచ్చు.
ఎక్కువ మెమొరీతో కూడిన ఫైల్స్‌ని ఎటాచ్‌ చేసి పంపడం మెయిల్‌ సర్వీసులో కష్టమే. అలాంటప్పుడు ఫైల్‌ని డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేసి లింక్‌ని షేర్‌ చేయవచ్చు.
డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను గూగుల్‌ ప్లస్‌లో నెట్‌వర్క్‌లో షేర్‌ చేయాలంటే ఒకే ఒక్క క్లిక్‌ చాలు. అందుకు షేర్‌ చేయాలనుకునే ఇమేజ్‌ను చెక్‌ చేసి గూగుల్‌ డ్రైవ్‌ పైభాగంలో కనిపించే గూగుల్‌ ప్లస్‌ గుర్తుపై క్లిక్‌ చేస్తే చేయాలి.
డ్రైవ్‌లోని ఫైల్స్‌ని సెర్చ్‌ ద్వారా వెతకొచ్చు. కీవర్డ్స్‌ ఆధారంగా వెతుకులాట మరింత సులభం.
ఇతర స్టోరేజ్‌ సర్వీసులు...
స్కైడ్రైవ్‌. మైక్రోసాఫ్ట్‌ సంస్ధ దీన్ని అందిస్తోంది. విండోస్‌ లైవ్‌ ఐడీతో దీంట్లోకి లాగిన్‌ అవొచ్చు. 25 జీబీ ఉచితం. విండోస్‌ మొబైల్‌, ఐఓఎస్‌ల్లో కూడా సర్వీసుని పొందొచ్చు. https://skydrive.live.com
ఏడ్రైవ్‌. ఉచితం 50 జీబీ. www.adrive.com
బాక్స్‌. ఉచితం 5 జీబీ. www.box.com
ఐక్లౌడ్‌. ఉచితం 5 జీబీ. www.icloud.com
మోజీ. ఉచితం 5జీబీ. http://mozy.com
డ్రాప్‌బాక్స్‌. ఉచితం 2 జీబీ. www.dropbox.com
షుగర్‌సింక్‌. ఉచితం 5 జీబీ. www.sugarsync.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు