Eenadu Eetaram (19/05/2012)


నేటి తరం కుర్రకారుకి దూకుడెక్కువ... సరదాలైనా, సంప్రదాయమైనా సరే... ఇక రియాలిటీ షోల గురించి చెప్పేదేముంది? ఈటీవీ 'పాడుతా తీయగా'లో... పరవశింపజేస్తున్నదీ యువ తరంగాలే... లక్షలాది మందిని టీవీ సెట్ల ముందు కట్టిపడేస్తున్న... ఈ నలుగురూ కాలేజీ విద్యార్థులే! ఆ గళ విన్యాసాలకు అందినవి బహుమతులే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల ప్రశంసలు కూడా... ఆ యువ గాయకుల అభిరుచులు... అలవాట్లు... కాలేజీ సరదాలు... వారి మాటల్లోనే!ఈటీవీ 'పాడుతా తీయగా'లో అవకాశం వారికి అంత సులువుగా ఏమీ దక్కలేదు. అర్హత కోసం ఎనిమిది వేల మందితో పోటీ. అందులో సంగీతంపై పట్టున్నవాళ్లు, గెలవాలని పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నవాళ్లు. వడపోతలో మిగిలింది 93 మంది. వాళ్లనీ జల్లెడ పడితే తుది పోటీలకు పదహారు మంది. ఆఖరి అంకంలో నిలిచింది హరిణి, సాయిచరణ్‌, తేజస్విని, రోహిత్‌లు. తప్పులు దాటుకుంటూ... సంగీతజ్ఞుల మెప్పులు పొందితేనే ఇది సాధ్యమైంది.
తీరిన అమ్మ కోరిక
పేరు: ఇవటూరి హరిణి,
వూరు: కాకినాడ,
చదువు: ఇంటర్‌ సెకండియర్‌డిలో అక్షరాల్ని, సంగీత ఓనమాల్ని ఒకేసారి దిద్దడం మొదలు పెట్టా. పన్నెండేళ్లుగా సాధన కొనసాగుతోంది. దీనంతటికీ అమ్మే కారణం. సంగీతం నేర్చుకోవాలనే ఆమె చిన్ననాటి ఆశ నెరవేరలేదు. అందుకే పిల్లల రూపంలో తీర్చుకోవాలనుకుంది. సంగీతం నేర్చుకుంటూనే పోటీలకు వెళ్లేదాణ్ని. కచేరీలు చేసేదాణ్ని. ఎన్ని బహుమతులు గెల్చుకున్నా బాగా పేరొచ్చింది పాడుతా తీయగాలో పాడాకే. ఈ షోలో కనిపించాకే స్నేహితులకి నాపై అభిమానం రెట్టింపైంది. విద్యార్థిగా చదువు, సంగీతం, పోటీలు... చాలా కష్టం అని కొందరి అభిప్రాయం. కానీ సంగీతమే సరదా, ఇష్టం అయినపుడు ఈ బాధలేం ఉండవు. పాడుతా తీయగా కోసం ఇంటర్లో రెండు పరీక్షల్ని సైతం వదిలేశా. ఇక నా పాటకి బాలుగారంతటి గాయకుడి కళ్లు చెమర్చడం... చాగంటి కోటేశ్వరరావు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌లాంటి ఉద్ధండులు మెచ్చుకోవడం మర్చిపోలేని అనుభూతి. పైగా ఎనిమిది నుంచి ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు. ఇంత పేరు, ఇన్ని అవకాశాలు సంగీతం పుణ్యమే.
* మాటీవీ పాడాలని ఉంది ప్రి క్వార్టర్‌ ఫైనల్‌
* జీ తెలుగు సరిగమపలో టాప్‌ ఫైవ్‌
* జెమిని స్టార్‌ ఆఫ్‌ ఏపీ ఫైనలిస్ట్‌
* జెమిని సంగీత మహాయజ్ఞం సెమీఫైనల్‌
* సునాద వినోదిని ఫైనలిస్ట్‌.
* అన్నమయ్య బాల బ్రహ్మోత్సవాల్లో బాలమిత్ర అవార్డు
* 'భామ' పోటీల ఫైనలిస్ట్‌.
బయటపడ్డ ప్రతిభ
పరు: భాస్కరుని సాయిచరణ్‌ 
వూరు: హైదరాబాద్‌,
చదువు: బీకామ్‌ సెకండియర్‌రోతరగతిలో అనుకోకుండా నా ప్రతిభ బయటపడింది. ఓ పెళ్లిలో అమ్మానాన్న కలిసి పాట పాడాల్సింది. ఏదో ఇబ్బందితో అమ్మ తప్పుకుంది. నాతో పాడించారు. గొంతు బాగుందని బంధువులు పొగిడారు. ఆ మెచ్చుకోలే నన్ను మళ్లీమళ్లీ వేదికలెక్కించింది. అప్పట్నుంచి పాడటం ఆపలేదు. తర్వాత నేనే సొంతంగా సంగీతం సమకూర్చుతూ మూడు ప్రైవేటు ఆల్బమ్స్‌ పాడాను. ఏ పోటీలకు వెళ్లినా బహుమతులొచ్చేవి. ఇప్పుడు పాడుతా తీయగా ఫైనల్‌ చేరాక ఒకటే ఫోన్లు, ప్రశంసలు. అయినా నా ఫ్రెండ్సందరికీ నేను మామూలు సాయిచరణ్‌నే. షో గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఏ పోటీలోనైనా అవతలి వాళ్లు ఓడిపోవాలని కోరుకోవడం సహజం. ఇక్కడ మాత్రం బాగా పాడేవాళ్లు గెలవాలని మిగతావాళ్లం కోరుకున్నాం. ఫైనల్‌ తిరుపతిలో జరిగింది. అప్పుడే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. అదీ 'వీఐపీ' దర్శనంలో. మనసులో వీఐపీలమయ్యామన్న భావం.
* ఏపీ సాంస్కృతిక శాఖ ఘంటసాల అవార్డు
* మా టీవీ పాడాలని ఉంది విజేత 
* జీ సరిగమప జోడీ నెంబర్‌వన్‌ రన్నరప్‌
* ఘంటసాల కళాసమితి బాల గంధర్వ అవార్డు
* రాగ మాధురి సంస్థ బాల కోకిల సత్కారం
* కళానిలయం మోస్ట్‌ టాలెంటెడ్‌ కిడ్‌ అవార్డు.
పిక్నిక్‌లా గడిచింది
పేరు: పరిటాల రోహిత్‌,
వూరు: హైదరాబాద్‌,
చదువు: బీటెక్‌ సెకండియర్‌మేనత్త పుణ్యమాని చిన్నప్పుడే పాడటం అలవాటైంది. పాటలు నేర్పి మరీ పోటీలకు పంపేదామె. అదే ఊపుతో ఐదోతరగతి నుంచి స్వరాల సాధన మొదలుపెట్టా. ఏ పోటీలకెళ్లినా టీచర్లు స్కూల్‌, కాలేజీల యాజమాన్యం బాగా ప్రోత్సహించేవాళ్లు. పాడుతా తీయగా పోటీ ఎక్కడ జరిగినా కాలేజీ స్నేహితులంతా వెన్నంటే ఉండేవాళ్లు. కేవలం బాలుగారిని కలవడానికే పాడుతా తీయగాలో పోటీ పడాలనుకున్నా. ఇప్పుడేమో ఆయనతో కలిసి పాడే అవకాశం రావడం, ఓ రోజంతా కలిసి గడపడం మర్చిపోలేని అనుభూతి. చదువు, సంగీతం, పోటీలు... కష్టం అనుకుంటే ఈ అవకాశం దక్కేదా? సంగీతం కోసం సరదాలు వదులుకున్న మాట వాస్తవమే. కానీ అంతకంటే రెట్టింపు పేరే వచ్చింది. పాడుతా తీయగా షూటింగ్‌ జరిగిన ఎనిమిది నెలలూ ఓ పిక్నిక్‌లా గడిచింది. పరీక్షలపుడు మాకోసం చాలాసార్లు షూటింగ్‌ ఆసల్యంగా మొదలు పెట్టేవాళ్లు. ఓపిగ్గా వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఇప్పుడు మా అందరికీ సినిమాల్లో పాడే అవకాశాలు వస్తున్నాయి.
* మా టీవీ పాడాలని ఉంది క్వార్టర్‌ ఫైనల్‌
* సరిగమప వాయిస్‌ ఆఫ్‌ యూత్‌లో టాప్‌ టెన్‌
* మాటీ వీ సూపర్‌ సింగర్‌ టాప్‌టెన్‌
* సితార స్టార్‌ సింగర్‌.
మామయ్య చలవ
పేరు: తేజస్విని నందిభట్ల,
వూరు: నకిరేకల్‌
చదువు: ఎంఏ మ్యూజిక్‌నేనిక్కడిదాకా వచ్చానంటే మామయ్య, అన్నయ్యల చలవే. నాకు సంగీతం నేర్పించడానికే మామయ్య హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఒకటో తరగతిలోనే నా సంగీత ప్రస్థానం మొదలైంది. చదువు, మ్యూజిక్‌, పోటీలు.. తీరిక లేనంత బిజీ. అయినా నేనెప్పుడూ చదువులో టాపే. అందుకేనేమో టీచర్లు నాకోసం చాలా మినహాయింపులు ఇచ్చేవారు. స్నేహితుల అభిమానం, మెచ్చుకోళ్లు మామూలే. ఎప్పుడైనా బస్‌లో వెళ్తుంటే, రోడ్డుమీద నడుస్తుంటే 'నువ్వు తేజస్విని కదమ్మా. ఫలానా పాట చాలా బాగా పాడావ్‌' అంటుంటే చెప్పలేనంత ఆనందం. వాళ్లలో ఎక్కువమంది పెద్దవాళ్లే. తమ మనవరాలే అన్నట్టు ఫీలై మాట్లాడుతుంటారు. ఫైనల్‌కి చేరిన మేం నలుగురం పాడుతా తీయగాకి ముందు ఒకరికొకరం తెలియదు. ఇప్పుడేమో కొట్టుకునేంత చనువు.'వేణువై వచ్చాను..' పాటకి బాలుగారు వందకి వంద మార్కులిచ్చారు. ఇన్ని మార్కులు రావడం పాడుతా తీయగాలో ఇదే మొదటిసారి. పైగా ఆ పాటకి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
* మాటీవీ పాడాలని ఉంది సెమీఫైనల్‌
* ఈటీవీ సప్తస్వరాలు టాప్‌ ఫైవ్‌
* స్టార్‌ సింగర్‌ ఫైనలిస్ట్‌
* సై జోడి నెంబర్‌వన్‌లో సెమీఫైనల్‌
* ఎస్‌.ఎస్‌.మ్యూజిక్‌ అకాడెమీ అవార్డు
* కళాసాగర్‌ సంస్థ పోటీల్లో ఫస్ట్‌ ప్రైజ్‌

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు