ఎంతో రుచిరా..!
పాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అదో సముద్రం... క్షీర సముద్రం! పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న మనం, వినియోగంలో మాత్రం వెనుకబడే ఉన్నాం. 'ప్రపంచ పాల దినోత్సవం' (జూన్ 1)నుంచి అయినా 'రోజుకో లోటా..' తీర్మానాన్ని అమలుచేద్దాం.
అప్పటిదాకా... వద్దేవద్దని మారాం చేసినవాడు, తిననే తిననని మొండికేసినవాడు, అస్సలు ఆకల్లేదని హఠం చేసినవాడు... వెండిగిన్నెను చూడగానే మనసు మార్చుకుంటాడు. అమాంతంగా అమ్మ ఒళ్లో వాలిపోతాడు. ముద్దుగా నోరు తెరుస్తాడు. బుద్ధిగా ముద్దలు పెట్టించుకుంటాడు. కారణం... పాలబువ్వంటే ఇష్టం. పాలంటే ఇంకా ఇష్టం.గిన్నె ఖాళీ అయిపోయాక, 'వాతాపి జీర్ణం... వాతాపి జీర్ణం' అంటూ అమ్మ బుజ్జిగాడి బొజ్జమీద ప్రేమగా నిమురుతుంది. 'ఇంతకీ, ఎవరీ వాతాపి' అంటారా? అదో పెద్ద కథ. పురాణాల ప్రకారం అతనో రాక్షసుడు. మనుషుల పొట్టల్లో దాక్కుని వేధిస్తుంటాడు. చెడుకు ప్రతినిధి. పరోక్షంగా అజీర్ణానికీ అనారోగ్యానికీ అధినాయకుడు. ఆ రాక్షసుడితో ఫైటింగ్ చేసే ప్రధాన హీరో...పాలే!
పాలలో అపారమైన విలువలున్నాయి. చెడు క్రిముల్ని ఓడించడంలో, మంచి పోషకాలను రక్షించడంలో పాల పాత్ర కీలకం. ఆ పోరు జీవితాంతం సాగుతుంది. మురిపాలు, తాపాలు, కోపాలు, కష్టాలపాలు... ఇలా ప్రతి మాటవెనుకా 'పాలు'న్నాయి. బాల్యమైనా, యవ్వనమైనా, వృద్ధాప్యమైనా... అపోహల కారణంగానో, అకారణంగానో పాలను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదన్న అంతర్లీన సందేశమిది. శీతలపానీయాల ధరతో, మద్యం సీసా ధరతో, మినరల్ వాటర్ ధరతో పోలిస్తే-పాలు చాలా చౌక! పాలు చాలాచాలా ఆరోగ్యం!
అన్నీ ఉన్నాయ్... 'మేరే పాస్... చికెన్ హై! మేరే పాస్... ఫ్రూట్స్ హై! మేరే పాస్... వెజిటబుల్స్ హై!.. విలన్ చాంతాడంత జాబితా చదువుతాడు. హీరో వూరుకుంటాడేమిటీ? ఓపిగ్గా అంతా విని, చివర్లో సింగిల్ లైనర్ వదుల్తాడు... 'మేరే పాస్ దూద్ హై!' ఇంకేముంది, విలన్ కాలికి బుద్ధిచెబుతాడు. ఎవరి పేరు చెబితే దిమ్మదిరిగి మైండు బ్లాకైపోద్దో వారే ఈ 'పాలు'గారు! ఒక బాలీవుడ్ సీనూ, ఒక టాలీవుడ్ సీనూ రీమిక్సు చేసి చెప్పినా... ఇందులో అతిశయం లేదు. సకల పోషక విలువల సారం... క్షీరం!
పాలలో విటమిన్లూ ఖనిజాలూ పుష్కలం. కాల్షియం గురించి అయితే చెప్పనక్కర్లేదు. పాల ఉత్పత్తుల్లోని ప్రొటీన్ చాలా నాణ్యమైంది. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. కొన్నిరకాల కూరగాయల్లో ధాన్యాల్లో ప్రొటీన్ నాసిరకంగా ఉంటుంది. అమైనో యాసిడ్ నామమాత్రంగా ఉంటుంది. పాల ఉత్పత్తులు ఆ లోపాన్ని సవరించి, వాటి సమర్ధతను మెరుగుపరుస్తాయి. పాలలోని ఖనిజ పదార్థాలన్నీ పోషకశక్తిని అందించేవే. కాల్షియం, ఫాస్ఫరస్... విటమిన్-డితో కలిసి ఎముకల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇక విటమిన్ల విషయానికొస్తే... విటమిన్-ఎ, విటమిన్-డి, థయమిన్, రిబోఫ్లవిన్ పుష్కలంగా దొరుకుతాయి. ఏమాటకామాటే చెప్పుకోవాలి విటమిన్-సి, ఐరన్ మోతాదు మాత్రం తక్కువే.
బాల్యానికి భరోసా... పాల ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. వినియోగంలో మాత్రం వెనుకబాటే. కారణం... అర్థంలేని అపోహలూ తలాతోకాలేని అనుమానాలే. పసివాళ్లకు, చనుబాల తర్వాత అంతటి సత్తువనిచ్చేది పాలే! పాలలోని విటమిన్-డి రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుంది. దగ్గు, జలుబు వంటి చిన్నచిన్న చికాకుల బారిన పడకుండా రక్షణ చక్రం అడ్డేస్తుంది. పసివాళ్లు పాలను హరాయించుకోలేరనే అపవాదు ఉంది. నిజానికి, పెద్దలతో పోలిస్తే పిల్లల్లోనే పాలను జీర్ణంచేసుకునే శక్తి ఎక్కువని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. ఎదుగుతున్న వయసులో పాల అండాదండా అవసరం. పాలలోని కాల్షియం... ఎముకల్ని దృఢంగా చేస్తుంది. రోజూ పాలు తీసుకునే చిన్నారుల్లో కాల్షియం లోపమే ఉండదు. పెద్దయ్యాక కూడా 'ఆస్టియోపొరోసిస్' వంటి వ్యాధులు దరిదాపుల్లోకి కూడా రావు. ఆడుకుంటున్నప్పుడో, ఆదమరచినప్పుడో ఎముకలు దెబ్బతిన్నా... త్వరగా కోలుకుంటారు. కాల్షియం గుండె పనితీరునూ ప్రభావితం చేస్తుంది. రోజూ పాలుతాగే పిల్లలు, పెద్దయ్యాక 'గుండె'దిటవు వ్యక్తులవుతారు. హృద్రోగ సమస్యలుండవు. దంతాలు ఆరోగ్యంగా తళతళలాడుతూ ఉంటాయి. దంతక్షయం, పిప్పిపళ్లు వంటి ఇబ్బందులు దాదాపుగా ఉండవు. విటమిన్ -ఎ కంటిచూపుకు శ్రీరామరక్ష. పాలలోని జింక్... పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. అవసరమైనన్ని పోషక విలువలు అందుతున్నప్పుడే పిల్లలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. చురుకుదనాన్ని ప్రదర్శిస్తారు. బాబో పాపో బాగా చదువుతున్నారంటే, రోజూ పాలు తాగుతున్నారనే అర్థం.
మొక్కలుగా ఉన్నప్పుడే పిల్లల్లో పాలంటే మక్కువ పెంచాలి. భోజనంలో పెరుగూ మజ్జిగా తీసుకునేలా ప్రోత్సహించాలి. ఆ కమ్మదనం ఏమిటో తెలియజెప్పాలి. క్రీడాకారులకైతే పాలను మించిన 'ఎనర్జీ డ్రింక్' లేదు. పాలల్లో సత్వరశక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు ఉన్నాయి. వ్యాయామం తర్వాత పాలు తాగడం వల్ల, కండరాలకు మంచి జరుగుతుందని తాజా పరిశోధనలు నిర్ధరిస్తున్నాయి. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు రోజుకు కనీసం అరలీటరు పాలు తీసుకోవాలని సూచిస్తారు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) నిపుణురాలు డాక్టర్ కె.దమయంతి.
యవ్వనంలో అండాదండా! టీనేజీ మార్పుల చౌరస్తా. అబ్బాయి పురుషుడైపోతాడు. అమ్మాయి పరిపూర్ణ స్త్రీగా అవతరిస్తుంది. ఎత్తులో బరువులో అనూహ్యమైన మార్పులు వచ్చేస్తాయి. చకచకా జరిగిపోయే ఈ పరిణామాల్ని తట్టుకోవాలంటే శరీరానికి ఎంతో శక్తి కావాలి. అది పాలతో వస్తుంది. ఎదిగేకొద్దీ పిల్లల అలవాట్లు మారిపోతూ ఉంటాయి. తమకంటూ ఇష్టాలూ అయిష్టాలూ ఏర్పడతాయి. పాల స్థానాన్ని కాఫీలూ టీలూ ఆక్రమించేస్తాయి. వాటివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఆకలి మందగిస్తుంది. నిద్ర తగ్గుతుంది. శీతలపానీయాలైతే మరీ ప్రమాదం. ఇలాంటి వాటికి అలవాటుపడ్డాక... మంచినీళ్లు తాగడం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా డీహైడ్రేషన్ సమస్యలొస్తాయి. పాలతో ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే... పాలలో నీళ్లూ ఉంటాయి.
రుచికరంగా అనిపించే పానీయాల్లో ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యాన్నిచ్చే కషాయాల్లో రుచి ఉండదు. పాల విషయానికొస్తే - హెల్త్ భీ... టేస్ట్ భీ! బరువు పెరుగుతున్నామన్న భయం యువతీయువకుల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ ఆలోచన రావడమే తరువాయి, తిండి మానేస్తారు. చిరుతిళ్లకు అలవాటైపోతారు. వీటన్నిటివల్ల పోషక విలువల లోపం ఏర్పడుతుంది. సగానికిపైగా టీనేజర్లలో కాల్షియం కొరత కొట్టొచ్చినట్టు కనబడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్నప్పటి నేస్తం... పాలను దూరం చేసుకోవడం వల్లే ఇన్ని సమస్యలు. చక్కగా రోజూ ఓ గ్లాసు పాలు తాగితే ఏ ఇబ్బందీ ఉండదు. మిగిలినవారితో పోలిస్తే... పాలుతాగే వారిలో (కొవ్వు తీసేసిన పాలు) వూబకాయ సమస్య ఉండదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, చక్కని జీవనశైలిని అలవరచుకుని రోజూ పాలుతాగే టీనేజర్లు... నడివయసులో కూడా అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం తక్కువని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకటించింది. క్షీరాభిమానులకు భవిష్యత్‌లో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశమూ తక్కువేనట.యువతీయువకుల్ని అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో పాలు తనవంతు పాత్ర పోషిస్తాయి. క్లియోపాత్రా గురించి కొత్తగా చెప్పేదేముంది? ఆమె రోజూ క్షీరాభిషేకం చేసుకునేదట. ముప్పూటలా పాలు తాగేదట. అందుకే, ఆ సౌందర్యరాశి మేని నిగారింపు మాగొప్పగా ఉండేదంటారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈరోజుల్లో అలాంటి ప్రయోగాలు ఎందుకు కాని, రోజూ ఓ గ్లాసు పాలు తాగితే సరిపోతుంది. అనేక సౌందర్య సాధనాల తయారీలో పాలు తప్పనిసరి. పాలలోని లాక్టిక్ యాసిడ్... పొడిబారిపోయిన చర్మకణాల్ని తొలగించి... కొత్త కాంతులు ప్రసాదిస్తుంది. పాల ఉత్పత్తులైన వెన్న, మీగడ, పెరుగు, మజ్జిగ... చర్మ సంరక్షణలో, కేశ సౌందర్యంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
పాలగ్లాసుతోనే కొత్తదంపతుల మురిపాల కాపురం మొదలవుతుంది. వెచ్చని పాలు ప్రేమబంధాన్ని చిక్కబరుస్తాయి. పాలలోని ప్రత్యేకగుణం... ఒత్తిడినీ అలసటనూ పోగొడుతుంది. తనువులో వలపు మెరుపులు మెరిపిస్తుంది. పాలకు శృంగార భావనలను పెంపొందించగల శక్తి ఉందని ఆయుర్వేదం చెబుతుంది. పాలలోని పోషక విలువలు, ఆ నవవధువుకు తల్లిపాత్ర పోషించడానికి అవసరమైన శారీరక సామర్థ్యాన్ని అందిస్తాయి. అన్ని దశల్లోనూ మహిళకు కాల్షియం చాలాచాలా అవసరం. అది పాలల్లో పుష్కలంగా దొరుకుతుంది. శాకాహారులైతే... పాలను నిర్లక్ష్యం చేయడానికే వీల్లేదు. జంతువుల్లో అధికంగా దొరికే బి-12 విటమిన్ పాలలోనే ఉంటుంది. పాలలో కుంకుమ పువ్వు కలుపుకొని తాగితే పండంటి బిడ్డ పుడతాడని నమ్మకం. ఆ బిడ్డకు కడుపునిండా పాలివ్వాలన్నా... తల్లి తగినన్ని పాలు తాగాల్సిందే. వయోధికులు వృద్ధాప్య సమస్యల్ని ఎదుర్కోవడంలో పాలు... అండగా నిలబడతాయి. ఐదుపదులు దాటినవారు రోజూ 250 నుంచి 300 మిల్లీలీటర్ల పాలూ పాల ఉత్పత్తులూ తీసుకోవాలని ఎన్‌ఐఎన్ సూచన.
పరిపూర్ణ ఆరోగ్యం... రోజూ కొవ్వు తీసిన పాలు తీసుకుంటే, అధిక రక్తపోటు సమస్య దరిచేరదని అమెరికాలో జరిగిన కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు పనితీరును కూడా పాలు ప్రభావితం చేస్తాయి. దాదాపు తొమ్మిది వందల మందితో జరిపిన ఓ అధ్యయనంలో... రోజూ ఓ గ్లాసు పాలు తాగేవారే అత్యధిక మార్కులు సాధించి అందరికంటే ముందున్నారు. నిజానికి, రోజూ పాలు తాగుతున్నారంటే ఆరోగ్య స్పృహ ఉన్నట్టే. అది వారి జీవన విధానం మీద కూడా ప్రభావం చూపుతుంది. చెడు అలవాట్ల నుంచీ అనారోగ్యకరమైన జీవనశైలి నుంచీ దూరంగా ఉంచుతుంది. రోజూ పాలుతీసుకునే వ్యక్తులకు క్యాన్సర్ ప్రమాదమూ తక్కువేనని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ దాదాపు యాభైవేలమందిని అతిదగ్గరగా పరిశీలించాకే ఈ అభిప్రాయానికి వచ్చింది. కణాల్లోని అసాధారణ వృద్ధిని కాల్షియం నియంత్రించగలదని నిపుణులు చెబుతున్నారు. న్యూజిలాండ్ పరిశోధకులు కూడా ఈ మాటతో ఏకీభవిస్తున్నారు. ఇది తీపికబురే అయినా, ఈ అంశంపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉంది.
జాగ్రత్త'పాలు' తక్కువే... తెల్లనివన్నీ పాలే అనుకోలేం. కొన్నిసార్లు విషం కూడా తెల్లగానే ఉండవచ్చు. 'కల్తీపాలు' అతిపెద్ద సమస్య. ఆహార ప్రమాణాల సంస్థ నిర్వహించిన తనిఖీల్లో వణుకుపుట్టించే నిజాలు వెల్లడయ్యాయి. దాదాపు 70 శాతం శాంపిళ్లు కల్తీవేనని తేలింది. పాలపొడి, గ్లూకోజ్ కలిపి కృత్రిమమైన పాలు తయారుచేస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. మరీ భయంకరంగా... హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా, డిటర్జెంట్లు మొదలైన వాటి అవశేషాలూ బయటపడ్డాయి. ఇక పాడి పరిశ్రమలో, పాల నిర్వహణలో అపరిశుభ్రత గురించి పట్టించుకునేవారే లేరు. దిగుబడి కోసం పశువులకు కృత్రిమమైన హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నవారూ ఉన్నారు. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకు 'అగ్ మార్క్' ఉన్నట్టే... పాలకూ 'మిల్క్ మార్క్' ఎందుకు ఉండకూడదు?
అవగాహన లేమితో, పాలలోని పోషక విలువల్ని చేతులారా నాశనం చేస్తున్నవారు ఎంతోమంది. రెండుమూడు నిమిషాలకు మించి వేడి చేయడం వల్ల పోషకశక్తులు అడుగంటుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మళ్లీమళ్లీ వేడిచేయడం వల్ల బి గ్రూపు విటమిన్లయిన... బి2, బి12 తగ్గుముఖం పడతాయి. తాగాలనుకున్న ప్రతిసారీ, కాస్త వెచ్చబెట్టుకుంటే సరిపోతుంది. రుచికి యాలకులు వేసుకుంటే... అచ్చంగా అమృతమే!పాల కడలిపై... పాలు... భారతీయ సంప్రదాయంలో ఓ భాగం. పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుడి నివాసం పాల సముద్రం. మంధరపర్వతంతో పాలను చిలికినప్పుడే అమృతం పుట్టింది. పాలతో దేవుణ్ని అభిషేకిస్తారు. నైవేద్యాల్లో పాలు ఉండాల్సిందే. అన్నప్రాశన నాటి క్షీరాన్నంతోనే పసివాడి భోజనం మొదలవుతుంది. గృహప్రవేశంలో పాలు పొంగించాల్సిందే. నాగులచవితికి పుట్టలో పాలుపోస్తాం. పంచారామాల్లో క్షీరారామం ఒకటి. ఇక్కడ శివుడు బాణం వేస్తే... భూమి లోంచి పాలు పొంగుకొచ్చాయని ఐతిహ్యం. పాలు రాజకీయాల్లోకీ ప్రవేశించాయి. వివాదాలు ఎదురైనపుడూ విమర్శలొచ్చినపుడూ... అభిమాన నేతల విగ్రహాలను పాలతో శుద్ధి చేయడం షరా మామూలైపోయింది. అప్పుడప్పుడూ వినాయకుడు పాలుతాగడం, సాయిబాబా కళ్లలో పాలుకారడం... వగైరా వగైరా పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి సందర్భంలోనే, ఓ కార్టూన్ వచ్చింది... ఓవైపు జనం లీటర్లకొద్దీ పాలుతెచ్చి వినాయకుడి తొండంలో పోస్తుంటారు. అవన్నీ మట్టిపాలు అవుతూ ఉంటాయి. మరోవైపు గుక్కెడు పాల కోసం ఓ పసివాడు గుక్కపెట్టి ఏడుస్తుంటాడు. నిజమే, పాల ఉత్పత్తిలో మనం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నా, తలసరి వినియోగంలో మాత్రం వెనుకబడే ఉన్నాం. రకరకాల సబ్సిడీల పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం... నిరుపేదలకు తక్కువ ధరకే పాలను మాత్రం ఎందుకు సరఫరా చేయకూడదు? దీనివల్ల పాడి పరిశ్రమను ప్రోత్సహించినట్టు ఉంటుంది. గ్రామీణ భారతానికి సాయం చేసినట్టూ ఉంటుంది. ఆ దిశగా ఎవరూ ఆలోచించడం లేదు. అసలు సమస్య నిధుల లేమి కాదు... చిత్తశుద్ధి లేకపోవడం! పాల విలువ తెలియకపోవడం! అన్నిటికంటే ముందు, మన నేతలందరితో రోజూ పాలు తాగించాలి. అప్పుడైనా వాళ్ల ఆలోచనల్లో మార్పు వస్తుందేమో.
ఎందుకంటే...పాలు బుద్ధివికాసాన్నిస్తాయి!
|
పాలోయమ్మ పాలు...'మధురానగరిలో చల్లలమ్మపోదు దారి విడుము కృష్ణా!' అంటూ గొల్లభామలు అల్లరి కృష్ణుడిని వేడుకునే కమనీయ దృశ్యాన్ని తలచుకున్నప్పుడు... పక్కా వ్యాపార బుర్రలకు ద్వాపరయుగంలోని పాల బిజినెస్ గుర్తుకు వస్తుంది! అలా... నెత్తిమీద పాలకుండో, పెరుగు గిన్నో పెట్టుకుని పట్టణాలకు వెళ్లి 'పాలోయమ్మ పాలు... పెరుగోయమ్మ పెరుగు' అని అమ్ముకోవడం తొలిదశ. ఇప్పుడు పాలంటే వేలకోట్ల వ్యాపారం. దేశీయంగా జరుగుతున్న పాల ప్యాకెట్ల వ్యాపారం విలువ 50 వేల కోట్లు. బ్రాండెడ్ వెన్న మార్కెట్ పన్నెండు వందల కోట్ల నుంచి పద్నాలుగు వందల కోట్లు. చీజ్ మార్కెట్ అటూ ఇటుగా ఐదువందల కోట్లు. సుగంధ పాల మార్కెట్ ఎంతలేదన్నా మూడువందల కోట్లు! 2015 నాటికి భారత్‌లో పాల ఉత్పత్తి 190 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం వార్షిక టర్నోవరు 5 లక్షల కోట్లను దాటుతుంది. గుజరాత్‌లో సహకార సూత్రాలపై నడుస్తున్న 'అమూల్' పాల ఉత్పత్తుల మార్కెట్‌లో సింహభాగాన్ని ఆక్రమించుకుంది. ఒక్క వెన్న వ్యాపారంలోనే 90 శాతం వాటా అమూల్‌దే! సహకార మూలాలున్న 'మదర్ డెయిరీ', కార్పొరేట్ స్థాయిలో నడుస్తున్న హెరిటేజ్, తిరుమల మిల్క్‌ఫుడ్, నెస్లే, బ్రిటానియా వంటి సంస్థలు మార్కెట్‌లో వాటా పెంచుకోడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఐస్‌క్రీమ్ తయారీ, మిఠాయిల వ్యాపారం, హోటళ్లు తదితర రంగాలు కూడా ప్రత్యక్షంగా పాలపైనే ఆధారపడుతున్నాయి. కోట్ల మంది రైతులకు పాడిపరిశ్రమ అదనపు ఆదాయవనరు. ఇప్పటికీ 80 శాతం పాల ఉత్పత్తి అవ్యవస్థీకృత రంగంలోనే జరుగుతోంది. దేశీయంగా పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలు పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కంటే ముందున్నాయి. అంతర్జాతీయంగా పాకిస్థాన్, చైనా, ఇటలీ మన తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వర్ఘీస్ కురియన్ నేతృత్వంలో 1970లో ప్రారంభమైన 'శ్వేత విప్లవం'తోనే ఈ అభివృద్ధి అంతా! |
అపోహలూ అనుమానాలూఅపోహ: పాలకూరలోనూ కాల్షియం ఉంటుంది. అలాంటప్పుడు, పాలే ఎందుకు?నిజం: నిజమే, పాలకూరలోనూ కాల్షియం ఉంటుంది. కానీ పాలకూరతో పోలిస్తే పాలలోని కాల్షియం మూడురెట్లు ఎక్కువ. దానికి మించి, పాలలోని విటమిన్-డి... కాల్షియం పనితీరును మెరుగుపరుస్తుంది.
అపోహ: పాలు తాగితే ఆస్తమా వస్తుంది.
నిజం: పాలకూ ఆస్తమాకూ ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే, పెద్దయ్యాక ఆస్తమా వచ్చే అవకాశం ఉన్న కొందరు పిల్లల్లో 'మిల్క్ ఎలర్జీ' లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
అపోహ: పాలు తాగితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
నిజం: ఇది కూడా అర్థంలేని ప్రచారమే. నిజానికి, పాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కొంతమేర అడ్డుకుంటాయి.
అపోహ: కాచిన పాలకంటే గుమ్మపాలే ఆరోగ్యం!
నిజం: కాదు, కాచిన పాలే మెరుగు. పాలను ఓ స్థాయివరకు వేడిచేయడం వల్ల అందులోని హానికర క్రిములు నాశనం అవుతాయి.
అపోహ: గేదెపాలకంటే ఆవుపాలే శ్రేష్ఠం.
నిజం: ఆవు పాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. దీంతో పసిపిల్లలకు తేలిగ్గా జీర్ణం అవుతుంది. అంతకుమించి, పోషక విలువల్లో గణనీయమైన తేడాల్లేవు. |
రకరకాలు...హోల్ మిల్క్, స్కిమ్డ్‌మిల్క్, పాశ్చరైజ్డ్ మిల్క్... పాల ప్యాకెట్ల మీద రకరకాల పేర్లు. ఎందులో ఏం ఉంటాయనే విషయంలో... అనేక సందేహాలు.* హోల్ మిల్క్ అంటే... కొవ్వు తీయని పాలు. ఇందులో కొవ్వేకాదు, క్యాలరీలూ ఎక్కువే. * స్కిమ్డ్ మిల్క్‌లో కొవ్వు తీసేస్తారు. ఫలితంగా కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. క్యాలరీలూ తక్కువే. * ఓ స్థాయి దాకా వేడి చేసి చల్లార్చినవి... పాశ్చరైజ్డ్ మిల్క్. దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది. దాంతోపాటే కొన్ని పోషక విలువలూ తగ్గుతాయి.
* హోల్ మిల్క్‌కు స్కిమ్డ్‌మిల్క్ పౌడరూ నీళ్లూ చేర్చితే టోన్డ్ మిల్క్. కొవ్వుశాతాన్ని బట్టి వాటిని సాధారణ టోన్డ్ మిల్క్‌గా, డబుల్ టోన్డ్ మిల్క్‌గా విభజిస్తారు.
* హోమోజనైజ్డ్ మిల్క్... పాలపై ఒత్తిడి పెంచి చిన్నచిన్న రంధ్రాల గుండా మరో పాత్రలోకి మళ్లిస్తారు. దీనివల్ల... పాలలోని కొవ్వు కణాలు సమానంగా విస్తరిస్తాయి. ఒకేచోట పేరుకుపోయే అవకాశం ఉండదు.
శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణలతో పాలలో అదనంగా విటమిన్లూ ఖనిజాలూ జోడిస్తున్నారు. వాటిని 'ఫోర్టిఫైడ్' మిల్క్ అని వ్యవహరిస్తారు. సోయాపాలు కూడా ఇటీవల ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటిలో కొలెస్ట్రాల్, కొవ్వు తక్కువ. బియ్యం, ఓట్స్, ఆల్మండ్ తదితరాల నుంచి కూడా పాలు తీస్తున్నారు. ఒంటెపాలు, గాడిదపాలు... శ్రేష్ఠమని నమ్మేవారూ ఉన్నారు. |
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి