'విశ్వ'నాథుడే (Special page)
ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచినపుడో.. లేదా మరేదైనా టోర్నీలో నెగ్గినపుడో మాత్రం మనం ఆనంద్ గురించి నాలుగు ముక్కలు చెప్పుకుంటాం.. గేమ్‌లో భలేగా ఎత్తులు వేశాడంటూ మాట్లాడుకుంటాం! కానీ ఓ గేమ్‌కు ముందు, ఓ టోర్నీకి ముందు ఆనంద్ ఎంత శ్రమిస్తాడో.. ఎంతగా బుర్రకు పనిపెడతాడో తెలుసుకుంటే ఆశ్చర్యానికి గురికాక తప్పదు! 1995లో తన తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాస్పరోవ్ చేతిలో ఓడిన ఆనంద్‌కు.. ప్రత్యర్థి బలమేంటో తెలిసింది.. అదే ఓపెనింగ్ గేమ్. దీన్ని విశ్లేషించడానికి ఏకంగా నెలన్నరపాటు మరో పని పెట్టుకోలేదు ఆనంద్. ఏకంగా 80 వేల గేమ్‌లను విశ్లేషించాడతను. ఈ శ్రమతోనే ఆనంద్ తనను తాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆనంద్ ఇప్పటిదాకా అధ్యయనం చేసిన సమాచారం కొన్ని కోట్ల బైట్లకు, కొన్ని వేల పుస్తకాలకు సమానం!
దిగ్గజాలూ ఒప్పుకున్నారు!: ఒకనాడు ప్రపంచానికి చెస్ నేర్పించిన భారత్.. రెండు మూడు దశాబ్దాల క్రితం కనీసం ఒక్క ఇంటర్నేషనల్ మాస్టర్‌ను తయారు చేయలేని స్థితిలో ఉంది. ఆ స్థితి నుంచి మన దేశం చదరంగంలో రారాజైన రష్యాకే సవాల్ విసిరే స్థాయికి చేరిందంటే అది ఆనందుడి చలవే. చెస్ ప్రపంచమంతా 'ఆల్‌టైం గ్రేట్'గా కీర్తించిన కాస్పరోవ్ సైతం.. ఆనంద్‌కు తిరుగులేదని, అతణ్ని అధిగమించడం కొత్త తరానికి కష్టసాధ్యమేనని తేల్చేశాడంటే ఆనంద్ ఏ స్థాయికి చేరాడో అర్థం చేసుకోవచ్చు. టోర్నమెంట్, మ్యాచ్, ర్యాపిడ్, నాకౌట్.. ఇలా అన్ని రకాల ఫార్మాట్లోనూ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌ను మరో దిగ్గజం కావలెక్ ''చెస్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఛాంపియన్''గా కీర్తించాడు. గతంలో ఎప్పుడూ ఆనంద్ గురించి పొగడని క్రామ్నిక్ సైతం ఆనంద్‌ను కాస్పరోవ్‌కు సరిసమానుడంటూ తీర్పిచ్చేశాడు.
అంతా అతని చలవే: కేవలం ఆనంద్ విజయాల్ని మాత్రమే అతనికి ఆపాదించలేం. హరికృష్ణ, హంపి, శశికిరణ్, గంగూలీ, హారిక, లలిత్‌బాబు.. ఇలా అందరి విజయాల్లోనూ, అందరి ఘనతల్లోనూ ఆనంద్‌కు పాత్ర ఉంది. ఎందుకంటే మనలోనూ అంతర్జాతీయ స్థాయి చెస్ ప్రతిభ ఉందని చాటింది ఆనందే. తర్వాతి తరం చెస్‌ను కెరీర్‌గా స్వీకరించేలా చేసింది ఆనందే. అతను దేశంలో చెస్ విప్లవమే సృష్టించాడని చెప్పుకోవచ్చు. మనకు ఇప్పుడింతమంది ఇంటర్నేషనల్, గ్రాండ్‌మాస్టర్లు ఉండటం ఆనంద్ చలవే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి