పొగ పెట్టేస్తోంది


పొగ పెట్టేస్తోంది
కొన్ని కోట్ల మంది ప్రజలను వూపిరితిత్తులు, గొంతు క్యాన్సర్‌లాంటి తీవ్రమైన అనారోగ్యాలకు గురి చేస్తోంది. ఏటా ఎన్నో లక్షల ప్రాణాలను బలితీసుకుంటోంది. ఆ విష వృక్షమే పొగాకు. అలాంటి దానికి దూరంగా ఉండాల్సింది పోయి, కోరి కోరి నోట్లో పెట్టుకుంటున్నవారు ఇప్పటికైనా ఆలోచిస్తారా..?
మే 31 - ప్రపంచ పొగాకు వ్యతిరేకదినం
పొగాకులో 4000 రకాల రసాయన పదార్థాలుంటాయి. అందులో కనీసం నాలుగొందల రకాలు ఆరోగ్యానికి తీవ్రంగా హాని చేసేవే. రోజూ తినే ఆహారంలో అయిదొంతులు పండ్లూ కూరగాయలు తింటూ వ్యాయామం చేసేవారైనా సరే పొగతాగే అలవాటుంటే వారి ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లేనట. 
పొగాకులో ఉండే కార్సినోజెన్‌- క్యాన్సర్లు రావడానికి కారణం అయితే, నికోటిన్‌ శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచుతుంది. నికోటిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ల మిశ్రమం ధమనుల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి, రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల హృదయం, మెదడుల్లో రక్తం గడ్డ కట్టి అకస్మాత్తుగా మరణాలు సంభవించే అవకాశం ఉంది. కొందరికి అవయవాలు పనిచేయకుండా పోయే పరిస్థితీ వస్తుంది. 
తొంభైశాతం వూపిరితిత్తుల క్యాన్సర్‌ రోగులు, హార్ట్‌ఎటాక్‌ వచ్చేవారిలో ముప్ఫై శాతం మందీ పొగతాగేవారే. వీరికి గొంతు, నోటి క్యాన్సర్లు రావడం కూడా చాలా సహజం. మిగతావారికి ఇవి అరుదుగా వస్తాయి. వివిధరకాల క్యాన్సర్లు, కిడ్నీలు చెడిపోవడం, అధిక రక్తపోటు, ఆస్థమా, పక్షవాతం, అల్సర్లలాంటి రోగాలను తెచ్చిపెట్టడంతో పాటు కంటి చూపుకు కూడా హాని కలిగిస్తుంది ధూమపానం. 
మిగతావారితో పోల్చితే పొగతాగే వారికి పిల్లలు పుట్టే అవకాశాలూ తక్కువేనట.
ధూమపానం అందాన్నీ పాడుచేస్తుంది. ఒక సిగరెట్‌ తాగితే గంటపాటు చర్మానికి రక్త ప్రసరణ సరిగా జరగదు మరి. 
ఒక సిగరెట్‌ మనిషి ఆయుర్దాయాన్ని 11 నిమిషాలు తగ్గిస్తుంది. 
పొగ తాగడం వల్ల వచ్చే వ్యాధులతో డెబ్భయ్యేళ్ల వయసుకు ముందు చనిపోయేవారి సంఖ్య... రొమ్ము క్యాన్సర్‌, ఎయిడ్స్‌, వాహన ప్రమాదాలు, మాదక ద్రవ్యాల వల్ల చనిపోయేవారికంటే ఎక్కువ.
'పొగాకును పండించిన నేల కలుషితమైనట్లే, పొగాకును ముట్టుకుంటే అమృత్‌సర్‌లోని సరస్సులో స్నానం చేయాలి. ధూమపానం పాపం. పొగాకును నమిలితే సర్వం పోగొట్టుకుంటావు...' అని సిక్కుల నియమావళి (సిఖ్‌ రెహత్‌ మర్యాదా) చెబుతుంది. ప్రపంచంలో పొగాకును నిషేధించిన ఏకైక మతం ఇదే. 
ప్రయత్నిస్తే వదిలించుకోవచ్చు
ధూమపానం మీద విముఖతను కలిగించడానికి కొన్ని రకాల ఔషధాలు మార్కెట్లోకి వస్తున్నాయి. నికోటిన్‌ ప్యాచెస్‌ను శరీరంపై అతికించుకుంటే చర్మంపై సూక్ష్మరంధ్రాల ద్వారా నికోటిన్‌ శరీరంలోకి కొద్ది మోతాదులో ప్రవేశిస్తుంది. నికోటిన్‌ చూయింగ్‌ గమ్‌లూ, ముక్కులో వేసుకునే స్ప్రేలూ అందుబాటులో ఉన్నాయి. మానేయాలన్న దృఢ సంకల్పం అన్నిటికన్నా ముఖ్యం.
మనదేశంలో...
భారత్‌లో పొగతాగడం వల్ల ప్రతి ఏడాదీ పది లక్షల మంది ప్రాణాలను కోల్పోతున్నారు.62శాతం పొగరాయుళ్లు 30 నుంచి 69ఏళ్ల వయసులోపే చనిపోతున్నారట.
బీడీ తాగేవాళ్ల ఆయుర్దాయం ఆరేళ్లు తగ్గుతోంది. రోజుకు ఏడు, అంతకన్నా తక్కువ బీడీలు తాగే వారి ఆయుష్షు 25 శాతం తగ్గితే, అదే సంఖ్యలో సిగరెట్లు తాగితే 50 శాతం ఆయుష్షు క్షీణించే అవకాశాలున్నాయన్నది ఓ సర్వే. 
మనదేశంలో 12కోట్ల మంది ధూమపాన ప్రియులున్నారని అంచనా.
2008 అక్టోబర్‌ రెండునుంచి మనదేశంలో థియేటర్లు, ఆసుపత్రులు, హోటళ్లు, బస్సులు, రైల్వే స్టేషన్లు, పార్కులు, షాపింగ్‌ మాల్స్‌ లాంటి జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించింది ప్రభుత్వం. 
భారత్‌లో 40శాతం ఆరోగ్య సమస్యలకూ 50శాతం క్యాన్సర్లకూ ధూమపానమే ప్రధాన కారణం.
పక్కనున్నవాళ్లకి ఎక్కువ ప్రమాదం
సిగరెట్లు తాగేవారికన్నా పక్కనుంచి పొగను పీల్చేవారికే ఆరోగ్య సమస్యలు ఎక్కువ.పొగతాగేవాళ్లున్న ఇంట్లోని పిల్లలకు ఉబ్బసం, అలర్జీలు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. 
రెండేళ్ల లోపు చిన్నారులపైన ఈ ప్రభావం ఒక్కోసారి ప్రాణాలను కూడా తీసేంత తీవ్రంగా ఉంటుంది. ధూమపానం చేసేవారి వల్ల గర్భస్థ శిశువులకీ నష్టమే.
పెద్దవారిలో అయితే, వూపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వివిధ రకాల క్యాన్సర్లు, ఇంకా ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది
ప్రపంచవ్యాప్తంగా ఎనభైశాతం పొగరాయుళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారట.ధూమపానం ఇప్పట్లానే ఉంటే 21వ శతాబ్దంలో వందకోట్లమంది దానికి బలయ్యే అవకాశం ఉందట. ప్రస్తుతం సంవత్సరానికి దీనివల్ల 60 లక్షల మంది మరణిస్తున్నారనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక.
ధూమపాన ప్రియులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటిది చైనా, రెండోది భారత్‌.
10 నుంచి 24 ఏళ్లలోపు వయసున్నవారిలో 180 కోట్లమంది సిగరెట్లు తాగుతున్నారనేది ఓ సర్వే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు