తిరుగులేని పల్లె! (Eenadu Sunday Magazine 29/04/2012)
మనం గొప్పగా చెప్పుకునే మహానగరాల్లో ఏం ఉంది? దగ్గర్లోని ఏ పల్లెటూరి చెరువులోంచో నీళ్లు మళ్లిస్తారు. గ్రామాల నుంచే కూరగాయలూ పాలూ వెళ్తాయి. అలాంటప్పుడు, పరాన్నజీవుల్లాంటి నగరాలే ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి? పల్లెలు మాత్రం అలానే ఎందుకు ఉంటున్నాయి?...పదీపన్నెండేళ్ల దళిత బాలుడికి కలిగిన సందేహమిది. ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా అందుకున్నాక కూడా సమాధానం దొరకలేదు. మూడుపదుల వయసులో సంతృప్తికరమైన సమాధానం లభించింది. అదీ ఏ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోనో కాదు. సర్పంచిగా ఎన్నికై, తన గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఆ యువకుడి పేరు ఇళంగో రంగస్వామి. చెన్నై నుంచి ముప్ఫై అయిదు కిలోమీటర్ల దూరంలోని కుత్తంబాకం అతని సొంతూరు. ఆ వూళ్లో ఎప్పుడూ ఏదో ఓ సమస్య. అక్రమ మద్యం ఏరులైపారేది. తాగిన మత్తులో రోజూ గొడవలే. దళితులపై దాడులకైతే హద్దూ అదుపూ లేదు. గ్రామపాలనలో అంతులేని అవినీతి. ఏ సంక్షేమ కార్యక్రమమైనా జనం దాకా వచ్చేది కాదు. రోడ్ల పరిస్థితి అధ్వానం. తాగునీటికి ఎప్పుడూ కటకటే. ఉపాధి అవకాశాలు లేనేలేవు. 'మా వూరికే ఎందుకిన్ని సమస్యలు?' అనిపించేది. ఆ ప్రశ్నకు జవాబు తెలిసేలోగా కుర్రాడు పెద్దవాడైపోయాడు. ప్రతిభావంతుడు కావడంతో ఐఐటీ(మద్రాసు)లో సీటొచ్చింది. పట్టాచేతికి వచ్చేలోపే, భువనేశ్వర్‌లో మంచి ఉద్యోగం దొరికింది. సెలవులకు సొంతూరికి వచ్చిన ప్రతిసారీ ఏదో ఆత్మన్యూనతాభావం! తన వాళ్ల కోసం ఏమీ చేయలేకపోతున్నానన్న బాధ. అలా అని అప్పటికప్పుడు రాజీనామా ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు. బరువులూ బాధ్యతలూ ఉండనే ఉన్నాయి. కనీసం, సొంతూరికి దగ్గరగా వెళ్తే అయినా ఎంతోకొంత చేయగలనేమో అనుకున్నాడు. అందుకే, చెన్నైలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్)లో శాస్త్రవేత్తగా చేరాడు. కోరుకున్నట్టే వూరికి దగ్గర్లో అయితే ఉన్నాడు కాని, ఆఫీసు బాధ్యతల కారణంగా వారాంతాల్లో కూడా తీరిక దొరికేది కాదు. ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సిన సమయం రానే వచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఏటా వందలమంది, వేలమంది విద్యార్థులు ఐఐటీల నుంచి బయటికొస్తారు. నేరుగా అట్నుంచి అటే ఏ బహుళజాతి సంస్థ కొలువుకో వెళ్లిపోతారు. లేదంటే, అమెరికా విమానం ఎక్కేస్తారు. రంగస్వామికి మాత్రమే ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చింది? ఎందుకంటే, అతను సమస్యల్లో పుట్టాడు, సమస్యల మధ్య పెరిగాడు. దళితుడిగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ప్రధాన వీధుల్లో తల ఎత్తుకుని నడవలేని దుస్థితి. తోటి పిల్లలంతా క్యారేజీలు విప్పుకుని భోంచేస్తుంటే...చెంబు నిండా మంచినీళ్లు తాగి కడుపు తడిమి చూసుకునేంత పేదరికం. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నవారూ వైద్యం అందక ప్రాణాలు కోల్పోయినవారూ.. ఒకటేమిటి, కళ్లముందే కటిక దారిద్య్రాన్ని చూశాడు.యువజన సైన్యం... రాజీనామా సమర్పించగానే, రంగస్వామి దేశమంతా తిరిగాడు. బాగా అభివృద్ధి చెందిన గ్రామాలన్నీ సందర్శించాడు. ఆ విజయాల వెనకున్న కారణాల్ని విశ్లేషించుకున్నాడు. అప్పుడో స్పష్టత వచ్చింది. కుత్తంబాకం వెళ్లిపోయి, తనలాగే సొంతూరు బాగుపడాలని కోరుకునే యువకులను కూడగట్టాడు. తన కార్యక్రమాలకు వేదికగా ఒక యువజన సంఘాన్ని స్థాపించాడు. అందులో రకరకాల విభాగాలుంటాయి. ఒక్కో బృందంలో కొంతమంది సభ్యులుంటారు. తల్లిదండ్రులతో మాట్లాడి బాలకార్మికులను బడికి పంపడం, ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అవినీతిపై సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయటం... ఇలా ఒక్కో విభాగం ఒక్కో బాధ్యత తీసుకుంది. ఆ పల్లెలో అదో గొప్ప మార్పు. ఒక చిన్న లేఖతో సమస్య పరిష్కారం అవుతుందా, అర్జీపెడితే ఆఫీసర్లను కూడా బదిలీ చేసేస్తారా..సామాన్యులకు ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ సంతోషం ఎంతోకాలం నిలబడలేదు. యువజన సంఘంలో చురుగ్గా ఉండే సభ్యుల్లో చాలామంది...ఉద్యోగమనో, ఉపాధి కోసమనో పట్టణాలకు వలస వెళ్లిపోయారు. రంగస్వామి దాదాపుగా ఒంటరివాడైపోయాడు. ఒక వ్యక్తిగా చాలా పరిమితులు ఉంటాయి. ప్రజాప్రతినిధిగా అయితే, మరింత సమర్ధంగా పనిచేయగలనేమో అనిపించింది. అప్పుడే పంచాయతీ ఎన్నికలొచ్చాయి. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, స్వతంత్రంగా బరిలో దిగాడు. 60 శాతం ఓట్లతో విజయం సాధించాడు. సర్పంచిగా ప్రజా జీవితం మొదలైంది. సర్పంచికి విధులెక్కువ, నిధులు తక్కువ. రంగస్వామికి ఆ విషయం అర్థంకావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో చాలామందికి తెలియదు. ఏమీ చేయలేమన్న నిస్పృహ ఆవరించేస్తుంది. పలాయనవాదానికి అలవాటు పడతారు. ఏవో సాకులు చూపుతూ ఐదేళ్లు నెట్టుకొస్తారు. రంగస్వామి మాత్రం నిరాశపడలేదు. అందుబాటులో ఉన్న వనరులతోనే ఒక్కో పనీ చేసుకుంటూ ముందుకెళ్లాడు.వూళ్లో ప్రధాన సమస్యలు - తాగునీరు, పంటనీరు. గ్రామ ప్రజలను ఒక్కటి చేసి, శ్రమదానంతో చెరువు పూడిక తీయడానికి పూనుకున్నాడు. ప్రతీ కుటుంబం ఉత్సాహంగా పాల్గొంది. ఇంట్లో ఇద్దరు పెద్దలుంటే ఒకరు బయటి పనులకెళ్తే, ఇంకొకరు శ్రమదానానికి వచ్చేవారు. రంగస్వామి ... కరెంటు సరఫరాను లెక్కించినట్టే, నీటి అవసరాలనూ గణించాడు. ప్రతీ కుటుంబానికి 24 గంటలూ తాగునీరు కావాలంటే, సాగునీరు అందాలంటే ఎన్ని వనరులుండాలి? ఆ అవసరం మేరకు పూడికతీత జరిగింది. వాననీటి సంరక్షణ కార్యక్రమమూ చురుగ్గా ప్రారంభమైంది. ఒక్క నీటి చుక్క కూడా వృథాగా పోవడానికి వీల్లేదు. నేరుగా చెరువులో పారాల్సిందే. ఎందుకూ పనికిరాకుండా పడున్న తరాలనాటి చెరువులకు మరమ్మతులు చేయించాడు. శ్రమదానం ఫలితంగా...వాటికి జీవకళ వచ్చింది. ఆ ప్రభావంతో భూగర్భ జలమట్టం పెరిగింది. తాగునీటి సమస్య పరిష్కారమైంది. నడివేసవిలోనూ ఈ చెరువుల్లో కనీస నీటిమట్టం పదమూడు అడుగులకు తగ్గదు. ఆ జల విజయం పక్క గ్రామాలకూ పక్క తాలూకాలకూ పక్క జిల్లాలకూ స్ఫూర్తినిచ్చింది. సర్పంచులకూ గ్రామీణాభివృద్ధి అధికారులకూ పర్యాటక కేంద్రమైంది. విజయ రహస్యాలను అందరితో పంచుకోడానికి రంగస్వామి గ్రామ అధ్యక్షుల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కేంద్రం వర్షపునీటి పొదుపు, పూడికతీత తదితర అంశాలపై వందలాది మందికి పాఠాలు చెప్పింది. పొదుపే మదుపు! మోయలేనన్ని పన్నులు విధించి... ఆ డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం గొప్పకాదు. అలా అని, ప్రత్యేకంగా నిధులు కేటాయించమని ప్రభుత్వాన్ని అడగడమూ దండగే. సర్కారువారికి మన మొరలు ఆలకించేంత తీరికా ఓపికా ఉండదు. ఇక, స్వచ్ఛంద సంస్థల పరిమితులు స్వచ్ఛంద సంస్థలకుంటాయి. గ్రామ పంచాయతీని ఆర్థికంగా శక్తిమంతం చేయడానికి రంగస్వామి సరికొత్త వ్యూహాన్ని రచించాడు. ఒక రూపాయి పొదుపు చేయడమంటే, ఒక రూపాయి సంపాదించడమే! ఇదే సూత్రాన్ని ఖజానాకూ వర్తింపజేశాడు. దుబారా అన్నది ఏ విభాగంలో ఉన్నా, ఏ మేరకు ఉన్నా ... తగ్గించాల్సిందే! ముందుగా విద్యుత్ వంతు. పంచాయతీ ఆఫీసుకూ ఇతర ప్రభుత్వ కార్యాలయాలకూ కరెంటు బిల్లుల కోసం గ్రామ పంచాయతీ వేలాది రూపాయలు కేటాయిస్తోంది. వీధి దీపాలు సరేసరి. సగటున ప్రతి వీధి దీపం (100 ఓల్టుల బల్బు)పై నెలకు ఎనభై రూపాయలు చెల్లిస్తోంది. ఈ లెక్కన గ్రామంలోని మొత్తం 400 వీధిదీపాల విద్యుత్ బిల్లు నెలకు రూ. 32వేలు. గుండు బల్బులతో విద్యుత్ వినియోగం ఎక్కువ. వెంటనే వాటి స్థానంలో ... కాంపాక్ట్ ఫ్లోరొసెంట్ (సీఎఫ్‌ఎల్) దీపాలను అమర్చారు. విద్యుత్ పొదుపుపై గ్రామ ప్రజలకున్న చిత్తశుద్ధిని ప్రోత్సహిస్తూ సీఎఫ్‌ఎల్ దీపాల తయారీ సంస్థ ప్రత్యేక రాయితీని ప్రకటించింది. ఈ ప్రయోగంతో దాదాపు 60 శాతం వరకు విద్యుత్ ఆదా సాధ్యమైంది. ఒక్కో దీపానికి అయ్యే కరెంటు ఖర్చు ఎనభై రూపాయల నుంచి ముప్ఫై రూపాయలకు తగ్గింది. ఈ పొదుపు విలువ నెలకు ఇరవై వేలు, ఏడాదికి రూ.2.40 లక్షలు. పొదుపు చర్యలు ఇక్కడితో ఆగలేదు. వెంటనే మరో ప్రయోగం. డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ఉపయోగించే రాళ్లను కాంట్రాక్టర్ల ద్వారా తెప్పించకుండా, సమీపంలోని కొండరాళ్లను పగులగొట్టి వాడుకున్నారు. దీంతో చాలా ఖర్చు తగ్గింది. ప్రభుత్వం పదిహేను లక్షలు కేటాయిస్తే, రంగస్వామి నాలుగు లక్షలకే పని పూర్తిచేసి చూపించాడు. ఈ నిర్ణయం క్వారీ వ్యాపారులకు ఆగ్రహాన్ని కలిగించింది. నిబంధనల ప్రకారం వ్యవహరించలేదంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగస్వామిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ఖజానాకు పదకొండు లక్షలు మిగిల్చినందుకు ఇదీ ప్రతిఫలం! ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. గ్రామంలో నిరసన దీక్ష ప్రారంభమైంది. ఆ సెగ ప్రభుత్వానికీ తాకింది. సాయంత్రంలోపే ఉత్తర్వులు రద్దు చేశారు. 'ఆ మద్దతు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రజలు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థమైంది' అంటాడు రంగస్వామి. ఉపాధి బాటలో... గ్రామంలో తాగునీటి సమస్యలేదు. సాగునీటి కొరతా లేదు. ఉన్నంతలో మంచి రోడ్లున్నాయి. వీధి దీపాలున్నాయి. అయినా జనం వలస వెళ్తున్నారు. కారణం...ఉపాధి కొరత! ఇక వూళ్లోనే ఉంటున్నవారికి సారా తయారీ తప్పించి, మరో పని తెలియదు. ఆ వూరు కాపుసారాకు పెట్టింది పేరు! గ్రామంలో మద్యం బానిసలూ ఎక్కువే. శాంతిభద్రతల విఘాతానికి ఇదో కారణం. చేతినిండా పని కరవై, పట్టణాలకు వలస వెళ్తున్నవారికి ఉపాధి మార్గం చూపించాలి. సారా తయారీ తప్పించి, మరో పని తెలియనివారికి తగిన శిక్షణ ఇప్పించాలి. గ్రామ వనరులు, అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలపై అధ్యయనం ప్రారంభమైంది. కుత్తంబాకం వ్యవసాయ గ్రామమే అయినా, వూళ్లో ఒక్క రైస్‌మిల్లు కూడా లేదు. దీంతో పంటల్ని పట్నం దాకా తీసుకెళ్లాల్సి వస్తుంది. అసలే అంతంత మాత్రం ధరలు, దానికితోడు రవాణా ఖర్చులు. వూళ్లోనే ఓ రైస్‌మిల్లు ఏర్పాటు చేస్తే .. రైతులకు లాభం, ఓ వందమందికి ఉపాధి. గ్రామ పంచాయతీకి కూడా ఆదాయం లభిస్తుంది.గ్రామానికి సంబంధించి ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా, గ్రామసభ ద్వారా ప్రజలకు తెలియజేయడం, వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం...రంగస్వామి ముందునుంచీ పాటిస్తున్న విధానమే ఇది. పారదర్శకత వల్ల ప్రజలకు ఆయన మీద నమ్మకం పెరిగింది. రైస్ మిల్లు ఆలోచన బ్యాంకులనూ ఆకర్షించింది. పంచాయతీ నిధులకు బ్యాంకుల ఆర్థిక సహకారం తోడైంది. ఆదర్శ గ్రామంలో కొత్త తరహా ప్రయోగం కావటంతో దీనికి 'మినీ మోడల్ రైస్‌మిల్'గా నామకరణం చేశారు. ఆతర్వాత పప్పు దినుసుల మిల్లు, నూనె గింజల మిల్లు కూడా ఏర్పాటయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల రైతులూ ఈ మిల్లులనే వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం వీటివల్ల సుమారు 200 కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. వీరంతా ఒకప్పుడు మద్యాన్ని నమ్ముకుని బతికినవారే. దీనివల్ల, గ్రామంలో సారా తయారీ తగ్గింది. అదే ఉత్సాహంతో... మరో అడుగు ముందుకేశాడు రంగస్వామి. ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి ఎంతోమంది యువకులు నగరానికి వలస వెళ్తారు. రోజూ పొద్దున్నే వెళ్లి ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకునేవారూ చాలామందే ఉన్నారు. వూళ్లోనే ఏదైనా ఫ్యాక్టరీ ప్రారంభిస్తే, ఆ అవసరం ఉండదుగా! పారిశ్రామిక వేత్తలను కలిసి తన ఆలోచన వివరించాడు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడబోమని హామీ ఇచ్చాడు. ఐఐటీ పూర్వ విద్యార్థి కాబట్టి, రంగస్వామి సామర్థ్యం మీద ఎవరికీ అనుమానం కలగలేదు. వెంటనే సరేనన్నారు. లెదర్ షూస్, హ్యాండ్‌బ్యాగుల తయారీ యూనిట్ అలా వచ్చిందే. తక్కువ ఇంధనంతో పనిచేసే బర్నర్ల తయారీ విభాగాన్ని కూడా ప్రారంభించాడు. టీ, కాఫీ పొడులు, బేకరీ ఐటమ్స్, గిన్నెలు తోమే సబ్బులు, ఇటుకలు... మొత్తం 13 రకాల వస్తువులు కుత్తంబాకంలో తయారవుతున్నాయి. ముడిసరుకును పరిశ్రమలే అందిస్తాయి. ఉత్పత్తిలో భారీ యంత్రాలు వినియోగించరు. చిన్నచిన్న పరికరాలతోనే పనులు జరుగుతాయి. అందులో చాలావరకూ రంగస్వామి డిజైన్ చేసినవే. దీనివల్ల పెట్టుబడి ఖర్చు బాగా తగ్గింది. రెండేళ్లలో గ్రామ ఆర్థిక పరిస్థితే మారిపోయింది. కుత్తంబాకం విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగింది. ప్రజల ఆర్థిక పరిస్థితిలోనూ చాలా మార్పు వచ్చింది. నెలకు ఎనిమిది వేలదాకా సంపాదిస్తున్నారు. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. ఇంటికే పరిమితమైన మహిళలకూ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతీ మహిళకూ ఈ సంఘంలో సభ్యత్వం లభిస్తుంది. వీరికి కంప్యూటర్ ప్రాథమిక అంశాలు బోధించేందుకు ఓ అమెరికన్ సంస్థ ముందుకొచ్చింది. ఎనిమిది కంప్యూటర్లను కానుకగా ఇచ్చింది. పాఠశాల విద్యార్థులూ వీటిని వినియోగిస్తున్నారు. ఐదో తరగతి నుంచే కంప్యూటర్ శిక్షణ తప్పనిసరి. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉచితంగా బోధిస్తారు. ఇక మిగిలింది..సామాజిక రుగ్మతలు! గ్రామంలో 60 శాతం దళితులే. దళితేతరులతో నిత్యం ఘర్షణలే. ఇరు వర్గాల మధ్య సఖ్యత సాధించాలన్నదే రంగస్వామి ఆలోచన. గ్రామంలో ప్రత్యేకంగా గృహనిర్మాణ పథకాన్ని అమలుచేశాడు. ఈ ప్రాంతానికి 'సమతాపురం' అని నామకరణం చేశాడు. ఇంటి నిర్మాణానికి అయిన మొత్తం వ్యయంలో 50 శాతాన్ని గ్రామ పంచాయతీ భరిస్తుంది. 30 శాతాన్ని బ్యాంకు రుణంగా ఇస్తుంది. మిగిలిన 20 శాతాన్ని లబ్ధిదారులు సులభ వాయిదాల్లో చెల్లించాలి. అలా మొత్తం 100 ఇళ్లు నిర్మించారు. ఒక్కో ఇంట్లో రెండు వాటాలు ఉంటాయి... ఒకటి దళిత కుటుంబానికి, మరొకటి ఇతరులకు. ఇరు వర్గాల్లో స్నేహభావాన్ని పెంచడానికి ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడింది. సమతాపురం నిర్మించాక.. గ్రామంలో దళితులపై ఒక్క దాడి కూడా జరగలేదు.మళ్లీ గెలుపు! అంతలోనే ఐదేళ్ల పదవీకాలం పూర్తయింది. మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఈసారి, పోలైన ఓట్లలో తొంభైశాతం రంగస్వామికే దక్కాయి. సంస్కరణల్నీ సంక్షేమ కార్యక్రమాల్నీ మునుపటి ఉత్సాహంతోనే కొనసాగించాడు. తమిళనాడు ప్రభుత్వానికి కూడా ఈ గ్రామం దిశానిర్దేశం చేసింది. కుత్తంబాకంలో సీఎఫ్‌ఎల్ దీపాలతో విద్యుత్ పొదుపు చేస్తున్నారన్న సంగతి ప్రభుత్వం దృష్టికెళ్లింది. రాష్ట్రంలోని మిగిలిన పంచాయతీల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎంతోమంది ప్రముఖులు కుత్తంబాకాన్ని సందర్శించారు. వారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం కూడా ఉన్నారు. రంగస్వామి కృషిని ప్రశంసిస్తూనే...సంప్రదాయేతర విద్యుత్ వినియోగంపై దృష్టి సారించాలని సలహా ఇచ్చారాయన. కలాం సూచనతో రంగస్వామి ఆ దిశగా ప్రయోగాలు ప్రారంభించాడు. ప్రస్తుతం, సౌరశక్తితో నడిచే సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నాడు. అలాగే, గ్రామంలోని అన్ని ఇళ్లలో కొంత సౌరవిద్యుత్తునూ తప్పనిసరిగా వాడాలన్న నిబంధన పెట్టాడు. తమిళనాడులో గుడిసెలు లేని గ్రామం ఇదొక్కటే. కుత్తంబాకాన్ని ఆదర్శంగా తీసుకునే తమిళనాడు ప్రభుత్వం 'గుడిసె రహిత రాష్ట్రం' పేరుతో భారీ ప్రణాళిక అమలుచేస్తోంది.గతంలో ఇక్కడ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండేది. పైచదువులకు వెళ్లాలంటే పదమూడు కిలోమీటర్లు ప్రయాణించాలి. రంగస్వామి చొరవతో జూనియర్ కాలేజీ కూడా వచ్చింది. వందశాతం పిల్లలు పాఠశాలకు వెళ్తారు. బాలకార్మికులు అస్సలు కనిపించరు. గ్రామంలో తయారవుతున్న ఉత్పత్తులను అధునాతన పద్ధతుల్లో మార్కెటింగ్ చేస్తారు. ఇంటర్‌నెట్‌ను సద్వినియోగం చేసుకుంటారు. ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ కూడా ఉంది. ప్రస్తుతం దాన్ని నవీకరిస్తున్నారు. గ్రామం సమీపంలో ఓ ప్రైవేటు వైద్యకళాశాల ఉంది. ఇక్కడ ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదివే ప్రతి విద్యార్థీ కుత్తంబాకంలోని ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి. ఆ కుటుంబ ఆరోగ్య సంరక్షణ బాధ్యత పూర్తిగా ఆ విద్యార్థిదే. దీనివల్ల పోషక విలువల లోపం, అంటురోగాలు వంటి సమస్యలు బాగా తగ్గిపోయాయి. గ్రామ పంచాయతీ ఖర్చుచేసే ప్రతీపైసా వివరాలూ గ్రామస్తులందరికీ తెలియాల్సిందే. ఆ లెక్కలనుగ్రామసభలో పెడతారు. ఆదాయ వ్యయ పట్టిక పంచాయతీ నోటీసు బోర్డుపై ప్రకటిస్తారు. గ్రామంలో స్వయం ఉపాధి, చిన్నతరహా పరిశ్రమల కారణంగా.. ఆర్థిక లావాదేవీలు భారీగా పెరిగాయి.ఈ లెక్కల కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. దీనికి రంగస్వామి అధ్యక్షుడు. ప్రజలే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామీణాభివృద్ధి రంగంలో రంగస్వామి కృషిని అనేక జాతీయ సంస్థలు అభినందించాయి. ప్రముఖ వార్తాసంస్థ సీఎన్‌ఎన్ ఐబీఎన్ 'రియల్‌హీరో'గా గౌరవించింది.
- మహ్మద్ ఆర్.హెచ్.షరీఫ్, న్యూస్‌టుడే,
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి